అబద్ధాలకు చెక్‌... అభివృద్ధితోనే!

1 Dec, 2021 03:16 IST|Sakshi

విశ్లేషణ

ఎన్నో ప్రణాళికలతో ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించిన నాయకుడికి పదవీకాలంలో తొలి సగం చాలా కీలకం. అనుకున్నవి చేయాలి, అనుకోకుండా వచ్చిపడేవి ఎదుర్కోవాలి. దురదృష్టవశాత్తూ జగన్‌కు గత టీడీపీ ప్రభుత్వం మిగిల్చివెళ్లింది ఖాళీ ఖజానా. దీనికితోడు కరోనా మహమ్మారి సృష్టించిన ఆర్థిక, ఆరోగ్య సంక్షోభం. పైగా నిత్యం రంధ్రాన్వేషణ చేసే, అబద్ధపు కథనాలు వండివార్చే పచ్చ మీడియా. ఆర్థిక అననుకూలతలను తట్టుకొని మేనిఫెస్టోలో ప్రకటించిన అన్ని పథకాలనూ అమలు చేస్తోంది. ఇక అడ్డగోలు మీడియాను, బాధ్యత లేని ప్రతిపక్షాన్ని సంక్షేమ ఫలాలతో ప్రజలకు చేరువ కావడం ద్వారా ఎదుర్కొంటోంది. జగన్‌ ప్రభుత్వం సాధించిన గొప్ప విజయం ఇదే!

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పదవీకాలం అప్పుడే సగం ముగిసింది. ఇందులో మొదటి ఆరు నెలలు ఇల్లు సర్దుకోవడానికి సరిపోయింది. ఆ తర్వాత కరోనా సంక్షోభంతో ఏడాదిన్నర కాలం జరిగిపోయింది. ఇప్పటికీ అది పూర్తిగా తొలగిపోలేదు. మొత్తం మీద జగన్‌ ప్రభుత్వం సరిగా నడి చింది ఆరు నెలలే అన్నమాట. గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వానికి మిగిల్చి వెళ్లింది వంద కోట్ల రూపాయలు. ఈ విషయాన్ని టీడీపీకి మద్దతిచ్చే ఒక పత్రికే రాసింది. కానీ ప్రస్తుతం అవే టీడీపీ పత్రికలు, టీవీ చానళ్లు జగన్‌ ప్రభుత్వాన్ని దుర్మార్గంగా వెంటాడుతున్నాయి.  ప్రతిపక్ష దాడి ఒక ఎత్తు అయితే, ఈ మీడియా దాడిని తట్టుకోవడం మరో సమస్య. అయినా జగన్‌కు ఇది కొత్త కాదు. 2011 నుంచి ఈ పరిస్థితికి అలవాటుపడ్డారు. 

తాజాగా ఒక టీడీపీ పత్రిక జగన్‌ తన పదవీకాలం సగం పూర్తి చేసుకున్న సందర్భంగా సమీక్ష పేరుతో ఒక కథనం రాస్తూ,  కొన్ని వాస్తవాలు తప్ప అత్యధిక భాగం అబద్ధాలతో నింపేసింది. ఏ మీడియా అయినా నిష్పక్షపాతంగా విశ్లేషణలు ఇవ్వాలి. ప్రభుత్వం వైపు నుంచి జరిగిన మంచిపనులను అంగీకరించాలి. కానీ ఈ మీడియా మాత్రం జగన్‌ ప్రభుత్వంలో ఈ రెండున్నర ఏళ్లలో ఏమీ జరగలేదని ప్రచారం చేసే దుస్సాహసానికి దిగింది.

జగన్‌ వ్యతిరేకులు అనండి, ఆయా ప్రతిపక్షాలు అనండి, టీడీపీ మీడియా అనండి... ఎక్కడా ఏడాదిన్నర కరోనా సంక్షోభం గురించి గానీ, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నిధులు మిగల్చకుండా వెళ్లిపోయిన వైనం గురించి గానీ ఒక్క ముక్క కూడా ప్రస్తావించ కుండా, జగన్‌ ప్రభుత్వం అప్పులు చేసిందని ప్రచారం చేస్తున్నారు. అప్పులు మరీ ఎక్కువ అయితే ఇబ్బందే కావచ్చు. కానీ కరోనా సమయంలో అప్పులు చేసి పేదలను ఆదుకోకుండా ఉన్నట్లయితే వీరే ఎంత గగ్గోలు పెట్టేవారు!

చంద్రబాబు హయాంలో చివరి మూడు నెలల్లో పసుపు–కుంకుమ, అన్నదాత సుఖీభవ తదితర స్కీముల పేర్లతో వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే మహిళలంతా టీడీపీకి ఓటు వేస్తున్నారని ప్రచారం చేసిన ఈ మీడియా, ప్రతిపక్షం ఇప్పుడు జగన్‌ అమలు చేస్తున్న స్కీములను చూసి ఓర్వలేకపోతున్నాయి. గతంలో చంద్రబాబు గానీ, మరే ముఖ్యమంత్రి గానీ తమ పార్టీ మానిఫెస్టోని సెక్రటేరియట్‌లో, మంత్రుల చాంబర్‌లలో ఉంచి ఇవి అమలు కావాలని చెప్పారా? కానీ జగన్‌ అలా చేయగలిగారు. అందులో తొంభై శాతం హామీలను నెరవేర్చామని జగన్‌ చెబు తున్నారు. అలా చేయలేదని పథకం వారీగా విశ్లేషించే ధైర్యం వీరికి ఉందా? 

ఉదాహరణకు అమ్మ ఒడి కింద పదిహేను వేల రూపాయలు ఇస్తామని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ మానిఫెస్టోలో ఉంది. దానిని అమలు చేశారా, లేదా? దాని గురించి ఒక్కమాటా చెప్పరు. చేయూత కింద బలహీనవర్గాల మహిళలకు స్వయం ఉపాధి అవకాశాల కల్పనకోసం 18,500 చొప్పున ఇస్తున్నారా, లేదా? రైతు భరోసా కింద రైతులకు పదమూడువేల రూపాయల చొప్పున ఇచ్చారా, లేదా? రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులకు ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు వంటివి అందుబాటులో ఉంచగలుగుతున్నారా, లేదా? గ్రామ సచివాలయ వ్యవస్థను ఆవిష్కరించడం ద్వారా పరిపాలనను గ్రామాలకు తీసుకు వెళ్లారా, లేదా?

వలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రజల అవసరాలు తీర్చుతున్నారా, లేదా? గ్రామాలలో, పట్టణాలలో స్కూళ్లను పూర్తిగా మార్పు చేస్తూ కార్పొరేట్‌ విద్యా సంస్థలకు పోటీగా తయారు చేస్తున్నారా, లేదా? వైద్య రంగంలో కూడా నాడు–నేడు అమలు చేస్తున్నారా, లేదా? ప్రజల ఇళ్లవద్దకే రేషన్‌ అందిస్తున్నారా, లేదా? గతంలో పింఛన్ల కోసం వృద్ధులు రోజుల తరబడి ప్రభుత్వ ఆఫీసుల వద్ద పడిగాపులు పడాల్సి వచ్చేది. ఇప్పుడు వారి ఇళ్ల వద్దకే తీసుకు వెళ్లి ఇస్తూ పెద్ద మార్పు తెచ్చారన్నది నిజమా, కాదా? ఈ రెండున్నర సంవత్సరాలలో జగన్‌ అమలు చేసినన్ని స్కీములను మరే ప్రభుత్వం అమలు చేయలేదని డంకా భజాయించి చెప్పవచ్చు. 

జగన్‌ అమలు చేసే స్కీములలో కొన్ని నచ్చవచ్చు, నచ్చక పోవచ్చు. కానీ ఆయన చెప్పింది చేస్తున్నారా, లేదా అన్నది విశ్లేషిం చుకోవాలి. ముప్పై లక్షల ఇళ్ల స్థలాలు ఇచ్చింది కనిపిస్తోందా, లేదా? ఇవన్ని చెబితే అంతా సంక్షేమమే, అభివృద్ధి ఏదని మరో విమర్శ చేస్తారు. ఇవన్నీ అభివృద్ధి కిందకు రాకుండా ఏమవుతాయి? 1994లో ఎన్టీఆర్‌ అధికారంలోకి వచ్చినప్పుడు రెండు రూపాయలకు కిలో బియ్యం పథకం తిరిగి ప్రవేశపెట్టారు. అప్పుడు కాంగ్రెస్, మరికొన్ని పక్షాలు విమర్శించేవి. ఆనాడు ఇదే చంద్రబాబు, అప్పట్లో పౌరసరఫ రాల శాఖ మంత్రిగా ఉన్న బుచ్చయ్య చౌదరి తదితరులు ఇదంతా మానవాభివృద్ధి కిందే, క్యాపిటల్‌ వ్యయం కిందే తీసుకోవాలని వాదించేవారు. కానీ ప్రస్తుతం తెలుగు దేశం, ఆ పార్టీకి వంత పాడే మీడియా అంతా ఇదంతా అభివృద్ధి కానట్లు మాట్లాడుతోంది.

జగన్‌ ముఖం చూసి ఎవరు అప్పులు ఇస్తారని టీడీపీ సీనియర్‌ నేత యనమల రామకృష్ణుడు అంటే, చంద్రబాబు కాబట్టి అమరావతి బాండ్ల పేరుతో రెండువేల కోట్లు తెచ్చారని టీడీపీ మీడియా ఆ రోజులలో ప్రచారం చేసింది. మరి ఇప్పుడు జగన్‌ ఇన్ని సంక్షేమ కార్య క్రమాలకు ఎలా డబ్బు తేగలిగారు! వీటిలో అవినీతి లేకుండా నేరుగా ఎలా లబ్ధిదారులకు బదిలీ చేస్తున్నారు! గతంలో మాదిరి జన్మభూమి కమిటీలు ఉన్నాయా? పార్టీ, కులం, మతం వంటివి చూస్తు న్నారా? చంద్రబాబు నియోజకవర్గమైన కుప్పంలో కూడా స్కూలును తీర్చి దిద్దింది జగన్‌ ప్రభుత్వం కాదా? ఈ ఒక్కటి చాలు... జగన్‌ ప్రభు త్వానికీ, చంద్రబాబు ప్రభుత్వానికీ ఉన్న తేడా చెప్పడానికి.

రోడ్లకు సంబంధించి కొంత ఇబ్బంది ఎదురైన మాట నిజమే. ఆ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. కొత్త పరిశ్రమలు రావడం కరోనా సమయంలో దేశం అంతటా ఉన్నదే. దాని ప్రభావం ఏపీపై కూడా ఉంది. మరోవైపు ప్రత్యేక హోదాపై కేంద్రం మొండికేసింది. అయినా కొప్పర్తి పారిశ్రామికవాడ, శ్రీసిటీ వంటి చోట్ల కొత్త పరిశ్రమలు వస్తున్నాయి. విశాఖలో అదానీ డేటాసెంటర్, ఇతర ఐటీ పరిశ్రమలు పుంజుకుంటే కొంత మెరుగైన పరిస్థితి ఉండవచ్చు.

అదానీ గతంలో చంద్రబాబును కలిస్తే అదంతా అభివృద్ధి కోసమనీ, ఇప్పుడు అదే అదాని జగన్‌ను కలిస్తే ఆంధ్ర ప్రదేశ్‌ను రాసిచ్చేస్తున్నారని ప్రచారం చేసే దుర్మార్గపు మీడియాను ఎదుర్కుని నిలబడటమే జగన్‌ అసలు విజయం. అమరావతి పేరుతో లక్షల కోట్లు ఒకేచోట వ్యయం చేయాలన్న తమ డిమాండ్‌ నెరవేర లేదన్న దుగ్ధ కూడా టీడీపీకీ, ఆ వర్గం మీడియాకూ ఉంది. విశాఖ పట్నం కార్యనిర్వాహక రాజధాని అయితే తక్కువ ఖర్చుతో ఎక్కువ ఫలితం పొందవచ్చన్నది జగన్‌ ఆలోచన. వీటన్నిటికి న్యాయ వ్యవస్థ ద్వారా అడ్డుపడేది వీరే. మళ్లీ వ్యతిరేక ప్రచారం చేసేది వీరే.

ఎంతగా జగన్‌ను దెబ్బతీయాలని అనుకున్నా, స్థానిక ఎన్నికలలో వందకు తొంభై శాతం వైసీపీ పరం అయ్యాయి. అందులో కుప్పం కూడా ఉండటం వీరికి జీర్ణం కావడం లేదు. అమరావతిలో పది డిగ్రీల ఉష్ణోగ్రత తగ్గించాలని ఆదేశించి అధికారులను విస్తుపరచిన చంద్రబాబును గొప్ప వ్యక్తిగా టీడీపీ మీడియా ప్రచారం చేసు కోవచ్చు. కానీ అది రాజుగారి దేవతా వస్త్రం అని ప్రజలు గమనిం చారు కనుకే టీడీపీని మట్టికరిపించి వైసీపీకి పట్టం కట్టారు.

అయితే ఏ ప్రభుత్వానికి అయినా సమస్యలు ఉంటాయి. వాటిని సరిచేసు కుంటూ ముందుకు పోవడమే నాయకుడి విధి. రానున్న రెండున్నర ఏళ్లలో జగన్‌ ఎలా ఆర్థిక సమస్యలను ఎదుర్కుని తన కార్యక్రమాలను అమలు చేయగలుగాతరన్న ప్రశ్న చాలా మందిలో లేకపోలేదు. దీనికి కాలమే జవాబు ఇస్తుంది. ఇప్పటికైతే సఫలం అయిన ముఖ్యమంత్రి గానే వైఎస్‌ జగన్‌ నిలుస్తారు.


- కొమ్మనేని శ్రీనివాసరావు, సీనియర్‌ పాత్రికేయులు      

మరిన్ని వార్తలు