రాయని డైరీ: ఎ.కె.ఆంటోనీ (కాంగ్రెస్‌)

13 Sep, 2020 01:15 IST|Sakshi

డెబ్బై ఏళ్ల వయసు గల నా మిత్రుడు గులామ్‌ నబీ ఆజాద్‌ని నా డెబ్బై తొమ్మిదేళ్ల వయసులో నాకై నేనుగా వెళ్లి పరామర్శించడమా లేక అతడికై అతడే నాకోసం వచ్చే వరకు ఆగడమా అని తర్కించవలసిన అవసరం మా మధ్య లేనప్పటికీ, ఎనభై ఏడేళ్ల మన్మోహన్‌సింVŠ  జీ మనోభావాలనైతే మాత్రం గట్టిగా శిరసావహించాలనే నేను తీర్మానించుకున్నాను. సోనియాజీ సలహా మండలిలో కొత్తగా కీలక సభ్యుడిని అవడం కూడా ఆజాద్‌తో నేను దూరాన్ని ఏర్పరచుకోవలసిన పరిణామమే.

ఆజాద్‌ను కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శిగా తొలగిస్తూ సోనియాజీ నిర్ణయం తీసుకున్నాక, అతడెంత స్నేహితుడైనా వెళ్లి అతడిని పలకరించడం అంటే పార్టీ నిర్ణయాధికారాన్ని ధిక్కరించడమే. కాంగ్రెస్‌ పార్టీలో వ్యక్తులు ఉండరు. పార్టీ మాత్రమే ఉంటుంది. ఆ సంగతిని ఆజాద్‌కి కాస్త ముందుగా ఎవరైనా వెళ్లి అర్థం చేయించవలసి ఉంటుందని ఈ ఏజ్‌ గ్రూప్‌లో ఎవరికైనా ఎందుకు ఒక ఆలోచన కలుగుతుంది! 

కాంగ్రెస్‌కు గట్టి ప్రెసిడెంట్‌ ఒకరు ఉండాల్సిందేనని ఆజాద్‌ ఇరవై రెండు మందితో కలిసి లేఖ రాసినప్పుడే నా ప్రియ మిత్రుడికి నూకలు చెల్లాయని నేను అర్థం చేసుకోగలిగాను. భూమి మీద నూకలు చెల్లితే కాలం తీరిపోయినట్లు. కాంగ్రెస్‌లో నూకలు చెల్లితే లేఖలు రాసి పోయినట్లు. కాంగ్రెస్‌ ఎంత పెద్ద ఓటమినైనా క్షమిస్తుంది. పార్టీ మీటింగులో మౌనంగా కూర్చొని వెళ్లకపోతే మాత్రం శిక్ష విధించి తీరుతుంది. ఆజాద్‌ మౌనంగా కూర్చోవాలని అనుకోకపోగా, మౌనంగా కూర్చోకూడదన్న ఆలోచన ఎంత వయసుకీ వచ్చే అవకాశం లేని వాళ్ల చేత కూడా ఆలోచింపజేసి లేఖలో సంతకం పెట్టించి ఉంటాడని సోనియాజీకి, మన్మోహన్‌జీకి , ఆఖరికి రాహుల్‌కీ ఒక బలమైన అనుమానం.  

లేఖ రాసిన తర్వాత జరిగిన తొలి సమావేశంలో స్క్రీన్‌ మీద ఆజాద్‌ని మన్మోహన్‌జీ ఎంత కోపంగా చూస్తూ కూర్చున్నారో నేనసలు చూడనట్లే స్క్రీన్‌ మీద వేరే మూలకు తలతిప్పి కూర్చున్నాను. ‘‘మీరే కాంగ్రెస్‌ ప్రెసిడెంట్‌గా కొనసాగాలి సోనియాజీ’’ అన్నారు మన్మోహన్‌. ‘‘అవును మేడమ్‌.. మీరే కాంగ్రెస్‌ ప్రెసిడెంటుగా ఉండాలి. లేదంటే రాహుల్‌ బాబు ఉండాలి’’ అని నేను అన్నాను. నా మిత్రుడు ఆజాద్‌ కూడా అటువంటి మనోరంజకమైన మాటే ఒకటి హృదయపూర్వకంగా అంటాడని  ఆశగా ఎదురుచూశాను. అనలేదు! అప్పుడే అనిపించింది అతడికి ఊహ తెలియడం మొదలైందని. పార్టీ ఊహలకు అతడొక వాస్తవంలా ఉంటే పోయేది. వాస్తవాలకు విరుద్ధమైన ఒక ఊహగా వికసించాడు. 

ఆజాద్‌ ఎంతగా నలిగి ఉంటాడో నేను ఊహించగలను. శిక్ష విధించడంలో కూడా కాంగ్రెస్‌ తన ప్రత్యేకతను చూపిస్తుంది. ఇరవై రెండు మంది చేత సంతకాలు పెట్టించి, తనూ ఒక సంతకం చేసినందుకు ఇరవై రెండు మందితో కొత్తగా సీడబ్ల్యూసీని ఏర్పాటు చేయడం చూస్తుంటే మిగిలిన ఆ ఒక్కటీ నీదేనని ఆజాద్‌కు చెప్పడానికే అన్నట్లు ఉంది. సీడబ్ల్యూసీలో అతడూ ఉంటాడు. ఉంటాడు కానీ.. ఉండటానికి ఉన్నట్లో, ఉన్నా లేనట్లో  ఉంటాడు. కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శిగా లేకపోయాక కశ్మీర్‌ను తీసుకొచ్చి బీజేపీ ఇండియాలో ఎంత కలిపితే మాత్రం ఆజాద్‌ ఇక ఎంతమాత్రం ఈ దేశ పౌరుడు కాదు. అది బాధిస్తుండవచ్చు ఆజాద్‌ని. పుట్టిన కశ్మీర్‌ కన్నా కాంగ్రెస్‌నే అతడు ఎక్కువగా ప్రేమించాడు. కశ్మీరో, ఇండియానో కాదు.. కాంగ్రెస్‌ పార్టీ అతడి దేశం.  

ఆజాద్‌ని కలవాలని మనసు ఆరాపడుతోంది. కాంగ్రెస్‌కు కొన్ని విలువలు ఉంటాయి. వాటిని పక్కన పెట్టి అతడిని కలవడం అంటే అతడెంతో విలువ, గౌరవం, ప్రాణం ఇచ్చే పార్టీని తక్కువ చేయడమే.
- మాధవ్‌ శింగరాజు

మరిన్ని వార్తలు