రాయని డైరీ యడియూరప్ప (కర్ణాటక సీఎం)

20 Jun, 2021 08:33 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ.. ఎనిమిది రోజులు ఒకసారి, మూడు రోజులు ఒకసారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ప్రాణానికి సుఖంగా ఉంది! ఈ డెబ్బై ఎనిమిదేళ్ల వయసులోనూ వదులుకోవడానికి నేను ఏమాత్రం  ఇష్టపడని నా తలనొప్పిని ఎలా ఇంకో రెండేళ్లయినా భద్రంగా కాపాడుకోవడం?!
‘‘లాక్‌డౌన్‌లో మీ అబ్బాయి ఏదో చేశాడట కదా, మీరింకా ముఖ్యమంత్రి పదవిలో కొనసాగుతున్నారేమిటీ?!’’ .. అంటారు! అబ్బాయిలు లేకుండా ఉంటారా, ఏదో ఒకటి చేయకుండా ఉంటారా?! 
‘‘ఏం చేశావ్‌ విజయేంద్రా ఈ లాక్‌డౌన్‌లో చెయ్యకూడని పని!’’ అని పిలిచి అడిగాను.
‘‘మీ కోసమే నాన్నగారూ, నంజనగూడు శ్రీకంఠేశ్వర దేవస్థానానికి వెళ్లి ప్రత్యేక పూజలు చేయించాను. ఎక్కువసేపు కూడా ఉండలేదు. ఐదే నిమిషాల్లో తిరిగొచ్చేశా..’’ అన్నాడు. 
‘‘నా కోసం దేవస్థానానికి వెళ్లాలా విజయేంద్రా.. ఇంట్లో దండం పెట్టుకుంటే సరిపోయేదిగా. ఇప్పుడు చూడు. పాలనలో వైఫల్యం అంటున్నారు. పాలన అంటే ఎవరు? నేనే కదా. తండ్రులు కొడుకుల్ని అర్థం చేసుకోగలరు కానీ, కోర్టులు ప్రభుత్వాలను అర్థం చేసుకోలేవు విజయేంద్రా. నీపై కఠిన చర్యలు తీసుకోవాలని జడ్జి అన్నారట’’ అన్నాను. 
‘‘సారీ నాన్నగారూ, ఇక ముందు ఇంట్లోనే దండం పెట్టుకుంటాను’’ అన్నాడు. 
‘సరే వెళ్లు’ అన్నట్లు చూసి, ప్రభులింగకు ఫోన్‌ చేశాను. లైన్‌లోకి వచ్చాడు. 
‘‘ఏం చేద్దాం?’’ అని అడిగాను. 
‘‘ఎవరు మాట్లాడుతున్నది..’’ అన్నాడు!! 
‘‘నేను ఫోన్‌ చేసింది అడ్వకేట్‌ జనరల్‌ ప్రభులింగకు అని నాకు తెలిసినప్పుడు.. మీకు ఫోన్‌ చేసింది కర్ణాటక సీఎం యడియూరప్ప అని మీకెందుకు తెలియడం లేదు!’’ అన్నాను.
‘‘సర్‌.. మీరా! నమస్తే. మీ గొంతు ఎవరిదో గొంతులా ఉంది సర్‌. వెంటనే పోల్చుకోలేక అలా అడిగేశాను’’ అన్నాడు. 
‘‘నా గొంతు గుర్తుపట్టకుండా ఉండటానికి మీకింకా రెండేళ్ల టైమ్‌ ఉంది ప్రభులింగా. పాలనలో వైఫల్యం అని మావాళ్లు అంటున్నా మా పైవాళ్లేమీ నన్ను తీసేయరు. ఇంకో రెండేళ్లు సీఎంగానే ఉంటాను. విజయేంద్రది అంత సీరియస్‌ కేసు కాదనకుంటున్నాను. మీరేమంటారు?’’ అని అడిగాను. 
‘‘నేనూ అదే అన్నాను సర్‌. టెంపుల్‌లో విజయేంద్ర దండం పెట్టుకుంది ఐదే నిమిషాలు అని వాదించాను. చీఫ్‌ జస్టిస్‌ నా మీద సీరియస్‌ అయ్యారు. నెక్ట్స్‌ వాయిదా ఉంది. అప్పుడు మళ్లీ వాదిస్తాను’’ అన్నాడు. 
‘‘వాదించండి’’ అని ఫోన్‌ పెట్టేశాను. పెట్టిన వెంటనే ఎవరిదో కాల్‌. 
శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌!!
‘‘యడియూరప్పాజీ.. విప్లవ్‌దేవ్‌ మీకేమైనా ఫోన్‌ చేశాడా?’’ అన్నాడు. 
విప్లవ్‌దేవ్‌ త్రిపుర ముఖ్యమంత్రి. చౌహాన్‌ మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి. నేను కర్ణాటక ముఖ్యమంత్రి. ఒక బీజేపీ ముఖ్యమంత్రి ఇంకో బీజేపీ ముఖ్యమంత్రికి ఫోన్‌ చేసి మరొక బీజేపీ ముఖ్యమంత్రి గురించి అడగడం గత ఏడేళ్లలో ఇదే మొదటిసారి కావచ్చు.
‘‘విప్లవ్‌దేవ్‌ నాకేమీ ఫోన్‌ చేయలేదు చౌహాన్‌జీ. ఎందుకు అలా అడుగుతున్నారు?’’ అని అడిగాను. 
‘‘ఏం లేదు. ఇంతక్రితం నాతో మాట్లాడుతూ సలహా కోసం మీకు ఫోన్‌ చేయాలని అన్నాడు. అందుకే.. చేశాడా అని అడుగుతున్నాను’’ అన్నాడు. 
‘‘దేనికి సలహా?’’ అని అడిగాను. 
‘‘రాష్ట్రంలో పాలన వైఫల్యం అని మనవాళ్లు అతడిని దిగిపొమ్మంటున్నారట.
మీ రాష్ట్రంలోనూ పాలన వైఫల్యం అని మీవాళ్లు మిమ్మల్ని దిగిపొమ్మంటున్నారు కనుక మీరేదైనా సలహా ఇస్తారని మీకు ఫోన్‌ చేస్తానన్నాడు. మా రాష్ట్రంలోనూ పాలన వైఫల్యం అని నన్ను మావాళ్లు దిగిపొమ్మంటున్నారు కనక అతడికి మీరిచ్చే సలహా నాకూ పనికొస్తుందని మీకు ఫోన్‌ చేశాను’’ అన్నాడు!
- మాధవ్‌ శింగరాజు

మరిన్ని వార్తలు