ఒంటెత్తు పోకడలకు చెంపపెట్టు

13 Jan, 2021 00:19 IST|Sakshi

విశ్లేషణ

వ్యాక్సినేషన్‌ ప్రక్రియపై షెడ్యూల్‌ ఖరారు అయ్యాక, స్థానిక ఎన్నికలపై చర్చిద్దామని ప్రభుత్వం చెప్పినా, వినకుండా ప్రధాని వీడియో కాన్ఫరెన్స్‌ కన్నా ముందుగానే ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ ఎన్నికల తేదీలను ప్రకటించడంలో కూడా దురుద్దేశం కనిపిస్తుంది. ఈ నెల పదహారు నుంచి వ్యాక్సిన్‌ పంపిణీ మొదలవుతుందని తెలిసి కూడా నిమ్మగడ్డ ఇలా చేయడం బాధ్యతారాహిత్యమే అవుతుంది. పదవీకాలంలో గౌరవాన్ని సంపాదించుకోవాలి కానీ, ఇలాంటి అప్రతిష్టను మూటకట్టుకోకూడదు. అయినా నిమ్మగడ్డ ఏమీ ఫీల్‌ కావడం లేదంటే అంతకంటే అధిక ప్రయోజనం ఎక్కడి నుంచో వస్తోందన్న అభిప్రాయం కలుగుతుంది. ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ తన బురదను అందరికీ అంటించాలనే భావిస్తున్నారా.. 

ఏపీ హైకోర్టు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడం మెచ్చదగినదే. ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ విడుదల చేసిన షెడ్యూల్‌ను రద్దు చేయడం కానీ, ఆ సందర్భంగా గౌరవ న్యాయమూర్తి జస్టిస్‌ గంగారావు వ్యక్తం చేసిన అభిప్రాయాలు కానీ అర్ధవంతంగా కనిపిస్తున్నాయి. ప్రధానంగా ప్రజలకు జీవించే హక్కు ఉందని, ప్రజల ప్రాణాలతో ఎవరూ చెలగాటమాడకూడదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం హర్షణీయం. కరోనా సంక్షోభం నేపథ్యంలో వ్యాక్సినేషన్‌కు దేశం అంతా సిద్ధమవుతున్న తరుణంలో నిమ్మగడ్డ స్థానిక ఎన్నికలు అంటూ హడావుడి చేయడం, ఎన్నికల కోడ్‌ పేరుతో ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే యత్నం చేయడం ఇవన్నీ చర్చనీయాంశం అయ్యాయి.

కొందరు బొడ్డుకు మసి రాసుకు కూర్చుంటారు. మరికొందరు బురదలో దిగుతారు. వారికి ఒక ఉద్దేశం ఉంటుంది. అదేమిటంటే ఆ మసి కానీ, ఆ బురద కానీ ఇతరులకు కూడా అంటించాలని. అప్పుడు వారి ఆత్మ సంతృప్తి చెందుతుంది. ప్రస్తుతం ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ తీరు అలాగే ఉంది. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు, ఆయన ప్రభుత్వానికి తన మసి అంటిం చాలన్న ఆలోచన చేస్తున్నారు. ప్రభుత్వానికి బురద అంటించడం ఎలా అని ప్రయత్నిస్తున్నారు. ఫిబ్రవరి నెలలో ఎన్నికలు పెట్టడం కోసం జనవరి తొమ్మిది నుంచే ఎన్నికల కోడ్‌ అంటూ చిత్రమైన నియమావళిని తీసుకువచ్చారు. 

అసలు ప్రస్తుతానికి ఎన్నికలే వద్దు.. ముందు కరోనా వ్యాక్సిన్‌ పంపిణీ ముఖ్యం, ప్రజల జీవితాలకు ప్రమాదం తేకూడదు అని ఏపీ ప్రభుత్వం తరపున చీఫ్‌ సెక్రటరీ ఆదిత్యనాథ్‌ దాస్, మరో ఇద్దరు సీనియర్‌ అధికారులు ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌కు చెప్పివచ్చిన కొద్దిసేపటికే ఎన్నికలు పెడుతున్నట్లు ప్రభుత్వానికి చెప్పకుండా ప్రకటన జారీ చేశారు. ఆ మాటకు వస్తే 2020 మార్చి 15న కరోనా పేరుతో నిమ్మగడ్డ కనీసం ప్రభుత్వాన్ని సంప్రదించకుండా, ఎన్నికలను వాయిదా వేసినప్పుడు ఏపీలో 25 కేసులు కూడా లేవు. అప్పుడు ఆయన ఏపీని రక్షించారని టీడీపీ అధినేత చంద్రబాబు, టీడీపీ మీడియావారు ఊదరకొట్టారు.

తదుపరి కరోనా ప్రపంచం అంతా విజృంభించింది. ఎనిమిది లక్షలకు పైగా కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఏడువేల మందికి పైగా మరణించారు. ఇప్పటికీ మూడువేల మందికి పైగా చికిత్స పొందుతున్నారు. రోజూ ఇంకా 200 నుంచి 300 కేసులు వస్తున్నాయి. అయినా నిమ్మగడ్డ అదేమీ పెద్ద ఇష్యూ కానట్లు ఎన్నికలు పెడతానంటూ ఏకపక్షంగా నిర్ణయం ప్రకటిం చడం, దానిని ప్రభుత్వం వ్యతిరేకించి హైకోర్టుకు వెళ్లాల్సి వచ్చింది. 

నిమ్మగడ్డ అక్కడితో ఆగలేదు. అమ్మ ఒడి, పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ వంటివాటిని కూడా నిలుపుదల చేయడానికి యత్నించారని వార్తలు వచ్చాయి. సాధారణంగా ఆన్‌ గోయింగ్‌ స్కీములకు ఎన్నికల కోడ్‌ వర్తించదు. అమ్మ ఒడి స్కీమ్‌ గత ఏడాది అమలు అయింది. ఈ ఏడాది నెల్లూరులో జనవరి పదకొం డున అమలు చేయడానికి ఏర్పాట్లు చేసుకున్న తరుణంలో నిమ్మగడ్డ నిలుపుదల చేస్తున్నట్లు సర్క్యులర్‌ ఇచ్చారు. అలాగే ఇళ్ల స్థలాల పంపిణీ కూడా గత ఏడాది డిసెంబర్‌ 25 నుంచి అమలు అవుతోంది. దీనిని కూడా నిలిపివేయాలన్నారు. వీటిని ఏపీ ప్రభుత్వం ఆపలేదు. అది వేరే విషయం. 

నిజమేదంటే ఈ స్కీములు పేదల గుండెల్లో నిలిచిపోయాయి. దానిని ఎలాగైనా దెబ్బకొట్టే లక్ష్యంతో ఎన్నికల కమిషనర్‌ ఈ దిక్కుమాలిన సర్క్యులర్‌ ఇచ్చారని అర్థం అవుతుంది. టీడీపీకి, చంద్రబాబుకు ఎలాగైనా ఉపయోగపడాలన్న కాంక్షతో ఈ పని చేసినట్లుంది కానీ, పద్ధతి ప్రకారం చేసినట్లు లేదని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు విమర్శిస్తున్నారు. నిజానికి టీడీపీకి స్థానిక ఎన్నికల కన్నా, తిరుపతి లోక్‌సభ నియోజకవర్గ ఉప ఎన్నిక ముఖ్యం. అక్కడ గణనీయంగా ఓట్లు రాకపోతే, వైఎస్సార్‌సీపీ మెజార్టీని తగ్గించకపోతే, టీడీపీ మరింత దెబ్బతింటుంది. అందుకే ఎన్నికల కోడ్‌ పెడుతున్నట్లు ప్రకటించారా అన్న సంశయం కలుగుతుంది.

ఫిబ్రవరిలో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుపుతారు కాబట్టి అప్పటివరకు ఒక ఎన్నికల కోడ్, ఆ తర్వాత మండల, జడ్పీ, మున్సిపల్‌ ఎన్నికలకు మరో షెడ్యూల్‌ విడుదల చేసి, తిరిగి ఎన్నికల కోడ్‌ కొనసాగించవచ్చన్న ఉద్దేశం కనిపిస్తుంది. అంతలో కేంద్ర ఎన్నికల సంఘం తిరుపతి ఉప ఎన్నిక ప్రకటిస్తే, ఆ కోడ్‌ నెల్లూరు, చిత్తూరు జిల్లాలకు వర్తింపచేసే అవకాశం ఉంటుంది. అంటే రెండున్నర నెలలు ప్రభుత్వం ఏ పని చేయకుండా, సంక్షేమ పథకాలు ప్రజలకు చేరకుండా జరిపిన కుట్రలాగా అనిపిస్తుంది. 

పైగా, ప్రభుత్వపరంగా కరోనా వ్యాక్సిన్‌ పంపిణీకి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రభుత్వ యంత్రాంగం అంతా దానిపై పనిచేయవలసి ఉంటుంది. ఇప్పుడు ఆ పని మాని నిమ్మగడ్డ ఎన్నికల ఆదేశాలను పాటించాలన్నమాట. అయితే ఎన్జీఓ సంఘం, ఉపాధ్యాయ సంఘం, పోలీసు అధికారుల సంఘం, సచివాలయ ఉద్యోగుల సంఘం ఇలా అన్ని సంఘాలు ఎన్నికలను బహిష్కరిస్తామని హెచ్చరించాయి. వారు కూడా కోర్టును ఆశ్రయించారు. వీటన్నిటిని పరిగణనలోకి తీసుకున్న గౌరవ హైకోర్టు స్థానిక ఎన్నికల షెడ్యూల్‌ను నిలుపుదల చేయడమే కాకుండా, ఎన్నికల ఏకపక్షంగా ప్రకటించారని అభిప్రాయపడింది. వారి షెడ్యూల్‌ వ్యాక్సినేషన్‌కు ఆటంకం అవుతుందని కూడా స్పష్టంగా భావించింది. రాజ్యాంగం ప్రకారం ప్రజలకు జీవించే హక్కు ఉంటుం దని వ్యాఖ్యానించింది. గౌరవ హైకోర్టు న్యాయమూర్తి విజ్ఞతతో తీర్పు ఇచ్చినందుకు వారిని అభినందించాలి. న్యాయవ్యవస్థ గౌరవాన్ని ఆయన పెంచారని చెప్పాలి. నిమ్మగడ్డ ఎంత అహంతో ఉన్నారన్నది మరోసారి ధ్రువపడుతుంది.

ఒక కోర్టువారు ప్రజలకు జీవించే హక్కు ఉన్నదని చెబితే, మరో కోర్టు అందుకు భిన్నంగా చెబుతుందా అన్న ప్రశ్న వస్తుంది. ఎన్నికల కమిషన్‌ ప్రకటన చేసిన తర్వాత కోర్టులు జోక్యం చేసుకోరాదన్నది నిమ్మగడ్డ వాదన. ఎన్నికల కమిషన్‌ షెడ్యూల్‌ను మాత్రమే ప్రకటించింది. ఎన్నికల నోటిఫికేషన్‌ జనవరి 23న వస్తుంది. అంటే అప్పటివరకు ఎన్నికల ప్రక్రియ ఆరంభం కానట్లేనని, అందువల్ల హైకోర్టువారు జోక్యం చేసుకోవచ్చని మరో వాదన కూడా ఉంది. ఉద్యోగులు, ప్రజలు తమ ప్రాణాలను పణంగా పెట్టి ఎన్నికలలో ఎలా పాల్గొంటారన్నది అన్నిటికి మించిన లాజిక్‌ అని చెప్పాలి. నిజంగానే స్థానిక ఎన్నికలపై అంత శ్రద్ధ ఉంటే 2018లోనే ఎందుకు నిర్వహించలేదన్న దానికి నిమ్మగడ్డ రమేష్‌ గానీ, చంద్రబాబు కానీ సమాధానం ఇవ్వలేదు. కరోనా సాకు చూపుతూ రాష్ట్ర ప్రభుత్వాన్ని కనీసం సంప్రదించకుండా గత మార్చిలో ఎలా వాయిదా వేశారన్న ప్రశ్నకు ఆయన వద్ద జవాబు లేదు. గతంలో ఇలా ఎన్నికలు వాయిదా పడలేదా? పడ్డాయి. స్వయంగా నిమ్మగడ్డే ఎన్నికలను వాయిదా వేశారు కదా. అలాం టప్పుడు అత్యవసర సమయాలలో హైకోర్టు ఎన్నికల కమిషన్‌ నిర్ణయాలలో జోక్యం చేసుకోకూడదని లేదని న్యాయ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.

వ్యాక్సినేషన్‌ ప్రక్రియపై షెడ్యూల్‌ ఖరారు అయ్యాక, స్థానిక ఎన్నికలపై చర్చిద్దామని ప్రభుత్వం చెప్పినా, వినకుండా ప్రధాని వీడియో కాన్ఫరెన్స్‌ కన్నా ముందుగానే నిమ్మగడ్డ ఎన్నికల తేదీలను ప్రకటించడంలో కూడా దురుద్దేశం కనిపిస్తుంది. ఈ నెల పదహారు నుంచి వ్యాక్సిన్‌ పంపిణీ మొదలవుతుందని తెలిసి కూడా నిమ్మగడ్డ ఇలా చేయడం బాధ్యతారాహిత్యమే అవుతుంది. మార్చి 31 నాటికి రమేష్‌ కుమార్‌ రిటైర్‌ అవుతారు. ఈలోగా తన అహాన్ని సంతృప్తిపరచుకోవడానికి, టీడీపీ నేతలను సంతోషపరచడానికి ఇలా పనిచేస్తున్నారన్న భావన ఏర్పడింది. మరో అంశం ప్రస్తావించాలి. న్యాయవ్యవస్థలో అయినా, ఇలాంటి రాజ్యాంగబద్ధమైన సంస్థలో అయినా నిష్పక్షపాతంగా వ్యవహరించడం లేదని ప్రభుత్వం చెబితే వెంటనే ఆ కేసులను విచారించకపోవడం, ఇతరత్రా నిర్ణయం తీసుకోకుండా ఉండడం అనే ఒక మర్యాద ఉంటుంది.

కానీ న్యాయ వ్యవస్థలో కూడా కొందరు ఆ ఎథిక్స్‌ను పాటిం చడం లేదు. ఇప్పుడు నిమ్మగడ్డ కూడా అదే రకంగా ఎవరు ఏమని అనుకున్నా పర్వాలేదు.. తాను మాత్రం ఇలాగే చేస్తాను అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ఇది మంచిదికాదు. అయినా ఈ మూడు నెలల్లోనే ఏదో చేసేయాలని ఆయన ప్రయత్నిస్తున్నారు. దానివల్ల టీడీపీకి పెద్దగా కలిసి వచ్చేది ఏమీ ఉండదు. మార్చి 31 తర్వాత నిమ్మగడ్డ చేయగలిగేది ఏమీ ఉండదన్న సంగతిని కూడా ఆయన గుర్తు ఉంచుకోవాలి. పదవీకాలంలో గౌరవాన్ని సంపాదించుకోవాలి కాని, ఇలాంటి అప్రతిష్టను మూటకట్టుకోకూడదు. అయినా ఆయన ఏమీ ఫీల్‌ కావడం లేదంటే అంతకంటే అధిక ప్రయోజనం ఎక్కడి నుంచో వస్తోందన్న అభిప్రాయం కలుగుతుంది.

-కొమ్మినేని శ్రీనివాసరావు
వ్యాసకర్త సీనియర్‌ పాత్రికేయులు 

 

మీ అభిప్రాయాలను కింద తెలపండి

Read latest Guest-columns News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments

మరిన్ని వార్తలు