మాట నిలబెట్టుకుంటే.. నెత్తిన పెట్టుకుంటారు

4 May, 2022 00:04 IST|Sakshi

విశ్లేషణ

ఆంధ్రప్రదేశ్‌లో పేదలకు ఇస్తున్న స్కీములు అమలు కావాలా, వద్దా అన్న చర్చను కొందరు లేవనెత్తుతున్నారు. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ చేసిన వ్యాఖ్యలు కొంత చర్చనీయాంశం అయ్యాయి. వాటిని తమకు అనుకూలంగా మలుచుకోవడానికి ప్రతిపక్షం, వారి మీడియా ప్రయత్నించాయి. చెప్పి చేయకపోతే మోసం చేశారన్న భావనతో నేతలను ఓడించారు తప్ప, ఇచ్చిన హమీలను నిలబెట్టుకున్నవారికి ప్రజలలో ఎప్పుడూ ఆదరణ ఉంటుందని ఇందిరాగాంధీ, ఎన్టీఆర్, వైఎస్‌ రాజశేఖరరెడ్డి వంటివారు రుజువు చేశారు. ఎన్నికల ప్రలోభంలా కాకుండా, ఒక పాలనా విధానంగా ఈ స్కీములు అమలు చేస్తున్న జగన్‌ విషయంలోనూ ప్రజాదరణకు అదే కారణం.


విశాఖలో ‘మీట్‌ ద ప్రెస్‌’ కార్యక్రమంలో ఉండవల్లి అరుణ్‌కుమార్‌ చేసిన వ్యాఖ్యలు కొంత పరస్పర విరుద్ధంగా ఉన్నాయనిపిస్తుంది. అసలు ఆయన  పేదలకు ఆయా స్కీముల కింద నగదు పంపిణీకి వ్యతిరేకమా, అనుకూలమా అన్నది స్పష్టం చేసి ఉంటే బాగుండేది. ఉండవల్లి 2014లో రాష్ట్ర విభజన తర్వాత రాజకీయ పార్టీలకు దూరంగా ఉండి, అప్పుడప్పుడు ఆయా అంశాలపై తన భావాలను వ్యక్తం చేస్తున్నారు. ఆయన మాట్లాడే విషయాలు ఆసక్తికరంగా ఉంటాయన్నది ఒక అభిప్రాయం. క్రమంగా ఆయన ఆలోచనా ధోరణిలో కొంత మార్పు వస్తున్నదేమోనన్న విశ్లేషణ వస్తోంది. ముఖ్యమంత్రి జగన్‌ గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు అంత అర్థవంతంగా లేవనిపిస్తుంది. ఆయన వ్యాపార వేత్త కనుక అదే కోణంలో ఆలోచిస్తారని అన్నారు. నిజానికి వ్యాపారవేత్తలు ఎవరూ పేదలకు ఇలాంటి స్కీములు అమలు చేయడానికి ఇష్టపడరు. ఆ మాటకు వస్తే ఉండవల్లి సుదీర్ఘకాలం ఉన్న కాంగ్రెస్‌ పార్టీలో ఇందిరాగాంధీ టైమ్‌లో ఏం జరిగిందో తెలియదా? 

బహుశా దేశంలో మొదటిసారిగా ఉచిత స్కీములు అనండి, సబ్సిడీ స్కీములు అనండి ప్రారంభించింది ఇందిరాగాంధీనే. సిండికేట్‌ కాంగ్రెస్, పాత కాంగ్రెస్‌ నేతలవి బూజు పట్టిన ఆలోచనలనీ, ఇందిరాగాంధీవి విప్లవాత్మకమైన భావాలనీ అప్పట్లో ఎందరో పొగిడారు. ఇరవై సూత్రాల కార్యక్రమం అమలు చేయాలని ఆమె అన్ని రాష్ట్రాలనూ ఆదేశించారు. గేదెల పంపిణీతో సహా అనేక స్కీములు అమలు చేశారు. వాటిలో కొన్ని ఉపయోగపడ్డాయి, కొన్ని దుర్విని యోగం అయ్యాయి. సబ్సిడీపైన పంపిణీ చేసిన గేదెలను పరిగణన లోకి తీసుకుంటే ఉమ్మడి ఏపీలో ప్రజలకు స్థలం దొరకదని చమత్కరించేవారు. అమ్మిన గేదెనే మళ్లీ అమ్మినట్లు చూపి కొందరు లబ్ధిదారులు, అధికారులు డబ్బు కాజేసేవారని అంటారు. అంత మాత్రాన ఆ స్కీము అసలు ఉపయోగపడలేదని కాదు. ఆ స్కీముల ఫలితంగానే ఇందిర పేద ప్రజలనుంచి విశేష ఆదరణ చూరగొన్నారు.  

ఆ తర్వాత కాలంలో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్‌.టి. రామారావు రెండు రూపాయలకే కిలో బియ్యం, పేదవారికి జనతా వస్త్రాలు, ఇలా కొన్ని స్కీములు ప్రకటించినప్పుడు కాంగ్రెస్‌ తీవ్రంగా విమర్శించేది. కానీ అవి ప్రజలను ఆకర్షిస్తున్నాయని గమనించిన ఆనాటి కాంగ్రెస్‌ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కరరెడ్డి తానే రెండు రూపాయలకు కిలో బియ్యం ఇస్తానని హడావుడిగా ప్రారంభించారు. అయినా జనం ఎన్టీఆర్‌కే పట్టం కట్టారు. తర్వాత వివిధ కారణాల వల్ల ఎన్టీఆర్‌ పార్టీ 1989 ఎన్నికలలో ఓడిపోయింది. అప్పట్లో పాలించిన కాంగ్రెస్‌ ప్రభుత్వాలు బియ్యం ధరను మూడున్నరకు పెంచడం, రేషన్‌ కార్డులను హేతుబద్ధీకరించడం వంటివి చేశాయి. 1994 ఎన్నికలకు ముందు రామారావు మళ్లీ రెండు రూపాయలకే కిలో బియ్యం ఇస్తాననీ, మద్య నిషేధం అమలు చేస్తాననీ ప్రకటించారు.  కారణాలు ఏమైనా గెలిచారు. 

ఆ తర్వాత వచ్చిన చంద్రబాబు నాయుడు మళ్లీ బియ్యం ధర పెంచారు. మద్య నిషేధం ఎత్తివేశారు. 1999 ఎన్నికల సమయానికి మళ్లీ వివిధ స్కీముల కింద వివిధ వర్గాలవారికి ఆర్థిక సాయం, లేక వస్తుసాయం చేశారు. అవన్నీ లెక్కవేస్తే ఓటుకు సుమారు ఐదు వేల రూపాయల వరకు ఇచ్చి నట్లవుతుంది. వాజ్‌పేయిపై ప్రజలలో వచ్చిన సానుభూతితో పాటు ఇవీ కలిసి వచ్చి ఆయన మళ్లీ గెలిచారు. తదుపరి ఆయన విద్యుత్‌ సంస్కరణలు, ప్రభుత్వ రంగ సంస్థల విక్రయం లాంటి చర్యలు చేపట్టారు. వాటిపై ప్రజలలో వ్యతిరేకత వచ్చింది. 2004 ఎన్నికలు వచ్చేసరికి పరిస్థితి అర్థం చేసుకుని ‘కోటి వరాలు’ పేరుతో పలు స్కీములు తెచ్చారు. వాటిలో బీసీలకు ఆదరణ మొదలైన  స్కీములు ఉన్నాయి. అయినా ప్రజలు ఆయనను విశ్వసించలేదు. దాంతో టీడీపీ ఓడిపోయింది. 

2004 ఎన్నికలలో వైఎస్‌ రాజశేఖరరెడ్డి మళ్లీ రెండు రూపా యలకు కిలో బియ్యం పథకం ప్రకటించారు. రైతులకు ఉచిత విద్యుత్‌ హామీని ఇచ్చారు. ఆయన నేతృత్వంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రిగా వాటన్నింటినీ ఆయన అమలు చేశారు. ఆ తర్వాత కాలంలో ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని తెచ్చారు. ఫీజ్‌ రీయింబర్స్‌ మెంట్‌ ప్రవేశపెట్టారు. ఫలితంగా 2009 ఎన్నికలలో బలమైన మహాకూటమిని ఓడించి ఆయన మళ్లీ అధికారంలోకి వచ్చారు. 

తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‘దళిత బంధు’ కింద ఒక్కో కుటుంబానికి పది లక్షల రూపాయల ఆర్థిక సాయం ఇవ్వ సంకల్పిం చారు. 2018 ఎన్నికలలో టీఆర్‌ఎస్‌ విజయానికి ‘రైతు బంధు’ స్కీమ్‌ బాగా ఉపయోగపడింది. పంజాబ్‌లో తాజాగా ఇళ్లకు వాడే విద్యుత్‌ను 300 యూనిట్ల వరకు ఉచితం అని ఆప్‌ ప్రభుత్వం ప్రకటించింది. ఢిల్లీలో కూడా కేజ్రీవాల్‌ ప్రభుత్వం ఇలాంటి పలు స్కీములను అమలు చేస్తోంది. ఫలితంగా ఆ పార్టీ అక్కడ వరసగా గెలుస్తోంది. విభజిత ఏపీకి వస్తే టీడీపీ అధినేత చంద్రబాబు 2014 ఎన్నికలకు ముందు రైతుల రుణాలన్నీ మాఫీ చేస్తాననీ, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తాననీ ప్రకటించారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని సీరియస్‌గా తీసుకోకుండా, రియల్‌ ఎస్టేట్‌ ప్రయోజనాలున్న అమరావతిపై ఆయన అధికంగా దృష్టి పెట్టారు. దాంతో ప్రజలలో ఈయన మోసం చేశాడన్న భావన ప్రబలింది. ఇంకా పలు కారణాలతో ఆయన ప్రభుత్వం 2019లో ఓటమి పాలయింది. 

ఆనాడు ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్‌ ఎన్నికల టైమ్‌లో తన ఎన్నికల ప్రణాళికను ప్రకటించలేదు. ఎన్నికలకు రెండేళ్ల ముందుగా 2017లో పార్టీ సభ పెట్టి, అందులో ‘నవరత్నాల’ పేరుతో ఆయా స్కీములను ప్రకటించారు. ఇవి సాధ్యమేనా అని ఎక్కువ మంది ప్రశ్నించుకున్నారంటే అతిశయోక్తి కాదు. అయినా ఆయన పట్టువద లకుండా తన పాదయాత్రలో విస్తృతంగా ప్రచారం చేసి ప్రజలను ఆకట్టుకున్నారు. దాంతో భారీ విజయం నమోదు చేసుకున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే నవరత్నాలను అమలు చేయడం ఆరం భించారు. అందుకు భారీగానే ఖర్చు అవుతుండవచ్చు. వృద్ధాప్య పెన్షన్‌ను పెంచడం, ‘అమ్మ ఒడి’, ‘చేయూత’, ‘చేనేత నేస్తం’, ‘కాపు నేస్తం’.. ఇలా పలు స్కీములను అమలు చేశారు. కరోనా సమయంలో జగన్‌ ఈ స్కీములు అమలు చేయడంతో ప్రజల చేతిలోకి డబ్బులు వెళ్లి మరీ ఎక్కువగా ఇబ్బంది పడలేదన్నది వాస్తవం. 

ఇవన్నీ ప్రజాకర్షక స్కీములని కొందరు విమర్శించవచ్చు. ఇందిరాగాంధీ నుంచి చంద్రబాబునాయుడు వరకు చేసింది క్విడ్‌ ప్రో కో అయితే జగన్‌ చేసింది అదే అనే చెప్పవచ్చు. వారందరిదీ వ్యాపార ధోరణి కానప్పుడు జగన్‌ది మాత్రం ఎలా అవుతుంది? ఉండవల్లి కూడా ఇలాంటి స్కీముల వల్లే  రెండుసార్లు ఎంపీ అయిన విషయం గమనించాలి. ఆ రోజుల్లో ఆయన ఇలాంటి విశ్లేషణ చేయలేదు. అందువల్ల క్విడ్‌ ప్రో కోలో తనకూ వాటా ఉందని ఆయన ఒప్పు కోవాలేమో! ఆయన మరో మాట అన్నారు. చంద్రబాబు 2019 ఎన్నికలకు ముందు ‘పసుపు–కుంకుమ’ పేరుతో పదివేల రూపా యల చొప్పున మహిళలకు ఇచ్చినా గెలవలేకపోయారని అన్నారు. అది నిజమే. దానికి కారణం ఎన్నికల ముందు ఎలాగోలా ప్రలోభ పెట్టాలన్న ఆలోచన అని ప్రజలు అర్థం చేసుకున్నారు. ఉండవల్లికి ఈ విషయం తెలియదని అనుకోలేం. 1982 ఆఖరులో విజయ భాస్కర రెడ్డి రెండు రూపాయలకు కిలో బియ్యం అమలు చేసినా ఇలాగే ఓడిపోయారు. జగన్‌ మాత్రం రెండేళ్లు ముందుగా ప్రకటించి వాటిని అమలు చేశారు కనుక ప్రజలలో ఇంతటి ఆదరణ వచ్చింది. ఉండవల్లి చెబుతున్నట్లు పేదలకు ఒక్కొక్కరికి లక్ష రూపాయల సాయం జగన్‌ ప్రభుత్వం ద్వారా అందింది. అంత మొత్తం ద్వారా లాభపడ్డ ప్రజలు జగన్‌ వెంట ఉండరన్న థీరీకి ఆధారాలు కనిపించడం లేదు. చెప్పి చేయకపోతే మోసం చేశారన్న భావనతో నేతలను ఓడించారు తప్ప, హమీ ఇచ్చిన వాటిని నిలబెట్టుకున్నవారికి ప్రజలలో ఎప్పుడూ ఆదరణ ఉంటుందని ఇందిరాగాంధీ, ఎన్టీఆర్, వైఎస్‌ రాజశేఖరరెడ్డి వంటివారు రుజువు చేశారు. ఇప్పుడు జగన్‌పై కూడా ప్రజలలో భిన్నమైన అభిప్రాయం ఎందుకు ఉంటుంది?

వ్యాసకర్త: కొమ్మినేని శ్రీనివాసరావు
 సీనియర్‌ పాత్రికేయులు 

మరిన్ని వార్తలు