Konijeti Rosaiah: మాటల తూటాల అజాత శత్రువు

3 Dec, 2022 13:14 IST|Sakshi

సందర్భం

అరుదైన రాజకీయ నాయకుడు కొణిజేటి రోశయ్య. ఆయన వాగ్ధాటికి అసెంబ్లీ సమావేశాలు దద్దరిల్లేవి. గొప్ప హాస్య చతురతతో పాటూ ముక్కుసూటిగా మాట్లాడటం ఆయన శైలి. ప్రభుత్వ శాఖలన్నింటిపైనా అపారమైన పట్టు, అవగాహన ఆయనకున్నాయి. వివాదాలకు దూరంగా ఉంటూ, మంచి సలహాదారుగా కూడా వ్యవహరించేవారు. రాజనీతిలో అపర చాణక్యుడు. విలువలతో కూడిన రాజకీయాలకు ఆయన చిరునామా. మాటల మాంత్రికుడిగా వినుతికెక్కారు. తన ప్రసంగంతో ప్రతి ఒక్కరినీ మంత్రముగ్ధుల్ని చేయడమే కాదు, మాటల తూటాలు కూడా పేల్చేవారు. చట్టసభ లోపల, బయట కూడా ఒంటిచేత్తో ప్రతిపక్షాల్ని మాట తూలకుండా ఆటలాడుకునేవారు.

కొణిజేటి రోశయ్య 1933, జూలై 4న గుంటూరు జిల్లా వేమూరు గ్రామములో ఆదెమ్మ, సుబ్బయ్య దంపతులకు జన్మించారు. గుంటూరు హిందూ కళాశాలలో కామర్స్‌ అభ్యసించారు. రోశయ్య ప్రముఖ స్వాతంత్య్ర యోధుడు, కర్షక నాయకుడు ఎన్‌జీ రంగా శిష్యులు. నిడుబ్రోలులోని రామానీడు రైతాంగ విద్యాలయంలో సహచరుడు తిమ్మారెడ్డితో బాటు రాజకీయ పాఠాలు నేర్చారు.

ఆయన భారత జాతీయ కాంగ్రెసు పార్టీ తరఫున 1968, 1974, 1980లలో శాసన మండలి సభ్యునిగా ఎన్నికయ్యారు. 1979లో టంగుటూరి అంజయ్య ప్రభుత్వంలో రవాణ, గృహనిర్మాణం, వాణిజ్య పన్నుల శాఖలు, 1982లో కోట్ల విజయభాస్కరరెడ్డి ప్రభుత్వంలో హోం శాఖ, 1989లో మర్రి చెన్నారెడ్డి ప్రభుత్వంలో ఆర్థిక, రవాణ, విద్యుత్తు శాఖలు; 1991లో నేదురుమల్లి జనార్దనరెడ్డి ప్రభుత్వంలో ఆర్థిక, ఆరోగ్య, విద్య, విద్యుత్తు శాఖలు; 1992లో కోట్ల విజయభాస్కర రెడ్డి ప్రభుత్వంలో ఆర్థిక, ఆరోగ్య, విద్య, విద్యుత్తు శాఖలకు మంత్రిగా పనిచేశారు. 2004, 2009లో వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర బడ్జెట్‌ (ఆర్థిక ప్రణాళిక)ను ఇప్పటికి 15 సార్లు శాసనసభలో ప్రవేశపెట్టారు. ఇందులో చివరి 7 సార్లు వరుసగా ప్రవేశపెట్టడం విశేషం. బడ్జెట్‌ కూర్పులో రోశయ్య ఘనాపాటిగా పేరు పొందారు. రాజకీయాల్లో అజాత శత్రువుగా పేరు పొందారు. గ్రూపు రాజకీయాలకు దూరంగా, చాలా కాంగ్రెస్‌ కేబినెట్‌లలో కీలక మంత్రిగా పని చేయడం సామాన్య విషయం కాదు. తనకు అప్పగించిన ఏ బాధ్యతనైనా సమర్థవంతంగా నిర్వహించారు. 
 
1995–97 మధ్యకాలంలో ఆంధ్ర ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (ఏపీసీసీ) అధ్యక్షుడిగా పనిచేశారు. 1998లో నరసరావుపేట నియోజకవర్గం నుండి లోక్‌సభకు ఎన్నికయ్యారు. 12వ శాసనసభకు చీరాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. 2007లో ఆంధ్ర విశ్వవిద్యాలయం రోశయ్యకు గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర మంత్రిమండలిలో సుదీర్ఘ కాలం పనిచేసిన అనుభవమున్న రోశయ్య 2009, సెప్టెంబర్‌ 3 నుండి 2010 నవంబరు 24 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 2011 ఆగస్టు 31న రోశయ్య తమిళనాడు రాష్ట్ర గవర్నరుగా ప్రమాణస్వీకారం చేశారు. 2016 ఆగస్టు 30 వరకూ తమిళనాడు గవర్నరుగా తన సేవలు అందించారు. ప్రతిపక్షంలో ఉంటే నెగటివ్‌ పాలిటిక్స్‌ చెయ్యచ్చు. అదే ప్రభుత్వంలో ఉంటే, నిర్మాణాత్మకమైన పాత్రతో పాజిటివ్‌ పాలిటిక్స్‌ నడపచ్చు అనేవారు.

వైఎస్‌ రాజశేఖరరెడ్డి హెలికాప్టర్‌ ప్రమాదంలో మృతిచెందడంతో 2009, సెప్టెంబర్‌ 3న రోశయ్య ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. పధ్నాలుగు నెలలు అధికారంలో కొనసాగిన అనంతరం 2010 నవంబరు 24వ తేదీన తన పదవికి రాజీనామా చేశారు. రాజకీయాల నుంచి విశ్రాంతి తీసుకున్న తరువాత ఆరోగ్యం సహకరించినప్పుడల్లా సాహితీ, సాంస్కృతిక కార్యాక్రమాలకు ముఖ్య అతిథిగా హాజరై అలరింపజేసేవారు. 2018 ఫిబ్రవరి 11న ఆదివారం నాడు టి. సుబ్బిరామిరెడ్డి లలిత కళా పరిషత్‌ ఆధ్వర్యంలో కొణిజేటి రోశయ్యను గజ మాలతో సత్కరించి జీవన సాఫల్య పురస్కారం అందించారు. 

ఆంధ్ర ఉద్యమంతో తన రాజకీయ జీవితం ప్రారంభమైందని రోశయ్య అనేవారు. కాంగ్రెస్‌ పార్టీ పెద్దలు అందించిన సహకారంతోనే చట్టసభల్లో తగిన గుర్తింపు లభించిందని విన మ్రంగా చెప్పేవారు. తనకు దక్కిన అవకాశాలను సద్వినియోగం చేసు కుంటూ.. తనకు అప్పగించిన విధిని సక్రమంగా నిర్వహించానని తాను పాల్గొనే కార్యక్రమాలలో ఆత్మ సంతృప్తితో చెప్పేవారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు సుదీర్ఘ కాలంపాటు ఆర్థిక మంత్రిగా పనిచేసిన ఘనత రోశయ్యదే. 

కొణిజేటి రోశయ్య అనారోగ్యంతో బాధపడుతూ 2021 డిసెంబర్‌ 4న హైదరాబాదులో కన్నుమూశారు. ప్రజాజీవితంలో ఆయన ఒక మహోన్నత నేత. రాజకీయ విలువలు, అత్యున్నత సంప్రదాయాలు కాపాడడంలో ఓ రుషి మాదిరి సేవలందించారు. (క్లిక్ చేయండి: వివక్ష ఉందంటే ఉలుకెందుకు?)


- తిరుమలగిరి సురేందర్‌ 
వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్ట్, మాజీ ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌
(డిసెంబర్‌ 4న కె. రోశయ్య ప్రథమ వర్ధంతి)

మరిన్ని వార్తలు