భూ రికార్డుల ప్రక్షాళన ఎప్పుడు?

11 May, 2022 12:56 IST|Sakshi

తెలంగాణతో భూమి అంశం తరతరాలుగా మమేకమైంది. వ్యవస్థ మార్పునకు, భౌగోళిక మార్పునకు ఇక్కడ  భూమి కూడా కీలక కారణమైంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత భూ సమస్య పరిష్కారమవుతుందేమోనని ఎనిమిదేళ్ళుగా ఎదురు చూస్తున్నా, అది ఇప్పటికీ సాకారం కావడం లేదు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ భూముల విషయంలో సమూల ప్రక్షాళనకు కొత్త రెవెన్యూ చట్టం తీసుకురావడం, ‘ధరణి’ విధానాన్ని ప్రవేశపెట్టడం వంటి చర్యలు తీసుకున్నారు. కానీ వాటిల్లో లొసుగుల పరిష్కారానికి ప్రభుత్వం ఆసక్తి చూపకపోవడంతో సమస్యలు జటిలమవుతున్నాయి. ముఖ్యంగా ‘ధరణి పోర్టల్‌’లో చేతులు మారిన భూములకు సంబంధించిన పట్టాదారుల పేర్లు మారకపోవడం, మోకాపై ఉన్న వారి పేరు లేక పోవడం సమస్యలకు కారణమవుతోంది. అన్నిటికీ మించి ఎప్పటి నుండో పెండింగ్‌లో ఉన్న భూ రికార్డుల ప్రక్షాళన ప్రక్రియకు మూలమైన భూ సర్వే ఇంకా చేపట్టకపోవడంతో ఇబ్బందులు తలెత్తు తున్నాయి. ఏడాదిలో డిజిటల్‌ భూ సర్వే చేసి, అక్షాంశాలు, రేఖాంశాల వారీగా వివాదాలకు తావు లేకుండా భూముల గుర్తింపు చేస్తామని సీఎం ప్రకటించి ఏళ్ళు గడుస్తున్నా, అది ముందుకు సాగడం లేదు. 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కూడా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రెండింటికీ విడివిడిగానే రెవెన్యూ చట్టాలు, భూ కార్డులున్నప్పటికీ ప్రత్యేక దృష్టి పెట్టలేదు. రికార్డులను సరిచేయడానికి ఉపశమన చర్యలు చేపట్టారు. భూ సమగ్ర సర్వే చేస్తే, భూముల అన్యాక్రాంతం, రికార్డులలో నెలకొన్న లొసుగులు బహిర్గతమయ్యేవి. కానీ అందుకు భిన్నంగా, ఆర్వోఆర్, అసైన్‌మెంట్‌ చట్టం, దేవాదాయ, వక్ఫ్‌ భూములకు కొత్త చట్టాలు వచ్చాయి. ఈ చట్టాలు ఎన్ని వచ్చినా అవి ప్రచారానికే పరిమితమైనాయి. కానీ క్షేత్రస్థాయిలో మార్పేమీ రాలేదు. 2004 సంవత్సరంలో అసెంబ్లీలో చర్చ జరిపి ఆనాటి మంత్రి కోనేరు రంగారావు నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ క్షేత్రస్థాయిలో పర్యటించి అనుభవపూర్వకంగా 104 సిఫారసులు చేసినప్పటికీ అవి బుట్టదాఖలైనాయి. ఈ రకంగా తెలంగాణ భూములు ప్రయోగశాలకు నిలయమైనాయి.

2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. మేధావులు, నిపుణులు, రాజకీయ పార్టీల నాయకులు భూ అంశంపైన అనేక అర్జీలిచ్చినా ప్రభుత్వం పట్టించు కోలేదు. రెవెన్యూ చట్టం అస్తవ్యస్తంగా ఉన్నదని 2020 సెప్టెంబర్‌ 11న కొత్త రెవెన్యూ చట్టాన్ని ఆమోదించారు.  మాన్యువల్‌ రికార్డుల స్థానే ‘ధరణి పోర్టల్‌’ తేవడం ఇందులోని ముఖ్యమైన అంశం. దాని పట్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనాయి. ‘ధరణి పోర్టల్‌’ సాఫ్ట్‌వేర్‌ మాత్రమే అమలుకు తెచ్చారు. దానిని పూర్తిగా నమ్ముకుంటే రైతుల భూ రికార్డులు తారుమారై బజారులో పడతారని చెప్పినప్పటికీ పట్టించుకోలేదు. ధరణి పోర్టల్‌లో నెలకొన్న లొసుగులతో రైతులు తీవ్రమానసిక వ్యధకు గురవుతున్నారు. ప్రతి గ్రామంలో 100 నుండి 200 మంది రైతుల పైబడి భూ రికార్డులు, సర్వే నంబర్‌ హద్దులు అన్యాక్రాంతమై దిక్కుతోచని స్థితిలో కుమిలిపోతున్నారు. తహశీల్దార్‌ కార్యాలయానికి వెళ్తే... జిల్లా కలెక్టర్‌ దగ్గరకి వెళ్లమంటారు. వారికి సమయముండదు. 

రైతుల ఇక్కట్ల నేపథ్యంలో ప్రభుత్వం... సర్వే నెంబర్‌ వారీగా సమగ్ర భూ సర్వే (డిజిటల్‌) విధిగా చేపట్టాలి. సాదా బైనామాలకు  ‘ధరణి పోర్టల్‌’లో ఆప్షన్‌ పెట్టాలి. అపరిష్కృతంగా ‘మీ సేవ’లో పెండింగ్‌ వున్న అర్జీలను వెంటనే పరిష్కరించాలి. గతంలో ‘ధరణి’ వచ్చిన తరువాత తప్పుగా నమోదైన పేర్ల స్థానంలో ఒరిజినల్‌ పట్టాదారుల పేర్లు నమోదు చేయాలి. (చదవండి: కాలం చెల్లిన చట్టాలు ఇంకానా?)

పై అంశాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టి, సవరణలు చేస్తూ చర్యలు చేపట్టగలిగితే సమస్యలు పరిష్కారమవుతాయి. భూ రికార్డులు సరి అవుతాయి. అయితే దీనికి ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవ చూపాల్సి ఉంటుంది. (చదవండి: ‘రెవెన్యూ’కు 250 ఏళ్లు)


- చాడ వెంకటరెడ్డి 
సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి

మరిన్ని వార్తలు