చెప్పింది చేసి చూపిన పాలన

1 Jun, 2022 02:09 IST|Sakshi

విశ్లేషణ

సమాజంలో అట్టడుగున ఉన్నవారిని కూడా ఆకట్టుకోవడం అంత తేలిక కాదు. దానిని ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ సాధించారు. అందుకు కారణం– ఆయన తన ఎన్నికల మేనిఫెస్టోలో ఏం చెప్పారో అది పాటిస్తున్నారు. ఇచ్చిన తొంభై ఐదు శాతం హామీలు నెరవేర్చడం ఏపీలోనే కాదు, దేశ చరిత్రలో కూడా అపురూపమైన ఘట్టమే. ప్రభుత్వ పాఠశాలలను ‘నాడు–నేడు’ కింద బాగు చేయడం విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పునకు శ్రీకారం. వాలంటీర్ల వ్యవస్థ, సచివాలయ వ్యవస్థను ప్రవేశపెట్టి ఆశ్చర్యపరిచారు. మంత్రివర్గంలో స్థానాలను డెబ్బై శాతం బలహీన వర్గాలవారికి కేటాయించడం కూడా కొత్త చరిత్రే. చెప్పాలంటే, వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఈ మూడేళ్లలో ఎన్నో అపురూప విజయాలు సాధించింది.

ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న సరికొత్త మార్పు చూస్తున్నారా? గతంలో ఎన్నడూ లేని స్థాయిలో పేదవర్గాలు, ధనిక వర్గాల మధ్య పోటీ వాతావరణం ఏర్పడుతోంది. పేదవర్గాలు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన వివిధ స్కీములకు సంపూర్ణ మద్దతు ఇస్తుంటే, ధనికులలో కొన్ని వర్గాలవారు వ్యతిరేకిస్తున్నారు. ఒకప్పుడు ప్రధాని ఇందిరా గాంధీ సమయంలో ఇలాంటి వాతావరణం ఉండేది. ఒక్క మాటలో చెప్పాలంటే జగన్‌ ప్రభుత్వం ఈ మూడేళ్లలో సాధించిన అతి గొప్ప విజయం ఇదే కావచ్చు. పేదలు, మధ్య తరగతి వర్గాలు,  ముఖ్యంగా షెడ్యూల్డ్‌ కులాలు, షెడ్యూల్డ్‌ జాతులు, వెనుకబడిన వర్గాలు, మైనార్టీ లలో, జగన్‌ పట్ల విపరీతమైన సానుకూలత ఏర్పడటం పెద్ద విశేషం. అగ్రవర్ణ పేదలలో కూడా జగన్‌ పట్ల ఆదరణ ఉంది. డబ్బున్నవారిలో మాత్రం ఈ స్కీముల పట్ల కొంత వ్యతిరేకత ఉంది.

చెప్పిన నవరత్నాలు అమలు చేయడం జగన్‌కు ఒక సవాలైతే... టీడీపీ, దానికి మద్దతిచ్చే మీడియా సంస్థలను ఎదుర్కోవడం మరింత పెద్ద సవాలుగా మారింది. అయినా మొండిగా ముందుకు కదులు తున్నారు. అనేక కొత్త వ్యవస్థలను తెచ్చి, జగన్‌ ఇంతటి ఆలోచనా పరుడా అని పలువురు ముక్కున వేలేసుకునేలా చేయగలిగారు. ఎవరైనా నేత ప్రభుత్వంలో ఉండి కొత్త వ్యవస్థలను తీసుకు వచ్చిన ప్పుడు శాశ్వతంగా ప్రజలలో గుర్తుండిపోతారు. జగన్‌ అధికారంలోకి వచ్చాక సుమారు ముప్పై ఐదు కొత్త స్కీములను ప్రవేశ పెట్టారు. వాటిలో అత్యధికం వేటికవే ప్రాధాన్యం కలిగినవని చెప్పాలి. 

గ్రామాలలో వాలంటీర్ల వ్యవస్థ, సచివాలయ వ్యవస్థను ప్రవేశ పెట్టినప్పుడు ప్రతిపక్ష టీడీపీ మెటికలు విరిచేది. ‘వాలంటీర్లు ఏమి చేస్తారు? ఇళ్లలో మగవారు లేనప్పుడు వెళ్లి ఆడవారిని ఇబ్బంది పెడతా’రని స్వయంగా ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడు విమర్శిం చారు. పైగా అవన్నీ గోనె సంచులు మోసే ఉద్యోగాలని ఎద్దేవా చేశారు. కానీ ఆ తర్వాత రోజులలో తన పార్టీ కార్యకర్తలకు ఆ ఉద్యో గాలు ఇస్తానని ఆయనే చెప్పారు. అంటే దీనర్థం ‘ఫాలో ద లీడర్‌’ అన్నట్లుగా జగన్‌ను అనుసరించడానికి ఒప్పుకున్నట్లే కదా? ‘గ్రామ సచివాలయాలలో లక్షన్నర ఉద్యోగాలా?’ అన్నవారు ఉన్నారుగానీ జగన్‌ చేసి చూపించి తద్వారా ప్రజలకు పాలనను చేరువ చేశారు. ప్రతి నెలా మొదటి తేదీన వృద్ధులకు పెన్షన్‌ ఇవ్వడం సరికొత్త రికార్డు. దాంతో వృద్ధులు తమకు ఇచ్చే పెన్షన్‌ కోసం రోజుల తరబడి ఎంఆర్‌ఓ ఆఫీసుల చుట్టూ తిరిగే బాధ తప్పింది. అంతేకాక వృద్ధాప్య పెన్షన్‌ను రెండువేల నుంచి 2,500 రూపాయలు చేశారు. ఇక రేషన్‌ షాపుల నుంచి బియ్యం తదితర సరుకులు ఇళ్లకే రావడం ఎవరం కలలో కూడా ఉహించి ఉండం. కానీ జగన్‌ ఆ పని చేసి చూపెట్టారు.

పిల్లలను స్కూళ్లకు పంపితే ప్రతి తల్లికి 15 వేల రూపాయలు ఇస్తానని హామీ ఇస్తే అది ఎలా సాధ్యమని అనుకున్నవారు చాలా మందే ఉన్నారు. కానీ అది సాధ్యమేనని జగన్‌ రుజువు చేశారు. ప్రభుత్వ బడులను ‘నాడు–నేడు’ కింద బాగు చేయడం ద్వారా విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పునకు శ్రీకారం చుట్టారు. వాటికి కార్పొరేట్‌ లుక్‌ తెచ్చిన ఘనత జగన్‌దే. చేయూత కింద స్వయం ఉపాధి నిమిత్తం మహిళలకు 18,750 రూపాయలు ఇవ్వడం అందరినీ ఆశ్చర్యపరచింది. గ్రామాలలో రైతు భరోసా కేంద్రాలు, విలేజ్‌ క్లినిక్స్, 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలు వంటివాటిని ప్రారంభించి రాజకీయ ప్రత్యర్థులను విస్తుపరిచారు. ఆయా వర్గాలకు నేస్తం పేరుతో ఆర్థిక సాయం అందించడం జగన్‌ మాత్రమే చేయగలరని అనుకునేలా చేయడం మరో విశిష్టత. కొత్త జిల్లాల ఏర్పాటు, చివరికి ఎన్టీఆర్‌ పేరును జగన్‌ ఒక జిల్లాకు పెట్టడం కూడా ఆసక్తికరమైన అంశమే.

జగన్‌ ఇప్పుడు దావోస్‌లో లక్షన్నర కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకున్నారు. విశాఖలో అదానీ డాట్‌ సెంటర్, కొప్పర్తిలో పారిశ్రామికవాడ, తీరప్రాంతంలో ఫిషింగ్‌ హార్బర్లు, ఓడ రేవులు మొదలైన వాటిని ఆరంభించారు. ప్రతిపక్షాలు ఈ అభివృద్ధిని ప్రస్తావించకుండా జాగ్రత్తపడతాయి. వైసీపీ నేతలు కూడా సంక్షే మంలో అమలు చేసే స్కీముల గురించే తప్ప, ఇతర నిర్మాణాత్మక ప్రాజెక్టులను ప్రొజెక్టు చేసుకోవడంలో అంతగా సఫలం అయినట్లు కనిపించదు. అందువల్లే టీడీపీ గానీ, వారి మీడియా గానీ ‘అప్పులు, అప్పులు’ అంటూ ప్రచారం చేయడం ద్వారా జగన్‌కు ఉన్న సాను కూల విషయాలను డైవర్టు చేయాలని విశ్వయత్నం చేస్తున్నాయి. విచిత్రమేమిటంటే ఒకపక్క జగన్‌ అప్పులు చేశారనీ, డబ్బును పంచేస్తున్నాడనీ తెలుగుదేశంతో పాటు కొన్ని వర్గాలు ఆరోపిస్తుం టాయి. అదే సమయంలో చంద్రబాబు నాయుడు తన హయాంలో ఏభై శాతం పైగా పేదల సంక్షేమానికి ఖర్చుచేశానని వాదిస్తుంటారు. జగన్‌ ప్రభుత్వం కన్నా ఎక్కువ ఖర్చు పెట్టామని అంటూనే, జగన్‌ అప్పులు తెస్తున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేస్తుంటారు. 

ఇక్కడ మరో సంగతి చెప్పాలి. జగన్‌ పాలన మూడేళ్లలో రెండు సంవత్సరాలపాటూ దేశం అంతటితో పాటు ఏపీలో కూడా కరోనా సంక్షోభం అల్లాడించింది. అయినా దానిని తట్టుకుని రాష్ట్రం నిలబడేలా చేశారు జగన్‌. చంద్రబాబు ఈ విషయం ప్రస్తావించరు. తాను ఉంటే బ్రహ్మాండం బద్దలైపోతుందని చెప్పే చంద్రబాబు తాను ఏపీకి ఏమి చేసింది ఎన్నడైనా చెప్పగలిగారా? అలాగే జగన్‌ స్కీములు వృథా అనగలిగారా? ఇదంతా జగన్‌ విజయం కిందే తీసుకోవాలి. గతంలో చంద్రబాబు లక్ష కోట్ల రైతు, డ్వాక్రా రుణాలను రద్దు చేస్తామని చెప్పి చేతులెత్తేశారు. కానీ జగన్‌ తన హామీలను చేసి చూపించారు. అందుకే మహానాడులో ఈ విషయాలపై కాకుండా, ఏదో జనరల్‌ ప్రసంగం చేస్తూ విమర్శలు సాగించారు. జగన్‌ చేసి చూపెట్టిన వాటిని కాకుండా అదనంగా తాము ఏమి చేస్తామో చంద్రబాబు చెప్పలేకపోతున్నారు.

ఈ నేపథ్యంలోనే జగన్‌ క్యాబినెట్‌లోని బలహీనవర్గాల మంత్రులు, ముఖ్యంగా ధర్మాన ప్రసాదరావు వంటివారు సామాజిక న్యాయ భేరిలో మాట్లాడుతూ... అమృతాన్ని దేవతలూ, రాక్షసులూ పంచుకున్నారనీ, అదే చంద్రబాబుకు అవకాశం వస్తే తన బంధు వులకూ, కుటుంబానికీ ఇచ్చుకుంటారనీ విమర్శించారు. మరి అదే జగన్‌ అయితే బలహీనవర్గాలవారికి పంపిణీ చేస్తారని అన్నారు. చంద్రబాబు జన్మభూమి కమిటీల ద్వారా ఆయా స్కీముల లబ్ధి దారులను వేధింపులకు గురి చేస్తే... పార్టీ ప్రాంతం, కులం, మతం వంటివి చూడకుండా జగన్‌ నేరుగా లబ్ధిదారుల ఖాతాలలో లక్షా ముప్పైవేల కోట్ల రూపాయలు జమచేసి చరిత్ర సృష్టించారు. జగన్‌ చెప్పినట్లుగానే మంత్రివర్గాన్ని రెండున్నర ఏళ్ల తర్వాత మార్పు చేయడమే కాకుండా, డెబ్బై శాతం బలహీన వర్గాలవారికి కేటా యించడం కూడా చరిత్రే.  మహానాడులో సైతం చంద్రబాబు వీటికి నేరుగా జవాబు ఇవ్వలేకపోయారు. 

ఇక ప్రభుత్వపరంగా కొన్ని లోటుపాట్లు ఉండవచ్చు. తొలి రోజులలో ఇసుక విధానంలో మార్పు తీసుకువచ్చే క్రమంలో కొంత ఇబ్బంది అయింది. కౌన్సిల్‌ రద్దు కాస్త తొందరపాటు నిర్ణయం అన్న అభిప్రాయం ఏర్పడింది. మూడు రాజధానులపై ముందుకు వెళ్లడానికి పలు అవాంతరాలు ఎదుర్కొంటున్నారు. నిజానికి ఈ మూడేళ్లలో జరిగిన అతి పెద్ద ఘటన అమలాపురంలో మంత్రి విశ్వ రూప్, ఎమ్మెల్యే పొన్నాడ సతీష్‌ ఇళ్లను దగ్ధం చేయడమే అని చెప్పాలి. కానీ ఈ ఉదంతం వెనుక కూడా టీడీపీ, జనసేన ఉన్నాయని తేల డంతో ఆ పార్టీలే ఆత్మరక్షణలో పడ్డాయి. వచ్చే రెండేళ్లు జగన్‌ వీరిపై పోరాడుతూనే, తాను ఇచ్చిన హామీలను మరింత సమర్థంగా అమలు చేయడానికి ప్రయత్నించవలసి ఉంటుంది.


వ్యాసకర్త సీనియర్‌ పాత్రికేయులు     
కొమ్మినేని శ్రీనివాసరావు 

మరిన్ని వార్తలు