న్యాయవ్యవస్థలో అవినీతి చేటుకాదా?

11 Nov, 2020 00:14 IST|Sakshi

విశ్లేషణ

ప్రజాస్వామ్య మూలాల్ని నమిలివేస్తున్న అవినీతి అని సుప్రీంకోర్టు సీనియర్‌ జడ్జి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ చేసిన ప్రసంగం అందరూ గమనించదగింది. ఒక న్యాయకోవిదుడు అవినీ తిపై తన ఆవేదన వ్యక్తం చేయడం హర్షించదగ్గ విషయం. న్యాయం అన్న పదానికి విస్తృతమైన అర్థం ఉందని ఆయన విడమరిచి చెప్పే యత్నం చేశారు. ప్రజలకు సామాజిక, ఆర్థిక, న్యాయపరమైన అంశాలు దీని పరిధిలోకి వస్తాయని ఆయన చెప్పారు. ప్రభుత్వాలు సామాజిక శాంతికి కృషి చేయాలని, అంతేకాక, ఆ విషయాన్ని ప్రభుత్వాలు ప్రజలకు తెలియచేయాలని ఆయన సూచించారు. ఎక్కడైతే అవినీతి సాధారణం అయిపోతుందో అక్కడ వ్యవస్థలపై ప్రజలలో విశ్వాసం సన్నగిల్లుతుందని ఆయన అన్నారు. చాలా విలువైన విషయాలను గౌరవ న్యాయమూర్తి ప్రసంగించారు. ఈ సందర్భంగా కొన్ని అంశాలను అంతా పరిశీలించవలసి ఉంటుంది. 

న్యాయమూర్తి చెప్పిన విషయాలు కచ్చితంగా అన్ని వ్యవస్థలు పాటించాలి. శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయ వ్యవస్థ ఈ మూడు సమన్వయంతో పనిచేయాల్సి ఉంటుంది. అలాగే చెక్స్‌ అండ్‌ బ్యాలెన్స్‌తో వ్యవస్థలు ముందుకు సాగాల్సి ఉంటుంది. శాసన వ్యవస్థలో రాజకీయ నేతలు కీలకంగా  ఉంటే, కార్యనిర్వాహక వ్యవస్థలో ఐఏఎస్,ఐపీఎస్‌లు ముఖ్య భాగంగా ఉంటారు. మూడోది న్యాయ వ్యవస్థలో న్యాయమూర్తులు ప్రముఖులు అన్న విషయం వేరే చెప్పనవసరం లేదు. ఈ మూడింటిలో ఎక్కడ తేడా వచ్చినా, పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. నిజమే! దేశంలో రాజకీయ వ్యవస్థలో అవినీతి పెరిగిన మాట వాస్తవం. అలాగే రాజకీయాల కోసం ప్రత్యర్థుల మీద కేసులు పెట్టిన ఘటనలు కొన్ని అయితే, తమకు కావాల్సిన వారు ఏమి చేసినా వారిపై ఎలాంటి కేసులు రాని పరిస్థితి మరొకటి ఉంటోంది. దీనికి ప్రధానంగా శాసన వ్యవస్థ, న్యాయవ్యవస్థ బాధ్యత వహించాలి.

జస్టిస్‌ రమణ చెప్పినదాని ప్రకారం అవినీతి ప్రజాస్వామ్య మూలాలను నమిలివేస్తుంటే, దానిని చెక్‌ చేయవలసిన న్యాయ వ్యవస్థపై ఆరోపణలు వస్తే ఏమి చేయాలన్న దానిపై కూడా ఆయన కొన్ని సూచనలు చేస్తే బాగుండేది. ఒక ప్రభుత్వం ఫలానా అవినీతి జరిగింది. దానిపై విచారణ చేయాలని దర్యాప్తు సంస్థలకు బాధ్యత అప్పగిస్తే, అవి తమ కర్తవ్యం నిర్వర్తించి కొంతమంది వ్యక్తులపై అవినీతి కేసులు పెడితే గౌరవ హైకోర్టులు ఎందుకు ఆ విచారణను నిలిపివేస్తున్నాయి? పైగా కొన్ని కేసులలో ఆశ్చర్యంగా సంబంధిత సమాచారం ఎవరికీ తెలియకూడదని ఆదేశాలు ఇస్తున్నాయి. రాజకీయ లేదా శాసన, కార్యనిర్వాహక వ్యవస్థలలో అవినీతి జరిగితే చెక్‌ చేయడానికి న్యాయ వ్యవస్థ ఉండాలి. మరి న్యాయవ్యవస్థలో అలాంటి లోటుపాట్లు జరి గితే దాన్ని చెక్‌ చేయడానికి కూడా అవకాశం ఉండాలి కదా.. న్యాయమూర్తులంతా కడిగిన ముత్యాల్లా, తామరాకు మీద నీటి బొట్టులా నిష్పక్షపాతంగా ఉంటే అంతకన్నా గొప్ప విషయం ఏమి ఉంటుంది?

ముంబై హైకోర్టు సాయంత్రం ఆరు గంటలు దాటింది కనుక తాము ఎలాంటి ఆదేశాలు ఇవ్వజాలమని, జర్నలిస్టు అర్నాబ్‌ కేసులో ఎందుకు చెప్పింది? ఏపీలో మాజీ ఏజీ దమ్మాలపాటి శ్రీని వాస్‌ కేసులో  హైకోర్టువారు రాత్రి పొద్దుపోయిన తర్వాత అవినీతి కేసులో ఎఫ్‌ఐఆర్‌పై స్టే ఇవ్వడమే కాకుండా ఎక్కడా ప్రచారం కారాదని ఎందుకు ఆదేశాలు ఇచ్చింది? అంతేకాక అసలు ఆ కేసులో పిటిషన్‌ వేయకపోయినా, అందరికీ వర్తించేలా ఆదేశాలు ఇవ్వాలని ఏ చట్టం, ఏ రాజ్యాంగం చెప్పిందన్నది మాబోటి సామాన్యులకు తెలియదు. కానీ ఆయా హైకోర్టులు కొన్ని అంశాలపై భిన్నమైన రీతిలో స్పందిస్తున్నప్పుడు సహజంగానే చర్చనీ యాంశం అవుతాయి కదా? కేరళలో మధ్యతరగతి ప్రజలు నివసించే అపార్టుమెంట్లను నదీ సంరక్షణ చట్టం కింద సుప్రీంకోర్టు ఎందుకు కూల్చివేయిం చింది.. మరి అదే ఏపీలో కృష్ణా కరకట్టపై ఉన్న అక్రమ కట్టడాలు కూల్చడానికి వ్యతిరేకంగా న్యాయ వ్యవస్థ ఎందుకు స్టేలు ఇచ్చిందని అనుకోవాలి. ఇలాంటి సంశయాలు చట్టపరమైన విద్య చదువుకోని మాబోటివాళ్లకు వస్తే ఎవరు సమాధానం ఇస్తారు? 

గతంలో న్యాయ వ్యవస్థలోని కొందరిని అవి నీతి కేసులలో అరెస్టు చేసిన ఘట్టాలు కూడా చూశాం. ఇప్పుడు జస్టిస్‌ రమణ చేసిన ప్రసంగం స్ఫూర్తిదాయకమైనది. కానీ ఆయన చెబుతున్నదానికి విరుద్ధంగా కొన్ని హైకోర్టులలో విషయాలు నడుస్తున్నాయన్న భావన కలిగితే ఎవరిని అడగాలి? రమణగారు అవినీతి ప్రజాస్వామ్య మూలాలను తినేస్తోందని అంటారు. కానీ కొన్ని హైకోర్టులు అవినీతి కేసులలో స్టేలు ఇస్తున్న తీరు ఆశ్చర్యం కలిగిస్తుంది. అమరావతిలో భూమి స్కాం జరిగిందని ఎఫ్‌ఐఆర్‌ నమోదు అయితేనే దానిని గౌరవ న్యాయస్థానం వారు నిలుపుదల చేయడం సరైనదేనా? జస్టిస్‌ రమణ చేసిన అభిప్రాయాలకు ఇది విరుద్ధంగా ఉన్నట్లా? కాదా? ఈ ఎస్‌ఐ స్కామ్‌లో అరెస్టు అయిన ఒక రాజకీయ నాయకుడిని ప్రైవేటు కార్పొరేట్‌ ఆస్పత్రిలో చేర్పించడానికి ఒక కోర్టు వారు ఇచ్చిన ఆదేశాలు, అలాగే బెయిల్‌ వచ్చిన తీరు చర్చకు అవకాశం ఇచ్చిందా? లేదా? విశాఖలో ఎల్జీ పాలిమర్స్‌ ప్రమాద ఘటనలో ఎంతో సీరియస్‌గా స్పందించిన గౌరవ హైకోర్టు వారు, విజయవాడలో జరిగిన హోటల్‌ అగ్నిప్రమాద కేసులో ఎందుకు స్టే ఇచ్చిందని సామాన్యుడు అడిగే ప్రశ్నకు జవాబు దొరుకుతుందా? 

ప్రభుత్వాలలో అవినీతి జరగదని, కార్యనిర్వాహక వ్యవస్థలో తప్పులు జరగవని చెప్పడం లేదు. కచ్చితంగా వాటిని చెక్‌ చేయవలసిందే. కనీసం న్యాయ వ్యవస్థకు ఆ అవకాశం ఉంటుంది. కానీ న్యాయ వ్యవస్థలో జరిగే తప్పొప్పులకు ఎవరు బాధ్యత వహించాలి. న్యాయ వ్యవస్థలో ప్రముఖులపై అభియోగాలు వస్తే ప్రభుత్వాలు చర్య తీసుకోవాలా? లేదా? న్యాయ వ్యవస్థ గురించి ఎవరూ మాట్లాడకూడదు అన్నట్లు వ్యవహారాలు నడవడం సమంజసమేనా? నిజమే కొన్నిసార్లు ప్రత్యర్థులను ఇబ్బంది పెట్టడానికి తప్పుడు కేసులుపెట్టవచ్చు. అలాంటి వాటిని కనిపెట్టి కోర్టులు న్యాయం చేయడం, పౌరహక్కులను కాపాడడం ఎవరైనా సమర్థించి తీరవలసిందే. కానీ అందరూ చూస్తుం డగా జరిగిన కొన్ని నేరాభియోగాలను న్యాయ వ్యవస్థ ఎందుకు గమనంలోకి తీసుకోవడం లేదని అడిగితే ఏమి చెబుదాం. 

ఉదాహరణకు ఓటుకు నోటు కేసులో ఒక మాజీ సీఎం పాత్ర గురించి చార్జీషీట్‌లో పలుమార్లు ఎందుకు ప్రస్తావనకు వచ్చింది? అయినా ఆయన పేరు ఎఫ్‌ఐఆర్‌లో ఎందుకు పెట్టలేదు? దానిపై హైకోర్టుకు వెళితే ఒక జడ్జిగారు చంద్రబాబుకు ఏం సంబంధం అని అనడం కరెక్టేనా? ఆ కేసుపై సుప్రీం కోర్టులో ఇంతకాలం అసలు విచారణే ఎందుకు జరగలేదని సామాన్యులకు సందేహాలు వస్తే ఏమని చెప్పాలి? కనుక  జస్టిస్‌ రమణ చెప్పినట్లు ప్రజాస్వామ్య మూలాలను అవినీతి నమిలేస్తున్నదన్నది వాస్తవమే. అలాంటి పరిస్థితి న్యాయ వ్యవస్థలో చొరబడకుండా గౌరవ న్యాయమూర్తులు ఏమి చేయాలి? దాని గురించి ముందుగా కేంద్రీకరించి వ్యవస్థను ప్రక్షాళన చేయడానికి పూనుకుంటే అంతకన్నా గొప్ప విషయం ఏమి ఉంటుంది? ప్రభుత్వాల విధానాల నిర్ణయాలలో తరచూ హైకోర్టులు జోక్యం చేసుకుని ప్రభుత్వాలను ఇబ్బంది పెడుతున్నాయని సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా అన్నారు. ఓడిపోయినవారు కోర్టులను అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తున్నారని న్యాయ శాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ ఎందుకు అంటున్నారు?

ఈ మధ్య రిటైర్‌ అయిన దీపక్‌ గుర్తా అనే సుప్రీంకోర్టు జడ్జి ఒక వ్యాఖ్య చేస్తూ న్యాయ వ్యవస్థ ధనికుల కేసుల్లో అతి వేగంగా స్పందిస్తోందని అనడంలో ఆంతర్యం ఏమిటి? సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌గా పనిచేసిన రంజన్‌ గొగోయ్‌ వ్యవస్థలో మాఫియా ఉందని అనడం ఏమిటి? తదుపరి ఆయన రాజ్యసభ సభ్యుడు అవడం ఏమిటి? ప్రజాస్వామ్యానికి ఎంతో కీలకమైన న్యాయ వ్యవస్థ గురించి కూడా అంతా ఆలోచించాల్సిన సమయం రాలేదా? జస్టిస్‌ రమణ చెప్పినట్లు అవినీతి ప్రజాస్వామ్య మూలాలను నమిలేస్తోంది. దురదృష్టవశాత్తు న్యాయవ్యవస్థ కూడా ఈ విషయంలో విమర్శలు ఎదుర్కోవడమే బాధాకరం. ఆ పరిస్థితి పోవాలని, న్యాయ వ్యవస్థ స్వతంత్రంగా పనిచేయాలని, నిష్పక్షపాతంగా ఉండాలని, ఎలాంటి అవినీతి అభియోగాలకు అవకాశం లేకుండా ఉండాలని ప్రజలు కోరుకోవడం ఆక్షేపణీయం కాదు. అందువల్ల అన్ని వ్యవస్థలు సజావుగా సాగాలని, అన్ని విభాగాలు అవినీతికి దూరంగా ఉండాలని, అప్పుడు దేశంలో ప్రజాస్వామ్యం మరింతగా వర్ధి ల్లుతుందని ఆశించడం తప్పు కాదు. మరి ఆ పరి స్థితి వస్తుందా?

వ్యాసకర్త
కొమ్మినేని శ్రీనివాసరావు
సీనియర్‌ పాత్రికేయులు    

Read latest Guest-columns News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు