ఉద్యమ వారసత్వమే ఊపిరి

14 Aug, 2022 00:41 IST|Sakshi

ప్రపంచ చరిత్రలో భారతీయ జాతీయోద్యమం, దాన్ని నిర్వహించిన నాయకత్వం, వారు అనుసరించిన ఎత్తుగడలు, నిర్వహించిన కార్యక్రమాలు అపూర్వమైనవి. వలస పాలనలో కుంగి, కృశించిన సామాన్య ప్రజానీకం ఉద్యమ నాయకత్వం ఇచ్చిన ప్రతి పిలుపునకూ స్పందించిన తీరు దానికి ఓ ముఖ్యమైన పార్శ్వం. అలనాటి జాతీయోద్యమ ప్రధాన వారసత్వం –  దేశ సమైక్యత, మతసహనం, భిన్న సంస్కృతుల మధ్య సయోధ్య. జాతీయోద్యమ వారసత్వంలో చెప్పుకోదగిన మరో అంశం – రాజకీయ స్వాతంత్య్రంతో పాటు పౌరహక్కులు. ఇటీవలి కాలంలో ఇవన్నీ ఒత్తిళ్లకు గురవుతున్నాయి. దీన్ని సరిదిద్దాలి. ఆర్థిక ప్రయోగాలతో పాటు లౌకిక సమాజ నిర్మాణం, స్వతంత్ర విదేశాంగ విధానం నేటి అవసరం. స్వాతంత్య్ర అమృతోత్సవ వేళ ఇదే మన లక్ష్యం కావాలి.

► ఒక దేశ చరిత్రలో 75 ఏళ్ళు గణింపదగ్గ కాలమే! ఇదొక ఉద్విగ్నభరిత సన్నివేశం. మన స్థితిగతులు, దేశ పరిస్థితులు ఎలా ఉన్నా, వాటిని పక్కనబెట్టి, సంబరాలు చేసుకోవలసిన సమయం. అదేక్రమంలో మనం అనుభవిస్తున్న స్వాతంత్య్రం వెనుక ఒక సుదీర్ఘ పోరాటం దాని ఆశయాలు, ఆకాంక్షలు ఉన్నాయి. ప్రపంచ చరిత్రలోనే భారతీయ జాతీయోద్యమం, దాన్ని నిర్వహించిన నాయకత్వం, వారు అనుసరించిన ఎత్తుగడలు, నిర్వహించిన కార్యక్రమాలు అపూర్వమైనవి. అవి అందరి ప్రశంసలూ అందుకొన్నాయి. నాయకత్వం రూపొందించిన కార్యక్రమాలు, నిర్వహించిన ఉద్యమాలు, అనుసరించిన ఎత్తుగడలు ఒక పార్శ్వం.

► కాగా, మరొకవైపు వలస పాలనలో కుంగి, కృశించి, దినదిన గండంగా కాలం వెళ్ళదీస్తున్న సామాన్య ప్రజానీకం – అక్షరం ముక్క తెలియని గ్రామీణ ప్రజలు – ఉద్యమ నాయకత్వం ఇచ్చిన ప్రతి పిలుపుకూ స్పందించిన తీరు మరో ముఖ్య పార్శ్వం. బెంగాల్‌ విభజన, సహాయ నిరాకరణోద్యమం, బార్డోలీ రైతు సత్యాగ్రహం, క్విట్‌ ఇండియా – ఇలా అన్ని దశల్లోనూ, అన్ని పోరాటాల్లోనూ పురుషులతో పాటు స్త్రీలూ పాల్గొని ఉద్యమాలను నడిపించారు. పోరాటాలు, త్యాగాలు ఎందుకోసం? ఉజ్వల భవిష్యత్తు కోసం! స్వతంత్ర జాతిగా ఆత్మ గౌరవంతో బతకడం కోసం! రానున్న భవిష్యత్తు తరాలకు బంగారు బాటలు వేయడం కోసం! 

► జాతీయోద్యమ వారసత్వం ఏమిటి? ఆ వారసత్వానికి నేడు ప్రాసంగికత (రిలవెన్స్‌) ఉందా? ఆంగ్లపాలనకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాల్లో ముఖ్యంగా, ప్రధానంగా చెప్పుకోవాల్సింది 1857 తిరుగుబాటు. చరిత్రకారులు వర్ణించినట్లు... ఇది ‘ఫస్ట్‌ వార్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఇండిపెండెన్స్‌’. ప్రథమ భారత స్వాతంత్య్ర సంగ్రామం. జాతీయతాభావం ఎక్కడో మసక మసకగా అంతర్లీనంగా ఉన్నా, ఇది ప్రధానంగా ఆంగ్లపాలనకు వ్యతిరేకంగా జరిగిన చరిత్రాత్మక తిరుగుబాటు. హిందూ, ముస్లిం మత విభేదాలు లేకుండా, కలసికట్టుగా, అనేక సందర్భాల్లో సామాన్య ప్రజానీకంతో కలిసి జరిపిన సైనిక తిరుగుబాటు. ఇది ఫలవంతం కాకున్నా మనకు మిగిల్చిన వారసత్వం – ఆంగ్ల పాలనకు వ్యతిరేకత, స్వతంత్రత, వీటిని మించి హిందూ–ముస్లిం ఐక్యత! జాతీయోద్యమంలో ఈ ధార దాదాపు 1940వ దశకం దాకా కొనసాగింది.

► రవీంద్రుని ‘జనగణమన’ గీతం, బంకించంద్రుని ‘వందేమాతరం’, ఇక్బాల్‌ గేయం ‘సారే జహాసే అచ్ఛా’ – ఇవి దేశ నైసర్గిక, ప్రజా సముదాయాలను ఉద్దేశించి రాసినవే! ఈ సమైక్యతను దెబ్బతీయడానికి విదేశీ పాలకులు ‘ద్విజాతి’ సిద్ధాంతాన్ని ప్రతిపాదించి, ప్రోది చేశారు. జాతీయోద్యమ ప్రధాన వారసత్వం –  దేశ సమైక్యత, మతసహనం, భిన్న సంస్కృతుల మధ్య సయోధ్య. జాతీయోద్యమ క్రమంలో పౌరహక్కులను, ప్రజాస్వామిక భావాలను, పార్లమెంటరీ వ్యవస్థను నిర్ద్వంద్వంగా బలపరిచి, పదిలపరచి, భారత రాజ్యాంగంలో పొందుపరచగలిగిందీ జాతీయోద్యమ వారసత్వమే!

► జాతీయోద్యమం కేవలం రాజకీయ స్వాతంత్య్రం, వ్యక్తిపర ప్రాథమిక హక్కుల కోసమే పాటుపడలేదు. ఆర్థికాభివృద్ధి వైపు దృష్టి సారించింది. ఆంగ్లపాలన... ఒకవైపు తాను పారిశ్రామికంగా బలపడుతూ, మరో పార్శ్వంలో భారతదేశ ఆర్థిక వ్యవస్థను తమ దేశ ఆర్థిక పురోభివృద్ధికి ఉపయోగించుకుంది. ఈ అంశాన్ని ‘సంపద తరలింపు’గా  సిద్ధాంతీకరించాడు దాదాభాయ్‌ నౌరోజీ. జాతీయ నాయకత్వం దీన్ని గ్రహించి, అది భారతీయ ఆర్థిక వ్యవస్థకు చేస్తున్న కీడును ప్రజలకు ఎరుకపరిచింది. వాస్తవంలో వలసపాలన ఆర్థికదోపిడీని బట్టబయలు చేసింది తొలితరం జాతీయోద్యమ నాయకులే! ఆధునిక యంత్ర పరిశ్రమల ప్రాధాన్యాన్ని గుర్తించి, అవి రాజ్య(స్టేట్‌) పరిధిలో ఉండి ప్రజల అభ్యున్నతికి తోడ్పడాలని ఉద్ఘాటించారు.

► జాతీయోద్యమం ప్రారంభదశ నుండి పౌరహక్కుల సంరక్షణ కోసం పోరాడుతూ వచ్చింది. లోకమాన్య తిలక్‌ నిర్వహించిన ఆంగ్ల వ్యతిరేక సమీకరణలు (మహారాష్ట్రలో), ఆ తర్వాత జరిగిన విదేశీ వస్తు బహిష్కరణ, సహాయ నిరాకరణ ఉద్యమాలు భారతీయుల్లో దేశభక్తి, స్వేచ్ఛ, స్వాతంత్య్రాలను ప్రోదిచేశాయి. పౌరహక్కుల పరిరక్షణకు వాక్, పత్రికా స్వాతంత్య్రాలు జాతీయోద్యమంలో ప్రధాన భాగాలు. గాంధీజీ మాటల్లో, ‘‘సివిల్‌ లిబర్టీ... ఈజ్‌ ద ఫస్ట్‌ స్టెప్‌ టువార్డ్స్‌ స్వరాజ్‌. ఇటీజ్‌ వాటర్‌ ఆఫ్‌ లైఫ్‌. ఐ హ్యావ్‌ నెవర్‌ హర్డ్‌ ఆఫ్‌ వాటర్‌ బీయింగ్‌ డైల్యూటెడ్‌.’’

► జాతీయోద్యమమనేది ప్రారంభంలో సమాజంలోని శిష్టులకే (ఎలైట్స్‌కే) పరిమితమైనా, ఆ తర్వాత సహాయ నిరాకరణ ఉద్యమానికి (1920–21) పూర్వమే విస్తృత ప్రజాపోరాటంగా రూపుదిద్దుకుంది. సహాయ నిరాకరణ, గ్రామ పునర్నిర్మాణం, మద్యపాన నిషేధం, కుటీర పరిశ్రమల పెంపుదల – ఇవన్నీ మహాత్ముడు ఆరంభించిన ప్రజా కార్యక్రమాలు. ఇవి సామాన్య ప్రజానీకాన్ని – స్త్రీ, పురుషులను ఉద్యమ భాగస్వాములుగా చేశాయి. ఈ ధోరణి ‘క్విట్‌ ఇండియా’ ఉద్యమం (1942)తో పరాకాష్ఠకు చేరుకొంది. ఉద్యమాలు నాయకులు ప్రారంభించినా, వాటిని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళిందీ, ఊపిరులూదిందీ సామాన్య ప్రజానీకమే! జాతీయోద్యమ వారసత్వంలో గ్రహించాల్సిన ప్రధాన అంశం ఇదే! దీనికి ప్రబల ఉదాహరణ – సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ నిర్వహించిన ‘బార్డోలీ రైతు సత్యాగ్రహం’. పటేల్‌ పిలుపునందుకొని లక్షలాది స్త్రీ, పురుషులు, రైతులు ఉద్యమాన్ని విజయవంతం చేశారు. ప్రజలే ఉద్యమానికి ఊపిరులు!

► జాతీయోద్యమ వారసత్వంలో ప్రధానంగా చెప్పుకోదగింది – రాజకీయ స్వాతంత్య్రంతో పాటు పౌరహక్కులు. ఇటీవలి కాలంలో ఇవి ఒత్తిళ్లకు గురవుతున్నాయి. ప్రజాఉద్యమాలు, వార్తాసాధనాలు వీటిని కాపాడుకొంటూ వస్తున్నాయి. జాతీయోద్యమ స్వప్నం భావితరాలకు అందించిన సందేశం, చూపిన దారి ఏమిటి? ఉద్యమ ఆశయాలు, కన్న కలలు, రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులుగా పొందుపరచబడ్డాయి. ఇవి చట్టపరమైనహక్కులు. వీటికి భంగం కలగకూడదు. కానీ, ఇవి ఇటీవలి కాలంలో ప్రశ్నార్థకమవుతున్నాయి. కాగా రాజ్యాంగంలో మరో ముఖ్య అధికరణం – రాజ్యం అనుసరించదగ్గ ‘ఆదేశిక సూత్రాలు’(ప్రిన్సిపుల్స్‌ ఆఫ్‌ స్టేట్‌ పాలసీ). ప్రజా శ్రేయస్సుపరంగా ఆచరింపదగ్గవి. అయితే, ఇవి ఆశించే ఫలితాలు చేకూరతాయా? ఈ ప్రశ్నకు సమాధానం – విశాల భారతీయ సమాజం స్పందించి, చేపట్టే కార్యాచరణపై ఆధారపడి ఉంటుంది.

► జాతీయోద్యమ వారసత్వం... ప్రజాశ్రేయస్సు – పేద వర్గాల అభ్యున్నతి, శాస్త్రీయ విజ్ఞానసమాజ నిర్మాణం, పౌరహక్కులు, చట్టం ముందు అందరూ సమానం! వీటిని సాధించే క్రమంలో ఆర్థిక ప్రయోగాలతో పాటు లౌకిక సమాజ నిర్మాణం, స్వతంత్ర విదేశాంగ విధానం అవలంబించడం నేటి అవసరం. భారతీయ సంస్కృతిని ‘భిన్నత్వంలో ఏకత్వం’గా చెప్పుకుంటాం. ఇటీవలి కాలంలో దేశంలో వేగంగా మారుతున్న రాజకీయ, ఆర్థిక పరిణామాల దృష్ట్యా... దేశీయతలో ఏకత్వం లోపించి, భిన్నత్వం మరింత వృద్ధి చెందుతోంది. ప్రాంతీయ రాజకీయ పక్షాలు ఆయాప్రాంతాల్లో నెలకొన్న  ప్రత్యేక పరిస్థితుల వల్ల ఉత్పన్నమై, రాజ్యస్వభావంలో మౌలిక మార్పులకు దోహదం చేస్తున్నాయి.

► ఈ పరిణామం భారత దేశీయతకు అడ్డు కాదు. భిన్నత్వంలో ఏకత్వాన్ని గూర్చి పరిగణిస్తూనే, మారుతున్న పరిస్థితుల దృష్ట్యా భిన్నత్వాన్ని గుర్తించి దానికి తగిన చోటును మనం కల్పించుకోవాలి. అలా చేసినప్పుడు భారతదేశ సమైక్యత, జాతీయత మరింతగా వృద్ధి చెందుతాయి. జాతీయోద్యమ బృహత్‌ ప్రణాళికలో లక్ష్యాలైన పేదరిక, నిరక్షరాస్యత నిర్మూలన ఇంకా అపరిష్కృత సమస్యలుగానే ఉండిపోయాయి. నిజానికి ఇవే మన దేశీయతకు భంగం కలిగించే ముఖ్యాంశాలు. వీటిని అధిగమించగలిగితే మనం భారతీయతను సాధించగలం. స్వాతంత్య్ర అమృతోత్సవ వేళ ఇదే మన లక్ష్యంగా ఉండాలి.

డా‘‘ వకుళాభరణం రామకృష్ణ
వ్యాసకర్త చరిత్ర పరిశోధకులు, ఆచార్యులు

మరిన్ని వార్తలు