రాయని డైరీ: రాహుల్‌ గాంధీ (కాంగ్రెస్‌)

18 Oct, 2020 00:41 IST|Sakshi

ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ నా ట్వీట్‌లను చూస్తున్నట్లు లేరు! టీవీలలో కనీసం గంటలోపు, పత్రికల్లో మరికొన్ని గంటల్లోపు నేనేం ట్వీట్‌ చేసిందీ వస్తుంది. వాటిని కూడా ఆయన చూడటం మానేసి ఉండాలి. లేకుంటే అంత ప్రశాంతంగా ఉండరు. ప్రశాంతత సహజమైనదై ఉండాలి. యోగా చేసి కానీ, దీర్ఘంగా శ్వాస తీసుకుంటూ గానీ తెప్పించుకున్నది కాకూడదు. 

మోదీకి దేశం పట్టడం లేదు. దేశ ప్రజలు పట్టడం లేదు. మరి ఏం పడుతున్నట్లు?! అది తెలియడం లేదు. ఆలోచిస్తే ఒక భ్రాంతిలా అనిపిస్తుంది. తెల్లగడ్డం, తెల్ల మీసాలు, తెల్ల జుట్టుతో కళ్లద్దాలు పెట్టుకుని తరచు కనిపిస్తుండే ఈ మనిషికి, భారతదేశానికి ఏమిటి సంబంధం అనే భావన నిత్యం నా మదిలో కదలాడుతూ ఉంటుంది. ఆ చెయ్యి ఎత్తడం ఎవరికో తెలియదు. ఆ చిరునవ్వు దేనికో తెలియదు. ఎవరి వైపు చూస్తూ మాట్లాడుతున్నారో తెలియదు. ఏం మాట్లాడారో కూడా తెలియదు. అదేమీ తెలుసుకోవాలన్నంత సంగతి అయి ఉండదు కానీ, ఎందుకు మాట్లాడారో అదైతే తెలుసుకోవాలన్న తీరని వేదన ఒకటి దేశ పౌరులకు కలిగించి స్టేజ్‌ దిగి వెళ్లిపోతారు. ఆరేళ్లుగా ప్రజలకు, ప్రతి పక్షాలకు అంతుచిక్కని విధంగా దేశాన్ని పరిపాలిస్తున్న మనిషిలోని కోణాలలో కనీసం ఒకదాన్నైనా పట్టుకోలేక పోవడం అన్నది ఒక ఘోరమైన ప్రజాస్వామ్య వైఫల్యం కాక, ఒక తప్పిదంగా నాకు అనిపిస్తుంటుంది.

ఇండియా కంటే వెనుక ఉన్న బంగ్లాదేశ్‌ అకస్మాత్తుగా ఇండియా కంటే ముందు వెళుతున్నప్పుడు ప్రధానికి సందేహం రావాలి. వచ్చి, తన ఆర్థిక మంత్రికి ఫోన్‌ చేసి, ‘ఇలా ఎందుకవుతోంది!’ అని అడగాలి. పేదల ఆకలి తీర్చలేకపోతున్న దేశంగా గ్లోబల్‌ హంగర్‌ ఇండెక్స్‌లో ఇండియా ముందు వరుసలో ఉన్నప్పుడైనా సందేహం రావాలి. వచ్చి, తన ఆహార భద్రత మంత్రిని పిలిపించుకుని అడగాలి. సరిహద్దుల్లో చైనా యుద్ధ సామగ్రిని సిద్ధం చేసుకుంటున్నప్పుడు, సిద్ధం చేసుకోవడానికి ముందే సందేహం రావాలి. వచ్చి, అదేమిటని విదేశాంగ మంత్రిని పిలిచి అడగాలి. మోదీ ఇవేమీ అడగరు! 

టీవీ చూడకుండా, పేపర్లు చదవకుండా, మంత్రులకు ఫోన్‌ చేయకుండా ఉన్నా కూడా దేశంలో లోపల ఏం జరుగుతోంది, వెలుపల నుంచి ఏం జరగబోతోందీ మోదీకి చెప్పడానికి నేను ఎప్పుడూ సిద్ధంగా ఉంటాను. నా ట్వీట్‌లు ఉంటాయి. కానీ మోదీ వాటిని కూడా పట్టించుకోరు. తను వాకింగ్‌కి వెళితే ప్రజల ఆరోగ్యం మెరుగవుతుందని అనుకుంటారు. తన ప్రసంగం వింటే ప్రజలకు మానసిక ప్రశాంతత చేకూరుతుంది అనుకుంటారు!

చైనా పాలిటిక్స్‌ని కొన్నాళ్లుగా నేను బాగా స్టడీ చేస్తున్నాను. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ వేస్తున్న ఒక్కో స్టెప్పూ నాకు అర్థమౌతోంది. నా అంచనా ప్రకారం నేడో రేపో చైనా నుంచి ఒక బాంబు వచ్చి ఇండియాలో పడుతుంది. అయితే జిన్‌పింగ్‌ టార్గెట్‌ ఇండియా కాదు. తన దేశంలో తను విప్లవనేత మావో అంతటి వాడవడం! మావో అంతటి వ్యక్తి అవడానికి మావో అంతటి వ్యక్తి కాగల వ్యక్తి ఒకరు ఉన్నారని తన దేశ ప్రజలకు తెలియాలి.  మావోని చైనా ‘చైర్మన్‌’ అని పిలిచినట్లుగా తననీ ‘చైర్మన్‌’ అని పిలిపించుకోవాలి. అందుకే ఎవరో ఒకరిపై ఏదో ఒకటి వేయడం. త్వరలో వాళ్ల పార్టీ సెంట్రల్‌ కమిటీ మీటింగ్‌ ఉంది. నేననుకోవడం ఆ మీటింగ్‌కి ముందే ఇండియాపై బాంబు పడుతుంది. ఆ వెంటనే జరిగే మీటింగ్‌లో కొత్త మార్పులు చేసి అతడు చైర్మన్‌ అయిపోతాడు. చైనాకు అధ్యక్షుడిగా ఉంటూనే ఛైర్మన్‌ మావో అయిపోతాడు. అతడి నాడి నాకు తెలుస్తూనే ఉంది. శ్రీ మోదీ నాడిని మాత్రం పట్టుకోలేక పోతున్నాను. బహుశా మోదీకి నాలుక తప్ప నాడి లేదేమోనని నా సందేహం. ఉంటే నా చేతికి దొరక్కపోతుందా?!
-మాధవ్‌ శింగరాజు 

Read latest Guest-columns News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు