ఎం.కె. స్టాలిన్‌ (తమిళనాడు సీఎం) రాయని డైరీ

15 Jan, 2023 12:36 IST|Sakshi

మనిషిని చూస్తే శుభ్రంగా ఉన్నాడు. సంప్ర దాయంగా ఉన్నాడు. ధోతీ–చొక్కా ధరించి ఉన్నాడు. శ్రీమతితో కలిసి నడుస్తున్నాడు!
‘‘ఈయన రవి కదా, మన తమిళనాడు గవర్నర్‌!’’ అన్నాను...  ఫొటోలో అలా శుభ్రంగా, సంప్రదాయంగా, ధోతీ–చొక్కా ధరించి, శ్రీమతితో కలిసి నడుస్తున్న వ్యక్తిని రఘుపతికి చూపిస్తూ. 
‘‘ఆమా తలైవా. అలాగే అనిపిస్తోంది..’’ అన్నారు రఘుపతి. ఆయన ‘లా’ మినిస్టర్‌. 
‘‘అనిపించడం కాదు, కనిపిస్తున్నది ఆయనే’’ అని నవ్వారు పెరియస్వామి. ఆయన రూర ల్‌ మినిస్టర్‌. ఆయన చేతిలో మరికొన్ని ఫొటోలు ఉన్నాయి. 
ఆ ఫొటోల్లో కూడా రవి శుభ్రంగా,
సంప్రదాయంగా ఉన్నారు. రాజ్‌భవన్‌ పొంగల్‌ ఈవెంట్‌కు వచ్చిన వారందరినీ వారి దగ్గరకు వెళ్లి మరీ ఆత్మీయంగా పలకరిస్తున్నారు.
పొంగల్‌ శుభాకాంక్షలు చెబుతున్నారు. నీలగిరి ట్రైబల్స్‌ కొందరు ఎంపికగా తెంపుకొచ్చి, గుత్తిగా ముడి వేసి తెచ్చిన కొండపూల బొకేను అపురూపంగా స్వీకరిస్తున్నారు. కేరళ నుంచి వచ్చిన బ్రాహ్మణులు పూజలు నిర్వహించి ఇచ్చిన ‘పరివట్టమ్‌’ను భక్తి ప్రపత్తులతో శ్రద్ధగా తన తలకు చుట్టుకుంటున్నారు. 
ఆ ఫొటోలను పెరియస్వామికి తిరిగి ఇచ్చేస్తూ... ‘‘ఇంత శుభ్రమైన, సంప్రదాయ బద్ధమైన మనిషి మొన్న అసెంబ్లీలో అలా
ఎందుకు బిహేవ్‌ చేశారంటారూ!!’’ అన్నాను.
రఘుపతి, పెరియస్వామి మాట్లాడలేదు. ఆ ప్రశ్న అందరిలోనూ ఉంది. సమాధానం గవర్నర్‌ రవి మాత్రమే చెప్పగలిగింది. 
రవికి, తమిళనాడుకు సంబంధమే లేదు. బిహార్‌ అతడి రాష్ట్రం. కేరళ అతడి క్యాడర్‌. ఢిల్లీ అతడి వర్క్‌ప్లేస్‌. మేఘాలయకు, నాగాలాండ్‌కు గవర్నర్‌గా ఉన్నారు. అలాగే ఇప్పుడు తమిళనాడుకు. 
మేఘాలయకు గవర్నర్‌గా ఉన్నప్పుడు ఆయన మేఘాలయను మేఘాలయ అనే అన్నారు. నాగాలాండ్‌కు గవర్నర్‌గా ఉన్నప్పుడు నాగాలాండ్‌ను నాగాలాండ్‌ అనే అన్నారు. తమిళనాడును మాత్రం తమిళనాడు అనడం లేదు. ‘తమిళగం’ అంటున్నారు. బయటా అదే మాట. అసెంబ్లీలోనూ అదే మాట!
తమిళనాడు అంటే ‘తమిళభూమి’ అనే అర్థం వస్తుంది కనుక.. అప్పుడది భరత భూమికి సంబంధం లేని స్వతంత్ర దేశంగా అనిపించే ప్రమాదం ఉంది కనుక..  తమిళ నాడును ‘తమిళుల ప్రాంతం’ అనే అర్థం వచ్చేలా ‘తమిళగం’ అనడమే కరెక్ట్‌ అని తను గవర్నర్‌గా వచ్చినప్పటి నుంచీ రవి అంటూనే ఉన్నారు.
కాన్‌స్టిట్యూషన్‌ని రవి కాస్త ఎక్కువగా చదివినట్లున్నారు. ఎక్కువ చదివితే ముఖ్యమైనవి కొన్ని తక్కువగా అనిపిస్తాయి. మంత్రి మండలి తీసుకున్న నిర్ణయాలలో గవర్నర్‌ తల దూర్చకూడదని, వేలు పెట్టకూడదని, కాలు దువ్వకూడదని ఆర్టికల్‌ 163 (1) లో ఉంది. రాష్ట్ర ప్రభుత్వం రాసిచ్చిన అసెంబ్లీ ప్రసంగంలోంచి మహనీయులు పెరియార్‌ని, అంబేద్కర్‌ని, కామరాజ్‌ని అన్నాదురైని తొలగించి, తమిళనాడుకు బదులు తమిళగంను చేర్చి, అలా ఎలా చేస్తారని ప్రశ్నించినందుకు వాకౌట్‌ చేసి.. గవర్నర్‌ రవి ఎవరి ఔన్నత్యాన్ని నిలబెట్టినట్లు! రాజ్యాంగానిదా, రాజ్‌భవన్‌దా? 
రాజ్యాంగ నియమాలను శిరసావహించని ఈ పెద్దమనిషేనా ఇప్పుడు పొంగల్‌
సంప్రదాయాలను గౌరవిస్తూ కనిపిస్తున్నది!!
‘‘ఫొటోలు మనకెందుకు పంపారట?’’ అని పెరియస్వామిని అడిగాను. 
‘‘పొంగల్‌ ఈవెంట్‌కి పిలిచినా మనం వెళ్లలేదని పొంగల్‌ ఈవెంట్‌నే మనకు
పంపారు’’ అన్నారు నవ్వుతూ పెరియస్వామి.
ఆ నవ్వుకు ఆయన చేతిలోంచి ఒక ఫొటో జారి కింద పడింది. 
‘హ్యాపీ పొంగల్‌ – ఇట్లు మీ ప్రియమైన రవి’.. అని ఆ ఫొటో వెనుక రాసి ఉంది!  
-మాధవ్‌ శింగరాజు

మరిన్ని వార్తలు