Korrapati Gangadhara Rao: నాటకరంగ ఘనాపాఠి కొర్రపాటి

10 May, 2022 12:44 IST|Sakshi

స్త్రీ పాత్రలు లేని ప్రదర్శన యోగ్యమైన నాటికల కోసం ఆంధ్రనాటక రంగం ఎదురు చూస్తున్న తరుణంలో ఆ లోటు పూడ్చిన ఘనత డాక్టర్‌ కొర్రపాటి గంగాధరరావుది. 1950–80 మధ్య దశాబ్దాల్లో తెలుగు నాటక రంగాన్ని ఆయన సుసంపన్నం చేశారు. 110కి పైగా నాటికలు, నాటకాలు రాసి ‘శతాధిక నాటక రచయిత’గా ఖ్యాతి గడించారు. వృత్తిరీత్యా వైద్యుడైన కొర్రపాటి 1922 మే 10న బందరులో జన్మించారు. అభ్యుదయ భావాలతో, సంస్కరణాభిలాషతో, సమసమాజ స్థాపనా ధ్యేయంతో ఆయన రాసిన నాటికలు తెలుగు ప్రేక్షకులను అలరించాయి. ఆసక్తిదాయకంగా ప్రేక్షకుల హృదయాలలో పదికాలాల పాటు నిలిచిపోయే విధంగా పాత్రలను తీర్చిదిద్దడంలో ఆయన సిద్ధహస్తుడు. 

గంభీరమైన సన్నివేశాల మధ్య కూడా ఒక సునిశితమైన హాస్య సంఘటనను చొప్పించి నాటకాలను రంజింపజేయడంలో ఆయనది అందెవేసిన చేయి. ‘యథా ప్రజా తథా రాజా’, ‘పెండింగ్‌ ఫైలు’, ‘తెరలో తెర’, ‘కమల’, ‘ఆరని పారాణి’, ‘తారా బలం’, ‘తెలుగు కోపం’, ‘కొత్త చిగురు’, ‘లోక సంగ్రహం’ వంటివి వందలాది ప్రదర్శనలకు నోచుకున్నాయి. 

కొర్రపాటి గొప్ప నటుడు కూడా! చిన్నతనం నుండి నాటకాలు వేసేవారు. అందరూ ఆయన్ని ‘రంగబ్బాయి’ అని పిలిచేవారు. 14 ఏళ్ల వయసులోనే ‘హతవిధీ’ అనే నాటిక రాసి ఆడారు. ప్రధానంగా స్త్రీ పాత్రలు వేసేవారు. ‘విడాకులా’ అనే నాటికలో ఆయన స్త్రీ పాత్ర నటన పలువురి ప్రశంసలు పొందింది. స్వాతంత్రోద్యమ కాలంలో ‘నా దేశం’ నాటకంలో ‘కామ్రేడ్‌’ పాత్రను పోషించారు. 

తర్వాతి కాలంలో సినీరచయితగా, నవలా రచయితగా కూడా పేరు గడించారు కొర్రపాటి. ‘ఇద్దరు మిత్రులు’, ‘మాయని మమత’ వంటి చిత్రాలకు మాటలు రాశారు. ఇవిగాక షాడోరైటర్‌గా కూడా ఇంకా చాలా సినిమాలకు మాటలు రాశారు. కొర్రపాటి సుమారు పది నవలలు రాశారు. వాటిలో ‘లంబాడోళ్ళ రాందాసు’, ‘గృహ దహనం’, ‘ధంసా’ అధిక ప్రాచుర్యాన్ని పొందాయి. ఆంధ్ర నాటక కళా పరిషత్‌  నుండి అసంఖ్యాకంగా బహుమతులు పొందారు. ‘రంగరచనా ప్రవీణ’ అనే బిరుదాన్ని పొందారు. ఆంధ్ర సాహిత్య అకాడమీ, సంగీత నాటక అకాడమీలలో సభ్యుడిగా నియమితులైనారు. ( చరిత్ర చెక్కిలిపై చెరగని సంతకం)

ఔత్సాహికులకు శిక్షణ ఇవ్వడానికి కొర్రపాటి నాటక శిక్షణాలయాన్ని కూడా నడిపారు. ‘పద్మశ్రీ’ స్థానం నరసింహారావు, బందా కనకలింగేశ్వరరావు, గరికపాటి రాజారావు, పినిశెట్టి, రామచంద్ర కాశ్యప, పృథ్వీ రాజ్‌ కపూర్‌ వంటి వారితో కొర్రపాటికి సాన్నిహిత్యం ఉండేది. సినీనటులు పి.ఎల్‌.నారాయణ, చంద్రమోహన్, నూతన ప్రసాద్, కె.ఎస్‌.టి. సాయి వంటివారు ఆయన శిష్యవర్గంగా ఉండేవారు. కొర్రపాటి మద్రాస్‌ మెడికల్‌ కాలేజీలో వైద్యంలో సర్టిఫికెట్‌ కోర్సు పూర్తి చేసిన తర్వాత బాపట్లలో వైద్యుడిగా ప్రాక్టీస్‌ ప్రారంభించారు. గొప్ప హస్తవాసి కలవారని పేరుండేది. ఆయన సౌమ్యులు, మితభాషి, అభ్యుదయవాది, హాస్యప్రియులు. 1986 జనవరి 27న బాపట్లలో తనువు చాలించారు. 

– డాక్టర్‌ పి.సి. సాయిబాబు, రీడర్‌ ఇన్‌ కామర్స్‌(విశ్రాంత) 
(మే 10న కొర్రపాటి గంగాధరరావు శతజయంతి)

మరిన్ని వార్తలు