BJP Vijay Sankalpa Sabha: కేసీఆర్‌ పేరెత్తకుండా పై ఎత్తు.. మోదీ వ్యూహమిదేనా..?

6 Jul, 2022 12:23 IST|Sakshi

విశ్లేషణ

హైదరాబాద్‌లో జరిగిన విజయ్‌ సంకల్ప సభలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించిన తీరు ఎలా ఉంది? ఒక జాతీయ పార్టీ నేత, దేశ ప్రధాని కేవలం ఒక ప్రాంత విషయాలకే పరిమితమై మాట్లాడటంలో మతలబు ఏమిటి? బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలలో తెలంగాణ రాజకీయాలపై ప్రత్యేక డిక్లరేషన్‌ ఇవ్వడం దేనికి సంకేతం? తెలంగాణలో వచ్చే శాసనసభ ఎన్నికలలో ఎలాగైనా గెలవాలన్న దృఢ సంకల్పంతో బీజేపీ ఉంది. కానీ, ఎక్కడా కేసీఆర్‌ పేరెత్తకుండా మోదీ వ్యూహాత్మకంగా వ్యవహరించారు. తెలంగాణలో అధికారంలోకి రాగలిగితే సరేసరి. రాలేకపోయినా, ప్రధాన ప్రతిపక్షంగా ఎదగాలన్నది బీజేపీ ప్రయత్నం. తద్వారా కాంగ్రెస్‌ స్థానాన్ని పొంది, భవిష్యత్తులో అధికారంలోకి వచ్చేలా ఎత్తుగడలు వేస్తోంది.

జాతీయ నేత అయిన మోదీ ప్రాంతీయ ఉపన్యాసం చేస్తే, ప్రాంతీయ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు జాతీయ స్థాయి ఉపన్యాసం చేయడం గమనించవలసిన అంశం. ఇద్దరికీ వేర్వేరు లక్ష్యాలు ఉన్నాయి. మోదీ బహిరంగ సభకు ముందు రోజే కేసీఆర్‌ రాష్ట్రపతి అభ్యర్ధి యశ్వంత్‌ సిన్హాను హైదరాబాద్‌కు రప్పించి మొత్తం సీన్‌ అంతా బీజేపీ వైపే వెళ్లకుండా తన వాటా తాను పొందేలా యత్నించారు. అంతవరకూ కొంత సఫలం అయ్యారని చెప్పవచ్చు. ఆ సందర్భంగా ఆయన అనేక జాతీయ, అంతర్జాతీయ ప్రశ్నలు లేవ నెత్తారు. శ్రీలంకలో మోదీపై వచ్చిన ఆరోపణలు మొదలు, అమెరికాలో ట్రంప్‌ కోసం మోదీ ప్రచారం చేశారన్న విషయాల వరకూ; నల్లధనం తెచ్చి భారతీయులకు పంచుతానన్న హామీ నుంచి, రూపాయి విలువ పతనం అయిన తీరు వరకూ పలు ప్రశ్నలు సంధించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేశానికే మార్గదర్శకం అంటూ వివిధ శాఖలలో జరుగుతున్న ప్రగతిని వివరిస్తూ పెద్ద ఎత్తున ప్రకటనలు ఇచ్చారు. ఇది కూడా వ్యూహాత్మకమైనదే. 

గతంలో మోదీ గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇలాగే తన రాష్ట్ర ప్రగతి వివరిస్తూ, భారీ ప్రచారం నిర్వహించేవారు. అది బాగా సఫలం అయి, దేశంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుకూ, తద్వారా తనకు ప్రధాని పదవి దక్కడానికీ ఉపయోగపడింది.  బీజేపీకి దేశ వ్యాప్తంగా బలం, బలగం ఉన్నాయి. టీఆర్‌ఎస్‌కు అంతటి పరిస్థితి లేదు. కేసీఆర్‌ భారత రాష్ట్ర సమితి పేరుతో పార్టీ పెట్టాలని అనుకున్నా, కొంత వెనుకడుగు వేయక తప్పలేదు. అంతకుముందు ఫెడరల్‌ ఫ్రంట్‌ అని హడావుడి చేసినా అదీ సఫలం కాలేదు. ఇప్పుడు జాతీయ రాజకీయాల గురించి గట్టిగా మాట్లాడినా, కేసీఆర్‌ తక్షణ లక్ష్యం వచ్చే శాసనసభ ఎన్నికలన్నది తెలియనిది కాదు. అలాగే కేసీఆర్‌ చేసిన విమర్శలకు మోదీ ఎక్కడా జవాబు ఇవ్వకపోవడం కూడా ఇలాంటిదే. ఆయన కేవలం తెలంగాణ గురించి మాట్లాడి తాను ఈ రాష్ట్రానికి చాలా చేస్తున్నాననీ, బీజేపీకి అధికారం ఇస్తే డబుల్‌ ఇంజన్‌లా పనిచేసి మరింత అభివృద్ధి సాధిస్తామనీ చెప్పారు. 

కేసీఆర్‌ చేసిన జాతీయ, అంతర్జాతీయ విమర్శలకు సమాధానం ఇస్తే, వాటికి అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు అవుతుందనీ, ఒక ప్రాంతీయ పార్టీ వ్యాఖ్యలను అంత సీరియస్‌గా తీసుకుని ప్రధాని స్థాయిలో స్పందించనవసరం లేదనీ మోదీ భావించి ఉండాలి. పైగా కేసీఆర్‌కు దేశ వ్యాప్త ప్రచారం రావడానికి తాను ఎందుకు దోహదపడాలని అనుకున్నట్లుగా ఉంది. అదే సమయంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మాత్రం కేసీఆర్‌ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు గుప్పించి, వచ్చేది తమ ప్రభుత్వమే అని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ డిక్లరేషన్‌లో కూడా టీఆర్‌ఎస్‌పై విమర్శలు గుప్పించారు. 

విజయ్‌ సంకల్ప్‌ సభకు జనం ఏ మాత్రం వచ్చారన్నదానిపై రకరకాల అంచనాలు ఉన్నా, రెండు లక్షల మంది వచ్చినా అది విజయవంతం అయినట్లే లెక్క. అంతేకాక ప్రధానితో సహా ఆయా వక్తలు మాట్లాడుతున్నప్పుడు వచ్చిన స్పందన కూడా బాగానే ఉంది. వచ్చిన ప్రజానీకాన్ని చూసి బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌ను అందరికీ తెలిసేలా మోదీ అభినందించారు. బీజేపీ తెలంగాణ శాఖ నిజానికి ఇంకా అంత బలం పుంజుకోకపోయినా, ఈ సభను విజయవంతం చేయడం విశేషమే అని చెప్పాలి. 

కేసీఆర్‌ పేరు చెప్పి, తీవ్రమైన విమర్శలు, ఆరోపణలు చేస్తే బీజేపీలో మరింత ఉత్సాహం వచ్చి ఉండేదేమో! అమిత్‌ షా, నడ్డా, పీయూష్‌ గోయల్, కిషన్‌ రెడ్డి వంటి కేంద్ర మంత్రులు ఎన్ని విమర్శలు చేసినా, మోదీ మాట్లాడకపోతే అంత ఊపు రాదు. కానీ మోదీ వ్యూహాత్మకంగానే ఇలా చేశారని అనుకోవాలి. పైగా రాజకీయ ప్రత్యర్థులపై ఏమీ మాట్లాడలేదంటే, భవిష్యత్తులో సీరియస్‌ పరిణామాలు ఉండవచ్చు. తీవ్ర విమర్శలు చేసి, తదుపరి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై చర్యలకు అడుగులు వేస్తే, రాజకీయంగా ఇబ్బంది రావచ్చు. ఎందుకంటే ఇప్పటికే కేంద్రం తెలంగాణ వ్యవహారాలపై బాగానే దృష్టి పెట్టింది. ఆర్బీఐ నుంచి అప్పు పొందే విషయంలో కూడా యక్ష ప్రశ్నలు వేయడమే ఇందుకు ఉదాహరణ. మోదీ హైదరాబాద్‌లో ఉన్న సమయంలోనే టీఆర్‌ఎస్‌ ఎంపీ నామా నాగేశ్వరావు కంపెనీకి చెందిన ఆస్తులు జప్తు చేయడం కాకతాళీ యమా, కాదా అన్నది అప్పుడే చెప్పలేకపోయినా, ఏదో బలమైన సంకేతంగానే ఎక్కువ మంది తీసుకుంటున్నారు.

పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికలకు ముందు పలువురు తృణమూల్‌ కాంగ్రెస్‌ నేతలను బీజేపీలోకి ఆకర్షించడం ఒక ఎత్తు అయితే, వారిలో కొంతమంది అంతకుముందు సీబీఐ కేసులు, విచారణలు ఎదుర్కో వడం గమనార్హం. వారు బీజేపీలో చేరితేగానీ సేఫ్‌ కాలేమన్న భావనకు వచ్చారు. శారదా చిట్‌ఫండ్‌ స్కామ్, నారదా స్టింగ్‌ ఆపరేషన్‌ వంటి వాటిలో తృణమూల్‌ కాంగ్రెస్‌ నేతలు పలు సమస్యలు ఎదుర్కొన్నారు. ఆ పార్టీ అధినేత మమతా బెనర్జీ వీటన్నిటినీ తట్టుకుని బెంగాల్‌ గౌరవాన్ని ముందుకు తెచ్చి  మరోసారి అధికారంలోకి రాగలిగారు. గుజరాతీయులైన మోదీ, అమిత్‌ షా పెత్తనం బెంగాల్‌ పైనా అంటూ ఆమె చేసిన ప్రచారం బాగానే పని చేసింది. అదే రీతిలో తెలంగాణ ప్రభుత్వం కూడా ఇటీవలి కాలంలో ప్రతిదానికీ గుజరాత్‌ను తెరపైకి తెస్తూ, రాష్ట్రానికి అన్యాయం జరుగుతోందని చెబుతోంది. టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ గుజరాత్‌కు కేంద్రం ఇస్తున్న నిధులు, గిఫ్ట్‌ సిటీ, ఆర్బిట్రేషన్‌ సెంటర్‌ అహ్మదాబాద్‌లో ఏర్పాటు చేయడం వంటివి ఉదాహరిస్తూ తెలంగాణ సెంటిమెంట్‌ను రెచ్చగొట్టే యత్నానికి శ్రీకారం చుట్టినట్లుగా ఉంది. ఈ వ్యూహం ఫలిస్తే టీఆర్‌ఎస్‌ మరోసారి గెలవడం తేలికవుతుందని వారు అంచనా వేస్తుండవచ్చు. 

మరోవైపు బీజేపీ త్రిపుర మోడల్‌ ప్రయోగానికి వెళుతుందా అన్న అనుమానం కలుగుతోంది. త్రిపురలో ఒకప్పుడు బీజేపీ జాడే లేదు. కానీ గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ అంతటినీ ఖాళీచేయించి బీజేపీలో కలుపుకొన్నారు. తద్వారా అక్కడి అధికార పక్షం సీపీఎంను ఓడించగలిగారు. తెలంగాణలో కూడా అలాంటి ఆలోచన ఏమైనా చేస్తుందా అన్న సందేహం కలుగుతోంది. దుబ్బాక, హుజూరాబాద్‌ ఉప ఎన్నికలలో గెలిచినా, హైదరాబాద్‌ మున్సిపల్‌ ఎన్నికలలో గణనీయంగా ఫలితాలు సాధించినా, తెలంగాణ అంతటా క్షేత్ర స్థాయిలో బీజేపీకి కార్యకర్తలు అంతగా లేరన్నది వాస్తవం. దానిని తీర్చుకోవాలంటే అయితే టీఆర్‌ఎస్, లేదా కాంగ్రెస్‌ల నుంచి కొందరు ముఖ్యమైన నేతలను ఆకర్షించవలసి ఉంటుంది. మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి బీజేపీలో చేరడం కూడా ఇందుకు ఒక ఉదాహరణగా కనిపిస్తుంది. 

కాంగ్రెస్‌కు క్షేత్ర స్థాయిలో కొంత బలం ఉన్నా, అంతర్గత పోరుతో బాగా ఇబ్బంది పడుతోంది. టీఆర్‌ఎస్‌ను మోదీ ఒక్క మాట అనకపోవడాన్ని మ్యాచ్‌ ఫిక్సింగ్‌గా కాంగ్రెస్‌ వ్యాఖ్యానిస్తోంది. ఒకవేళ టీఆర్‌ఎస్‌పై ప్రజలలో వ్యతిరేకత ఉంటే, కాంగ్రెస్‌ అయితేనే దాన్ని  ఓడించగలుగుతుందని నమ్మకం కుదిరితే తప్ప, ఆ పార్టీకి విజయా వకాశాలు ఉండవు. ఆ దిశలో కాంగ్రెస్‌ ప్రయత్నాలు సాగిస్తోంది. మొత్తం మీద కేసీఆర్‌ ప్రస్తావన తేకుండా, కాంగ్రెస్‌ గురించి విమర్శలు చేయకుండా మోదీ వారికి ప్రాముఖ్యత ఇవ్వకుండా జాగ్రత్తపడితే, మోదీపై కేసీఆర్‌ విమర్శలు చేసి జాతీయ ప్రాముఖ్యత పొందడానికి ప్రయత్నించారు. వీరిద్దరిలో ఎవరు సఫలం అవుతారన్నది వచ్చే ఎన్నికలలో తేలుతుంది. 

    

కొమ్మినేని శ్రీనివాసరావు
వ్యాసకర్త సీనియర్‌ పాత్రికేయులు
 

మరిన్ని వార్తలు