Krishnapatnam: చెట్లక్రియ కమాల్‌... కరోనా ఢమాల్‌?

22 May, 2021 11:51 IST|Sakshi

సందర్భం

కరోనా చికిత్సకు ప్లాస్మా థెరపి, రెమ్‌డెసివిర్, ఐవర్‌మెక్టిన్, హెచ్‌సీక్యూ అంతా ఒడిసిన ముచ్చట. కొత్త ప్రొటోకాల్‌ వేరే వుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేల్చిన బాంబు కరోనా రోగుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్నది. ఆక్సిజన్‌ లేక, వెంటిలేటర్లు లేక వణుకుతున్న జనానికి అనుభవంతో కొందరు, అత్యుత్సా హంతో కొందరు చిత్రమైన వైద్యం చెబుతున్నారు. 

హైదరాబాద్‌ డీఆర్‌డీఓ అభివృద్ధి చేసిన 2డీజీ (2డి ఆక్సీ గ్లూకోజ్‌) ఎప్పుడు చేతికి వస్తుందా అని ఎదురు చూస్తున్న తరుణంలో... ఎక్కడో నెల్లూరు జిల్లా కృష్ణపట్టణంలో ఆనందయ్య అనే ఆయుర్వేద వైద్యుడు కలలోనో, నేరుగానో ఒక సాధువు సూచించిన ఫార్ములా ఇది అని పెరట్లో మొలిచే మొక్కలతో తయారు చేసిన మందు కరోనా రోగులకు ఇవ్వడం, కొంత మందికి కంట్లో చుక్కలుగా వేయడంతో వెంటనే ఆక్సిజన్‌ లెవెల్స్‌ పెరుగుతున్నా యనీ, ఆయాసం తగ్గుతుందనీ వచ్చిన వార్త కొత్త ఆశలు రేపింది. సామాజిక మాధ్యమాల ప్రచారం ఊపందుకుని అరలక్ష మంది ప్రజలు బారులు తీరి చికిత్స చేయించుకుంటున్నప్పుడు ఎవరో ఫిర్యాదు చేస్తే జిల్లా వైద్యాధికారి, ఇతరులు మందుకు శాస్త్రీయత, కోవిడ్‌ నిబంధనల పేరుతో ఆపివేసినారు.

వెంటనే వైసీపీ స్థానిక ఎంఎల్‌ఏ చొరవ తీసు కొని ఉచితంగా ఇస్తున్న ప్రభావవంతమైన మందును ఎట్లా ఆపుతారని అధికారులను ప్రశ్నించడంతో పాటు, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్య మంత్రికి కూడా తెలియజేయడంతో అధికార యంత్రాంగం కదిలి, కొంత విచారణ చేసి, అనుకూల అభిప్రాయాలను చెప్పింది. ఇప్పుడే అందిన వార్త, మందు పనితీరు, శాస్త్రీయత, సురక్షత గురించి ఐసీఎంఆర్‌ కదిలినట్లు.  

బహుళ జాతి కంపెనీలే ఏమీ చేయలేకపోతున్నాయని పెదవి విరుస్తున్న వాళ్ళకు ఒక విషయం తెలియాలి. కరోనా కాలంలో ఇన్ని మందులను జనానికి అంటగట్టి ఇప్పుడు పనికి రావని ఎలా అంటున్నారు? ప్రపంచంలో ఫార్మా స్యూటికల్స్‌తో పోటీ పడుతూ ఫైటోస్యూటికల్స్‌ ఎదుగుతోందని, మనం అల్లోపతిలో వాడుతున్న డిగాగ్జిన్‌ గుండె మందు, విషం విరుగుడుకు అట్రోపిన్‌ , క్యాన్సర్‌కు వాడే విన్‌ క్రిస్టిన్‌ మన పెరటిచెట్ల నుండి సంగ్రహించినవే అని తెలియాలి. హోమియోపతిలో కూడా చెట్టు క్రియను ఆల్కహాల్‌తో పోటెన్సీ పెంచి ఔషధంగా వాడుతారు. చైనాలో హెర్బల్‌ మెడిసిన్‌ తారస్థాయిలో ఉంది. 

మలేరియాకు క్లోరోక్విన్‌, క్వినైన్‌ , ఆర్టిమెస్మన్‌, శారీరక బలహీనతకు జిన్‌ సెంగ్, పక్షవాతం, ఇతర నరాల జబ్బులకు జింకోబా చేనా, ఇతర దేశాలు అందించిన చెట్టు ఉత్పత్తులే. ఆనందయ్య మందులోని మూలకాలను, మూలికలను స్పష్టంగా బహిర్గతం చేయడం గొప్ప విషయం. సాధారణంగా ఉచితంగా మందులు ఇచ్చినా ఫార్ములా చెప్పేది లేదంటారు. సీదా సాదా ఆనందయ్య పదిమందికి ఈ ఫలితం అందాలని ఉవిళ్ళూరుతున్నారు. ఏఏ మూలికలతో ఈ మందు తయారయ్యిందో వాటి నిష్పత్తి తెలియజేస్తే ఆయుష్‌ విభాగాలు వాటిని ప్రయోగ ప్రాతిపది కన కరోనా రోగులకు అంద జేయాలి. ఫలితాలను శాస్త్రీయంగా రికార్డు చేయాలి.

అంతర్జాతీయ ఎపిడెమాలజిస్టు శ్రీనాథ్‌రెడ్డిని వైద్య, ఆరోగ్య సలహాదారుడిగా సేవలందించమని అడిగి, చేర్చుకొని ఫలితాలు రాబడుతున్న జగన్‌ మోహన్‌రెడ్డి యుద్ధప్రాతిపదికన ఆనందయ్య మందు మీద దృష్టి సారించి కేంద్రానికి కూడా నివేదిక అందించాలని కోరుకుందాం. బ్లాక్‌ ఫంగస్‌కు యునానీ వైద్యం పనిచేస్తుందని ఆ డాక్టర్లు  ప్రకటించారు. కరోనా నయమైతే బ్లాక్, వైట్‌ ఏ ఫంగస్‌ సమస్య ఉండదు. 2డీజీతో సంచలనమైన తెలుగు రాష్ట్రాల పరిశోధన ఈ కరోనా కాక్‌ టెయిల్‌తో విశ్వవ్యాపితమవ్వాలని ఆశిద్దాం.


- డాక్టర్‌ చెరుకు సుధాకర్‌ 
తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షులు 
మొబైల్‌ : 98484 72329

Read latest Guest-columns News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు