అస్తిత్వం కోసం ఆదివాసీల ఆరాటం

3 Dec, 2020 00:58 IST|Sakshi

దేశంలోని ఆదివాసీ సంఘాలు, తమ తెగల కోసం ప్రత్యేకంగా ఆదివాసీ మతం పేరుతో జనాభా లెక్కల్లో ప్రత్యేక కాలమ్‌ కేటాయించాలని డిమాండ్‌ చేస్తున్నాయి. జనాభా గణ న సందర్భంగా ఆదివాసీలను ఇతర మతాల్లో కలపకుండా ప్రత్యేక గుర్తింపు కోడ్‌ కాలమ్‌లో చేర్చాలని జార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ శాసనసభలో చేసిన తీర్మానం సభ ఆమోదం పొందింది. జార్ఖండ్‌లోని ఆదివాసీ సంఘాలు మాత్రమే కాకుండా దేశంలోని ఆదివాసీ సంఘాలు కూడా, తమ తెగల కోసం ప్రత్యేకంగా ఆదివాసీ మతం పేరుతో జనాభా లెక్కల్లో ప్రత్యేక కాలమ్‌ కేటాయించాలని డిమాండ్‌ చేస్తున్నాయి. కేంద్రం, జనగణన విభాగం దీన్ని ఆమోదించడం సాధ్యం కాకపోవచ్చు కానీ ఇది ప్రారంభం మాత్రమే. ఇది క్రమంగా ఆదివాసీల అస్తిత్వ ఉద్యమంగా రూపుదిద్దుకోవడం ఖాయం.

‘‘జనాభా లెక్కల్లో ఆదివాసీలను హిందు వుల్లోగానీ, ఏ ఇతర మతాల్లోగానీ చేర్చకూ డదు. వారిని జనాభా లెక్కల్లో ‘సరన’ కోడ్‌ కాలమ్‌లో చేర్చాలి. గత నలభై ఏళ్ళుగా ఆదివాసీలు  చేస్తున్న ఈ డిమాండ్‌ని శాసనసభ ఆమో దించాలి’’ అంటూ జార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ శాసన సభలో తీర్మానం ప్రవేశపెట్టారు. గత చరిత్రలో ఎన్నడూ జరగని విధంగా నవంబర్‌ 11వ తేదీన ఒక రోజు ప్రత్యేక సమావేశం నిర్వ హించి, ఈ తీర్మానాన్ని ఆమోదించారు. ప్రతిపక్షంలో ఉన్న భారతీయ జనతా పార్టీ(బీజేపీ) ఈ తీర్మానాన్ని వ్యతిరేకించలేదు. కానీ కొన్ని అభ్యంతరాలను లేవనెత్తింది. సాంకేతికంగా సమస్యలున్నాయని ఆ పార్టీ నాయకులు బాబూలాల్‌ మరాండి పేర్కొన్నారు. 

అయితే సరన కోడ్‌ను జనాభా లెక్కల్లో చేర్చాలనే డిమాండ్‌ను హేమంత్‌ సోరెన్‌ నాయకత్వం వహిస్తున్న జార్ఖండ్‌ ముక్తి మోర్చా(జేఎంఎం) తన ఎన్నికల ప్రణాళికలో ప్రకటించింది. అంతేకాదు, ఈ విషయంపైన జార్ఖండ్‌లోని ఆదివాసీ సంఘాలు మాత్రమే కాకుండా దేశంలోని ఆదివాసీ సంఘాలు, తమ తెగల కోసం ప్రత్యేకంగా ఆదివాసీ మతం (ట్రైబల్‌ రిలీజియన్‌) పేరుతో జనాభా లెక్కల్లో ప్రత్యేక కాలమ్‌ కేటాయించాలని డిమాండ్‌ చేస్తున్నాయి. జార్ఖండ్‌ శాసనసభ చేసిన తీర్మానం పైన కేంద్ర ప్రభుత్వం, జనాభా గణన విభాగం (సెన్సెస్‌ డిపార్ట్‌మెంట్‌) సానుకూలంగా ఉంటుందని ఎవ్వరూ భావించడం లేదు. అయితే ఇది ప్రారంభం మాత్రమే. మిగతా రాష్ట్రాల్లో ఈ డిమాండ్‌ ఊపందుకునే అవకాశం మెండుగా ఉంది. 

ఇది క్రమంగా ఆదివాసీల అస్తిత్వ ఉద్యమంగా రూపుదిద్దుకోవడానికి ఉపయోగపడు తుందన్నది వాస్తవం. భారతదేశంలో 1871లో జనాభా గణన ప్రారంభం అయినప్పటి నుంచి ఆదివాసీలను ‘అబ్‌ ఆర్జినల్స్‌’గా పేర్కొన్నారు. 1901 నుంచి 1942 వరకు జనాభా లెక్కల్లో ఆది వాసీలను యానిమిస్ట్స్‌ అని పేర్కొన్నారు. దానర్థం ‘ప్రకృతి ఆరా ధకులు’ అని. అయితే భారతదేశం స్వాతంత్య్రం సిద్ధించిన తర్వాత ఆదివాసీలను ప్రత్యేకంగా గుర్తించడం ఆపేశారు. అప్పటి నుంచి వారిని హిందువులుగానో, క్రైస్తవులుగానో లేదా ఇతర మతాల గాటనో కట్టేశారు. 

నిజానికి చరిత్ర పరిశోధకులుగానీ, మానవ శాస్త్ర నిపుణులుగానీ ఆదివాసీలు ప్రత్యేక మత సాంప్రదాయాలు కలిగిన వారుగానే పేర్కొ న్నారు. ఏ దేశంలోనైనా అడవుల్లో, కొండల్లో నివసించే వారి సాంప్రదా యాలు విభిన్నంగానే ఉంటాయి. వాళ్ళల్లో విగ్రహారాధనగానీ, ఇతర మనుషుల రూపంలో ఉండే దేవుళ్ళు, దేవతలుగానీ ఉండరు. సమస్త ప్రకృతే వారి దైవం. చెట్లు, కొండలు, జంతువులు, పక్షులు, ప్రకృతి లోని ఇతర గాలి, నీరు లాంటివే వారికి ఆరాధ్యదైవాలు. 

‘సరన’ అంటే ఒక చెట్టు పేరు. దానిని ‘సాల్‌ ట్రీ’ అంటారు. అంటే తెలుగులో మద్ది చెట్టు అన్నమాట. ఇది చరిత్రలో కూడా ఎంతో ఆరాధ్య వృక్షంగా వుంది. గౌతమ బుద్ధుడు జన్మించింది, మహాపరి నిర్వాణం పొందింది కూడా ఈ మద్దిచెట్ల మధ్యనే అని బౌద్ధ సాహిత్యం ద్వారా తెలుస్తోంది. ఇప్పుడు మన దేశంలోని ప్రధాన ఆదివాసీ తెగలన్నీ కూడా ఏదో ఒక రకమైన ప్రకృతి ఆరాధనలోనే ఉన్నాయి. భారతదేశంలోని ప్రధానమైన ఆదివాసీ తెగల్లో సంతాల్‌ ఒకటి. తమ పూర్వీకుల ఆత్మలే తమకు మంచి, చెడు చేకూరుస్తాయని నమ్ముతారు. 

అదేవిధంగా ఒక తోటలోని చెట్లలో తమ పూర్వీకులు నివసిస్తుంటారని, తమకు సమీపంలోని కొండల్లో వాళ్ళు కొలువుదీరి ఉంటారని సంతాల్‌ తెగ నమ్ముతుంది. మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న చెంచులు చెట్లకు ప్రతిరూపంగా గరెలైసమ్మకు పూజ చేస్తారని అంటారు. మన దేశంలోని మరో ప్రధానమైన తెగ గోండ్‌ తెగ. వీళ్ళు ప్రధానంగా ప్రకృతి ఆరాధకులు. నాగజాతి ఆరాధకులు. నాగోబా జాతర పేరుతో జరిగే జాతర వీరి సాంప్రదాయంలో చాలా ముఖ్యమైన జాతర. వీళ్ళ గూడేల్లో కూడా ఏ హిందూ దేవుళ్ళో, లేదా దేవతల విగ్రహాలో ఉండేవి కావు. వీరిలో మనిషిని బలిచ్చే సాంప్రదాయం ఉండేది. ఎంత శక్తిమంతులను బలిస్తే, అంత ఫలితం ఉంటుందని వీళ్ళు 
1
9వ శతాబ్దం వరకు నమ్మేవారు.  
మరొక తెగ ‘ఖిల్‌’. వీళ్ళ ప్రకృతి ఆరాధనతో పాటు, మంత్రా లను, తంత్రాలను విశ్వసిస్తారు. కోయ, కొండరెడ్లు, కోంద్, ఇతర తెగలన్నీ గతంలో ప్రకృతి ఆరాధకులుగానే ఉన్నారు. ఇటీవల కొంతకాలంగా, కొందరు క్రైస్తవులుగా, మరికొందరు హిందూ దేవత లను ఆరాధించేవాళ్ళుగా మారిన మాట వాస్తవమే. అయితే ఇటీవల ఆదివాసులలో పెరిగిన రాజకీయ చైతన్యం ఆదివాసీలను తమ అస్తిత్వ ఉద్యమంవైపు అడుగులు వేసేలా చేస్తోండడం ఆహ్వానించదగ్గ పరి ణామం. అయితే వాళ్ళు ఈ దేశంలోని మెజారిటీ మతం కలహించే సమాజం, సంస్థలు, ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాల వల్ల నిరాశకు గురవుతున్నారు. 

రాజ్యాంగంలో వీరిని షెడ్యూల్డ్‌ తెగలుగా గుర్తిస్తుంటారు. దానికి కొన్ని ప్రాతిపదికలు ఉన్నాయి. అవి 1. భౌగోళికంగా ప్రత్యేక ప్రాంతం, ప్రత్యేకించి అడవులు, కొండలు. 2. ప్రత్యేక భాష, 3. ప్రధాన సమాజానికి భిన్నంగా ప్రాచీన సాంప్రదా యాలు, ప్రత్యేకించి ప్రకృతి ఆరాధన. 4. వెనుకబడిన ఆర్థిక విధానం, ప్రకృతి వనరులపైన ఆధారపడిన జీవన విధానం, 5. ప్రత్యేక తెగగా ఉండడం, 6. అన్ని సమస్యలనూ, వ్యవహారాలనూ వారి సంఘం నేతృత్వంలో పరిష్కరించుకొనే తమదైన ప్రత్యేక పాలనా విధానం. ఈ విధమైన జీవనవిధానాన్ని బట్టి వారిని ఆదివాసీలుగా గుర్తించాలని భారత 
ప్రభుత్వమే ఎన్నో ఏళ్ళ కిందట నిర్ణయించింది. 

ఇప్పటికీ ఆదివాసీలు తమ మత విధానాలను వదులుకోలేదని, బయటి ప్రపంచం ప్రభావం కొంత ఉన్నప్పటికీ తమ అస్తిత్వాన్ని కాపాడుకుంటున్నది వాస్తవం. మన దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 72 ఏళ్ళు గడిచిపోయాయి. ఎన్నో ప్రణాళికలు, పథకాలు రచించారు. మరెన్నో విధివిధానాలు రూపొందించారు. కానీ అవి మిగతా పేదలు, దళితులతో పాటు, ఆదివాసీలకు అందించాల్సిన స్థాయిలో అంద లేదు. ఇప్పటికీ ఆదివాసీలు అభివృద్ధిలో భాగం కాలేకపోయారు. అంతేకాకుండా, మన ప్రభుత్వాలు, పాలకులు, పెద్దలు అనుసరిస్తున్న అభివృద్ధి విధానాల వల్ల ఆదివాసీలకు ప్రయోజనం చేకూరకపోవడం మాత్రమే కాదు, వారు అభివృద్ధిలో బలిపశువులుగా మారుతున్నారు. గత 30 ఏళ్లనుంచి ఇప్పటి వరకు 3 కోట్ల మంది ఆదివాసీలు నిరాశ్ర యులయ్యారని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 

ప్రాజెక్టులు, ఫ్యాక్టరీలు, గనులు, బహుళజాతి కంపెనీల వల్ల, తాము వేల ఏళ్ళుగా నివసిస్తోన్న నేలను వీడి, తాము దైవ స్వరూపంగా భావించే భూమిని వదులుకొని, వలసపోతున్నారు. అభివృద్ధి పేరుతో ఆదివాసీలపై జరుగుతోన్న అకృత్యాలెన్నో లెక్కలో లేవు. అంతే కాకుండా రాజ్యాంగంలో పొందు పరిచిన ఐదవ, ఆరవ షెడ్యూల్స్‌లో ఎన్నో రక్షణలు ఉన్నప్పటికీ ఆచరణలో అవి ఎంత మాత్రం అండగా నిలబడలేకపోతున్నాయి. రాజ్యాంగం అమలుకి వచ్చి ఏడు దశాబ్దాలు దాటిపోయాయి. ఆదివా సీల ప్రగతికి పదికిపైగా కమిషన్లు, కమిటీలు నివేదికలు ఇచ్చాయి. కానీ ఏ ఒక్కటీ కూడా మనస్ఫూర్తిగా, చిత్తశుద్ధితో అమలు చేయలేదు. 

ఇప్పటికే ఆదివాసీ ప్రాంతాల్లోని పిల్లలు, యువకుల చదువు అంతంత మాత్రంగానే ఉంది. అడవులు, కొండ కోనలు దాటి ఉన్నత విద్యను ఆర్జిస్తున్న వారు, వారి జనాభాలో రెండు శాతం మాత్రమే. అంటు వ్యాధులు, ఇతర సీజనల్‌ జబ్బులు వారిని ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటాయి. టి.బి., ఇతర తీవ్రమైన రోగాలతో ప్రతి సంవత్సరం వేలాదిమంది ఆదివాసీలు ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రతి ఏడాది ఐదు సంవత్సరాలలోపు పిల్లలు ఒక లక్షా నలభైవేల మంది మృత్యు వాత పడుతున్నట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 

అడవిలో లక్షల ఎకరాల భూమి ఉన్నప్పటికీ, ఆదివాసీలు తర తరాలుగా ఆ అడవే జీవితంగా బతుకుతున్నప్పటికీ వారి కాళ్ళకింది నేల వారిది కాదు. వారు జీవిస్తోన్న అడవిపై వారి హక్కు కాగితాలకే పరిమితం. రకరకాల పేర్లతో, అభివృద్ధి పథకాల నెపంతో ఆదివాసీ లకు చెందాల్సిన భూమి మొత్తం అన్యాక్రాంతమౌతోంది. అందుకే అవునన్నా, కాదన్నా జల్, జంగిల్, జమీన్‌ అనే నినాదం మరింత తీవ్ర తరం అవుతున్నది. 

భారత సమాజం, భారత ప్రభుత్వం అనుసరి స్తున్న దోపిడీ, నిర్లక్ష్యం ఆదివాసీలను ప్రత్యేక అస్తిత్వం వైపు నడిపిస్తు న్నది. జార్ఖండ్‌ అసెంబ్లీలో ప్రత్యేక ఆది వాసులను ప్రత్యేక మతంగా గుర్తించాలని చేసిన తీర్మానం భారత సమాజానికి, కేంద్ర ప్రభు త్వాలకు చేసిన ఒక హెచ్చరిక. ఇప్పటికైనా వివక్షకు, విద్వేషానికి, విస్మరణకు గురౌతోన్న కులాల, తెగల విషయంలో సానుకూల దృక్పథం అనుసరించకపోతే ఫలితాలు మన ఆలోచనలకు అందనంత దూరంలో ఉంటాయన్న విషయాన్ని మరువకూడదు.
వ్యాసకర్త: మల్లెపల్లి లక్ష్మయ్య, సామాజిక విశ్లేషకులు

మొబైల్‌ : 81063 22077

మరిన్ని వార్తలు