Krishnapatnam Anandaiah: దేశీయ వైద్యానికి అసలు వారసుడు

3 Jun, 2021 01:28 IST|Sakshi

విశ్లేషణ

మేకలు తినని మొక్కల్లో ఔషధ గుణాలున్నాయని గుర్తించిన గొల్లకులం వారసుడు ఆనందయ్య. తరతరాలుగా ఆయన కుటుంబం మూలికా వైద్యం చేస్తోంది. ఆనందయ్యకు వారసత్వంగా వస్తున్న జ్ఞానాన్ని ఏ ఆయుర్వేద పండితుడూ పరిశీలించలేదు. దానిపై పరిశోధనలు జరపలేదు. ఇట్లా దేశ వ్యాప్తంగా కొన్ని లక్షల మంది ఉన్నారు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఇక్కడ ఉన్న దేశీయ వైద్య విధానాన్నంతటినీ సమగ్రంగా అధ్యయనం చేసి, ఆధునిక అల్లోపతి వైద్య విధానాన్ని కూడా పరిగణనలోనికి తీసుకొని ఈ దేశ అవసరాలకు అనుగుణ మైన ఒక నూతన వైద్య విధానాన్ని రూపొందించే అవకాశం మనకు వచ్చింది. ఇప్పటికైనా పాత పాపాలను కడుగుకొని, కొత్త సమాజానికి పునాదులు వేస్తే చరిత్ర మనల్ని కొంతైనా క్షమిస్తుందేమో.

కృష్ణపట్నం ఆనందయ్య అంటే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశంలోనే తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదు. నెల్లూరు జిల్లా కృష్ణపట్నంకి చెందిన ఆనందయ్య కరోనా కోసం తయారుచేసి, పంపిణీ చేసిన మందు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశమంతటా చర్చనీయాంశంగా మారింది. ఆయుర్వేదం ఔషధాలు, అల్లోపతి వైద్యంపైన కూడా వాదాలూ, వివాదాలూ తలెత్తాయి. కొంత మంది ఆయుర్వేదం మాత్రమే గొప్ప దంటే, మరికొందరు అది పూర్తిగా అశాస్త్రీయమైనదని కొట్టిపారేశారు. నిజానికి ఏదేశానికైనా తమ దేశ కాలమాన పరిస్థితుల్లో ఆవిర్భవించి, అభివృద్ధి పరుచుకున్న వైద్య విధానం ఒకటుంటుంది. భారతదేశంలో అటువంటి వైద్య విధానం ఉండేది. అదే ఆయుర్వేద సిద్ధ వైద్యం, మూలికా వైద్యం, దీనికి ఇంకా ఎన్నో పేర్లున్నాయి.

అయితే వాటి గతి ఎటువంటి పురోగతి లేని నిరర్ధకంగా మారిపోయింది. ఒక విధంగా చెప్పాలంటే ఆనందయ్యలు ఎక్కడైతే ఆగిపోయారో అక్కడే భారత వైద్యం స్తంభించిపోయింది. భారత్‌లోనే కాదు, ప్రపంచమంతటా విస్తరించిన అల్లోపతి లేదా ఆధునిక లేదా, పాశ్చాత్య వైద్యం అనే పేర్లతో పిలుస్తోన్న ఇంగ్లిష్‌ వైద్యం రోజురోజుకీ నూతన ఆవిష్కరణ లతో మనిషిని చిరాయువు చేసేవైపు పురోగమిస్తోంది. ఎవరికి ఏ అభిప్రాయాలున్నా శాస్త్ర రీత్యా అల్లోపతి అత్యాధునిక విధానాలతో మానవుణ్ణి ఎంతో ఉన్నతస్థాయిలో నిలబెట్టింది. 

అయితే ఇప్పుడు మన దేశంలో ఉన్న ఆయుర్వేదం, సిద్ధ, మూలికా వైద్యాలు అశాస్త్రీయమైనవని నేను అనదలుచుకోలేదు. కానీ వాటి ఉన్నతిని, పురోభివృద్ధినీ మన సమాజమే అడ్డుకున్నది. మన తల్లిని మనమే హతమార్చినట్టుగా మన వైద్యాన్ని మనమే మట్టు బెట్టాం. చరిత్రను తవ్వితీస్తే అథఃపాతాళంలోకి తొక్కివేసిన మనకిప్ప టికీ ఎంతో విలువైన, ఉపయోగకరమైన వైద్యం బయటపడుతుంది. 

ఈనాటి ఆధునిక వైద్యమని చెప్పుకుంటున్న అల్లోపతికి, గ్రీకు వైద్య తాత్వికవేత్త గ్రీస్‌కి చెందిన హిప్పోక్రిటస్, ఆయన గురువు డెమొక్రిటస్‌ ఆద్యులు. హిప్పోక్రిటస్‌ క్రీస్తు పూర్వం 4వ శతాబ్దానికి చెందినవాడు. అప్పటివరకు మనిషి కేవలం దైవ ప్రార్థన మీద మాత్రమే ఆధారపడి ఉన్నాడు. ఎటువంటి శాస్త్రీయమైన ఔషధాలు గానీ, వైద్య విధానంగానీ లేవు. అయితే దానిని పూర్తిగా మార్చివేసి, మానవుడు తనను తాను కాపాడుకోగలడని, అందుకు వైద్యం అవసర మని, రోగాలను, రోగకారకాలను, రోగనివారణకు, రోగనిర్మూలన కోసం ఎంతో శ్రమించి ఒక విధానాన్ని రూపొందించారు. దాని పునాదుల మీదనే నేటి అల్లోపతి వైద్య విధానం వృద్ధి చెందింది. ఎన్నో వ్యాధులకు మందులు కనిపెట్టడం మాత్రమే కాదు, మరెన్నో మహ మ్మారులకు వ్యాక్సినేషన్‌లను కనుగొని మానవాళిని రక్షించింది.

అయితే అది వ్యాపారంగా మారి, కంపెనీలు, కార్పొరేట్లు వేల కోట్ల రూపాయల పెట్టుబడులతో ప్రజలను దోచుకోవడానికి ఒక సాధనంగా ఉపయోగపడుతోంది. ఇది వైద్యం తప్పు కాదు, దానిని వ్యాపారంగా మార్చిన కార్పొరేట్లదే ఆ తప్పిదం అని చెప్పక తప్పదు. వాటికి అండగా నిలబడుతున్న ప్రభుత్వాలది కూడా అంతకు మించిన తప్పు. అయితే అల్లోపతి ప్రగతి గురించి అందరికీ తెలుసు. 

అయితే మన దేశంలో మన దేశీయ వైద్యం ఎందుకు శతాబ్దాల క్రితమే ఆగిపోయింది? ఎందుకు అది ప్రజల వైద్యావసరాలను తీర్చ లేకపోతున్నది? ఇది మనం ఆలోచించుకోవాల్సిన అవసరమున్నది. సరిగ్గా గ్రీస్‌లో ఆధునిక వైద్యం పురుడుపోసుకున్న కాలంలోనే క్రీస్తు పూర్వం మూడవ శతాబ్దంలో చరకుడు అనే భారత వైద్య పితా మహుడు చరకసంహిత రాశాడు. దీనిని ఎనిమిది పుస్తకాలుగా, 120 అధ్యాయాలుగా విభజించారు. ఇందులో ఆహారం, పరిశుభ్రత, రోగ నిరోధం, వైద్యం, ఔషధాలు, వైద్యుడు, నర్సు, రోగి అనుసంధానం గురించి వివరంగా రాశారు. ఇది పూర్తిగా ఎంతో అధ్యయనం చేసి, రాసిన పుస్తకం. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిందేమిటంటే, అది బౌద్ధం అనంతరం రాసిన పుస్తకం.

అయితే బౌద్ధం సమయంలో వైద్యం ఆచరణలో ఉంది. జీవకుడు అనే వైద్యుడి గురించి బౌద్ధ సాహిత్యం ప్రస్తావించింది. అంతేకాకుండా స్వయంగా బుద్ధుడు వైద్యుడనే ప్రస్తావన కూడా ఉంది. బౌద్ధారామాలు అన్నీ మిగతా విష యాలతో పాటు, ఆరోగ్య కేంద్రాలుగా పనిచేశాయి. బౌద్ధ బిక్కులు వైద్యాన్ని కూడా అనుసరించారు.  అప్పటివరకు వేదాలు, మహిమలు తప్ప వైదిక మతాన్ని ఆచరిస్తున్న పురోహిత, బ్రాహ్మణ వర్గం వైద్యంపై దృష్టిపెట్టలేదు. పైగా వైద్యం చేస్తున్న వాళ్ళను సామాజిక వెలివేతకు గురిచేశారు. ఎందుకంటే, రోగాలను, వారి రుగ్మతలను రూపుమాప డానికి వాళ్లందరినీ అంటుకొని వైద్యం చేయాలి. వారిని అంటుకో వడం ద్వారా వాళ్ళు మలినమైపోయారని వైదిక పెద్దలు భావించారు. అయితే బౌద్ధం ప్రభావం ఉన్నంత వరకు వాళ్ళు ఏమీ చేయలేక పోయారు.

క్రీస్తు పూర్వం ఒకటవ శతాబ్దంలో మౌర్య చక్రవర్తి అశోకుడి మనవడు బృహద్రధుణ్ణి బ్రాహ్మణ వర్గానికి చెందిన పుష్యమిత్ర శుంగుడు హత్య చేసి, బ్రాహ్మణ ఆధిపత్యంతో కూడిన శుంగ వంశ స్థాపన చేశాడు. ఆ తర్వాత మరో బ్రాహ్మణవంశమైన కణ్వ రాజ్యం వచ్చింది. ఈ రెండు రాజ్యాలు బౌద్ధాన్ని దెబ్బతీసి, దాని ప్రగతిశీల విధానాలను తిరగదోడాయి. అందులో భాగంగానే మనుధర్మం వచ్చింది. అందులో వైద్యులను నీచమైన వాళ్ళుగా నిర్ధారించారు. మనుధర్మంలోని మూడవ అధ్యాయంలోని 152వ, 180వ నిబం ధనల్లో వైద్యుడు ఎలాంటి పవిత్ర కార్యక్రమాల్లో, ప్రత్యేకించి యాగాల్లో పాల్గొనకూడదని, అతనికి ఆహారం అందిస్తే అది చీము, నెత్తురుతో సమానమని తీర్మానించారు. అదేవిధంగా 4వ అధ్యాయం లోని 212, 220 నిబంధనల్లో వైద్యునికి తిండి పెట్టకపోవడం మాత్రమే కాదు, ఆయన చేతి తిండిని తినకూడదని కూడా మను« ధర్మం శాసించింది. భారత వైద్యం నేలకరవడానికి ఇది తొలి దెబ్బ.

తర్వాత వైదిక మతం బ్రాహ్మణ మతంగా మారి ముందుకు వెళుతున్న సమయంలో అదే ఆయుర్వేదాన్ని తమ సొంతం చేసుకు న్నారు. అయితే వాళ్ళు ఈ వైద్యాన్ని మిగిలిన కులాలకు నేర్పించ కుండా జాగ్రత్తపడ్డారు. దీంతో వైద్యం పూర్తిగా బ్రాహ్మణుల సొంత మైపోయింది. అయితే మిగతా ప్రజలు బౌద్ధుల నుంచి నేర్చుకున్న విజ్ఞానం, తమ అనుభవంతో సంపాదించుకున్న జ్ఞానంతో వైద్యాన్ని అలవర్చుకున్నారు. అందుకే శూద్రులలో మంగలి(నాయీబ్రాహ్మణ) కులం వారు గొప్ప వైద్యులుగా ఆరోజు సేవలందించారు. మంగలి కులానికి చెందిన మహిళలు మంత్రసానులుగా వేల సంవత్సరాలు కోట్లాది మంది నూతన శిశువులకు జన్మనిచ్చారు. అయితే వీళ్ళు కూడా అప్పుడు అంటరాని కులాలుగా పిలుచుకునే మాల, మాదిగల లాంటి వారికి వైద్యం అందించడంలో చొరవచూపడం లేదు. దానితో అనివార్యంగా పంబాల, బైండ్ల వృత్తి ఉనికిలోనికి వచ్చింది. 

ఆనందయ్య కుటుంబం కూడా తరతరాలుగా మూలికా వైద్యం చేస్తున్నది. ఈయన గొల్లకులానికి చెందినవాడు. గొల్లకులం వారు మేకలు, గొర్రెలు మేపడానికి అడవుల్లోకి వెళ్ళేవారు. అక్కడ మేకలు తినని చెట్లు చిన్న చిన్న మొక్కలు ఉండేవి. వాటిని గమనించడం మొదలుపెట్టారు. వాటిని తమ అనుభవం ద్వారా ఔషధ మొక్కలుగా గుర్తించారు. ఆ వారసత్వమే ఆనందయ్య. అయితే ఆనందయ్యకు వారసత్వంగా వస్తున్న జ్ఞానాన్ని ఏ ఆయుర్వేద పండితుడూ పరిశీలిం చలేదు. దానిపై పరిశోధనలు జరపలేదు. ఇట్లా దేశవ్యాప్తంగా కొన్ని లక్షలమంది ఉన్నారు. ఇక్కడ ఏర్పడిన కుల వ్యవస్థ, బ్రాహ్మణ ఆధి పత్య భావజాలం మన దేశ వైద్యవిధానానికి గొడ్డలిపెట్టుగా మారింది. ఆ విధంగా మన దేశంలో మన వైద్యం తెరమరుగైంది. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఇక్కడ ఉన్న దేశీయ వైద్య విధానాన్నంతటినీ సమగ్రంగా అధ్యయనం చేసి, ఆధునిక అల్లోపతి వైద్య విధానాన్ని కూడా పరిగణనలోనికి తీసుకొని ఈ దేశ అవసరాలకు అనుగుణ మైన ఒక నూతన వైద్య విధానాన్ని రూపొందించే అవకాశం మనకు వచ్చింది. ఇప్పటికైనా పాత పాపాలను కడుగు కొని, కొత్త సమాజానికి పునాదులు వేస్తే చరిత్ర మనల్ని కొంతైనా క్షమిస్తుందేమో.

వ్యాసకర్త :మల్లెపల్లి లక్ష్మయ్య
సామాజిక విశ్లేషకులు
81063 22077 

మరిన్ని వార్తలు