ఆంధ్రకు వరం ఈ కొత్త ‘పార్క్‌’

10 Sep, 2022 13:41 IST|Sakshi

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక ప్రగతిలో అంతర్భాగం పారిశ్రామిక ప్రగతి. దీని ద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. సహజ వనరులు, మానవ వనరులు గరిష్ఠ స్థాయిలో సద్వినియోగం అవుతాయి. అదే సమయంలో సర్వజనుల అవసరాలు తీరుతాయి. ఇవి ప్రజల ప్రాణాలకు సంబంధించినవి అయినప్పుడు వారి జీవన ప్రమాణ స్థాయి కూడా పెంచుతాయి. కేంద్ర ప్రభుత్వం తాజాగా మన రాష్ట్రానికి కేటాయించిన ‘బల్క్‌ డ్రగ్‌ పార్క్‌’ (బీడీపీ) మనకు ఈ ప్రయోజనాలు అన్నింటినీ కలుగజేయనున్నది. శక్తిమంతమైన పొరుగు రాష్ట్రాలను కాదని కేంద్రం దీనిని మనకు ఇవ్వటం గమనార్హం. అందునా కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీయే కర్ణాటకలోనూ ఉన్నా... దాన్ని పక్కన పెట్టి మన రాష్ట్రానికి ప్రాధాన్యత నివ్వటం హర్షణీయం. 

‘బల్క్‌ డ్రగ్‌ పార్క్‌’ కేటాయించడానికి కేవలం కేంద్ర ఉదారత మాత్రమే కారణం కాదు. ఇప్పటికే ఈ ప్రాంతంలో రోడ్డు, రైలు, నౌకా రవాణా, విద్యుత్తు, నీటి సదుపాయాలు లాంటి మానవ నిర్మిత, సహజ మౌలిక సదుపాయాలు అనేకం ఉన్నాయి. విదేశీ వాణిజ్యానికి కావాల్సిన ఓడరేవులున్న తీరప్రాంతం ఉంది. నైపుణ్య మానవ వనరులు అందించే ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు అనేకం ఉన్నాయి. వీటితోపాటు గోదావరి జిల్లాల్లో విజయ వంతంగా నడుస్తున్న పలు రకాల పరిశ్రమలు ఉన్నాయి. ముఖ్యంగా బల్క్‌ డ్రగ్స్‌కు కావాల్సిన అనేక రకాల రసాయనాలు, ఇతర ముడి పదార్థాలు సరఫరా చేయగల సామర్థ్యం ఉన్న సంస్థలు అనేకం ఉన్నాయి. ఇటీవల నూతనంగా సామర్లకోటలో ఆదిత్య బిర్లా గ్రూపు నెలకొల్పిన ‘ఆల్కలీ’ పరిశ్రమ కూడా రాబోవు పార్క్‌ అవసరాలను మరింతగా తీర్చగలదు. 

ఫార్మా రాజధానిగా పేరుగాంచిన హైదరాబాదులో ఎన్నో ఫార్మా కంపెనీలను సృష్టించి అంతరించిన ఐడీపీఎల్‌ ఉండేది. దానికి అవసరమైన సమస్త రసాయనాలు, ఆమ్లాలు, వాయు వులు అనేకం తణుకు, కొవ్వూరు, సగ్గొండ ఫ్యాక్టరీల నుండి సప్లై అవుతుండేవి. వ్యవసాయాధార చక్కెర కర్మాగారాలు రైతు శ్రేయస్సు కొరకు తణుకు, చాగల్లు, ఉయ్యూరు లాంటి చోట్ల నెలకొని ఉన్నాయి. ఆ కర్మాగారాలలో చక్కెరతో పాటు మొలాసిస్‌ వస్తుంది. దాని నుండి ఆల్కహాల్, ఇతర ఆర్గానిక్‌ రసాయనాలు తయారు చేస్తారు. అవి బల్క్‌ డ్రగ్స్‌ తయారీలో వాడతారు. వీటి కారణం గానే ఇప్పటికే తణుకులో ఆస్ప్రిన్, సాలిసిలిక్‌ యాసిడ్‌ తయారీ జరుగుతోంది. అంతరిక్ష నౌకల్లో వాడే రాకెట్‌ లిక్విడ్‌ ఇంధనం కూడా తణుకులోనే తయారవడానికి ఈ రసాయనాల లభ్యత ముఖ్య కారణం. తూర్పుగోదావరి జిల్లాలో రాబోయే ఈ బీడీపీలోని సంస్థలకు ఇవన్నీ అమర్చి పెట్టినట్లు అందుబాటులో ఉంటాయి. ఈ పార్క్‌ కేటాయింపులో వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ఉంటారు.

ఈ పార్క్‌లో ఫార్ములేషన్, ప్యాకింగ్, టెస్టింగ్‌ లాబ్స్, రవాణా, ఫైనాన్స్‌ లాంటి అనుబంధ సంస్థలు వస్తాయి. అందువల్ల మరిన్ని ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. కాలుష్య నివారణ, నియంత్రణ, పారిశ్రామిక భద్రత, సామాజిక బాధ్యత వంటి విషయాల్లో ఎలాంటి రాజీ పడని సీఎం నేతృత్వంలో.. రాష్ట్రం పారిశ్రామిక వృద్ధిలో అగ్రస్థానంలో నిలుస్తుందని ఆశిద్దాం. (క్లిక్: శాస్త్ర జ్ఞానాభివృద్ధే దేశానికి ఊపిరి)


- బి. లలితానంద ప్రసాద్‌ 
కార్పొరేట్‌ వ్యవహారాల నిపుణులు

మరిన్ని వార్తలు