స్కామ్‌లపై కేసులు వద్దంటే ఏంటర్థం?

3 Sep, 2020 00:28 IST|Sakshi

విశ్లేషణ

దేశంలోనే ఇలాంటి వ్యాజ్యాలు అరుదుగా పడుతుంటాయేమో! తమ ప్రభుత్వ హయాంలో జరిగిన వ్యవహారాలపై ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం విచారణ జరపరాదనీ, ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించరాదనీ, సీబీఐ విచారణకు అప్పగించరాదనీ ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ హైకోర్టును ఆశ్రయించిన తీరు ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇంతకాలం దమ్ముంటే విచారణ చేసుకోండి, మేం ఏ తప్పూ చేయలేదు, నిప్పులా బతికాం అంటూ భీషణ ప్రకటనలు చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన మద్దతుదారులు ఎందుకు స్వరం మార్చారు? కేసులు పెట్టుకోండని సవాళ్లు చేసిన టీడీపీ, తమపై వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం కక్షతో కేసులు పెడుతోందని, అవినీతి జరిగిందని ఆరోపిస్తూ తమ వాళ్లను అరెస్టు చేస్తోందని ప్రచారం చేస్తోంది. ఇప్పుడు ఏకంగా అసలు కేసులే పెట్టవద్దని హైకోర్టుకు వెళ్లారు. హైకోర్టు ఏమి చేస్తుందన్నది వేరే విషయం. ఏ న్యాయస్థానం కూడా అక్రమాలను వెలికి తీయవద్దని, అన్యాయాలను నిరోధించవద్దని చెబుతుందని అనుకోజాలం. గతంలో ఎన్నో సందర్భాలలో హైకోర్టులే ప్రస్తుత ప్రభుత్వాలలో జరిగే తప్పులను, గత ప్రభుత్వాలలో జరిగే తప్పులను విచారించాలని దర్యాప్తు సంస్థలకు ఆదేశాలు ఇచ్చాయి. ఏపీ హైకోర్టు కూడా అలా ఎన్నో తీర్పులు వెలువరించింది. చిన్న, చిన్న కేసులలో కూడా సీబీఐ విచారణ చేయాలని ఆదేశాలు ఇస్తూ సీరియస్‌ అయిన విషయాన్ని చూశాం. అలాంటిది వేల కోట్ల కుంభకోణం ఆరోపణలను విస్మరించకపోవచ్చు. అయినా తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగా తమపై కేసుల విచారణ సాగరాదని హైకోర్టుకు వెళ్లడం ఒకరకంగా సెల్ఫ్‌ గోల్‌ చేసుకున్నట్లు అవుతుంది. కోర్టు విచారణకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినా టీడీపీకి అప్రతిష్టే. ఏ సాంకేతిక కారణం ఆధారంగానో విచారణకు అనుమతి ఇవ్వకపోయినా టీడీపీకి పరువు తక్కువే. అసలే వ్యవస్థలను మేనేజ్‌ చేయడంలో దిట్ట అని పేరుపొందిన చంద్రబాబుపై అనేక విమర్శలు వచ్చే అవకాశం ఉంటుంది. 

ఏపీ ప్రభుత్వం హైకోర్టుకు ఇచ్చిన రిపోర్టులో అనేక విషయాలు వెల్లడించింది. ఏకంగా అప్పటి అడ్వొకేట్‌ జనరల్‌ దమ్మాలపాటి శ్రీనివాస్‌పైనే ఇన్‌సైడ్‌ ట్రేడింగ్‌ ఆరోపణ చేశారు. చంద్రబాబు, లోకేశ్‌లకు సంబంధించిన హెరిటేజ్‌ సంస్థ భూముల కొనుగోలు మొదలు అప్పటి మంత్రులు నారాయణ, పుల్లారావు, కొందరు ఎమ్మెల్యేలు అంతా కలిసి నాలుగు వేలకు పైగా ఎకరాల మేర ఇన్‌సైడ్‌ ట్రేడింగ్‌ చేశారని ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. ఈ క్రమంలోనే టీడీపీ తరఫు న్యాయవాది గత ప్రభుత్వాలలో జరిగిన వాటిపై ప్రస్తుత ప్రభుత్వం విచారణ చేయరాదని వాదించడం విచిత్రమే. ఆయన చాలా సీనియర్‌ న్యాయవాది. అనేక విషయాలు తెలిసినవారు. మన రాష్ట్రంలోనే జరిగిన ఒక సంగతిని గుర్తు చేయాల్సి ఉంటుంది. 2007, 2008 ప్రాంతంలో ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి కుమారుడు అయిన ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో సాక్షి మీడియాతో పాటు, కొన్ని పరిశ్రమలను స్థాపించారు. అందులో ఆయా పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టారు. ఆ సమయంలో చంద్రబాబు నాయుడు కొన్ని ఆరోపణలు చేశారు. కేంద్రానికి ఫిర్యాదులు కూడా చేశారు. కేంద్రం కానీ, ఆయా దర్యాప్తు సంస్థలు, పెట్టుబడులకు సంబంధించిన ప్రభుత్వ శాఖలు కానీ జగన్‌ కంపెనీలలో పెట్టుబడులను తప్పుపట్టలేదు.

కానీ 2009లో ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి అనూహ్య మరణం తర్వాత జరిగిన పరిణామాలలో టీడీపీ, కాంగ్రెస్‌ హైకోర్టుకు వెళ్లడం, ఆనాటి చీఫ్‌ జస్టిస్‌ ఆ పెట్టుబడులపై విచారణకు ఆదేశించడం, క్విడ్‌ ప్రో కో అనే కొత్త పదాన్ని కనిపెట్టి సీబీఐ విచారణ చేపట్టడం, వైఎస్‌ ప్రభుత్వం ఆ పారిశ్రామికవేత్తలకు ఉదారంగా రాయితీలు ఇచ్చిందని ఆరోపించడం, తద్వారా జగన్‌ను ఏకంగా పదహారు నెలల పాటు జైలులో నిర్బంధించిన సంగతి ఇంకా జనం స్మృతిపథంలోనే ఉంది. అప్పుడు అక్రమంగా కాంగ్రెస్, టీడీపీ కలిసి కేసులు పెట్టాయని నమ్మారు కనుకే జగన్‌కు ఇప్పుడు జనం బ్రహ్మరథం పట్టారు. మరి టీడీపీ లాయర్‌ వెంకటరమణ వాదన కరెక్టు అయితే వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో జరిగిన నిర్ణయాలపై ఆయన చనిపోయిన తర్వాత కేసులే పెట్టకూడదు కదా! అది కూడా మూడు, నాలుగేళ్ల తర్వాత కేసులు పెట్టారే. అప్పుడు పరిశ్రమలలో పెట్టుబడులు నేరంగా సీబీఐ చూపించడం దారుణమని మాబోటివాళ్లం వాదించేవారం. భూములు తీసుకుని పరిశ్రమలు పెట్టకపోతే జైలులో పెట్టాలి కాని, పరిశ్రమలు పెట్టడానికి సిద్ధం అయినవారిపై కేసులు ఏమిటని ప్రశ్నించేవారం. కానీ ఆ రోజున ఇదే చంద్రబాబు, జగన్‌ అక్రమాలకు పాల్పడ్డారు కనుకే కేసులు వచ్చాయని చెప్పారు. తన రాజకీయ శత్రువు అయిన కాంగ్రెస్‌తో కలిసి మరీ కేసులు పెట్టించే యత్నం చేశారు. ఈ ఒక్క ఉదాహరణ చాలు టీడీపీ వాదన బలహీనంగా ఉందని చెప్పడానికి. అంతేకాదు, ఇప్పుడు నేరుగా అడ్వొకేట్‌ జనరల్‌ శ్రీరామ్‌ హైకోర్టుకు సమర్పించిన నివేదికలో ఆనాటి అడ్వొకేట్‌ జనరల్‌ దమ్మాలపాటి శ్రీనివాస్‌ సైతం ఇన్‌సైడ్‌ ట్రేడింగ్‌కు పాల్పడినట్లు నేరుగానే అభియోగం మోపారు కదా. మరి అది ఇన్‌సైడ్‌ ట్రేడింగ్‌ కాదని రుజువు చేసుకోవలసిన చంద్రబాబు కానీ, ఇతర టీడీపీ నేతలు కానీ అసలు కేసే వద్దని హైకోర్టుకు వెళ్లారంటేనే వారు ముందుగానే తప్పు చేసినట్లు ఒప్పుకున్నట్లే అవుతుంది. 

పోని గతంలో ఇలాంటివి జరగలేదా అంటే అనేక ఉదాహరణలు ఉన్నాయి. ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ హయాంలో జరిగిన బియ్యం మిల్లుల కుంభకోణంపై ఇప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం విచారణ జరుపుతోంది. 1977లో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన జనతా ప్రభుత్వం ఇందిరాగాంధీ ప్రభుత్వ కాలంలో, ప్రత్యేకించి ఎమర్జెన్సీ అత్యాచారాలపై ఏకంగా జస్టిస్‌ షా కమిషన్‌ను నియమించి విచారణ చేయించింది. ఇందిరాగాంధీపై పార్లమెంటులో అనర్హత వేటు కూడా వేశారే! తమిళనాడులో కరుణానిధి ప్రభుత్వంపై ఏకంగా కేంద్రం ఒకసారి కమిషన్‌ను నియమించింది. అలాగే జయలలితపై కరుణానిధి ప్రభుత్వం విచారణ జరిపించడం, జైలుకు పంపించడం వంటి ఘట్టాలు చూశాం. అలాగే కరుణానిధిని కూడా అవినీతి ఆరోపణలపై జయలలిత జైలుకు పంపారు. బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి లాలూప్రసాద్‌ యాదవ్‌ గానీ, హరియాణా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాష్‌ చౌతాలా గానీ వేర్వేరు కుంభకోణాలలో దోషులుగా రుజువు అవడంతో ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్నారు. గత ప్రభుత్వాల అక్రమాలపై విచారణ జరగకూడదనుకుంటే ఇవేవీ జరగకూడదు కదా. అంతేకాదు, ఉమ్మడి ఏపీలో జలగం వెంగళరావు ప్రభుత్వ కాలంలో నక్సల్స్‌పై జరిగిన దాడులపై కేంద్ర ప్రభుత్వం విమద్‌ లాల్‌ కమిçషన్‌ను నియమించింది. ఆయనకు ఆ కమిషన్‌తో పెద్దగా ఇబ్బంది రాలేదు, అది వేరే విషయం.

మరి ఇప్పుడు చంద్రబాబు కానీ, ఆయన పార్టీ నేతలు కానీ అమరావతి రాజధానిలో అక్రమాలు జరగలేదని గట్టి విశ్వాసంతో ఉంటే వారు కూడా సిట్‌ లేదా సీబీఐ... ఏ విచారణకైనా సిద్ధమే అని చెప్పాలి తప్ప ఇలా జారిపోవడానికి ప్రయత్నించవచ్చా? తెలుగుదేశం పార్టీ ఐదేళ్ల అధికారం అనుభవించిన తర్వాత దారుణమైన ఆత్మరక్షణలో పడిందనడానికి ఇంతకన్నా ఉదాహరణ ఏముంటుంది? మాజీ మంత్రి అచ్చెన్నాయుడు ఈఎస్‌ఐ కుంభకోణంలో భాగస్వామి అయితే బీసీ కనుక అభియోగాలు మోపి అరెస్టు చేశారని ఆరోపించారు. మరి ఈఎస్‌ఐ స్కామ్‌లో 151 కోట్ల గోల్‌మాల్‌ జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు? కృష్ణా పుష్కరాలలో ఘాట్‌ల నిర్మాణంలో అక్రమాలు జరిగాయని విజిలెన్స్‌ విచారణ వేసి నలుగురు అధికారులపై దర్యాప్తు చేస్తుంటే అది మాజీ మంత్రి దేవినేని ఉమాను ఇబ్బంది పెట్టడానికే అని అంటారు. ఇప్పుడు ఏకంగా చంద్రబాబును ఇబ్బంది పెట్టడానికే రాజధాని భూ కుంభకోణం తెరపైకి తెచ్చారని అంటున్నారు. ఆ మాట అనడం ద్వారా వారు పరోక్షంగానో, ప్రత్యక్షంగానో స్కాములు జరిగాయని ఒప్పుకున్నట్లే అవుతుంది.

ఇక్కడ ఇంకో మాట చెప్పాలి. కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఆదాయపన్ను శాఖ చంద్రబాబు పీఎస్‌ ఇంటిపై దాడి చేసి 2 వేల కోట్ల మేర అక్రమాలకు సంబంధించిన ఆధారాలు లభ్యమయ్యాయని ప్రకటన ఇచ్చింది. నిజానికి అది చాలా సీరియస్‌ కేసు. అయినా చంద్రబాబు కానీ, ఆయన పార్టీ నేతలు కానీ దానిపై ఎందుకు హైకోర్టుకు వెళ్లలేదు? పైగా బీజేపీ నేతల ప్రాపకం కోసం ఎందుకు ప్రయత్నిస్తున్నారు? అంటే కేంద్రంలో ఎలాగోలా మేనేజ్‌ చేసుకుని బయటపడవచ్చన్న నమ్మకమా? లేక ఇంకేమైనా కారణం ఉందా? మరి ఏపీ ప్రభుత్వం ఇన్‌సైడ్‌ ట్రేడింగ్‌ దర్యాప్తు అంటే ఎందుకు భయపడి హైకోర్టును ఆశ్రయించారు? జగన్‌ను మేనేజ్‌ చేయలేమని అనుకున్నారా? ఏది ఏమైనా ఏపీ రాజకీయాలలో ఇది కొత్త ఒరవడి. నిజంగానే చంద్రబాబు ప్రభుత్వంలో జరిగిన అవినీతిని జగన్‌ ప్రభుత్వం వెలికి తీయగలిగితే పెద్ద విషయమే అవుతుంది. అప్పుడు ప్రభుత్వం అంటే స్కాములు చేయడం కాదు, అలా జరిగితే ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎప్పుడో అప్పుడు శిక్ష పడుతుందన్న నమ్మకం ప్రజలకు కలుగుతుంది.  ప్రజలకు రాజకీయ వ్యవస్థపై ఒక నమ్మకం వస్తుంది.

కొమ్మినేని శ్రీనివాసరావు 
వ్యాసకర్త, సీనియర్‌ పాత్రికేయులు

మరిన్ని వార్తలు