‘ఉపసంహరణల’తో ఎవరికి మేలు?

20 Feb, 2021 01:07 IST|Sakshi

విశ్లేషణ 

వాస్తవాధీన రేఖ వద్ద భారత్‌–చైనా సైనిక బలగాల ఉపసంహరణ ప్రక్రియ భారత్‌ వ్యూహాత్మక తప్పిదం కానుందని పలువురు రక్షణ రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు.  ఈ వివాదంలో తానాశించిన వాటిని చాలావరకు చైనా సాధించుకోగా, భారత్‌ తనకు పట్టు ఉన్న పర్వత ప్రాంతాలనుంచి కూడా వైదొలగాల్సి వచ్చింది. భారత్‌ కీలకమైన డెస్పాంగ్‌ ప్రాంతాన్ని చైనా తన ఆధీనంలోనే ఉంచుకుంది. సరిహద్దు చర్చలు ఒకడుగు వెనక్కి, రెండడుగులు ముందుకు అనే చైనా వైఖరికి అనుగుణంగానే ముగిశాయి. వాస్తవాధీన రేఖపై యధాతథ స్థితిని పునరుద్ధరించడం అనే భారత్‌ కల ఇక ఫలించనట్లేనా?

సైనికుడి తర్వాత సైనికుడిని, ఆయుధం తర్వాత ఆయుధాన్ని మోహరిస్తూ, శిఖరం తర్వాత శిఖరాన్ని అధిరోహిస్తూ భారత సైన్యం లద్దాఖ్‌ సరిహద్దుప్రాంతంలో చైనా సైనిక బలగాలను సాహసోపేతంగా నిలువరించడానికి ప్రయత్నించినప్పుడు ప్రాణత్యాగాల మధ్యే మన వాళ్ల తెగువను చూసి పులకించిపోయాం. చాలా కాలం తర్వాత భారత ప్రభుత్వం ప్రదర్శించిన కఠిన వైఖరిని ప్రశంసలతో ముంచెత్తాం. కానీ బీజింగ్‌ ఒత్తిడి కారణంగా ఇంత తెగువ కూడా ఇప్పుడు బీటలువారిపోతున్నట్లు కనిపిస్తోంది.

పార్లమెంటులో కాస్త ఆందోళనా స్వరంతో రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ చేసిన ప్రకటన వాస్తవాధీన రేఖ వద్ద 2020 ఏప్రిల్‌కి ముందునాటి య«థాతథ స్థితిపై పెద్దగా హామీని ఇవ్వలేకపోయింది. ఈ సందర్భంగా రాజకీయాలను పక్కన పెట్టి, ప్రస్తుతం వాస్తవాధీన రేఖవద్ద ఇరుదేశాల సైనిక బలగాల ఉపసంహరణ పథకంపై ప్రశ్నలు సంధిం చాల్సిన అవసరం వచ్చిపడింది. వాస్తవాధీన రేఖ వద్ద సంక్లిష్ట పరిస్థితిని అధిగమించడానికి భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని నిపుణులు ఊహించిన భయాలన్నీ ఇప్పుడు వాస్తవమయ్యాయి. మరోవైపున 1959లో తాను ప్రకటించిన రేఖనే అంగీకరించాలని పట్టుబట్టడంతో సహా ఈ వివాదంలో తాను ఆశించిన వాటిలో చాలావరకు చైనా సాధించుకున్నట్లేనని చెప్పాలి. 

చైనాతో సరిహద్దు ఘర్షణను ఎదుర్కొన్న సమయంలో భారత్‌ నిఘాపరమైన, సైనిక చర్యలపరమైన, ఇప్పుడు చర్చలపరమైన తప్పులు చేసింది. భారత భూభాగంలో 8 కిలోమీటర్ల లోపలికి చొచ్చుకొచ్చిన చైనా బలగాలను ఫింగర్‌ 4 నుంచి ఫింగర్‌ 8 ప్రాంతానికి ఉపసంహరించుకునేలా చేసే క్రమంలో తనవంతుగా భారత్‌ అత్యంత కీలకమైన పర్వత శిఖరాలనుంచి తన బలగాలను ఖాళీ చేయాల్సి వచ్చింది. ఇంతటితో ఇది పూర్తి కాలేదు. భారత బలగాలు ఇప్పుడు ఫింగర్‌ 4 ప్రాంతం నుంచి ఫింగర్‌ 3 పశ్చిమానికి తరలిపోవలసి ఉంది. ఇలా ఖాళీ చేసిన స్థలం బఫర్‌ జోన్‌గా ఉంటుంది.

అంటే ఇక్కడ సాధారణ గస్తీని కూడా సస్పెండ్‌ చేస్తారన్నమాట. మరోవైపున డెస్పాంగ్‌ ప్రాంతంలో చైనా బలగాలు 18 కిలోమీటర్ల లోపలికి చొచ్చుకురావడమే కాకుండా అక్కడ భారత బలగాల గస్తీపై కూడా నిషేధం విధించాయి. తాజాగా బలగాల ఉపసంహరణపై కుదిరిన ఒప్పందం గురించి కంఠశోష వచ్చేలా మాట్లాడిన రాజ్‌నాథ్‌ సింగ్‌ భారత్‌ ఎలాంటి భూభాగాన్ని చైనా పరం చేయలేదని పార్లమెంటుకు స్పష్టపరిచారు. చైనా భారత భూభాగంలోకి చొరబడలేదని, భారత్‌ తన భూభాగంలో దేన్నీ కోల్పోలేదని గతంలో కేంద్రప్రభుత్వం చేసిన ప్రకటనతో ఈ తాజా ప్రకటనను పోల్చవచ్చు. వాస్తవాలు పూర్తి భిన్నంగా ఉన్నాయి.

ఒక్కమాటలో చెప్పాలంటే చైనా భారత్‌పై గల్వాన్‌ నమూనా ఉపసంహరణను మోపింది. భారత్‌కు పట్టు ఉన్న కైలాష్‌ పర్వత శిఖరాలపై ఉన్న వ్యూహాత్మక ప్రదేశాన్ని వదిలేసుకుంటూ దాన్ని ఫింగర్స్‌ ప్రాంతాల నుంచి సైనిక బలగాల ఉపసంహరణతో ఎలా ముడిపెట్టగలదు? పైగా వాస్తవాధీన రేఖ వద్ద భారత సైనికుల కదలికలే లేకుండా చేయడం కూడా ఏదీ ఇచ్చేయలేదు అనే ప్రకటనలో భాగమేనా? 2020 సెప్టెంబర్‌లో ఎంపిక చేసుకున్న ప్రాంతాల నుంచి బలగాల ఉపసంహరణను చైనా ప్రతిపాదించింది. అయితే ఆగస్టు 29–30 తేదీల్లో భారత్‌ చుషుల్‌ పర్వత శిబిరాలను ఆక్రమించినందున అక్కడి నుంచి భారత్‌ వెనక్కు తగ్గాలని, ఆ తర్వాతే ఫింగర్‌ 4, ఫింగర్‌8 ప్రాంతాల నుంచి తాను వెనక్కు తగ్గుతానని చైనా పేర్కొంది.

గల్వాన్‌ ఘర్షణలో దెబ్బ తిన్నతర్వాత కీలకమైన పర్వత శిఖరాలను కైవసం చేసుకోవడం ద్వారా ఆధిపత్య స్థానాన్ని పొందిన భారత్‌ చైనా ఉచ్చులో పడొద్దని ఆ సమయంలోనే పలు రక్షణ, వ్యూహాత్మక వ్యవహారాల నిపుణులు కేంద్రప్రభుత్వాన్ని హెచ్చరించారు. సుదీర్ఘ కాలం పునరాలోచన చేసిన తర్వాత ఏకకాలంలో బలగాల ఉపసంహరణకు చైనా అంగీకరించింది. అయితే కైలాష్‌ పర్వత శ్రేణిని భారత్‌ ముందుగా ఆక్రమించింది కాబట్టి భారత దేశమే మొదటగా బలగాలను ఉపసంహరించుకోవాలని చైనా షరతు పెట్టింది. స్పష్టంగానే చైనా యధాతథ స్థితిని పునరుద్ధరించాలనే డిమాం డును పక్కన పెట్టింది. ఈ పదబంధాన్ని చైనా ఎన్నడూ ఉపయోగించలేదు. దానికి బదులుగా సరిహద్దు ప్రాంతాల్లో శాంతి, సామరస్యాన్ని పునరుద్ధరించాలని మాత్రమే చైనా పేర్కొంది. ఇంతవరకు, దౌలత్‌ బెగ్‌ ఓల్టీలోని భారత్‌ వ్యూహాత్మక సైనిక శిబిరాన్ని నిర్బంధించడమేకాక ఉంచిన డెస్పాంగ్‌ ప్రాంతంపై చర్చకు చైనా పదేపదే తిరస్కరిస్తూ వచ్చింది.

రాజ్‌నాథ్‌ సింగ్‌ దీన్నే పార్లమెంటులో ప్రస్తావించారు. తూర్పు లడాఖ్‌ ప్రాంతంలోని వాస్తవాధీన రేఖ పొడవునా సైనిక బలగాల మోహరింపు, గస్తీకి సంబంధించిన కొన్ని కీలక అంశాలు ఇంకా పెండింగులో ఉన్నాయని రక్షణమంత్రి చెప్పారు. అయితే డెస్పాంగ్‌ ప్రాంతం గురించి మంత్రి పేర్కొనలేదు. ఇది దౌలత్‌ బేగ్‌ ఓల్డీకి చెందిన కీలక ప్రాంతం. దీన్ని వశపర్చుకోవడం అనేది చాలా దీర్ఘకాలిక సైనిక చర్యల ఎజెండాలో భాగమై ఉంటోంది. 5,180 చదరపు కిలోమీటర్ల పొడవైన షాక్స్‌గామ్‌ లోయతో ముడిపడిన  ఈ దౌలత్‌ బేగ్‌ ఓల్డీ ప్రాంతాన్ని పాకిస్తాన్‌ 1963లోనే చైనాకు అప్పగించింది. ఇది చైనా పాకిస్తాన్‌ ఆర్థిక క్యారిడార్‌తో అనుసంధానమైంది. దౌలత్‌ బేగ్‌ ఓల్డీని కోల్పోవడం అంటే పాకిస్తాన్‌ బలగాలను, చైనా పీఎల్‌ఏను వేరు చేస్తున్న భారత్‌ స్వాధీనంలోని సియాచిన్‌ మంచుగోడను బలహీనపరుస్తుంది. వాస్తవాధీన రేఖ వద్ద సాంప్రదాయికంగా ఉన్న తమ గస్తీ కేంద్రాలకు భారత్‌ బలగాలు తరలిపోకుండా డెస్పాంగ్‌ వద్ద చైనా ఏకపక్షంగా అవరోధాలు కల్పించింది. 

అందుకే ఎంపిక చేసిన ప్రాంతాల్లోనే ఇరుదేశాల సైనిక బలగాల ఉపసంహరణపై కాంగ్రెస్‌ పార్టీ కేంద్రాన్ని నిలదీసింది. 2020 ఏప్రిల్‌ నాటి యధాతథ పరిస్థితిని నెలకొల్పడంపై రక్షణమంత్రి ప్రకటన కనీస హామీని ఇవ్వకపోవడంపై కాంగ్రెస్‌ పార్టీ ఆందోళన వ్యక్తం చేసింది. చైనా నుంచి ఎలాంటి ప్రతిఫలాన్ని డిమాండ్‌ చేయకుండానే భారత్‌కు ఆధిపత్యం ఉన్న పర్వతశిఖరాల నుంచి తన బలగాలను ఉపసంహరించుకోవడానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించడంపై కాంగ్రెస్‌ తీవ్రవిచారం ప్రకటించింది. ఈ అంశంపై వివరణను కోరడానికి కాంగ్రెస్‌ ఎంపీ అధీర్‌ రంజన్‌ చౌదరి ప్రయత్నించినప్పుడు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అర్జున్‌ మెఘ్వాల్‌ ఆయన్ని అడ్డుకుని దేశ రక్షణ బలగాలను చూసి గర్వపడుతున్నానని పేర్కొనడం అతిపెద్ద వింత. చైనాతో బలగాల ఉపసంహరణ ఒప్పందంలో దాగిన ప్రయోజనాలను వివరించడానికి బదులుగా జాతీయ రక్షణ త్రయం రక్షణ మంత్రి, విదేశాంగమంత్రి, జాతీయ భద్రతా సలహాదారు నైపుణ్యాల గురించి వల్లెవేస్తూ కధలల్లడానికి ప్రభుత్వాధికారులు సిద్ధమైపోయారు. వీరి సమిష్టి కృషి వల్లే సరిహద్ధు ఘర్షణల్లో స్తబ్దతను తొలగించగలిగామని రక్షణ, దౌత్యం, అంతర్జాతీయ భాగస్వామ్యంపై భారత్‌ ప్రతిష్టను పునరుద్ధరించామని అధికారులు గప్పాలు కొట్టసాగారు.

అదే సమయంలో తమ లక్ష్యాలను మార్చుకోవడం చైనీయుల ప్రవృత్తిలో భాగమైంది. ముందుగా పురోగమించిన వారే మొదటగా ఉపసంహరించుకోవాలనే సూత్రాన్ని గుర్తు చేస్తూ పైచేయి సాధిం చారు. సరిహద్దు చర్చలు ఒకడుగు వెనక్కి, రెండడుగులు ముందుకు అనే చైనా వైఖరికి అనుగుణంగానే ముగిశాయి. కీలకమైన డెస్పాంగ్‌ ప్రాంతాన్ని అది తన ఆధీనంలోనే ఉంచుకుంది. పాంగాగ్‌ సరస్సు ఉత్తర, దక్షిణ ప్రాంతాల్లో వ్యూహాత్మకంగా అధమస్థాయితో కూడిన రంగాల వారీ ఉపసంహరణకు అమోదం తెలుపడం ద్వారా కొన్ని ఫింగర్‌ ప్రాంతాలపై పట్టు కోసం చూసల్‌ పర్వత శ్రేణిలో మనకున్న ఆధిపత్య స్థానాన్ని వదులుకోవడం అనేది వ్యూహాత్మక విజయం కాదు వ్యూహాత్మక తప్పిదమే అవుతుంది. మొత్తం మీద చూస్తే వాస్తవాధీన రేఖపై యధాతథ స్థితిని పునరుద్ధరించడం అనే భారత కల ఎన్నటికీ ఫలించనిదిగా ఉండిపోతుంది.

మేజర్‌ జనరల్‌ అశోక్‌ కె. మెహతా
వ్యాసకర్త 
 

మరిన్ని వార్తలు