ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానులు సహేతుకమే!

20 Sep, 2022 13:08 IST|Sakshi

ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానులు సహేతుకం, సశాస్త్రీయం. రాజకీయ కారణాల వల్ల రాజధానుల నిర్మాణం ‘మూరెడు ముందుకు, బారెడు వెనుక’కు చందంగా సాగుతోంది. అయినా ఎప్పటికైనా విభిన్న భౌగోళిక, సాంస్కృతిక, సామాజిక కారణాల రీత్యా మూడు పరిపాలనా కేంద్రాల ఏర్పాటు కావలసిందే. ఏపీలో ఉత్తరాంధ్ర, రాయలసీమ, మధ్యాంధ్ర ప్రాంతాల మధ్య అభివృద్ధి, యాస, భాషల్లో ఎప్పటి నుంచో తేడాలు ఉన్నాయి. ఇందుకు భౌగోళికపరమైన వాతావరణం, నేలల స్వభావం, సముద్ర తీరం వంటివి కూడా కారణాలే. కారణాలు ఏవైనా మధ్యాంధ్ర జిల్లాలైన ఉమ్మడి గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు జిల్లాలు ఆర్థికంగా మిగతా ప్రాంతాల కంటే బాగా అభివృద్ధి చెందాయి. ఉత్తరాంధ్ర, రాయలసీమలు ఇప్పటికీ వెనక బడే ఉన్నాయి. వాటిని కూడా అభివృద్ధి చేయడానికే పరిపాలనను వికేంద్రీకరిస్తూ మూడు రాజధానులను ఏర్పాటు చేయాలని ఏపీలో జగన్‌ ప్రభుత్వం నిర్ణయించింది. 

శాసన రాజధానిగా ఇప్పటికే మధ్యాంధ్రలో ఉన్న అమరావతిని కొనసాగించాలనీ, న్యాయరాజధానిగా కర్నూలును చేసి, అందులో హైకోర్టును ఏర్పాటు చేయాలనీ; రాష్ట్రంలోనే పెద్ద నగరమైన విశాఖపట్టణాన్ని పరిపాలనా రాజధానిగా చేసి ఉత్తరాంధ్ర ప్రజలకు రాజధానిని దగ్గర చేయాలనీ జగన్‌ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోవడం రాజ్యాంగ విరుద్ధమేమీ కాదు. ఇప్పటికే దేశంలో పాలనా వికేంద్రీకరణను పాటిస్తున్న రాష్ట్రాలు పది దాకా ఉన్నాయి. ఛత్తీస్‌గఢ్‌లో అసెంబ్లీ రాయ్‌పూర్‌లో ఉంటే... హైకోర్టు బిలాస్‌పూర్‌లో పనిచేస్తోంది. గుజరాత్‌ అసెంబ్లీ, పరిపాలన విభాగం గాంధీనగర్‌లో ఉంటే, హైకోర్టు అహ్మదాబాద్‌లో కార్యకలాపాలు సాగిస్తోంది. 

కేరళకు సంబంధించి తిరువనంతపురంలో సెక్రటేరియేట్, అసెంబ్లీ ఉంటే... కొచ్చిలో హైకోర్టు పని చేస్తోంది. మధ్యప్రదేశ్‌ రాష్ట్ర రాజధాని భోపాల్‌లో, అసెంబ్లీ, సచివాలయం ఉన్నాయి. జబల్‌పూర్‌లో హైకోర్టు నడుస్తోంది. మహారాష్ట్రలో సమ్మర్‌ క్యాపిటల్‌ ముంబై, వింటర్‌ క్యాపిటల్‌ నాగ్‌పూర్‌లో ఉంటాయి. ఇక ఒడిశాలోని భువనేశ్వర్‌లో పరిపాలన విభాగం ఉంటే కటక్‌లో హైకోర్టు ఫంక్షన్‌లో ఉంది. రాజస్థాన్‌ రాష్ట్ర రాజధాని జైపూర్‌లో ఉంటే... పరిపాలన విభాగం జోధ్‌పూర్‌లో హైకోర్టు నడుస్తున్నాయి. ఉత్తరప్రదేశ్‌ రాజధాని లక్నోలో పరిపాలన, అసెంబ్లీ విభాగాలు ఉంటే... అలహాబాద్‌లో హైకోర్టు పనిచేస్తోంది. ఉత్తరాఖండ్‌ రాష్ట్ర రాజధాని డెహ్రాడూన్‌లో అసెంబ్లీ, సెక్రటేరియేట్‌ ఉన్నాయి. నైనిటాల్‌లో హైకోర్టు ఉంది. (క్లిక్: ఇది ఉత్తరాంధ్ర మనోభావాలపై దండయాత్ర!)

ఏపీలో నెలకొన్న భిన్న భూభౌతిక పరి స్థితులు, వాతావరణ పరిస్థితులు, సాంస్కృతిక వైరుధ్యం, ఆహారం, ఆహార్యం, ఆర్థిక అసమానతల రీత్యా రాజధాని విస్తరణ సహే తుకమే. ఆంధ్రప్రదేశ్‌లో అనేక ఏళ్లుగా పేరుకు పోయిన భిన్న వైరుధ్యాలను రూపుమాపే కార్యక్రమాలు రూపొందించడంలో గత ప్రభుత్వాలు విఫలమయ్యాయి. అందుకే నేటికీ ప్రత్యేక రాయలసీమ, ప్రత్యేక కళింగసీమ ఉద్యమ నినాదాలు వినిపిస్తూనే ఉన్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వాలు మేల్కొని ప్రజల మధ్య ఏకరీతి మానసిక స్థితి, ఏకాత్మతాభావం, సోదర భావం పెంపొం దించే కార్యాచరణ అమలు చేయాలి. అనేక మతాలు, భాషలు, జాతులు, సంస్కృతులు, భూభౌతిక వైవిధ్యాలతో కూడిన భారత దేశాన్ని ఒకే జాతిగా పెనవేయడానికి ప్రజల మధ్య సోదరభావం సృష్టించే వరకు వికేంద్రీకరణ మాత్రమే తారక మంత్రం! (క్లిక్: అమరావతి నిర్మాణం ఎలా సాధ్యమో మీరే చెప్పండి!)


- కౌడె సమ్మయ్య, జర్నలిస్టు

మరిన్ని వార్తలు