గణతంత్ర దినాన... తెలుగు ప్రభలు

26 Jan, 2023 14:44 IST|Sakshi

సందర్భం

భారతదేశం విభిన్న సంస్కృతి సంప్రదాయాల సమాహారం. వందల ఏళ్ల నాటి  సంప్రదాయాలను నేటికీ కొనసాగించడం దేశం గర్వించదగ్గ విషయం. సంక్రాంతి పర్వ దినాలలో భాగంగా కోన సీమ ప్రాంతంలో నిర్వహించే ప్రభల తీర్థాలు అత్యంత విశిష్టమైనవే కాక 400 సంవత్సరాల చరిత్ర కలిగినవి. ఈ ఏడాది ఢిల్లీలో జరిగే ప్రధాన గణతంత్ర వేడుకల్లో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ‘ప్రభల తీర్థం’ ఇతివృత్తంగా తయారుచేసిన శకటాన్ని ప్రదర్శిస్తోంది. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం, జగ్గన్నతోటలో నిర్వహించే ప్రభల తీర్థం కోనసీమలో అత్యంత ముఖ్యమైన సాంస్కృతిక వేడుక. క్రీ.శ 17వ శతాబ్దంలో ప్రభల తీర్థాన్ని ప్రారంభించారని అంటారు. 11 గ్రామాల నుండి వచ్చిన ఏకాదశ రుద్రులు ఇక్కడ కొలువై ఉంటారని ప్రతీతి. 

గతంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభల తీర్థం విశిష్టతను కొనియాడుతూ నిర్వాహకులకు లేఖను రాశారు. సంప్రదాయబద్ధంగా, భక్తి శ్రద్ధలతో  వెదురు, తాటి కర్రలను, రంగు రంగుల కొత్త బట్టలు, నూలుదారాలను, కొబ్బరి తాళ్ళను, రంగు కాగితాలను, నెమలి పింఛాలను ఉపయోగించి ఒక అందమైన ప్రభను తయారు చేసి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తారు. ఆ తర్వాత ఆయా గ్రామాల నుండి ఉత్సవ ప్రదేశానికి అంగరంగ వైభవంగా భుజాలపై ఆ ప్రభలను మోసుకువస్తారు. కుల మతాలకు అతీతంగా ఈ తీర్థానికి భక్తులు హాజరవ్వడం విశేషం. ప్రతియేటా సంక్రాంతి పర్వదినాల్లో కనుమ నాడు ఈ తీర్థాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది. 

కోనసీమ వ్యాప్తంగా దాదాపు 200 గ్రామాల్లో ప్రభల తీర్థాలను నిర్వహిస్తారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలలోనే కాక కృష్ణా జిల్లాలోనూ ప్రభల సంప్రదాయం ఉన్నది. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఈ ఉత్సవాల్లో పాల్గొంటారు. ఈ ప్రాంతాలకు చెందిన ప్రజలు దేశ, విదేశాలలో ఎక్కడ ఉన్నా... సంక్రాంతి సమయానికి మాత్రం వారి వారి స్వగ్రామాలకు చేరుకొని, ప్రభల తీర్థా లలో పాల్గొంటారు. మేళ తాళాలు, సంప్రదాయ నృత్యాల నడుమ బాణసంచా కాలుస్తూ సంప్రదాయ సంగీత వాద్యాలు, ‘గరగ’ జానపద కళారూపం వంటివాటిని ప్రదర్శిస్తూ వేడుకలు చేసుకుంటారు. సంప్రదాయ కళలకు, వాటినే నమ్ముకుని జీవిస్తున్న కళాకారులకు ఈ ఉత్సవాలు ప్రోత్సాహం ఇస్తాయి. చిన్న చిన్న బొమ్మలు, జీళ్ళు, కర్జూరం, గృహోపకరణాలు వంటివాటిని అమ్ముకుని జీవించే అనేక మంది చిరు వ్యాపారులకు ఆర్థికంగా చేయూత ఇస్తున్నాయి ఈ తీర్థాలు.

ప్రభల తీర్థ మహోత్సవాల్లో కొలువుదీరే ప్రభలలో వాకల గురువు (52 అడుగుల ఎత్తు), తొండవరం (51 అడుగుల ఎత్తు) ప్రభలు రాష్ట్రంలోనే అత్యంత ఎల్తైన ప్రభలుగా గుర్తింపబడ్డాయి. ఇంత ఎల్తైనప్రభలను తయారు చేయడం, వాటిని గ్రామస్థులు తమ భుజస్కంధాలపై ఎత్తుకుని కొబ్బరి, వరి పొలాలు, కాలువలు దాటుకుంటూ తీర్థం జరిగే ప్రదేశానికి తీసుకురావడం ఎంతో శ్రమతో కూడిన పని. పెద్ద ప్రభలకు బాసటగా పిల్ల ప్రభలను కొలువుదీరుస్తారు. వీటిని స్వయంగా 10 నుండి 15 ఏళ్ల వయసు ఉన్న చిన్నారులు తయారు చేస్తారు. 

సమాజంలో శాంతి, లోక కల్యాణం కోసం ప్రజలు ఏకాదశ రుద్రులను ప్రార్థిస్తారు. రైతులను సంఘటితం చేసేందుకు, వారి ఐక్యతను పెంపొందించేందుకు ఇవి ఉపయోగపడతాయని భావి స్తారు. ఇంతటి సాంస్కృతిక ప్రాధాన్యం కలిగిన ప్రభల తీర్థాలను ప్రతిబింబిస్తూ... గణతంత్ర దినోత్సవంలో ప్రదర్శించ తలపెట్టిన రాష్ట్ర శకటం ఎంతో ఆకర్షణీయంగా ఉంది. శకటం ముందు భాగంలో కోనసీమ జిల్లాలో సంక్రాంతి పర్వదినాల సందర్భంగా అలంకరించినట్లుగా ఉన్న ఒక గూడు ఎడ్ల బండిపై రైతు కుటుంబం ప్రయాణిస్తున్నట్లుగా చిత్రించారు. అలాగే కోనసీమ ప్రకృతి అందాలను ప్రతిబింబించే విధంగా వరి పొలం గట్టుపై ఈ బండి వెళుతున్నట్లుగాను, వరి ధాన్యాన్నీ, ఈ ప్రాంతంలో పండే కొన్ని కూరగాయలను, పొలాలను కూడా చిత్రించారు. దాని వెనుకే శోభాయమానంగా అలంకరించిన ప్రభలను, బోయీలు మోస్తున్న పల్లకీని ప్రదర్శిస్తున్నారు. ప్రభలను రైతులు పూజించే విధానాన్నీ, కోనసీమలో సంప్రదాయ ‘గరగ నృత్యం’ విశిష్ట తనూ తెలిపేవిధంగా ప్రదర్శన ఉంటుంది. వెనుక భాగంలో కోనసీమ కొంగుబంగారం కొబ్బరి చెట్లు ఎటూ ఉంటాయనుకోండి!
 
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఈ శకటం ప్రదర్శించడం ద్వారా తెలుగు ప్రజల సంస్కృతీ సంప్రదాయాలకు పెద్దపీట వేసింది. తద్వారా రైతు పండుగకు అగ్రతాంబూలం ఇచ్చింది. (క్లిక్‌ చేయండి: సకల శక్తుల సాధన సబ్‌ప్లాన్‌)


- నేలపూడి స్టాలిన్‌ బాబు 
సామాజిక రాజకీయ విశ్లేషకులు

మరిన్ని వార్తలు