తెలుగుదేశం విలాపం

26 Nov, 2021 01:50 IST|Sakshi

నారా చంద్రబాబు నాయుడు గార్కి–

‘విధిరహో బలవానితి మేమతిః’ ఎంతటివారయినా విధిచేతికి చిక్కి అనుభవించాల్సిందే. మొన్న మీ ఏడుపు చూశాక ఈ ఉత్తరం రాయాల నిపించింది. ఆరోజు మా వ్యవస్థాపక అధ్యక్షుడు నీవల్ల దుఃఖించిన సంఘటన గుర్తుకు వచ్చింది. నాతో పాటు యావదాంధ్ర జాతికీ గుర్తొచ్చి వుంటుంది. ‘సుకృతం దుష్కృతం చైవ గచ్ఛంత్యను గచ్ఛంతి.’ ఇది కూడా భర్తృహరి లాంటి పెద్దలే చెప్పారు. చేసిన పాపాలు వెంట తరుముతూ ఉంటే, మీడియా సాయంతో కట్టుకున్న అబద్ధాల కోట కూలిపోయే దృశ్యం ఆనందంగా చూశాను. నువ్వు చేసిన కర్మలే నిన్ను వెన్నంటి వస్తాయి అని భగవద్గీత కూడా చెప్పింది.

ఎటువంటి పార్టీని నేను, ఎలాంటి స్థితికి చేరుకున్నాను! చెడ్డవాడి చేతి ధనంలాగా నీ చేతిలో పడి ఎంత పతన మయ్యాను! ఎన్టీఆర్‌ దగ్గర నా వైభవం ఆకాశానికి ఎగసింది. హరివిల్లు సప్తరంగులను ఒకే పసుపురంగుగా మార్చుకుంది. దేశమంతా తిరిగాను. ఎక్కడికెళ్ళినా జేజేలు అందుకున్నాను.

1982 మార్చి 29న నా జననం జరిగింది. నాకు రూప మిచ్చిన నా తండ్రి, గురువు ఎన్టీఆర్‌ 35 సంవత్సరాలు సినిమా నటుడిగా అఖండ ప్రజాభిమానాన్ని పొంది, పురాణ పురు షుడిగా తెలుగువారి గుండెల్లో గుడికట్టుకున్న మహానటుడు. రాజకీయాలు తెలియకపోయినా పేదప్రజల ఆకలి ఆర్తనా దాలు, అసమానతలు తెలుసు కనుక రెండు రూపాయలకే కిలోబియ్యం, పది రూపాయలకే చీర– ధోవతి, బడుగు వర్గాలకు పక్కా ఇళ్ల పథకం వంటివి అందించి అందరికీ అన్నగా నిలబడిపోయారు. పేదవాని ముంగిట అన్నంగిన్నెగా మారిపోయారు. 

35 సంవత్సరాల కాంగ్రెస్‌ కోటను బీటలు పర్చి, 9 నెలల్లోనే అధికారాన్ని అందిపుచ్చుకున్నారు. ఆంధ్రదేశమే కాదు, భారతావనిలో, ప్రపంచంలో ఉన్న తెలుగువాళ్లంతా నాపేరు విని పులకరించారు. ఈ జాతికో దిక్సూచి దొరికిందని, రాష్ట్రంలోనే కాక కాంగ్రెసుకు వ్యతిరేకంగా దేశంలోని అన్ని ప్రాంతీయ పార్టీలు ఏకమయ్యాయి. నేషనల్‌ ఫ్రంటుగా ఏర్పడి మా నాయకుడి ఆధ్వర్యంలో నన్ను ముందుపెట్టుకుని పోరాటం సాగించాయి. 

అబ్బో ఆనాటి వైభవం ఏం చెప్పను. ఒక నోరు సరిపోతుందా? వీపీ సింగ్, లాలూప్రసాద్‌ యాదవ్, రామకృష్ణ హెగ్డే, బొమ్మయ్, బిజూ పట్నాయక్, దేవీలాల్, కమ్యూనిస్టు కురువృద్ధుడు సూర్జీత్‌ సింగ్, ప్రఫుల్లకుమార్‌ మహంతా, కరుణానిధి లాంటి అతిరథ మహారథులందరూ మా నాయ కుడికి నమస్కారాలు పెడుతుంటే ఈ కళ్ళతోనే చూసి ఆనంద బాష్పాలు రాల్చాను. ఈ నాయకులంతా ఎందుకు ఎన్టీఆర్‌ వెనకే నడిచారు? అది ఆయన వ్యక్తిత్వం, ఇచ్చినమాట మీద నిలబడే గుణం, విశ్వసనీయత, అవినీతి రాహిత్యం, నమ్మిన సిద్ధాంతం కోసం ఎంత దూరమైనా వెళ్లగల గుండె ధైర్యం, ఇవే ఆయన్ని జాతీయ నాయకుడిని చేశాయి.

అవన్నీ కళ్ళముందే కరిగిపోయి ‘ఈన గాసి నక్కల పాలయినట్లు’  వెన్నుపోటుదారుడు, కుట్రదారుడు, విలువలు లేనివ్యక్తి, అవినీతి స్వార్థ పరత్వమే అడ్రసుగా కలిగిన నీ చేతుల్లో పడి దుష్టుడికి చిక్కి భ్రష్టత చెందిన సాధ్విలా ఎటువంటి పతనావస్థకు చేరుకున్నాను! నా రాజ్యాంగంలో శాశ్వత అధ్యక్షుడిగా చెక్కబడిన ఆ శిలాక్షరాలపై దాడి చేశావు, కత్తులతో పొడిచి వాటిని లాగేశావు, అవమానాల అగ్నిలో వేసి కాల్చావు. 74 ఏళ్ళ వయసులో, అనారోగ్యంతో ఉండికూడా రాష్ట్రమంతా తిరిగి సాధించుకున్న ముఖ్యమంత్రి పదవిని చెప్పులేసి రోడ్డు పాల్జేశావు.

బ్యాంకు ఖాతాను కూడా స్తంభిం పజేసి చివరకు ప్రాణాలు తీశావు. ఆనాడు ఆయన మరణాన్ని కన్నీళ్ళతో చూస్తుండిపోయాను. అక్రమంగా బలవంతంగా నా మెళ్ళో తాళి కట్టి నీకు బానిసగా మార్చుకున్నావు. నన్ను అడ్డం పెట్టుకుని నువ్వు సాగించిన అరాచకాలు ఎన్నని చెప్పగలను. ఒక పెద్ద గ్రంథమే అవుతుంది. నా శరీరాన్ని, మనస్సును, ఆత్మను దిగజారుస్తూ నువ్వు ఎదిగావు. నేను మాత్రం రోజురోజుకు పాతాళానికి జారిపోతూనే ఉన్నా.

1982లో జరిగిన ఎన్నికల్లో 200 సీట్లు, 43 శాతం ఓట్లు; 1984లో జరిగిన ఎన్నికల్లో 202 సీట్లు, అంతే ఓట్ల శాతం. ఇంకా పెరిగినయ్యేమో గుర్తులేదు. 1989లో నీవల్లనే ఓడి పోయినా ఏ మాత్రం తగ్గని ఓటింగు. వెంటనే 1991లో వచ్చిన పార్లమెంటు ఎన్నికల్లో రాజీవ్‌గాంధీ మరణం ముందు వరకు జరిగిన పోల్‌ నేనే సొంతం చేసుకున్నా. తరువాత సాను భూతితో కాంగ్రెసుకు పోయాయి. 1994 ఎన్నికల్లో 222 సీట్లు, 36 మిత్రపక్షాలకు వెరసి 258 సీట్లతో 51 శాతం ఓట్లతో రికార్డు తిరగరాశాను. అజేయమైన శక్తిగా నిలబడ్డాను. అదీ మా నాయకుడి సత్తా. మరి ఇప్పుడో!

ఒక్కసారి కొన్ని నా చరిత్ర పుటలు తిరగేయ్‌. నువ్వేంటో, నీ బతుకేంటో తెలుస్తుంది. 40 సంవత్సరాల పుట్టుక నాది. ఎంతోమంది నాయకుల్ని తయారు చేశాను. దేశంలోని మిగిలిన ప్రాంతీయ పార్టీలకు పెద్దన్నగా నిలిచాను. లక్షలాది మంది సభ్యులు కలిగినదాన్ని. కోట్లాది రూపాయల ఫండ్‌. నెలకు దానిమీద వచ్చే వడ్డీయే 3 కోట్ల రూపాయలు ఉంటుందంటే ఎంత ఆర్థిక పరిపుష్టి ఉన్నదాన్ని! ప్రతి జిల్లాలో సొంత భవనాలు– కొన్ని మండలాల్లో కూడా. నువ్వేమైనా తక్కువ వాడివా. 1978లోనే మంత్రిగా చేశావు. 8  సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా, మూడుసార్లు ముఖ్యమంత్రిగా వెలగ బెట్టావు కదా.

ప్రధానమంత్రుల్ని నువ్వే పెట్టానన్నావు. దేశ రాజకీయాలు నీ కనుసన్నల్లో నడిచాయని చెప్పావు. నువ్వు చెప్పుకునే సొంత డబ్బాలో ప్రపంచ మేధావివి. అపర చాణక్యుడివి. హైటెక్‌ నిర్మాతవు. అబ్బో చాలా చెప్పుకుంటావులే. ఇక సింబలా? సామాన్యుడి చేతి చక్రాయుధం లాంటి సైకిలు. ఓటర్లా – రాష్ట్రంలోనే 60 శాతానికి మించి ఉన్న బీసీ గణాలు. సొంత కులం అండ. ఒక పది దాకా కుల మీడియా వ్యవస్థలు నిన్నెప్పుడూ పొగుడుతూనే ఉంటాయి. మరోపక్క న్యాయ వ్యవస్థ. ఇన్ని కొమ్ముకాస్తుంటే ఇంత స్థాయిలో ఎలా ఓడి పోయావు?

అసలు 2014 ఎన్నికల్లోనే ఓడిపోవాల్సింది. మోదీ జోడుతో పవన్‌ కల్యాణ్‌ గాలితో ఎలాగో చావుతప్పి కన్ను లొట్టబోయి బయటపడ్డావు. ఇక 2019 ఎన్నికల్లో నీ ఐదు సంవత్సరాల ముదనష్టపు పాలనకు విసిగిపోయిన జనం నిన్ను ఫుట్‌బాల్‌ను తన్నినట్టు తన్నారు. వైకాపాకు 49.95 శాతం ఓట్లు, 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలు. మరి నాకో 39.18 శాతం ఓట్లు అంటే 10 శాతం తక్కువతో ఓడిపోయాను. 2014లోనే పోయుంటే బాగుండేది. ఈ ప్రజలకు నీ కష్టాలు తప్పేవి.

పోనీ రెండున్నర సంవత్సరాల తర్వాతైనా నువ్వు పుంజు కుంటావనుకుంటే మొన్న జరిగిన స్థానిక ఎన్నికల్లో వైకాపాకు 52.6 శాతం. నాకేమో 30.7 శాతం. ఇదీ నా దురవస్థ. చివరకు 40 ఏళ్ల నుండి దొంగ ఓట్లతో గెలుస్తున్న నీ సొంత నియోజక వర్గం కుప్పం జనాలు కూడా తరిమేశారు. ఈనాటికి కదా నా నాయకుడికి ఆత్మశాంతి.
ఒకనాడు పేద వర్గాలకు అమ్మలాగా, అక్కలాగా అండగా నిలబడ్డాను. ఈరోజు నా పార్టీలోకి ఎవరెవరో సూట్లుబూట్లు వేసుకుని వస్తున్నారు.

అసలు కార్యకర్తలు కనుచూపు దూరంలో లేరు. విలువలు, సిద్ధాంతాలు, సంక్షేమ పథకాలు ఎప్పుడో అటకెక్కాయి. ఇప్పుడంతా కార్పొరేట్‌ వ్యక్తులు, అవినీతి సొమ్ముకు బినామీలు, బ్యాంకుల లూటీదార్లు, సారా కాంట్రాక్టర్లు, కాల్‌మనీవాళ్లు... ఛీ..ఛీ.. నా బ్రతుకిలా అయి పోయింది. నావాళ్లనుకున్న వాళ్లను దూరం చేశావు. ఇంకా ఏం మిగిలిందని?

చివరకు నా పతనానికి పరాకాష్టగా– ఏ కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా నా తండ్రి నన్ను పుట్టించాడో ఆ కాంగ్రెస్‌ వాళ్ల కాళ్ల దగ్గర పడేశావు కదా. ఆ రోజే నేను కూడా పూర్తిగా చచ్చిపోయాను. పవిత్ర గంగలాంటి నన్ను మురికిగుంటగా మార్చావు.

ఇక ఈ బాధలు నాకొద్దు. ఈ హీన జీవితం గడపలేను. నన్ను ప్రేమతో సృష్టించి, గౌరవించి, దేశ స్థాయిలోనే ఉన్న తంగా నిలబెట్టిన నా తండ్రి దగ్గరకే పోతున్నా. ఇంకా నన్నేదో ఉద్ధరిద్ధామనుకోకు. ఈ శరీరంలో రక్తమాంసాలు ఇంకిపోయి నాయి. ఆత్మ, మనస్సు చచ్చిపోయాయి. శరీరం చిక్కి శల్యా వస్థకు చేరుకుంది. ఇక రాసే ఓపిక కూడా లేదు. సెలవు. 
జన్మలో నీ ముఖం చూడను.

ఇట్లు
తెలుగుదేశం పార్టీ 

మరిన్ని వార్తలు