అమిత్‌ షా (హోమ్‌ మినిస్టర్‌).. రాయని డైరీ

21 Feb, 2021 01:04 IST|Sakshi

మాధవ్‌ శింగరాజు

రేపు ఉదయం కోల్‌కతాలో ఉండాలి. అక్కడొక స్పెషల్‌ కోర్టు జడ్జి ఉంటారు. సోమవారం ఉదయం పది గంటలకు కోర్టుకు రాగలిగితే బాగుంటుందని ఆయన నాకు సమన్లు ఇష్యూ చేశారని నా లాయర్‌ చెప్పాడు. 
నా మీద కేసు పెట్టిన వ్యక్తి ప్రముఖుడేం కాదు. అలాగని అతడికి సామాన్యుడి హోదాను కూడా ఇవ్వలేం. తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ. మమతా బెనర్జీకి దగ్గరి బంధువు. 
తనని నేనేదో అన్నానని అతడి కంప్లయింట్‌. అన్నది నిజమా కాదా అని కోర్టు అడుగుతుంది. నిజమో కాదో నా ప్లీడర్‌ వెళ్లి చెప్పగలడు. బొత్తిగా ఇది ప్లీడర్‌కు ప్లీడర్‌కు మధ్య వ్యవహారం. అయినప్పటికీ నేనే స్వయంగా కోర్టుకు వస్తే తన తడాఖా ఏమిటో పశ్చిమ బెంగాల్‌ ప్రజలకు తెలుస్తుందని మమత ఆశిస్తుండవచ్చు. ఎన్నికలకు ముందు ఆశలు ఎవరికైనా సహజమే. అయితే కేసులతో ఆశలు నెరవేరతాయా! ఈ సందేహం మమతకు రాకపోవడమే అసహజం. 
గురు, శుక్రవారాల్లో బెంగాల్లోనే ఉన్నాను. గురువారం మమత వాళ్లవాళ్లతో మీటింగేదో పెట్టుకున్నారు. సరాసరి ఆ మీటింగు నుంచే వస్తున్నానని అంటూ.. ఒక వ్యక్తి బెరుకు బెరుగ్గా నా దగ్గరికి వచ్చాడు. ‘మీరే కదా అమిత్‌ షా’ అన్నాడు. ‘అవును నన్నే అమిత్‌ షా అంటారు. మోదీజీ నన్ను అలాగే అంటారు. మీ మేడమ్‌ మమత కూడా అలాగే అంటారు’ అన్నాను. 
‘వాళ్లు అంటారు నిజమే. వాళ్లు అంటున్న అమిత్‌ షా యేనా మీరు అని నా సందేహం. ఆ సందేహం తీరితే నేను అడగవలసింది అడగగలను..’ అన్నాడు రొప్పుతూ. 
‘మీ సందేహం తప్పక తీరుతుంది. అయితే ముందు నా సందేహం తీరనివ్వండి. దేశంలో అంతా నన్ను ఇట్టే పోల్చుకుంటారు నేను అమిత్‌ షా నని. నా పక్కన మోదీజీ లేకున్నా కూడా నేను అమిత్‌ షానేనని గుర్తుపట్టేందుకు కూడా ఎవరూ ఏమీ ఇబ్బంది పడరు. అలాంటప్పుడు దేశ ప్రజల్లో ఒకరైన మీకెందుకు సందేహం కలుగుతోంది?’ అని ప్రశ్నించాను. 
‘లేదు. అలా ఏం లేదు. అయితే నేను వేరేలా ఆలోచించాను. రెండుసార్లు కరోనా వచ్చిన అమిత్‌షా.. అమిత్‌షాలా ఎలా ఉండగలరు అని నేను అనుకున్నాను. అందుకే మీరు అమిత్‌ షా అయి ఉంటారని మిమ్మల్ని చూసిన వెంటనే అనుకోలేకపోయాను’ అన్నాడు!
అతడి మాటల్లో నిజాయితీ కనిపించింది. మమత మాటల్లో ఒక్కనాడైనా కనిపించని నిజాయితీ అది!  
‘నేనే అమిత్‌షాని. ఇందుకు నేను మీకేమీ రుజువులు చూపించలేను. కరోనా వచ్చిపోయినా, రేపు ఎన్నికల్లో మమత ఓడిపోయినా నేను ఒకేలా ఉంటాను. నేనే అమిత్‌షా అనడానికి అదొక్కటే రుజువు. ఇప్పుడు చెప్పండి. నన్ను వెతుక్కుంటూ ఎందుకు వచ్చారు మీరు?’ అని అడిగాను. 
‘మిమ్మల్ని వెతుక్కుంటూ వెళితే మేము వెతుకుతున్నవాళ్లు మీ దగ్గర కనిపిస్తారని మమతా దీదీ పంపారు’ అని చెప్పాడు.
‘మిమీ చక్రవర్తి, ప్రతిమా మండల్, జీవన్‌ ముఖర్జీ, దేవశ్రీ రాయ్, మన్తూరామ్‌ పఖీరా.. వీళ్లనేనా మీరు వెతుకుతున్నది?’ అని అడిగాను. 
‘అవును వాళ్లనే! మీకెలా తెలుసు దీదీ మీటింగ్‌కి వాళ్లు మిస్‌ అయ్యారని’ అని ఆశ్చర్యపోయాడు.  
‘మీ దీదీ మీటింగ్‌కి వాళ్లు మిస్‌ అయ్యారని నాకు తెలీదు’ అన్నాను. 
‘మరి వాళ్ల పేర్లు ఎలా చెప్పగలిగారు’ అన్నాడు మళ్లీ ఆశ్చర్యపోతూ. 
నన్ను మీట్‌ అవ్వాలనుకుంటున్న వాళ్ల పేర్లే నేను అతడికి చెప్పాను. ఆ సంగతి అతడికి చెప్పలేదు. 
‘మీరు అమిత్‌షానే. రుజువులక్కర్లేదు’ అన్నాడు వెళ్లిపోతూ.   
సోమవారం కోర్టు పని మీద కోల్‌కతా వెళితే మళ్లొకసారి నేనే అమిత్‌షాని అని పనిలో పనిగా రుజువు అవుతుంది కానీ, రుజువు చేసుకునేంత అవసరం ఇప్పుడేముందని?!  

Read latest Guest-columns News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు