ఈటల రాజేందర్‌ (హెల్త్‌ మినిస్టర్‌) రాయని డైరీ

17 Jan, 2021 02:19 IST|Sakshi

వ్యాక్సినేషన్‌లో పార్టిసిపేట్‌ చేసి గాంధీ హాస్పిటల్‌ నుంచి బయటికి వచ్చాను. వ్యాక్సిన్‌ వేయించుకున్నట్లు గుర్తుగా ఎడమ చేతి బొటనవేలికి ఇంకు చుక్క పెడుతున్నారు. రెండు వారాల తర్వాత రెండో డోస్‌ అంటున్నారు. అప్పుడు అదే వేలి మీద రెండో చుక్క పెడతారో, ఇంకో వేలేదైనా పట్టమంటారో! 
ఆ మాటే అడిగాను సయ్యద్‌ అలీ ముర్తజా రిజ్వీని. బయట నాకోసం ఎదురుచూస్తూ ఉన్నాడతను. తెలంగాణ హెల్త్‌ సెక్రెటరీ. మనిషి చువ్వలా ఉంటాడు. యాంటీ బయాటì క్స్‌తో ల్యాబ్‌లో తయారైనట్లుగా ఉంటుంది బాడీ. 
‘‘మీరు గ్రేట్‌ సర్‌’’ అన్నాడు. 

‘‘దేనికి గ్రేట్‌ రిజ్వీ భయ్యా’’ అని అడిగాను. 
‘‘నిన్న ప్రెస్‌ మీట్‌లో ‘మొదటి వ్యాక్సిన్‌ నేనే తీసుకుంటాను’ అంటున్నప్పుడు మీ కళ్లల్లో భయం కనిపించలేదు. ఈరోజు గాంధీ హాస్పిటల్‌ నుంచి బయటికి వస్తున్నప్పుడూ మీ కళ్లల్లో భయం కనిపించడం లేదు!’’ అన్నాడు. 
‘‘అందులో గ్రేట్‌ ఏముంది రిజ్వీ భయ్యా! ఆరోగ్యశాఖ మంత్రికి ప్రజలొచ్చి ధైర్యం చెబుతారా? ఆరోగ్యశాఖ మంత్రే కదా వెళ్లి ప్రజలకు ధైర్యం చెప్పాలి’’ అన్నాను. 
‘‘అయినా గానీ మీరు గ్రేట్‌ సర్‌. రెండోసారి వ్యాక్సినప్పుడు రెండో చుక్కను మళ్లీ అదే చేతికి, మళ్లీ అదే వేలికీ వేస్తారా అని అడిగారు తప్పితే, వ్యాక్సిన్‌ని మళ్లీ అదే చేతికి, అదే జబ్బకు వేస్తారా అని మీరు అడగలేదు. అది కూడా ధైర్యమే కదా సార్‌’’ అన్నాడు రిజ్వీ. 
నవ్వాను. చెయ్యి చురుక్‌ మంది! నవ్వితే చురుక్‌మందా? వ్యాక్సినేషన్‌లో పార్టిసిపేట్‌ చేసి వచ్చినందుకు చురుక్కుమనడం మొదలైందా?!
రమేశ్‌రెడ్డి, శ్రీనివాస్‌ నా వెనకే వస్తున్నారు. రిజ్వీని వెళ్లనిచ్చి రమేశ్‌రెడ్డిని, శ్రీనివాస్‌ని దగ్గరకు పిలిచాను. రాలేదు! దూరం నుంచే.. ‘చెప్పండి సర్‌’ అన్నారు!
‘‘వ్యాక్సినేషన్‌లో పార్టిసిపేట్‌ చేసిన వాళ్ల నుంచి ఏమీ అంటవులేవయ్యా.. రండి దగ్గరకు..’’ అని పిలిచాను. ధైర్యం చేసి వచ్చారు. రమేశ్‌రెడ్డి మెడికల్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌. శ్రీనివాస్‌ పబ్లిక్‌ హెల్త్‌ డైరెక్టర్‌.

‘‘వాళ్లు వేస్తున్నది కోవాగ్జినా, కోవిషీల్డా’’ అని అడిగాను. 
‘‘గమనించలేదు సార్‌’’ అన్నారు!
‘‘హెల్త్‌ మినిస్టర్‌ పార్టిసిపేట్‌ చేసిన ప్రోగ్రామ్‌ని కూడా మీరు గమనించరా! వ్యాక్సిన్‌కి సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఎలా ఉంటాయో కనీసం అదైనా తెలుసా?’’ అన్నాను. చెయ్యి మళ్లీ చురుక్కుమంది. 
‘‘సూది గుచ్చిన చోట ‘చురుక్‌’ మంటుంది సర్‌..’ అన్నాడు రమేశ్‌రెడ్డి.
‘‘అది సైడ్‌  ఎఫెక్ట్‌ ఎందుకౌతుంది రమేశ్‌రెడ్డీ.. ఎఫెక్ట్‌ అవుతుంది కానీ! నువ్వు చెప్పలేవా శ్రీనివాస్‌.. వ్యాక్సిన్‌ సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఎలా ఉంటాయో?’’  అన్నాను. 
‘‘సర్‌.. ఒకట్రెండు ఉంటాయి. తలనొప్పి, అలసట, కండరాల నొప్పి, జ్వరం, కీళ్ల నొప్పులు, ఒళ్లు నొప్పులు. ఇంకా.. కడుపులో వికారం, వాంతులు, చెమటలు పట్టడం, జలుబు, దగ్గు, వణుకు, చికాకు..’’ చెప్పుకుంటూ పోతున్నాడు!
ఆగమన్నాను. ఒకట్రెండు అని చెప్పి బాడీలో ఏ పార్ట్‌నీ వదలడం లేదు!

‘‘శ్రీనివాస్‌.. నేనడిగింది సైడ్‌ ఎఫెక్ట్స్‌ గురించి. నువ్వు చెబుతున్నది కరోనా సింప్టమ్స్‌ గురించి..’’ అన్నాను. 
‘‘రెండూ ఒకేలా ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు సార్‌. వ్యాక్సిన్‌ వేసుకోకుండానే ఈ లక్షణాలు కనిపిస్తే కరోనా అన్నట్టు. వ్యాక్సిన్‌ వేసుకోగానే కనిపిస్తుంటే వ్యాక్సిన్‌ పని చేస్తున్నట్టు..’’ అన్నాడు రమేశ్‌రెడ్డి. 
తలనొప్పి మొదౖలైంది!
‘వ్యాక్సిన్‌ వేయించుకోకున్నా ఊరికే వ్యాక్సినేషన్‌లో పార్టిసిపేట్‌ చేసి వచ్చినందుకు కూడా సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఏమైనా ఉంటాయా శ్రీనివాస్‌..’ అని అడగబోయీ అడగలేదు.

-మాధవ్‌ శింగరాజు

మీ అభిప్రాయాలను కింద తెలపండి

Read latest Guest-columns News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments

మరిన్ని వార్తలు