రాయని డైరీ: నిర్మలా సీతారామన్‌ (ఆర్థికమంత్రి)

20 Sep, 2020 01:24 IST|Sakshi

మగవాళ్లు స్త్రీలను ఎంతగానైనా భరిస్తారు. పర్వతాన్ని అధిరోహించి వస్తే పూలగుత్తితో ఎదురొస్తారు. రాజకీయాలలోకి వస్తే ‘ఎప్పుడో రావలసింది కదా..’ అని స్వాగతం పలుకు తారు. ఒక స్త్రీ తొలిసారి రక్షణశాఖను చేపడితే ‘జైహింద్‌’ అని సెల్యూట్‌ చేస్తారు. ఆర్థికశాఖ లోకి వస్తే ‘మీకెంత, చిటికెలో పని!’ అని ప్రోత్సహిస్తారు. 

మగవాళ్లు స్త్రీలను ఎంతకైనా భరిస్తారు కానీ తెలివిగా మాట్లాడుతున్నారని అనుకుంటే మాత్రం అస్సలు సహించలేరు. సభలో నిన్న ఆ జీఎస్టీ డబ్బులేవో రాష్ట్రాలకు తలా ఇంత పంచండి అని అపోజిషన్‌ సభ్యులు అడుగుతున్నప్పుడు ‘యాక్ట్‌ ఆఫ్‌ గాడ్‌’ అనే మాట నా నోటికి వచ్చింది. చాలా సహజంగా వచ్చింది. దేవుడు చేసిందానికి జీఎస్టీ వసూళ్లు ఎంతని పంచుతాం అనే సందర్భంలో నేను ‘యాక్ట్‌ ఆఫ్‌ గాడ్‌’ అన్నాను. నిర్మలా సీతారామన్‌ ఏమిటి, అంత పెద్ద వర్డ్‌ యూజ్‌ చెయ్యడం ఏమిటి అన్నట్లు విపక్షాలు స్తంభించిపోయాయి. పక్కింటి ఆంటీ సడన్‌గా ఇంగ్లిష్‌ మాట్లాడ్డం ఏంటి అన్నట్లుంది వాళ్ల ఎక్స్‌ప్రెషన్‌. 

సీతారామన్‌ వీళ్లకు పక్కింటి ఆంటీనే! ఎప్పుడూ వంటింట్లో ఉంటుంది. కొంగుతో ముఖం తుడుచుకుంటూ ఉంటుంది. వంటపని అయిపోగానే ఇల్లు సర్దుకుంటూ ఉంటుంది. అలాంటి ఆంటీ హఠాత్తుగా ‘యాక్ట్‌ ఆఫ్‌ గాడ్‌’ అని అంటే నిరసనగానే చూస్తారు.
‘‘మీ వ్యంగ్యాలు కాదు, మీ సూచనలు ఇవ్వండి’’ అని సభ్యుల్ని అడిగాను. 
‘‘డబ్బులిచ్చే ఉద్దేశం మీకు లేనప్పుడు.. మేం సలహాలిచ్చి ఏం ఉపయోగం’’ అన్నాడు రంజన్‌ చౌదరి. నా సహాయ మంత్రిని ‘ఛోక్రా’ అన్నది ఆయనే.
వీళ్లయితే హిందీ, ఇంగ్లిష్, లాటిన్‌ మాట్లాడొచ్చు! ‘ఫోర్స్‌ మెషార్‌’ అనే లాటిన్‌ మాట వీళ్లకు నచ్చుతుంది. ‘యాక్ట్‌ ఆఫ్‌ గాడ్‌’ లాంటిదే ఫోర్స్‌ మోషార్‌ కూడా. కోర్టుల్లో క్లయింట్‌ల తరఫున న్యాయవాదులు మాట్లాడు తుంటారు. అది వీళ్లకు కామన్‌ వర్డ్‌. అదే కామన్‌ వర్డ్‌ని నేను మాట్లాడితే మళ్లీ అన్‌కామన్‌ అవుతుంది. ఒక స్త్రీ.. ఆమె మంత్రి అయినప్పటికీ నైబర్‌హుడ్‌ ఆంటీలా కనిపిస్తూ కూడా ఇంత పెద్ద మాట ఎలా వాడుతుందని వీళ్ల ఆశ్చర్యం! 
‘‘చెప్పండి.. ఏం చేద్దాం..’’ అన్నాను. 
‘‘పీఎం కేర్‌ డబ్బులు ఉన్నాయి కదా, వాటి సంగతేంటి’’ అంటాడు రంజన్‌ చౌదరి. 
‘‘నేను చెబుతాను వాటి సంగతి’’ అని లేచాడు అనురాగ్‌ ఠాకూర్‌. అతడు నా సహాయ మంత్రి. సరైన సమయానికి సహాయానికి వచ్చాడు.
అంతా అతడి వైపు చూశారు. ‘నీకేం తెలుసు?’ అన్నట్లుంది ఆ చూపు. 
‘‘మేడమ్‌ మీరు కూర్చోండి’’ అన్నాడు అనురాగ్‌. 
నేను కూర్చున్నాక, తను నిలబడ్డాడు. నా వైపు నిలబడ్డానికే అతడు నిలబడ్డాడని అర్థం చేసుకోగలిగాను కానీ.. పీఎం కేర్‌ ఫండ్‌పై అతడేం చెప్పబోతున్నాడో ఊహించలేక నేనూ ఆసక్తిగా నా సహాయ మంత్రి వైపు చూస్తూ ఉన్నాను. అయితే అతడు చెప్పలేదు. అడిగాడు!
‘‘ముందు నెహ్రూ ఫండ్‌ ఏమైందో మీరు చెప్పండి. ఆ ఫండ్‌కి లెక్కలు ఉన్నాయా? అసలు అది రిజిస్టర్‌ అయిందా? అందులో ఎవరెవరికి ఎంత వాటా ఉందో అది చెప్పండి’’ అన్నాడు! అకస్మాత్తుగా అతడు అలా అనడం కూడా యాక్ట్‌ ఆఫ్‌ గాడ్‌లా అనిపించింది నాకు. 
‘‘ఏయ్‌ ఛోక్రా నీకేం తెలియదు కూర్చో’’ అన్నాడు రంజన్‌ చౌదరి. 
తనని పిల్లోడా అన్నందుకు అనురాగ్‌ హర్ట్‌ అయ్యాడు. సభ నాలుగుసార్లు వాయిదా పడింది. హర్ట్‌ అయిన మనిషి కోసం పడలేదు. నెహ్రూ కుటుంబాన్ని అంటారా అని హర్ట్‌ అయినవారి కోసం పడింది! 
-మాధవ్‌ శింగరాజు

Read latest Guest-columns News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా