రాజధాని వ్యాజ్యం గమ్యం ఎటు?

14 Oct, 2020 01:25 IST|Sakshi

విశ్లేషణ

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చేపట్టిన పాలనా వికేంద్రీకరణ చట్టం, రాజధాని సంస్థ రద్దు వంటి అంశాలపై హైకోర్టు విచారణ జరుపుతున్న సందర్భంలో ఒక విషయం గుర్తుకు వస్తోంది. గౌరవ హైకోర్టు వారు శాసనమండలిలో ఈ చట్టాలకు సంబంధించి జరిగిన ప్రొసీడింగ్స్‌ వీడియో తమకు సమర్పించాలని కోరడం ఆసక్తికరంగా ఉంది. అందులో జరిగిన విషయాలపై ఆధారపడి కూడా విచారణ జరుగుతుందేమో తెలియదు. ఈ సందర్భంలో ఒక విషయం ప్రస్తావనకు తేవడం తప్పు కాకపోవచ్చు. లోక్‌సభలో ఏపీ విభజన బిల్లు ప్రవేశ పెట్టినప్పుడు తీవ్ర గందరగోళం చెలరేగింది. ఏపీకి సంబంధించిన ఎంపీలు కొందరు, తెలంగాణ ప్రాంతానికి చెందిన కొందరు ఎంపీలు తీవ్ర ఘర్షణకు దిగారు. విజయవాడకు అప్పట్లో ప్రాతినిధ్యం వహించిన ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ ఏకంగా పెప్పర్‌ స్ప్రేనే ప్రయోగించారు.

సమైక్య ఆంధ్ర కోరుకునే ఎంపీలు, విభజన కోరుకునే ఎంపీల మధ్య తీవ్రమైన పోరు సాగి, లోక్‌సభ ఒక విధంగా రణరంగంగా మారింది. ఈ గందరగోళంలోనే ఆనాటి స్పీకర్‌ మీరా కుమార్‌ విభజన బిల్లు ఆమోదం పొందినట్లు ప్రకటించారు. కానీ సమైక్య రాష్ట్రం కోరుకుంటున్న ఎంపీలు కొందరు కానీ, మరికొంతమంది ఇతరులు కానీ ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అసలు విభజన బిల్లు ఆమోదం పొందలేదని, లోక్‌సభ ప్రొసీడింగ్స్‌ ఆధారంగా అప్పటి రాజమండ్రి ఎంపీ ఉండవల్లి అరుణ కుమార్‌ పిటిషన్‌ వేశారు. అంతేకాక ఆయన దీనిపై పుస్తకం కూడా రచించారు. 

ఇక రాజ్యసభలో సైతం గందరగోళం జరిగింది. అప్పటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ ఏపీకి ప్రత్యేక హోదాను ప్రకటిస్తున్న సందర్భంగా కొందరు సమైక్యవాద ఎంపీలు ఆయనపై కూడా దాడి చేసినంత పనిచేశారు. పార్టీలకు అతీతంగా ప్రాంతాల వారీగా ఎంపీలు చీలిపోయి గొడవలు పడ్డారు. తన పార్టీకే చెందిన ఐదుగురు లోక్‌సభ సభ్యులను కాంగ్రెస్‌ పార్టీ సస్పెండ్‌ చేసింది. ఇన్ని పరిణామాలు జరిగినప్పుడు సుప్రీంకోర్టులో విభజన చట్టానికి వ్యతిరేకంగా వచ్చిన పిటిషన్‌లు ఏవీ ఇంతవరకు విచారణకే రాలేదు. మరి ఇది న్యాయ వ్యవస్థ లోపమా? లేక పార్లమెంటులో జరిగిన వాటి జోలికి వెళ్లకూడదన్న అభిప్రాయమా? రెండు వ్యవస్థల మధ్య అనవసర ఘర్షణ నివారించడానికా? దేనికో  తెలియదు కాని ఇదంతా చరిత్ర. పార్లమెంటు అయినా, శాసనసభ అయినా సభా సంప్రదాయాల ప్రకారం సభ ఆర్డర్‌లో లేనప్పుడు ఎలాంటి తీర్మానాలు చేయకూడదని అంటారు. మరి పార్లమెంటులోనే అలా జరిగింది.

అప్పటి ఉమ్మడి ఏపీ శాసనసభలో కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు శాసనసభలో రాష్ట్రం సమైక్యంగా ఉండాలంటూ తీర్మానం చేశారు. ఇక్కడ కూడా ప్రాంతాల వారీగా చీలిపోయి తీవ్ర ఆందోళనలు జరిగాయి. ఆ తర్వాత కాలంలో రాజకీయంగా యూపీఏ ప్రభుత్వం లేదా కాంగ్రెస్‌ నాయకత్వం ఘోరమైన రాజకీయ తప్పిదం చేసిందని రుజువు అయింది. విభజన చేసినప్పటికీ, కాంగ్రెస్‌ పార్టీ  తెలంగాణలో దారుణంగా ఓడిపోతే, విభజిత ఆంధ్రప్రదేశ్‌లో అయితే అడ్రస్‌ కోల్పోయింది. మొత్తం పోటీచేసినవారంతా ఓటమి పాలవడమే కాకుండా పది మందిలోపు తప్ప మిగిలినవారు డిపాజిట్లు కూడా కోల్పోయారు. కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారం కోల్పోవడానికి కూడా ఇది ఒక కారణంగా నిలిచింది. 
అప్పట్లో గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్న బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోదీ వంటివారు తల్లిని చంపి బిడ్డను కన్న చందంగా విభజన చేశారని తీవ్రమైన వ్యాఖ్యలను చేశారు. కానీ బీజేపీ కూడా అప్పట్లో విభజనకు మద్దతు ఇచ్చింది. అది వేరే విషయం.

సుప్రీంకోర్టు దీనిపై ఎలాంటి తీర్పు ఇవ్వకపోయినా ప్రజలు తీర్పు ఇచ్చి కాంగ్రెస్‌ను ఓటమిపాలు చేశారు. ప్రజాస్వామ్యంలో అంతిమ నిర్ణయం ప్రజలదేనని ఈ ఘట్టాలన్నీ రుజువు చేశాయి. ఆ తర్వాత ఏపీలో టీడీపీ, బీజేపీల సంకీర్ణ ప్రభుత్వం నాలుగేళ్లపాటు పాలన సాగించింది. రాజధానిపై కేంద్రం శివరామకృష్ణన్‌ కమిటీని నియమించగా, దానిని కాదని ఆనాటి చంద్రబాబు ప్రభుత్వం తన సొంత నిర్ణయాలు చేసింది. మూడు పంటలు పండే పచ్చని పొలాల భూములను రాజధానిగా ఎంపిక చేసింది. పలువురు పర్యావరణవేత్తలు దీనిపై అభ్యంతరం చెప్పారు. కొందరు గ్రీన్‌ ట్రిబ్యునల్‌కు వెళ్లారు. ప్రసిద్ధ సంపాదకులు ఏబీకే ప్రసాద్, మరికొందరు అమరావతి నిర్ణయంపై హైకోర్టుకు వెళ్లారు. వేసిన పిటిషన్లు ఆరేళ్లుగా పెండింగ్‌లోనే ఉన్నాయి. పైగా,  ఆ ప్రాంతానికి అమరావతి పేరు పెట్టి ఆనాటి ప్రభుత్వం దానిని రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంగా ఈ వ్యవహారాన్ని మార్చిం దన్న విమర్శలు వచ్చాయి. ఇది అందరి రాజధాని కాదు. కొందరిదే అనే అభిప్రాయం కలిగేలా అప్పటి పరిణామాలు సంభవించాయి. ఒకే పార్టీవారో,లేక ఒక వర్గంవారో  అధికంగా అక్కడ భూములు ఇన్‌సైడ్‌ ట్రేడింగ్‌ ద్వారా కొనుగోలు చేశారని ఆరోపణలు వచ్చాయి.

 సింగపూర్‌ కంపెనీల రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం కోసం 350 కోట్లు పెట్టుబడి పెట్టడానికి ముందుకు వస్తే స్విస్‌ చాలెంజ్‌ పద్ధతిలో 1,600 ఎకరాల భూమిని వారికి కేటాయించడమే కాకుండా, రూ. 5,500 కోట్ల ప్రజాధనాన్ని వెచ్చించి వారికి కావల్సిన సదుపాయాలను కల్పించడానికి సిద్ధమైంది. దీనిపై కూడా కోర్టులో వ్యాజ్యాలు పడడం, అప్పట్లో హైకోర్టులో ప్రభుత్వ వ్యతిరేక తీర్పు రావడం, దానిపై రాష్ట్ర ప్రభుత్వం మరో చట్టం తేవడం వంటివి జరిగాయి. ఈ నేపథ్యంలో అమరావతి రాజధాని అంశంగా టీడీపీ ప్రధానంగా ఎన్నికలకు వెళ్లింది. రాజధానిగా ప్రకటించిన గుంటూరు, కృష్ణా జిల్లాలతో సహా అన్ని ప్రాంతాల వారు టీడీపీని ఓడించారు. అది అమరావతిపై కూడా వచ్చిన తీర్పుగా ప్రజలు భావించారు. ప్రస్తుత వైస్సార్‌సీపీ ప్రభుత్వం మూడు రాజధానుల ప్రతిపాదన చేసింది. అసెంబ్లీలో చట్టం ఆమోదించింది. శాసనమండలిలో టీడీపీ వ్యతిరేకించి ఆ చట్టం ఆమోదం పొందకుండా ప్రయత్నించింది. అయినా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం మరోసారి అసెం బ్లీలో బిల్లును ఆమోదించి, మళ్లీ మండలికి పంపడం, అక్కడ గొడవల మధ్య సభ వాయిదాపడడం జరిగింది. తదుపరి గవర్నర్‌కు బిల్లును పంపించగా ఆయన సుమారు 10 రోజులపాటు పరిశీలన చేసి ఆమోదం తెలిపారు.

 ఈ ప్రభుత్వం వికేంద్రీకరణ ద్వారా అభివృద్ధి అని భావిస్తోంది. ఉత్తరాఖండ్‌లో కొత్త రాజధాని విషయంలో తాము జోక్యం చేసుకోమని సుప్రీంకోర్టు స్పష్టంగా చెబితే, ఏపీలో మూడు రాజధానుల అంశం రాష్ట్రం పరిధిలోనిదని కేంద్రం ఒకటికి రెండుసార్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో హైకోర్టులో అనేక పిల్స్‌పై విచారణ జరుగుతుండడం ఆసక్తికరంగా ఉంది. రాజధాని సంస్థ రద్దు చట్టం, వికేంద్రీకరణ చట్టంపై పెద్ద సంఖ్యలో హైకోర్టులో పిటిషన్‌లు పడ్డాయి. వాటిపై విచారణ జరుగుతోంది. అయితే గౌరవ హైకోర్టు గతంలో అమరావతి ఏర్పాటు సమయంలో పిల్‌ వేశారా అని ప్రస్తుతం ఈ కేసులలో ఇంప్లీడ్‌ అయిన రాయలసీమ, ఉత్తరాంధ్రలకు చెందిన కొందరు న్యాయవాదులను ప్రశ్నించింది. వారు తాము అప్పట్లో పిల్‌ వేయలేదని చెప్పారు.

 ఇప్పుడు మండలిలో జరిగిన ప్రొసీడింగ్స్‌పై వీడియోను కూడా గౌరవ న్యాయస్థానం వారు కోరడంతో ఈ విచారణ ఎటు వెళుతుందన్నది చర్చనీయాంశం అయింది. మళ్లీ శాసనవ్యవస్థ, న్యాయవ్యవస్థలు ఈ అంశంలో కూడా భిన్న ధ్రువాలు అవుతాయా? అన్నది చూడాల్సి ఉంది. ఇక విశాఖపట్నంలో ఒక అతిథి గృహం నిర్మించడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీనిపై కూడా పిల్స్‌ పడ్డాయి. విశేషం ఏమిటంటే గత ముఖ్యమంత్రి చంద్రబాబు తన స్వగ్రామం నారావారి పల్లెలో కూడా క్యాంప్‌ ఆఫీస్‌ ఏర్పాటు చేసుకున్నారట. అంతేకాదు. హైదరాబాద్‌ లో ముందు సొంత ఇల్లు, ఆ తర్వాత అక్కడ నుంచి మరో ఇంటిని అద్దెకు తీసుకున్నారు. తదుపరి అక్కడ నుంచి పార్క్‌ హయత్‌లో కాపురం పెట్టి ప్రభుత్వం డబ్బు కోట్లు వెచ్చించారు. ఇవన్నీ క్యాంప్‌ ఆఫీస్‌లుగానే అప్పట్లో ప్రకటించారట.

 ఇక కృష్ణానది కరకట్టపై ఉన్న అక్రమ కట్టడంలో చంద్రబాబు నివసించినా ఏ వ్యవస్థ ఇంతవరకు ఆయనను ఏమీ చేయలేకపోయింది. అది కూడా ఒక రకంగా క్యాంప్‌ ఆఫీస్‌ అనుకోవచ్చేమో! అయినా ఎవరూ పిల్‌ వేయలేదు. ఏ వ్యవస్థ కూడా తప్పు పట్టలేదు. నది ఒడ్డున ఉన్న అక్రమ కట్టడాలను తొలగించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తే గౌరవ హైకోర్టు స్టే ఇచ్చింది. అమరావతిలో జరిగిన స్కామ్‌ల కేసులు కొన్నిటిపై హైకోర్టు స్టే ఇవ్వడమే కాకుండా, కొన్ని కేసుల సమాచారం కూడా ప్రచారం చేయడానికి వీలులేదని ఆదేశించింది. మరో విషయం ఏమిటంటే ఏపీలో అసలు హైకోర్టు భవన నిర్మాణమే జరగకపోయినా, నిర్మాణం జరిగిపోయినట్లు గత ప్రభుత్వం ప్రకటించడం కూడా ఆశ్చర్యం కలిగించింది. స్వయంగా న్యాయమూర్తులు ఈ అంశాలపై అప్పట్లో ఎందుకు ప్రశ్నించలేదో తెలియదు. 

ఈ నేపథ్యంలో నిజంగానే ఏపీ ప్రభుత్వం మూడు రాజధానుల విషయంలో తప్పు నిర్ణయం తీసుకుంటే వచ్చే ఎన్నికలలో ప్రజలు తమ తీర్పు ఇస్తారు. రాజ్యాంగపరంగా తప్పులు జరిగితే న్యాయస్థానం జోక్యం చేసుకోవడం తప్పు కాదు. కానీ చట్టపరంగా తీర్మానాలు చేసిన తర్వాత, గవర్నర్‌ ఆమోద ముద్ర వేసిన తర్వాత హైకోర్టులో పెద్ద ఎత్తున విచారణ, స్టేటస్‌ కో ఉత్తర్వులు వంటి పరిణామాలు జరిగాయి.. అంతిమంగా మాబోటి వాళ్లకు వచ్చే సందేహం ఏమిటంటే, గతంలో పార్లమెంటులో విభజన బిల్లు ఆమోదం పొందిన వైనం, ఆ తర్వాత సుప్రీంకోర్టు ఆ విషయాన్ని ఎందుకు పట్టించుకోలేదు? ఇప్పుడు మూడు రాజధానుల బిల్లు, రాజధాని సంస్థ రద్దు బిల్లులపై శాసనమండలిలో జరిగిన పరిణామాలపై హైకోర్టు విచారణ జరపడానికి వీడియో రికార్డులు కావాలని కోరిన నేపథ్యంలో ఇవన్నీ ప్రస్తావనకు వస్తున్నాయి. ఆనాడు సుప్రీంకోర్టు అంత పెద్ద పరిణామాన్ని ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదు? ఇప్పుడు ఏపీ హైకోర్టు ఇంత సీరియస్‌గా ఎందుకు తీసుకుంటోంది? ఇది సామాన్యుడిగా వచ్చే సందేహం తప్ప, కోర్టులను ప్రశ్నించడం కాదు. కోర్టులను అగౌరవపరచడం కాదు. వారిని గౌరవిస్తూనే ఈ డౌట్‌ల గురించి మాట్లాడుకోవడం తప్పు కాదన్నది విశ్వాసం. 


కొమ్మినేని శ్రీనివాసరావు
వ్యాసకర్త సీనియర్‌ పాత్రికేయులు

మరిన్ని వార్తలు