విద్యార్థుల దశ ఇకనైనా మారేనా?

13 Oct, 2020 01:41 IST|Sakshi

అభిప్రాయం

దేశంలో 1986 నుండి అమలులో ఉన్న 10+2 విద్యావిధానం స్థానంలో 5+3+3+4 విధానాన్ని ప్రవేశపెట్టబోతున్నారు. నూతన విద్యా విధానంపై 2015 నుండి రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రజలు, వివిధ సంఘాల నుండి రెండు లక్షలకు పైగా సూచనలు సలహాలను స్వీకరించి కస్తూరిరంగన్‌ నివేదిక ఆధారంగా రెండు భాగాలుగా విభజించారు. (1) పాఠశాల విద్య (2) ఉన్నత విద్య. పాఠశాల విద్యను నాలుగు రకాలుగా విభజించారు. ఇందులో 3 నుండి 18 సంవత్సరాలు గల విద్యార్థులను చేర్చారు. (1) పునాది స్థాయి 1, 2వ తరగతులు (2) తయారు స్థాయి 3, 4, 5వ తరగతులు (3) మాధ్యమిక స్థాయి 6, 7, 8వ తరగతులు (4) సెకండరీ స్థాయి 9, 10, 11, 12వ తరగతులు,  ఈ నూతన విధానంలో అదనంగా 3 నుండి 6 సంవత్సరాల విద్యార్థులను చేర్చారు. దీంతో 2 కోట్లమంది పిల్లలకు విద్యాభ్యసనకు అవకాశం కలుగుతుందని కేంద్రం అంచనా వేసింది. 

ఉన్నత విద్యలో గ్రాడ్యుయేషన్‌ కోర్సులను 3 లేదా 4 సంవత్సరాల మల్టిపుల్‌ ఎగ్జిట్‌ ఆప్షన్‌ని ప్రవేశపెట్టనున్నారు, పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ కోర్సులను 1 లేదా రెండేళ్లుగా నిర్ధారించారు.  మొత్తంగా దేశ అక్షరాస్యత 100% చేరుకునే విధంగా లక్ష్యం పెట్టుకున్నారు, ఈ విధానంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేటు భాగస్వామ్యంతో ముందుకు పోవాల్సి ఉంటుంది. మొత్తం విద్యారంగంపై ఖర్చును జాతీయ జీడీపీలో 6% చేరుకోవాలని నిర్ణయించారు. నూతన విద్యా విధానంలో షెడ్యూల్డ్‌ కులాలు, షెడ్యూల్డ్‌ తెగలు, ఇతర వెనుకబడిన తరగతులు, ఇతర ఆర్థిక బలహీన వర్గాలకు రిజర్వేషన్లు, ఆర్థికపరమైన రాయితీలు కొనసాగుతాయని తెలిపారు. కాలానుగుణంగా, అవసరాల రీత్యా, అంతర్జాతీయ విద్యా ప్రమాణాలతో సమానంగా పోటీ పడాలంటే విద్యా విధానాలలో మార్పు చేసుకోకతప్పదు.

కేవలం విద్యా విధానాల మార్పు వలన ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈ డబ్ల్యూఎస్‌ విద్యార్థులకు ఎంతమేరకు లబ్ధి చేకూరుతుందో ఆలోచించాలి. ప్రభుత్వ పాఠశాలల కంటే ప్రైవేటు విద్యా సంస్థలలో విద్యార్థుల చేరిక దినదినం పెరుగుతోంది. దేశంలో ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు, ఉన్నత, మధ్య తరగతి ఆదాయం కలిగిన కుటుంబాలు తమ పిల్లలను 90% పైగా ప్రైవేటు విద్యాసంస్థలలో ఆంగ్ల మాధ్యమంలో మౌలిక వసతులు కలిగిన విద్యా సంస్థలలో చదివించడానికి మొగ్గుచూపుతున్నారు. ప్రభుత్వ విద్యా సంస్థలలో మౌలిక వసతులైన పక్కా భవనాలు, విద్యుత్‌ సౌకర్యం, త్రాగునీరు, టాయిలెట్స్, తగు బోధన బోధనేతర సిబ్బంది, కంప్యూటర్‌ విద్యా విధానం, రవాణా లాంటి సౌకర్యాలను కల్పించకుండా విద్యా విధానాల మార్పుతో పెద్దగా ఆశించిన ఫలితాలు రావు. కేంద్ర ప్రభుత్వం 2009లో ఉచిత నిర్బంధ విద్యాహక్కు చట్టాన్ని ప్రవేశపెడుతూ 6 నుండి 14 సంవత్సరాల బాల బాలికలకు ప్రైవేటు విద్యాసంస్థలలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, అగ్ర కులాల్లోని ఆర్థికంగా బలహీన వర్గాలకు 25% రిజర్వేషన్లను కల్పించింది దేశంలో ఎక్కడా కూడా పటిష్టంగా ఈ రిజర్వేషన్లు అమలు జరగడం లేదు. 

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ రంగంలో మాతృ భాషను కొనసాగిస్తూనే ఆంగ్ల మాధ్యమంలో విద్యాసంస్థల సంఖ్యను నాణ్యమైన విద్య, మౌలిక వసతులతో పెంచి రాజ్యాంగం కల్పిస్తున్న షెడ్యూల్డ్‌ కులాలు, షెడ్యూల్డ్‌ తెగలు, ఇతర వెనుకబడిన తరగతులు, అగ్రకులాల్లోని ఆర్థికంగా బలహీన వర్గాలకు రిజర్వేషన్లు అమలుపరచి ఆర్థిక సహకారాన్ని కొనసాగించాలి. ముఖ్యంగా నూతన విద్యా విధానాల పేరిట ప్రైవేటు సంస్థలకు విద్యారంగాన్ని ధారాదత్తం చేస్తే లక్ష్యం నెరవేరకపోగా దేశంలో విద్యా రంగం అధోగతి పాలయ్యే అవకాశాలే ఎక్కువ.

కె. కుమారస్వామి
వ్యాసకర్త ప్రముఖ సామాజిక విశ్లేషకులు 
 మొబైల్‌ : 94909 59625

>
మరిన్ని వార్తలు