దేశ హితం కోసం కలిసి ఉద్యమిద్దాం

27 Sep, 2021 01:09 IST|Sakshi

అవినీతి, దోపిడీ గుణం, అధికార దర్పం తలకెక్కిన నియంతల కబంధహస్తాల నుండి దేశాన్ని కాపాడుకునేందుకు ప్రజలు దండు కడుతున్నారు. బ్రిటిష్‌ వాళ్ళను తరిమికొట్టిన స్వాతంత్య్ర సంగ్రామం, రజాకార్లను తరిమికొట్టిన తెలంగాణ సాయుధ పోరాటాలే స్ఫూర్తిగా భారత్‌ బంద్‌లో పాల్గొనడానికి ముందుకు వస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీ నేతృత్వంలో 19 రాజకీయ పార్టీలు దేశవ్యాప్త బందుకు పిలుపునిచ్చాయి. దీనికి భారతదేశ రాజకీయాల గతిని మార్చే శక్తి ఉంది.

గతంలో ఎన్నో ప్రజా ఉద్యమాలు, నిరసన ప్రదర్శనలు జరిగినప్పటికీ దీనికి ఓ ప్రత్యేకస్థానం ఉంటుంది. ఏడేండ్లలో బీజేపీ దేశాన్ని ఆగం చేసిన తీరూ, జాతీయ ఆస్తులను ఒక్కరిద్దరు బడా పారిశ్రామిక వేత్తలకు కట్టబెట్టిన వైనం, అమలు కాని ఎన్నికల హామీలు, అడ్రస్‌ లేని అచ్ఛే దిన్, పెరిగిన నిరుద్యోగం, తగ్గిన జీడీపీ, పెగాసస్‌ గూఢచర్యం, రఫేల్‌ కుంభకోణం, కరోనా వైఫల్యాలు, రైతుల పాలిట శాపంగా మారిన నల్ల వ్యవసాయ చట్టాలు తదితర ప్రజావ్యతిరేక విధానాల నుండి ఈ దేశాన్ని కాపాడుకోవటానికి కలిసికట్టుగా నడుం బిగిస్తున్న సందర్భమిది.

నాడు కాంగ్రెస్‌ హయాంలో 10 శాతం వృద్ధిరేటు సాధించిన జీడీపీ, ఇపుడు మోదీ ప్రభుత్వ వైఫల్యం వల్ల తిరోగమనంలో 0 శాతం కంటే తక్కువగా నమోదయింది. బంగ్లాదేశ్‌ కంటే వెనుకబడిన పరిస్థితి. 60% చిన్న మధ్యతరగతి పరిశ్రమలు మూతపడితే వాటిని గాలికి వదిలేసి, 72 వేల కోట్ల రూపాయలు క్యాపిటల్‌ ఇన్‌ఫ్యూజన్‌ కింద కార్పొరేట్‌ కంపెనీలకు పంచి పెట్టారు. 70 ఏండ్లలో కాంగ్రెస్‌ దేశాన్ని; భారత రైల్వే, ఎల్‌ఐసీ, బీఎస్‌ఎన్‌ఎల్, భారత్‌ పెట్రోలియం, ఎయిర్‌ పోర్టులు, నౌకాశ్రయాల వంటి జాతీయ ఆస్తులను నిర్మిస్తే, మోదీ 7 ఏండ్లలో వాటిని తన అనుయాయులకు అమ్మేస్తున్నాడు. 

ఎన్నికల సందర్భంగా, యువతకు, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామన్న  మాట నిలబెట్టుకోలేదు. పార్లే–జీ బిస్కెట్‌ తయారీ సంస్థ మూతపడే పరిస్థితి ఏర్పడింది. ఫోర్డ్‌కార్ల పరిశ్రమ దేశం వదలి పోయింది. పార్లమెంటులో ప్రతిపక్ష పార్టీలు, యువతకు ఉద్యోగాలు కావాలని అడిగితే, అమిత్‌ షా పకోడీ షాపులు పెట్టుకోవాలని ఉచిత సలహా ఇచ్చారు. మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం పౌరుల జీవితాలలోకి తొంగి చూస్తున్నది.

పెగాసస్‌ అనే సాఫ్ట్‌వేర్‌ వాడి దేశంలోని ప్రతిపక్ష పార్టీల నాయకులు, ఎలక్షన్‌ కమిషన్‌ మాజీ చీఫ్‌ కమిషనర్, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కుటుంబ సభ్యులు,  సీనియర్‌ జర్నలిస్టులు, సామాజిక ఉద్యమకారుల ఫోన్లను హ్యాక్‌ చేస్తున్నారు. హ్యాక్‌ చేసి, కీలకమైన సమాచారం దొంగిలిస్తున్నారనే అంశంపై, పార్లమెంటు శీతాకాల సమావేశాలు స్తంభించిపోయాయి. మెజారిటీ ప్రజల మద్దతుతో ఏర్పడిన కర్ణాటక, మధ్యప్రదేశ్, రాజస్తాన్‌ ప్రభుత్వాలను కూల్చి, కాంగ్రెస్‌ శాసనసభ్యులను చీల్చి, అనైతికంగా బీజేపీ ప్రభుత్వాలను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించారు మోదీ–షా ద్వయం. కర్ణాటక, మధ్యప్రదేశ్‌లో ఈ కుట్రలకు కాంగ్రెస్‌ కూటమి అధికారం కోల్పోయింది. కానీ రాజస్తాన్‌లో బీజేపీ పాచిక పారలేదు.

ఒకరిద్దరు పారిశ్రామిక వేత్తలకు అనుకూలంగా వ్యవసాయ చట్టాలను తెచ్చి, రైతులు తమ పంటలకు గిట్టుబాటు ధర నిర్ణయంచుకునే స్వేచ్ఛ లేకుండా చేస్తున్నారు. రైతుల ఉత్పత్తుల వర్తక, వాణిజ్యం (ప్రోత్సాహం, సదుపాయ కల్పన) బిల్లు–2020 సెక్షన్‌–13 ప్రకారం, ఈ చట్టం అమలు క్రమంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అధికారులు మరియు ఏ ఇతర వ్యక్తులపైనగాని కేసులు వేయరాదు. సెక్షన్‌–15 ప్రకారం, ఈ చట్టం అమలు క్రమంలో తలెత్తిన వివాదాలు సివిల్‌ కోర్టు విచారణ పరిధిలోకి రావు. ఈ రెండు నిబంధనలూ రాజ్యాంగ విరుద్ధమైనవి.

కాంట్రాక్టు వ్యవసాయం రైతుల స్వేచ్ఛను హరించే యత్నం. తమ గొంతు నొక్కే చట్టాలను రద్దు చేయాలని రైతులు ఢిల్లీ పొలిమేరలలో ఆందోళన చేస్తే, ఆ ఉద్యమాన్ని అణిచి వేసేందుకు కుట్రలు పన్నుతున్నారు. 2014లో ఉన్న ధరలు 2021 వరకు 200 శాతం పెరిగాయి. ప్రపంచంలో ఎక్కడా సాధ్యపడని ఒక వింత మోదీ హయాంలో ఆవిష్కృతమైంది. నిత్యావసరమైన ఉల్లిగడ్డ, సౌకర్యమైన పెట్రోలు, విలాసమైన బీరు... ఈ మూడూ ఒకే ధర రూ.100కు దొరుకుతున్నాయి. మోదీ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైంది. దేశ హితం కోరుకునే పార్టీలు, మేధావులు, కవులు, కళాకారులు, సామాజిక వేత్తలు, ప్రజలు పాల్గొని భారత్‌ బంద్‌ను విజయవంతం చేయాలి. అది మన బాధ్యత.


కొనగాల మహేష్‌ 

వ్యాసకర్త ఏఐసీసీ సభ్యులు ‘ మొబైల్‌: 9866 776999
(నేడు జరగనున్న ‘భారత్‌ బంద్‌’ సందర్భంగా)

మరిన్ని వార్తలు