అమరావతి నిర్మాణం ఎలా సాధ్యమో మీరే చెప్పండి!

12 Sep, 2022 14:07 IST|Sakshi

అమరావతి రాజధాని పేరుతో రాజధాని రైతుల ఆందోళనకు 1,000 రోజులు. నేటి నుంచి ‘అమరావతి – అరసవిల్లి పాదయాత్ర’ ప్రారంభిస్తున్నారు. ఈ మధ్యనే ‘అమరావతి వివాదాలు– నిజాలు’ పేరుతో ఓ పుస్తకాన్ని కూడా విడుదల చేశారు. 1,000 రోజుల ఆందోళన, పుస్తకాలు, వేల కొద్దీ ఏకపక్ష మీడియా చర్చలు జరిపారు. కానీ కీలకమైన అనుమానాలకు మాత్రం సమాధానం చెప్పే ప్రయత్నం చేయకపోగా తమపై దాడి చేస్తున్నారంటూ సెంటిమెంట్‌ను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. 

ఏపీలో మరో కొత్త నగరం సాధ్యమా? నూతన నగర నిర్మాణానికి అవసరమైన నిధులు ఎలా సమకూరుతాయి? విశాఖతో సహా ఐదారు నగరాలు ఉన్న రాష్ట్రంలో మరో నగరానికి అవకాశం ఉన్నదా? కీలకమైన ఈ ప్రశ్నలకు ఎలాంటి సమాధానాలూ లేవు.

పంజాబ్‌ – హరియాణా రెండు ధనిక రాష్టాల ఉమ్మడి రాజధానిగా, కేంద్రపాలిత ప్రాంతంగా 1966లో చండీగఢ్‌ పేరుతో నూతన నగరంతో కూడిన రాజధాని నిర్మాణం ప్రారంభించారు. రెండు రాష్ట్రాల జనాభా దాదాపు 5 కోట్లు. నూతన నగర నిర్మాణానికి పూనుకున్న నాటికే రెండు రాష్ట్రాలలో లూథియానా, అమృత్‌సర్, పాటియాలా, జలంధర్, పానిపట్, ఫరీదాబాద్, గురుగావ్‌ లాంటి పట్ట ణాలు ఉన్నాయి. నేడు అవి నగరాలుగా మారి 90 లక్షల జనాభాకు చేరాయి. మొత్తం రెండు రాష్ట్రాల జనాభాలో 20 శాతం జనాభా నగరాలలోనే ఉన్నది. పట్టణ జనాభా శాతం పంజాబ్‌లో 36 అయితే, హరియాణాది 33 శాతం. దాని ఫలితంగా రెండు ధనిక రాష్టాల రాజధాని చండీగఢ్‌ నగర జనాభా 56 ఏళ్ల తర్వాత కూడా 11 లక్షలకు చేరుకోలేదు. అలాగే ఛత్తీస్‌గఢ్‌ నూతన రాష్ట్రంగా ఏర్పడిన తొలి నాళ్ళ లోనే రాయపూర్‌ సమీపంలో ‘నవరాయపూర్‌ అటల్‌ నగర్‌’ పేరుతో కొత్త నగర నిర్మాణానికి పూనుకున్నారు. 

నూతన నగర నిర్మాణం ప్రారంభించడానికి ముందే 3 కోట్ల ప్రస్తుత జనాభా కలిగిన ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో భిలాస్‌ పూర్, రాయ్‌పూర్‌ , భిలాయ్‌ లాంటి నగరాలు ఉన్నాయి. ప్రస్తుతం వాటి జనాభా 25 లక్షలు. రాష్ట్ర జనాభాలో మొత్తం పట్టణ జనాభా దాదాపు 30 శాతం ఉన్నది.  20 సంవత్సరాల క్రితం నిర్మాణం ప్రారంభించిన రాజధాని నగర జనాభా నేటికీ 5.6 లక్షలే. 

అలాగే ఢిల్లీ సమీపంలో ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో గౌతమ బుద్ధ నగర్‌ జిల్లాలో నోయిడాను 1976లో ప్రారంభించారు. నేడు అది పారిశ్రామిక అభివృద్ధికి కేంద్రంగా మారింది. నోయిడా ఢిల్లీకి 40, ఘాజియాబాద్‌కు 27, ఫరీదాబాద్‌కు 30 కిలోమీటర్ల సమీపంలో ఉన్నది. 40 ఏళ్ల తర్వాత కూడా నోయిడా జనాభా 6.4 లక్షలే. పారిశ్రామికంగా అభివృద్ధి చెందినా కూడా అప్పటికే సమీపంలో అభివృద్ధి చెందిన నగరాలు ఉంటే మరో కొత్త నగర అభివృద్ధి సాధ్యం కాదు అని ఈ ఉదాహరణలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ నూతన రాజధాని నగరంగా అమరావతిని నిర్మించడం సాధ్యమేనా అనేది పరిశీలించడం సమంజసం.

ఆంధ్రప్రదేశ్‌ ప్రస్తుత రాష్ట్ర జనాభా 5.5 కోట్లు. వెలగపూడి కేంద్రంగా అమరావతిని నూతన రాజధానిగా నిర్మించాలనుకునేనాటికి విశాఖ, విజయవాడ, గుంటూరు, తిరుపతి, నెల్లూరు, కర్నూలు నగరాలు అందుబాటులో ఉన్నాయి. ఇవి కాక ప్రతి జిల్లాలో 2 లక్షల జనాభా కలిగిన పట్టణాలు పదుల సంఖ్యలో ఉన్నాయి. మన రాష్ట్రంలో ఇప్పటికే అందుబాటులో ఉన్న కేవలం 6 నగరాల జనాభా 70 లక్షల పైమాటే. ఇది రాష్ట్ర జనాభాలో 15 శాతం. పదుల సంఖ్యలో ఉన్న పట్టణ  జనాభా మొత్తం కోటి దాటింది. స్థూలంగా రాష్ట్ర జనాభాలో పట్టణ జనాభా 34 శాతం. దేశంలో మిగతా చోట్ల నిర్మించిన కొత్త రాజధానుల అభివృద్ధి సరళిని దృష్టిలో పెట్టుకుని చూసినప్పుడు... హైదరాబాద్‌ వంటి మెట్రోపాలిటన్‌ సిటీగా అమరావతి ఎదగాలంటే సాధ్యమయ్యే పనేనా?

సమీపంలో నగరాలు ఉంటే కొత్త నగరంలో ఉపాధి అవకాశాలు ఉన్నా ప్రజలు నివాసాలు ఏర్పాటు చేసుకోరని నోయిడా నేర్పుతున్న పాఠం! అలాంటిది ప్రతిపాదిత అమరావతికి 35 కిలోమీటర్ల దూరంలో గుంటూరు, 19 కిలోమీటర్ల దూరంలో విజయవాడ, 15 కిలోమీటర్ల దూరంలో మంగళగిరి అభివృద్ధి చెంది ఉన్నాయి. ఈ పరిస్థి తులలో నూతన మహానగరం ఎలా సాధ్యం? కోటికిపైగా జనాభా కలిగిన హైదరాబాద్‌ స్థాయిలో అమరావతిని నిర్మించడం ఎలా సాధ్యం అవుతుందో ఆందోళన చేస్తున్న రైతులు చెప్పకపోయినా... ఆ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న నేతలూ, మద్దతు ఇస్తున్న రాజకీయ పార్టీలూ రాష్ట్ర ప్రజలకు చెప్పాలి. 

రాష్ట్ర ప్రజలు రాజధాని రైతు ఉద్యమం పేరుతో సెంటిమెంట్‌ రాజకీయాలకు అతీతంగా వాస్తవిక దృక్పథంతో ఆలోచించాలి. రాజధాని ఉద్యమ నాయకత్వానికి రాజకీయాలు ఉండవచ్చు. మద్దతు ఇస్తున్న రాజకీయ పార్టీలకు రాజకీయ ప్రయోజనాలు ఉండవచ్చు. కానీ దాదాపు 34 వేల ఎకరాల భూమి ప్రభుత్వానికి ఇచ్చి ఒప్పందం చేసుకున్న రైతులకు రాజకీయాలు ఆపాదించకూడదు. సమాచారం లోపం, నాటి ప్రభుత్వం కల్పించిన ఆశలు, వివేచన లేకుండా రాజకీయ కోణంలో మద్దతు ఇస్తున్న రాజకీయ పార్టీల మాటలు నమ్మి రైతులు మహా నగరం సాధ్యమనే ఆశతోనే నేటికీ ఉన్నారు. ప్రభుత్వం రైతులకు సావధానంగా నిజాలు చెప్పాలి. 

అంతిమంగా ‘‘ఆంధ్రప్రదేశ్‌ రాష్టానికి ప్రస్తుత పరిస్థితుల్లో కావాల్సినది నూతన నగరం కాదు. ప్రాంతాల మధ్య సమతుల్యత. రాష్ట్ర వనరులను, శక్తి సామర్థ్యాలను రాజధాని ప్రాజెక్టు కోసం వెచ్చించడం అంటే ఆత్మహత్యా సదృశమే అవుతుంది’’ అన్న విభజన చట్టం ప్రకారం ఏర్పడిన శివరామకృష్ణన్‌ కమిషన్‌ చెప్పిన మాటలు బాధ్యత కలిగిన ప్రభుత్వం, విపక్షాలు, అమరావతి రైతులు– ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు మరిచిపోకూడదు. (క్లిక్ చేయండి: ఆంధ్రకు వరం ఈ కొత్త ‘పార్క్‌’)


- మాకిరెడ్డి పురుషోత్తమ రెడ్డి 
‘రాయలసీమ మేధావుల ఫోరం’ కన్వీనర్‌

మరిన్ని వార్తలు