ఉక్కు ‘ఆకాంక్ష’ను నిలబెట్టుకుందాం

11 Feb, 2021 00:46 IST|Sakshi
విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్‌

విశ్లేషణ

ఉమ్మడి ఏపీలో 1960లలో ఎంతోమంది ప్రాణత్యాగాలు చేసిన మహోద్యమ ఫలితం విశాఖ ఉక్కు కర్మాగారం. ప్రభుత్వాల మెడలు వంచిన తెలుగు ప్రజల ఆకాంక్షకు కట్టెదుటి రూపం విశాఖ స్టీల్‌. ఇప్పుడు నష్టాలలో ఉందన్న కారణంగా దాన్ని ప్రైవేటీకరించాలని నీతి ఆయోగ్‌ సిఫారసు చేయడం, దానిపై ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ కమిటీ ఆమోద ముద్ర వేయడమే పరమ విషాదం. ప్రత్యక్షంగాగానీ, పరోక్షంగాగానీ సుమారు నలభై వేల మందికి ఉపాధి కల్గించే ఏకైక సంస్థ ఆంధ్రప్రదేశ్‌లో ఇది ఒక్కటే. ఏడాదికి రూ. 1,500 కోట్లు ఆర్థిక సాయం చేసి, కావాల్సిన గనిని కేటాయించి ఈ పరిశ్రమను లాభాలబాటలో పెట్టడం ప్రభుత్వ సమర్థత అవుతుంది కానీ, ఎలాగోలా వదిలించుకోవాలని చూడటం సమర్థత ఎలా అవుతుంది?

విశాఖపట్నం ఉక్కు కర్మాగారం మరోసారి వార్తల్లోకి వచ్చింది. తెలుగు ప్రజలకు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు ఒక భావోద్వేగంతో కూడిన విషయంగా ఈ ఉక్కు కర్మాగారం నిలుస్తుంది. దీనిని కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరించాలని నిర్ణయించడం ప్రజలలో భయాందోళనలకు దారి తీస్తుంది. ప్రైవేటు వారికి ఇవ్వడం అంటే అది మూతపడినట్లేనేమోనన్న అనుమానాలే కారణం. నిజానికి ఏదైనా మరో పెద్ద గ్రూప్‌ కంపెనీకి అప్పగించి, దీనిని బాగా రన్‌ చేస్తే, నష్టాల నుంచి లాభాల బాటలో పడితే ఎవరూ కాదనరు. కానీ మిగిలిన కంపెనీలు వేరు. ఈ కంపెనీ వేరు. ఈ ఉక్కు కర్మాగారం కోసం 1960వ దశకంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ అంతా ఉర్రూతలూగే ఉద్యమం జరిగింది. చివరికి ప్రజల ఆకాంక్షను గుర్తించిన ఆనాటి ప్రధాన మంత్రి ఇందిరాగాంధీ విశాఖ స్టీల్‌కు శంకుస్థాపన చేయడం ద్వారా ఆ కలను నెరవేర్చారు. 

కానీ ఇప్పుడు ఆ కంపెనీ నష్టాలలో ఉందన్న కారణంగా ప్రైవేటీకరించాలని నీతి ఆయోగ్‌ సిఫారసు చేయడం, దానిపై ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ కమిటీ ఆమోద ముంద్ర వేయడం సహజంగానే ఆంధ్రులకు తీరని ఆవేదన మిగుల్చుతుంది. ఇది కేవలం ఆ కంపెనీలో పనిచేసే వేలాది ఉద్యోగులకు మాత్రమే సంబంధించింది కాదు. అది ఆంధ్రప్రదేశ్‌కు ఒక మణిహారం వంటిది. అసలే ఏపీలో పరిశ్రమలు పెద్దగా లేవన్న భావన ఉన్న సమయంలో కేంద్ర ప్రభుత్వ అధీనంలోని ఒక సంస్థ ప్రైవేటుపరం అయితే ఏ పరిణామాలు జరుగుతాయోనని అంతా భయపడుతున్నారు. ప్రత్యక్షంగాగానీ, పరోక్షంగాగానీ సుమారు నలభై వేల మందికి ఉపాధి కల్గించే ఏకైక సంస్థ ఆంధ్రప్రదేశ్‌లో ఇది ఒక్కటే ఉందని చెప్పాలి. గతంలో కూడా ఈ కంపెనీకి కొన్ని గండాలు ఎదురైనా, వాటిని అధిగమిస్తూ ముందుకు సాగింది. సొంత గని లేకపోవడం, అప్పుల భారం, అధిక వడ్డీ చెల్లింపు మొదలైన కారణాలతో ఈ సంస్థ నష్టాల ఊబిలో కూరుకుపోయింది. 

సాధారణంగా ప్రైవేటు కంపెనీ అయినా ప్రభుత్వ కంపెనీ అయినా, ముందుగా దానిని ఎలా బాగు చేయాలని ఆలోచిస్తారు. రకరకాల ప్రయత్నాలు చేస్తారు. ఆ తర్వాత తప్పనిసరి పరిస్థితి వస్తే అప్పుడు దానిని అమ్మకానికి పెట్టడమో, మరో చర్య తీసుకోవడమో చేస్తారు. అవేవి చూడకుండానే నేరుగా అమ్మకానికి పెట్టడం అంటే ప్రభుత్వం తన అసమర్థతను తెలియచేయడమే అనుకోవాలి. నిజానికి మన దేశంలో బ్యాంకులకు వేల కోట్లు ఎగవేసిన బడాబాబుల నుంచి అందులో కొంత డబ్బు వసూలు చేయగలిగినా, ఇలాంటి సంస్థలు ఢోకా లేకుండా నడుస్తాయనిపిస్తుంది. ఉదాహరణకు ప్రస్తుతం బీజేపీలో చేరిన టీడీపీ ఎంపీ సుజనా చౌదరి బ్యాంకులకు ఎన్నివేల కోట్లు ఇవ్వాలి? అలాగే మరో పారిశ్రామికవేత్త విజయ్‌ మాల్యా, వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోదీ వంటివారు వేల కోట్లు ఎగవేసి ఇతర దేశాలకు పరారయ్యారు. ఆ సంగతి అలా ఉంచితే కడప జిల్లాలో మరో ఉక్కు కర్మాగారానికి కేంద్రం హామీ ఇచ్చింది. అది నెరవేరలేదు. ఎవరినైనా ప్రైవేటు పెట్టుబడిదారులను తీసుకువచ్చి ఆ ప్లాంట్‌ను నెలకొల్పాలని ఏపీ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. 

ఇంతలో పులిమీద పుట్రలా విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ వివాదం మొదలైంది. నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని ఈ విషయంలో చాలా మంది ఏపీ బీజేపీ నేతలు కూడా మనస్ఫూర్తిగా సమర్థించ లేకపోతున్నారు. ఈ విషయంలో వారు ఆత్మరక్షణలో పడుతున్నారు. వారి మిత్రపక్షంగా ఉన్న జనసేన కూడా దీనిపై నిరసన తెలిపింది. మరో వైపు అన్ని పార్టీల కార్మిక సంఘాలు దీనిపై ఆందోళనలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రధాని మోదీకి స్పష్టమైన రీతిలో ఒక లేఖ రాశారు. ముప్పై రెండు మంది ఆత్మార్పణతో ఈ పరిశ్రమ ఏర్పాటైందన్న సంగతి గుర్తుచేసి, ప్రజ లకు, ఈ ప్లాంట్‌కు ఉన్న భావోద్వేగ సంబంధాన్ని ఆయన తెలియచేశారు. ఈ ప్లాంట్‌కు 19,700 ఎకరాల భూమి ఉంది. దాని విలువే లక్ష కోట్ల రూపాయల వరకు ఉంటుందని సీఎం వివరించారు.

రెండేళ్లు కష్టపడితే ఈ ఫ్యాక్టరీ దారిలో పడుతుందని ఆయన సూచించారు. గత ఏడాది డిసెంబర్‌ నుంచి ఏడాదికి  63 లక్షల టన్నుల ఉక్కు ఉత్పత్తి చేసే సంస్థగా ఇది తయారైంది. నెలకు 200 కోట్ల లాభం ఆర్జించే దశకు ఇది చేరుకుందని ఆయన వివరించారు. ఈ ఫ్యాక్టరీకి సొంత ఇనుప ఖనిజ గనిని కేటాయించాలని , అలాగే ఈ సంస్థకు ఉన్న 22 వేల కోట్ల రుణాలను ఈక్విటీగా మార్చి వడ్డీ భారం తగ్గించగలిగితే ప్లాంట్‌ నడవడం కష్టం కాదని ఆయన అబిప్రాయపడ్డారు. కేంద్ర ఉక్కుశాఖతో కలిసి ఏపీ ప్రభుత్వం దీనిపై పనిచేయడానికి సిద్ధంగా ఉందని, అందువల్ల ప్రైవేటీకరణ ఆలోచనను విరమించుకోవాలని ఆయన కోరారు. 

లక్ష కోట్ల విలువైన భూమి ఉన్నప్పుడు, అందులో ఐదోవంతు అప్పు ఉంటే పెద్ద ప్రమాదం ఉండకపోవచ్చు. ఏడాదికి రూ. 1,500 కోట్లు లేదా, వెయ్యి కోట్ల ఆర్థిక సాయం చేసి, కావాల్సిన గనిని కేటాయించి ఈ పరిశ్రమను లాభాలబాటలో పెట్టడం ప్రభుత్వ సమర్థత అవుతుంది కానీ, ఎలాగోలా వదిలించుకోవాలని చూడడం సమర్థత ఎలా అవుతుంది? ఇప్పటికే మోదీ ప్రభుత్వం పలు ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరిస్తూ ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. కేంద్రం సంగతి ఎలా ఉన్నా, అవసరమైతే విశాఖ స్టీల్‌ను నడపడానికి ఏపీ ప్రభుత్వం సిద్ధపడడం మంచి పరిణామమే అయినా, అందుకు తగ్గ ఆర్థిక వనరులను సిద్ధం చేసుకోవలసి ఉంటుంది. ఆర్థిక కష్టాలలో ఉన్న ఏపీ ప్రభుత్వానికి ఇది చిన్న విషయం కాదు. ప్రత్యామ్నాయ ఆలోచనలు చేయడం మంచిదే. కానీ మోయలేని భారం పెట్టుకుని తర్వాత ఇబ్బంది పడకుండా ఉండవలసిన అవసరం కూడా ఉంటుంది. 

ఒక వైపు ముఖ్యమంత్రి జగన్‌ ఇలా ఆచరణాత్మక రీతిలో ప్రతిపాదనలు చేయడం, ప్రధాన మంత్రికి లేఖ రాయడం, ఇది ఏపీ ప్రజల ఆత్మగౌరవానికి సంబంధించిన అంశంగా తెలియచేయడం వంటివి చేస్తుంటే ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు ఎప్పటి మాదిరి దిక్కుమాలిన రాజకీయం చేయడానికి పూనుకున్నారు. ప్రధానమంత్రి మోదీని కానీ, కేంద్ర ప్రభుత్వాన్ని కానీ తప్పు పడుతూ ఒక్కమాట కూడా ట్విట్టర్‌లో రాయలేని చంద్రబాబు సీఎం జగన్‌పై మాత్రం ఆరోపణలు చేశారు. కేంద్ర ప్రభుత్వం వైజాగ్‌ స్టీల్‌ను అమ్మకానికి పెట్టడం ఏమిటి? చంద్రబాబేమో అది జగన్‌ ప్రభుత్వానికి సంబంధించిందన్నట్లు మాట్లాడడం ఏమిటి? జగన్‌పై ద్వేషం ఉండవచ్చు. తనను ఆంధ్ర ప్రజలు ఘోరంగా ఓడించారన్న దుగ్ధ ఉండవచ్చు. అదే సమయంలో ప్రధానమంత్రి మోదీ అంటే భయం ఉండవచ్చు. కానీ సంబంధం లేకుండా జగన్‌పై ఆరోపణలు చేస్తే ప్రజలు నవ్వుకుంటారన్న సంగతి ఆయనకు తెలియాలి.

ప్రతిదానిలో నీచ రాజకీయం చేయడమే రాజకీయాలకు అర్థం అని చంద్రబాబు భావిస్తే ఎవరం ఏమీ చేయలేం..గతంలో తానే పెద్ద సంస్కరణల వీరుడనని చెబుతూ అనేక సంస్థలను ప్రైవేట్‌ పరం చేసిన చరిత్ర చంద్రబాబుది. ఉదాహరణకు నిజాం షుగర్స్‌ను ప్రైవేటు కంపెనీకి అప్పగించారు. అలాగే ఆల్విన్, పలు సహకార కర్మాగారాలు అన్ని కలిపి 700 కోట్ల విలువైన వాటిని సుమారు 200 కోట్లకే విక్రయించేశారన్న విమర్శలున్నాయి. అలాంటి చంద్రబాబు ఇప్పుడు విశాఖ స్టీల్‌ ప్రైవేటీకరణ గురించి ప్రధాని మోదీని తప్పుపట్టకుండా, సంబంధం లేని జగన్‌ను విమర్శిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం దీనిని ఎప్పటిమాదిరే నడుపుతూ, లాభాల బాటలోకి వెళ్లడానికి అవసరమైన చర్యలు చేపట్టడమో, లేదా ముఖ్యమంత్రి జగన్‌ కోరినట్లు కేంద్రం, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కలిసి ఈ ప్లాంట్‌ను నడిపేలా చర్యలు తీసుకోగలిగితే విశాఖ ఉక్కు–ఆంధ్రుల హక్కు అన్న నినాదం అర్థవంతంగా మారి ప్రజలకు మేలు కలుగుతుంది. మరి ఆ దిశగా కేంద్రం, ప్రధాని మోదీ ఆలోచించాలని ఆశిద్దాం. 


కొమ్మినేని శ్రీనివాసరావు 
వ్యాసకర్త సీనియర్‌ పాత్రికేయులు
 

మరిన్ని వార్తలు