రాయని డైరీ: వీరేందర్‌ సెహ్వాగ్‌ (కామెంటేటర్‌)

11 Oct, 2020 01:13 IST|Sakshi

‘‘సర్, మిమ్మల్ని కలవాలి’’ అని సునీల్‌ గావస్కర్‌ సర్‌కి ఫోన్‌ చేశాను. ‘‘ఒకే బాక్సులోనే కదా ఉంటాము, పని కట్టుకుని కలవడం దేనికి?’’ అని అడిగారు గావస్కర్‌ సర్‌. ‘‘బాక్సుకు దూరంగా కలవాలి సర్, నా మనసేం బాగోలేదు’’ అని చెప్పాను. ‘‘సరే’’ అన్నారు సర్‌. 
‘‘సర్, మిమ్మల్ని కలవాలి’’ అని సంజయ్‌ మంజ్రేకర్‌ సర్‌కి ఫోన్‌ చేశాను. ఆయన బాక్సులో లేరు కనుక ‘‘ఎక్కడ కలుద్దాం?’’ అని మాత్రం అడిగారు. ఐపీల్‌ మొదలైనప్పట్నుంచీ మంజ్రేకర్‌ సర్‌ ఇక్కడిక్కడే దుబాయ్‌లో తిరుగుతున్నారు. నోరు మంచిది కాదని, బీసీసీఐ ఈసారి ఆయన్ని కామెంటరీ బాక్సుకు దూరంగా పెట్టింది. 

ముగ్గురం ఒక చోట కలుసుకున్నాం. ‘‘గావస్కర్‌ సర్‌ కూడా వస్తున్నట్లు చెప్పలేదు!’’ అని నా వైపు చూస్తూ ఆశ్చర్యపోయారు మంజ్రేకర్‌ సర్‌.  
‘‘మనసు బాగోలేక, చెప్పడం మర్చిపోయాను సర్‌’’ అన్నాను. 
పెద్దగా నవ్వారు గావస్కర్‌ సర్, మంజ్రేకర్‌ సర్‌. 
‘‘మనసు బాగుంటుందని, బాగుండాలని ఎలా అనుకుంటావు సెహ్వాగ్‌! నూట నలభై కోట్ల మనోభావాల మధ్య మనం జీవిస్తున్నాం, మర్చిపోకు’’ అన్నారు గావస్కర్‌ సర్‌. అవునన్నట్లు నవ్వారు మంజ్రేకర్‌ సర్‌. 

‘‘కామెంటేటర్‌కు ఉండవా సర్, మనోభావాలు?! సన్‌రైజర్స్‌కు బ్యాటింగ్‌ దమ్ము లేదు అన్నందుకు ‘నీ దమ్మెంతో చూపించు చూస్తాం’ అని సోషల్‌ మీడియాలో నన్ను ట్రోల్‌ చేస్తున్నారు. రిటైర్‌ అయినవాణ్ణి నేనేం చూపిస్తాను. దమ్ము లేదు అని నేను రెచ్చగొట్టినందుకే  కదా కింగ్స్‌ లెవన్‌  మీద సన్‌రైజర్స్‌ గెలిచింది. ఒకటేదైనా అంటే ఇంకోటేదో అర్థం చేసుకోవడమేనా ఈ మనోభావాల పని!’’ అన్నాను.
గావస్కర్‌ సర్‌ నా వైపు ఆవేదనగా చూశారు. ఆయన ఆవేదనగా చూస్తున్నారు కదా మళ్లీ తను కూడా ఆవేదనగా చూడటం ఎందుకు అనేమో మంజ్రేకర్‌ సర్‌ నా వైపు మామూలుగా చూశారు. 

‘‘సెహ్వాగ్‌. ఏదో ఒకటి అనకుండా ఉండ కూడని వృత్తిలో ఉన్నవారు, ఏదో ఒకటి అనిపించుకోకుండా ఉండరు. కోహ్లీ భార్య మనోభావాలను నువ్వు వినే ఉంటావు. ‘సన్‌రైజర్స్‌కి బ్యాటింగ్‌ దమ్ము లేదు’ అని నువ్వు ఇప్పుడు ప్రేరణ కలిగించినట్లే, ‘భార్య బౌలింగ్‌లో మాత్రమే ప్రాక్టీస్‌ చేసి ఉండకపోతే కోహ్లీ బ్యాటింగ్‌కి దమ్ము ఉండేది’ అని నేను మొన్న ప్రేరణ కలిగించాను. ఆ మాటకు ఆమె హర్ట్‌ అయ్యారు. మరికొన్ని మనోభావాలకైతే నా మాటల్లో డబుల్‌ మీనింగ్‌ కూడా కనిపించింది. ఇవన్నీ పట్టించుకోకు’’ అన్నారు గావస్కర్‌ సర్‌.

‘‘మరి నేనేం అనుకోవాలి?’’ అన్నారు మంజ్రేకర్‌ సర్‌.
‘‘అవును, మంజ్రేకర్‌ ఏమనుకోవాలి..’’ అంటూ పెద్దగా నవ్వి మంజ్రేకర్‌ సర్‌ భుజం తట్టారు గావస్కర్‌ సర్‌. 
‘‘నన్నసలు ఈసారి కామెంటరీ బాక్సు లోనికే రానివ్వలేదు. సచిన్‌ని ఓసారెప్పుడో ఏనుగు అని అన్నానట. మనోభావాలు నాపైకి బ్యాట్‌లు పట్టుకుని వచ్చేశాయి. నేనన్నది వేరే. సచిన్‌ ఏనుగులాంటి వాడు అన్నాను. ఎంత సేపని ‘సచిన్‌ బాగా ఆడుతున్నాడు’ అని కామెంటరీ ఇవ్వగలం. అదే భావాన్ని వేరే మాటల్లో చెప్పాలని ఉండదా కామెంటేటర్‌కు?!’’ అన్నారు మంజ్రేకర్‌ సర్‌. 

సర్‌లు ఇద్దరిలో ఇంత వాక్యూమ్‌ ఉందని నాకు తెలియదు! 
‘‘ఎలా సర్‌ మరి, మనోభావాలకు భంగం కలిగించకుండా ఉండటం?!’’ అన్నాను. 
ఇద్దరూ మళ్లీ పెద్దగా నవ్వారు. 
‘‘భంగం కలిగించకూడదని ప్రయత్నించకు. మరింతగా భంగపడతాయి’’ అన్నారు!
- మాధవ్‌ శింగరాజు

మరిన్ని వార్తలు