ఆపత్కాలంలో ఏపీ నగదు వ్యూహం

5 Sep, 2020 00:02 IST|Sakshi

విశ్లేషణ

జగన్‌ ప్రభుత్వం తక్షణమే నగదు బదిలీ చేయాలన్న ఒక సార్వత్రిక సహజ న్యాయ సూత్రాన్ని అమలు చేసింది. నగదు బదిలీ ద్వారా మాత్రమే రోజువారి కూలీలు, చిన్న సన్నకారు మెట్ట ప్రాంత రైతులు, అట్టడుగు సామాజిక వర్గాల వారి చేతిలో నాలుగు రూపాయల డబ్బులు పెరిగి మార్కెట్లో సరుకులకు డిమాండ్‌ పెరుగుతుంది. తద్వారా అది ఉత్పత్తులు పెరగడానికి, ఉద్యోగ ఆదాయ కల్పనకు దారితీస్తుంది. అందువల్లనే ప్రత్యక్ష నగదు చెల్లింపులు చేయాలని ప్రపంచంలో పేరుగాంచిన ఆర్థిక వేత్తలు, పరిశోధన సంస్థలు ఉమ్మడిగా తేల్చి చెప్పాయి. 

కరోనా వైరస్‌ మూలంగా లాక్‌డౌన్‌ మొదలై ఐదు నెలలు దాటింది. ఈ ఐదు నెలల కాలంలో  ప్రపంచవ్యాప్తంగా రెండు కీలక అంశాలమీద చర్చ జరుగుతున్నది. మొద టిది, వీలైనంత తొందరగా టీకా కనుగొనే విషయమై వైద్యరంగానికి సంబంధించినది. రెండవది, లాక్‌డౌన్‌ మూలంగా దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను కాపాడటానికి నగదు బదిలీ ఆవశ్యకతపై చర్చ. వైరస్‌ సోకితే ప్రాణాపాయ సమస్య రెండు శాతానికే పరిమితం కాగా, ఆర్థిక సంక్షోభ సమస్య 90 శాతం పైగా ప్రజలను చుట్టుముట్టి వైరస్‌కు వ్యతిరేకంగా పోరాడలేని నిస్సహాయ స్థితిలోకి సమాజాన్ని నెట్టివేస్తుంది. కరోనా టీకా వచ్చే వరకు ఆర్థిక వ్యవస్థకు కూడా ఆక్సిజన్‌ అందించడం అనివార్యం. ఆ ఆక్సిజన్‌ పేరే తక్షణ నగదు బదిలీ. ఈ విషయంలో అర్థశాస్త్ర నోబెల్‌ గ్రహీతలు అమర్త్యసేన్, అభిజీత్‌ బెనర్జీ మొదలు రఘురామ్‌ రాజన్, మన్మోహన్‌ సింగ్‌ వరకు ఏకాభిప్రాయాన్ని వ్యక్తం చేయడమే కాక, భారీమొత్తంలో అంతర్జాతీయ సంస్థల నుండి అప్పులు చేసైనా, చిట్ట చివరి అస్త్రంగా కరెన్సీని అదనంగా ముద్రించైనా నేరుగా నగదు బదిలీ చేయాలని భారత ప్రభుత్వాన్ని డిమాండ్‌ కూడా చేస్తున్నారు. అంతర్జా తీయ ద్రవ్య నిధి సంస్థ, ప్రపంచ బ్యాంక్‌ మొదలు ప్రపంచవ్యాప్తంగా వున్న అన్ని ఆర్థిక సంస్థలు కూడా ఇదే విషయమై అన్ని దేశాలకూ పిలుపునిస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా అన్ని ప్రభుత్వాల పాలనా సామర్థ్యాలకు సవాల్‌ విసరడమే గాక, మన సమాజ అనుభవంలోకి మునుపెన్నడూ రాని ఇంతటి గడ్డు పరిస్థితిని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఎలా ఎదుర్కున్నదో పరిశీలించడమే ఈ వ్యాసం ఉద్దేశం.

ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి బాధ్యతలు చేపట్టేనాటికి, అంటే కరోనా వ్యాప్తి జరగకముందే భారత ఆర్థిక వ్యవస్థ మాంద్యంలో కూరుకుపోయి కదలలేని స్థితిలో ఉంది. 2014 నుండి వృద్ధిరేటు క్షీణిస్తూ మూడు దశాబ్దాల కనిష్ఠ స్థాయికి చేరింది. 2015– 16 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి రేటు 8.2 శాతం ఉండగా, 2019– 20లో 4.2 శాతానికి పడిపోయింది. దీనికితోడు అంతకుముందే చంద్రబాబు ప్రభుత్వ అరాచక ఆర్థిక నిర్వహణ ఫలితంగా ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు వేల కోట్లు పేరుకుపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలపై ఎలాంటి ప్రతికూల ప్రభావం పడకుండా ఉండటానికి ముందుచూపుతో ప్రభుత్వం ఆర్థిక సహకారం అవసరం ఉన్న అన్ని వర్గాలవారికి నేరుగా నగదు బదిలీ ద్వారా మొదటి సంవత్సరంలో దాదాపు 40139.58 కోట్ల రూపాయలను అందించింది. ఈలోగా కరోనా రూపంలో జగన్‌ ప్రభుత్వానికి మరో పరీక్ష ఎదురైంది. పీరియాడిక్‌ లేబర్‌ ఫోర్స్‌ సర్వే 2017 –18 గణాంకాలను ప్రస్తుత పరిస్థితులకు అన్వయించి తేల్చిన అంచనాల ప్రకారం, దేశంలో ఇదివరకే పేదరికంలో వున్న 56 కోట్లమంది కాక, లాక్‌డౌన్‌ వల్ల మరో 40 కోట్లమంది కొత్తగా పేదరికపు రేఖకు దిగువకు పడిపోయారు. వీరిలో దాదాపు 62 కోట్లమంది అంటే దాదాపు 47 శాతం కటిక దారిద్య్రపు కోరల్లో చిక్కుకున్నారు. ఆర్బీఐ మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ అంచనా ప్రకారం, లాక్‌డౌన్‌ వల్ల ఒక నెలకు దేశ సంపద 12 శాతం హరించుకుపోయింది. పర్యవసానంగా నిరుద్యోగ రేటు అంచనాలకు అందనంతగా పెరిగింది. ఇంతటి విషాద పరిస్థితుల్లో ఖజానా నుండి పైసా తీయకుండా చేసే వట్టి ప్రచారాల వల్ల ఏమాత్రం ఉపయోగం ఉండదని భావించిన జగన్‌ ప్రభుత్వం తక్షణమే నగదు బదిలీ చేయాలన్న ఒక సార్వత్రిక సహజ న్యాయ సూత్రాన్ని అమలు చేసింది.

కేంద్ర ప్రభుత్వం కంటితుడుపు చర్యగా స్వల్ప నగదు సహాయం మాత్రమే ప్రకటించి చేతులు దులుపుకుంది. అంతకంటే ఎక్కువగా పారిశ్రామిక వర్గాలకు పలు ఉద్దీపన ప్యాకేజీలు ప్రకటించింది. డిమాండ్‌ పడిపోయిన ఆర్థిక రంగంపై కేవలం ప్యాకేజీలు ఏమాత్రం ప్రభావం చూపవన్నది కఠిన వాస్తవం. ప్రజలకు ఆదాయాలు పెరిగితే మార్కెట్లో వస్తువులను కొంటారు, వస్తువులు అమ్ముడుపోతే పరిశ్రమలు సరుకులు ఉత్పత్తి చేస్తాయి. అందువలన ప్రజల కొనుగోలు శక్తిని పెంచడానికి ఏ ప్రభుత్వమైనా ప్రాధాన్యత ఇవ్వాలి. డిమాండ్‌ పడిపోయివున్న పరిస్థితుల్లో ఉత్పత్తిదారులకు ద్రవ్య సరఫరా పెంచినా ఆర్థిక వ్యవస్థ గాడిలో పడదనేది 1930 నుండి ప్రపంచ వ్యాప్తంగా అనుభవంలో ఉన్న విషయమే. నగదు బదిలీ ద్వారా మాత్రమే రోజువారి కూలీలు, చిన్న సన్నకారు మెట్ట ప్రాంత రైతులు, అట్టడుగు సామాజిక వర్గాల వారి చేతిలో నాలుగు రూపాయలు డబ్బులు పెరిగి మార్కెట్లో సరుకులకు డిమాండ్‌ పెరుగుతుంది. తద్వారా అది ఉత్పత్తులు పెరగడానికి, ఉద్యోగ ఆదాయ కల్పనకు దారితీస్తుంది. అందువల్లనే ప్రత్యక్ష నగదు చెల్లింపులు చేయాలని ప్రపంచంలో పేరుగాంచిన ఆర్థిక వేత్తలు, పరిశోధన సంస్థలు ఉమ్మడిగా తేల్చి చెప్పాయి. నగదు బదిలీద్వారా కొనుగోలు శక్తిని వీలున్నంతవరకు అందించడం అనేది ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి కీలకాంశం అవుతుంది కాబట్టి.

నగదు బదిలీ పథకం లబ్ధిదారులు మహిళలు అయితే దాని ప్రభావం మరింత శక్తిమంతంగా ఉంటుందనీ, అది మొత్తం కుటుంబ జీవన ప్రమాణాలను, ప్రత్యేకించి పిల్లల భవిష్యత్‌ను ప్రభావితం చేస్తుందనీ ఇప్పటికే అంతర్జాతీయ సర్వేలు తేల్చాయి. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చేపట్టిన చాలా నగదు బదిలీ పథకాల్లో లబ్ధిదారులు నేరుగా మహిళలే ఉండటం ఒక అద్భుతమైన విషయం. నగదు బదిలీ ద్వారా పొందిన మొత్తం దేనిపై పెట్టుబడి పెట్టాలి, ఏ వినియోగంపైన ఏ అవసరాలకు ఖర్చు చేయాలి అనే ఎంపిక స్వేచ్ఛ కూడా ఆ కుటుంబాలకు ఉంటుంది. లాక్‌డౌన్‌ వల్ల ఒకవైపు కుటుంబాలకు పని లేక ఆదాయం తగ్గడమే గాక మరోవైపు ప్రభుత్వానికి కూడా ఆర్థిక కార్యకలాపాలు ఆగిపోవడం మూలంగా వనరుల కొరత ఏర్పడింది. అయినప్పటికీ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం వెనకడుగు వేయకుండా సంక్షేమ పథకాలను మరింతగా విస్తరించింది. ఎక్కువ మందికి లబ్ధి చేకూర్చడం కరోనా పూర్వపు పరిస్థితి కంటే అత్యవసరమని గుర్తించింది. ఏప్రిల్‌ 1 నుండి ఇప్పటివరకు 21,183.36 కోట్ల రూపాయలను నేరుగా నగదు బదిలీ ద్వారా 1,64,72,245 మందికి సహాయం చేసింది. వైఎస్సార్‌ విద్యా దీవెన ద్వారా 4200 కోట్లను విడుదల చేసి నగదు చెలామణిని పెంచింది. ప్రత్యేకించి అట్టడుగు వర్గాలకు దన్నుగా నిలిచింది. నేతన్న హస్తం ద్వారా చేనేతలకు ఒక్కో కుటుంబానికి 24 వేల చొప్పున 81,703 మందికి నేరుగా సహాయం చేసింది. జగనన్న చేదోడు పథకం ద్వారా రజకులు, నాయీ బ్రాహ్మణులు, దర్జీ కుటుంబాలకు 10 వేల చొప్పున 480 కోట్లను వారి బ్యాంక్‌ ఖాతాల్లో జమ చేసింది.

రైతు భరోసా కింద మొదటి విడతగా 3,675 కోట్ల రూపాయలు మే నెలలోనే అందించింది.  అంతేగాక 57 లక్షల మంది రైతులకు 1,150 కోట్ల వడ్డీ రహిత రుణాన్ని అందించింది. రైతుల దగ్గర వరి ధాన్యాన్ని కొనుగోలు చేసి 5,744 కోట్ల రూపాయలు రైతులకు చెల్లించింది. కందులు, శనగలు, జొన్నలు, పసుపు తదితర పంటలను మద్దతు ధరతో కొనుగోలు చేసి మరో 2,624 కోట్లు రైతులకు చెల్లించింది. ఇప్పటివరకు ఐదు విడతలుగా 1 కోటి 50 లక్షల రేషన్‌కార్డుదారులకు ఉచితంగా బియ్యం, కందులు, శనగలు పంపిణీ చేసింది. రేషన్‌కార్డుదారులకు 1000 చొప్పున నగదు సహాయం చేసింది. స్వయం సహాయక సంఘాల్లోని 91 లక్షల మంది మహిళలకు వడ్డీరహిత రుణ పథకం ద్వారా 1,400 కోట్లు అందించింది. అర్చకులకు, ఇమామ్‌లకు, పాస్టర్లకు 5 వేల చొప్పున 77,290 మందికి సహాయం చేసింది. వైఎస్సార్‌ చేయూత ద్వారా ఒక్కో కుటుంబానికి 18,750 చొప్పున 22,28,909 మంది మహిళలకు నేరుగా నగదు సహాయం చేసింది. దానితోపాటు అమూల్, అల్లానా, రిలయన్స్‌ లాంటి సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుని తద్వారా మహిళలను మైక్రో ఎంటర్‌ప్రైనర్స్‌గా మార్చే బాధ్యతను కూడా ప్రభుత్వమే చేపట్టడం మరో సంచలనం. విభిన్న పథకాలకు అర్హత పొందడం ద్వారా దాదాపు 25 వేల చొప్పున నగదు సహాయం పొందిన కుటుంబాలు లక్షల్లో ఉండటం చెప్పుకోదగ్గ విషయం.

దేశవ్యాప్తంగా ప్రజల కొనుగోలు శక్తి పడిపోయి దాని ప్రభావం వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లపై కూడా పడింది. గత ఆర్థిక సంవత్సరం జూలై నెలతో పోల్చితే ఈ సంవత్సరం జూలైలో దాదాపు 14.36 తక్కువగా జీఎస్టీ వసూలైంది. ఈ సందర్భంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం జీఎస్టీ వసూళ్లలో దేశవ్యాప్తంగా నమోదైన 14.36 శాతం ప్రతికూలతలను అధిగమించి 2.65 శాతం వృద్ధిని సాధించింది. పెట్రోలియం ఉత్పత్తుల అమ్మకంలో 1.90 శాతం అధికంగా వృద్ధి నమోదైంది. కరోనా ఆర్థిక సంక్షోభ కాలంలో కేంద్రప్రభుత్వం సహా మరే ఇతర ధనిక రాష్ట్రాలు సైతం చేయని విధంగా తక్కువ వనరులు ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నేరుగా నగదు సహాయం చేసి ఆంధ్రప్రదేశ్‌ ప్రజానీకంలో సామాజిక భద్రత, ఆర్థిక భరోసా కలిగించిందని చెప్పడానికి ఇదే నిదర్శనం. మాములుగా ఎన్నికలు అయిపోగానే ఎన్నికల మేనిఫెస్టోను అధికారంలోకి వచ్చిన పార్టీనే కాక ‘ఎన్నికల మేనిఫెస్టోను అమలు చేయండి’ అని నిలదీయాల్సిన ప్రజలు కూడా మర్చిపోతున్న సంప్రదాయాన్ని ఇప్పటివరకు మనం చూశాం. కానీ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మరుసటి రోజునుండే తన ఎన్నికల మేనిఫెస్టోను తు.చ. తప్పకుండా అమలు చేయడమేగాక, దాన్ని ప్రజాక్షేత్రంలో బహిరంగంగా వుంచి ప్రజలకు మేనిఫెస్టోను నిరంతరం గుర్తుచేస్తూ జవాబుదారీగా ఉండటం ఒక సాహసం, సంచలనం. ఇది దేశ రాజకీయాల్లోనే ఒక న్యూ ట్రెండ్‌! 
ప్రొ. కె.వి.రమణారెడ్డి 
వ్యాసకర్త రిటైర్డ్‌ ప్రొఫెసర్, ఎస్కే యూనివర్సిటీ, అనంతపురం. ఫోన్‌: 9177335604

మరిన్ని వార్తలు