కవిత్వంలా తరలిపోయిన ఆఫీసర్‌

10 Dec, 2020 01:17 IST|Sakshi

నివాళి

అనేక అక్షరాలని, రంగులని, రాగాల మధ్య నుంచి నడిచే దారిని జాగ్రత్తగా వెతుక్కుంటూ ఆ యింటి గదుల్లోంచి ఆ టెర్రస్‌ వెన్నెల మీదకి వస్తే అక్కడ రజనీ పాటలో... చలం గారి సుధో... హిందుస్తానీ సంగీతమో మనల్ని చుట్టుకుంటుంది. వెన్నెలంత నిశ్శ బ్దంగా ఆ రాగాలని నింపుకొంటూ సదాశివరావుగారు. ఆ రోజు ఆ గెట్‌ టుగెదర్‌కి వారు ఆహ్వా నించిన కళారంగానికి సంబంధించిన వారెందరో ఆ గానాన్ని శ్వాసిస్తూ... 
···  
చాలా యేళ్ళ క్రిందట వారు ఫోన్‌ చేసి ‘నువ్వు వచ్చేయ్, ఫొటోలు తియ్యాలి’ అన్నారు. నా కథాసంపుటి ‘ద లాస్‌ ఆఫ్‌ యిన్నొసెన్స్‌’ ఆవిష్కరణకి వచ్చి నా చేతిలో వో వెడల్పాటి కవర్‌ పెట్టారు. విప్పి చూస్తే... Pleasant Surprise. దాదాపు 15 యేళ్ళ క్రితం తీస్తానని తీసిన నా ఫొటోలు. భలే దాచారే అనుకున్నా. యెప్పుడు యెక్కడ యెవరికి యే కానుకని యివ్వాలో తెలిసినవారు.
···
యీ విశిష్టమైన చదువరి ‘ఆత్మా ఫేక్టర్‌’ కథతో తెలుగు సాహిత్య రంగంలోకి రచయితగా అడుగిడి ప్రపంచ కవిత్వం నుండి తాను చేసిన అనువాదాలని యిటీవలే ‘కావ్యకళ’ పేరుతో పుస్తకంగా వెలువరించారు. ‘క్రాస్‌ రోడ్స్‌’ కథాసంపుటి, పాలపుంత, ఆత్మా ఫేక్టర్, కావ్యకళ, సైన్స్‌ ఫిక్షన్‌ రచయితల పరిచయాలు పుస్తకాలుగా వెలుపడ్డాయి. బ్రిటిష్‌ కాలానికి సంబంధించిన కొన్ని కథలని వారు యెంతో మమేకతతో రాశారు. యిటీవల నాలుగైదేళ్ళుగా సైన్స్‌ ఫిక్షన్‌ మీద ‘పాలపిట్ట’ పత్రికలో రాస్తూ వచ్చిన వ్యాసాలు తెలుగు సాహిత్యంలో అపు రూపమైనవి. ‘సైన్స్‌ ఫిక్షన్‌ రచయితలు’ పేరిట నాలుగు సంపుటాలుగా వెలువడ్డ ఆ వ్యాసాల్లో ఆయన చేసిన కృషి అద్భుతం. తెలుగులో మరెవ్వరూ వారి దరిదాపుల్లోకి రాలేరనిపించేట్టు వుండే ఆ వ్యాసాలు తెలుగులో చిర స్థాయిగా నిలిచిపోయే రచన. యెంతో చదువుకొన్నందుకు తెలుగువారికి వారు అందించిన మేలిమి కానుక ఆ వ్యాసాలు. 
···
స్నేహశీలి సదాశివరావు గారికి స్నేహితులని కలవ లేదని బెంగ పడటం కంటే, యెలాగైనా వారిని కలవాలి అంతే కానీ టైమ్‌ లేదనుకో కూడదనుకొంటానని చెప్పారో సందర్భంలో. స్నేహితులని కలుసుకోవటం, సమయాలని రంగులమయం చేసుకోవటాన్ని వారు ప్రేమిస్తారు. వారికి బాపు అంటే బోలెడంత యిష్టం. చిత్రకారులు గోపి గారికి బాపు అవార్డ్‌ వచ్చిందని సంతోషపడుతూ, యేడవ తేదీ సాయంత్రం తమ యింటికి రమ్మని ఆహ్వానించారు. గోపీ గారు యిల్లు వెతుకుతూ ‘నాలుగేళ్ళ క్రితం వచ్చాను. యిల్లు తెలియటం లేదు’ అని కాల్‌ చేస్తే, ‘నే వస్తున్నా’ అని గోపిగారిని కలిసి మాట్లాడుతూ వారి యింటి వైపు నడుస్తున్నారు. సడన్‌గా సదాశివరావు గారు ‘‘యేమిటోలా వుంది’’ అని రోడ్డు పక్కనే ఆగి నిలబడలేక అలా పేవ్‌మెంట్‌ మీద కూర్చున్నారు. గోపిగారు వారి పక్కనే కూర్చుని సదాశివరావు గారి తలని వొడిలో పెట్టుకున్నారు. రోడ్డు మీద అటూయిటూ వెళ్తున్న వాహనాలు... మను షులు... కొద్ది దూరాన వున్న క్రాస్‌రోడ్స్‌కి చేరువగా... సైన్స్‌ ఫిక్షన్‌ రాగాల లోకాలకి... తనెంతో ప్రేమించే రంగులు విర జిమ్మే చిత్రకారుని చేతుల్లోనే ఆయన యీ లోకాన్ని విడిచి తరలిపోయారు.
···
ఆ మర్నాడు ధరమ్‌ కరమ్‌ రోడ్డులో వారి యింటి ప్రాంగణంలో కుటుంబసభ్యులు, కళాకారులు... వారు పని చేసిన డిపార్ట్‌మెంట్‌కి సంబంధించినవారు... యెందరో చెమ్మగిల్లిన మనసులతో.
IPS 1967 Batchకి చెందిన సదాశివరావు... కె.వెంకటసుబ్బారావు, చంద్రకాంత పుష్పవేణమ్మ గార్లకు కృష్ణా జిల్లా అత్కురులో 15–7–1943న జన్మించారు. ఎమ్మెస్సీ జియాలజీని వెంకటేశ్వర యూనివర్సిటీలో చదు వుకొన్నారు. 1966లో ప్రమీల గారితో వివాహం జరిగింది. వారికి నలుగురు పిల్లలు... యామిని, హరిత, రంజిత్, వినయ. కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతి. కె. సదాశివరావు గారికి వినమ్ర నమస్సులు.

వ్యాసకర్త

కుప్పిలి పద్మ, కవయిత్రి, రచయిత్రి. 
మొబైల్‌ : 98663 16174
kuppilipadma@gmail.com

మరిన్ని వార్తలు