జ్ఞానమనే వెలుగుకు ప్రతిరూపమైన పండుగ

4 Nov, 2021 02:33 IST|Sakshi

కొత్త కోణం 

దీపావళి అంటే దీపాల వరుస. పల్లె పట్నం తేడా లేకుండా ప్రతి చోటా, ప్రతి ఇంటా, తమ తాహతకు తగ్గట్టుగా దీపాలను వెలిగిస్తారు. ప్రతి పండుగకు ఒక కథ ఉంటుంది. ఈ పండుగకు కూడా ఒక కథ ఉంది. నరకాసు రుడు అనే రాక్షసుడు వేల మంది మహిళలను చెరబట్టాడనీ, ఇంద్రుని రాజధానిపైన దండెత్తాడనీ, విష్ణువు కృష్ణుడి అవతారమెత్తి నరకాసురుడిని చంపాడనీ, అందుకే దీపావళిని చేస్తున్నారనీ పురాణాలు చెబుతున్నాయి. నరకాసురుడే కాదు, ఎవరైనా ఇంద్రుణ్ణి జయించినా, జయించడానికి ప్రయత్నించినా, విష్ణువును ప్రతిఘ టించినా ఇదేగతి పట్టింది. వీళ్ళంతా అడవుల్లో నివాస ముండేవాళ్ళు. అవతారాలెత్తిన దేవుళ్ళందరూ వీరిని చంపారు. ఆనాడు ఆధిపత్య సంస్కృతిని ప్రతిఘటించి, వైదిక సంప్రదాయాలను నిరసించినవాళ్ళను రకరకాల పేర్లతో చంపేశారు.

భారతదేశ చరిత్రలో బౌద్ధం ఒక సామాజిక విప్లవం. యజ్ఞాల పేరుతో సాగుతున్న సామాజిక, ఆర్థిక దోపిడీని నిరోధించడానికి బౌద్ధులు సాగించిన సామాజిక ఉద్యమం ఆనాటి సమాజాన్ని మూఢాచారాల నుంచి విముక్తం చేసింది. బౌద్ధులు ఇళ్లను వదిలి, ప్రజల్లో కలిసిమెలిసి తిరుగుతూ, వాళ్లు పెట్టిన భిక్షను స్వీకరిస్తూ జీవనం గడిపేవాళ్ళు. అయితే ఎనిమిది నెలలు అంటే చలికాలం, వేసవిలో మాత్రమే సంచారం చేసేవాళ్లు. వర్షాకాలం నాలుగు నెలలు, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వీయుజం బయటకు వచ్చేవాళ్ళు కాదు. అయితే సిద్ధార్థ గౌతముడు జ్ఞానం పొంది గౌతమబుద్ధుడిగా మారిన తర్వాత 18 సంవత్సరాలకు తాను పుట్టిన ఊరి ప్రజలు ఆహ్వానిస్తే వెళతాడు. ఆయన ఊరికి వస్తున్నాడని ప్రజలంతా సంతోషంతో ఊరంతా దీపాలతో అలం కరించి స్వాగతం పలుకుతారు. ఎందుకంటే, అది అమా వాస్య రోజు. చిమ్మచీకటి. నూనె దీపాలు తప్ప మరొక వెలుగు పరికరం లేదు. అందుకే ప్రతి ఇంటా దీపాలు వెలిగించారు. ఆ తర్వాత ఇది ఒక సంప్రదాయంగా మారింది. ప్రతి సంవత్సరం వర్షవాసం ముగించుకొని గ్రామాలకు, నగరాలకు వస్తున్న బౌద్ధ భిక్కులకు ఇంటింటా దీపాలతో స్వాగతం పలికేవారు.

గౌతమ బుద్ధుడు మహాపరినిర్వాణం పొందడానికి కొన్ని నెలల ముందు ఆయన ప్రియ శిష్యులలో ఒకరైన మహామౌద్గాలాయనను బౌద్ధ వ్యతిరేకులు సరిగ్గా వర్షా్షవాసం ముగిసిన రోజు, ప్రజలంతా సంబరాలలో ఉండగా ఒక గుట్టమీద దాడిచేసి కిరాతకంగా హత్య చేశారు. బుద్ధుడి తర్వాత అంతటి విద్వత్తును సంపా దించినవాడు మౌద్గాలాయన. ఆయన మరోపేరు మొగ్గలన్న. ఇది ఆనాటి సమాజాన్ని దుఃఖంలో ముంచింది. అయితే సమ్రాట్‌ అశోకుడు బౌద్ధాన్ని స్వీక రించిన తర్వాత మళ్ళీ బౌద్ధానికి జీవం పోసినట్టయ్యింది. వర్షా్షవాసం ముగించుకొని వస్తున్న బౌద్ధ భిక్కులను మనుపటిలాగా సంతోషంతో ప్రజలు ఆహ్వానించలేక పోయారు. ఇది గమనించిన అశోకుడు ప్రజల శోకాన్ని పోగొట్టడానికి నిర్ణయించుకున్నాడు. బుద్ధుని బోధనలను, జ్ఞాపకాలను స్థిరంగా ఉంచడానికి తన పాలనా పరిధిలోని 84 వేల గ్రామాలు, పట్టణాల్లో శిలా ఫలకాలను, చైత్యాలను, ఇతర విహారాలను నిర్మించాడు. అందులో భాగంగానే మొగ్గలన్న మహాపరినిర్వాణం పొందిన రోజును ఆయన ఇచ్చిన జ్ఞానాన్ని వెలుగుగా భావించి, ఆయన ఆలోచనలకు ప్రతిరూపంగా బౌద్ధ స్థలాల్లోనూ, ప్రతి ఇంటా దీపాల వరుసలను పెట్టాలని ప్రకటించాడు. మన పూర్వీకులు మనకు అందించిన జ్ఞానాన్ని మననం చేసుకోవడానికి, వాళ్లను స్మరించుకోవడానికి ధమ్మదీప దానోత్సవం జరుపుకోవాలని చెప్పాడు. ఈ విషయాలన్నీ శ్రీలంక పరిభాషలో రచించిన ‘దీపవంశం’ పుస్తకంలో ఉన్నాయి. ఇది పాళీ బౌద్ధ సాహిత్యమైన ‘అట్టకత’లో నుంచి తీసుకున్నట్లు, ఇది క్రీ.శ. 3, 4 శతాబ్దాల మధ్యలో లిఖితమైనట్టు చరిత్ర చెబుతున్నది.

జైనమతంలో కూడా జరుపుకొంటున్న దీపావళికి ఒక ప్రత్యేకమైన స్థానమున్నది. జైన తీర్థంకరులలో 24వ గురువు మహావీరుని మహాపరినిర్వాణం ఇదే రోజున జరిగింది. ఆయన ప్రాణం మనకు వెలుగును అందించిం దనీ, ఆయన దీపమై నిలిచాడనీ భావిస్తూ జైనులు దీపా వళిని ఘనంగా జరుపుకుంటారు. దీపావళిని తమ వ్యాపార, వాణిజ్యాలకు ఆరంభ దినంగా కూడా భావిస్తారు.

నరకాసుర వధ గానీ, రాముడు అయోధ్యకు చేరినప్పుడు ప్రజలు దీపావళి జరిపారనే విషయం గానీ చారిత్రకంగా నిర్ధారణ కాలేదు. ఇది తర్వాత అల్లిన కథగా చరిత్రకారులు చెబుతున్నారు. కానీ బౌద్ధ, జైన సాంప్రదా యాలను ప్రజలు ఇప్పటికీ ఆచరిస్తున్నారు. తెలంగాణ జిల్లాల్లోని కరీంనగర్, ఆదిలాబాద్‌ ప్రాంతాల్లో తమ పూర్వీకుల సమా«ధులను శుభ్రపరిచి, సున్నాలు వేసి, పూలతో అలంకరించి, పటాకులను కాల్చి నివాళి అర్పిం చడం ఇప్పటికీ కొనసాగుతూ వస్తున్నది. అశోకుడు ప్రకటించిన ధర్మదీప దానోత్సవాన్ని బ్రాహ్మణేతర కులాలు, ప్రత్యేకించి దళితులు పాటిస్తున్నారు. బౌద్ధం, జైనం తాత్వికంగా మరణాన్ని అనివార్యమైన విషయంగా భావిస్తాయి. చనిపోయిన వాళ్ళకోసం దుఃఖించడం వ్యర్థ మనే విషయాన్ని బుద్ధుడు స్వయంగా ప్రకటించాడు. అదే విషయాన్ని అశోకుడు తన ఆచరణ ద్వారా బౌద్ధులకు ధమ్మ దీప దానోత్సవాన్ని అందించాడు. అదే ఈరోజు ప్రజలంతా జరుపుకుంటోన్న దీపావళి పండుగ.

బౌద్ధ, జైన బోధనలను, వారి ఆచార సంప్రదా యాలను కనుమరుగు చేయడానికే వారి వ్యతిరేకులు దీపావళిని జరుపుకోవడం మొదలైందని చరిత్రను పరిశీలిస్తే అర్థమవుతుంది. సమత, మమత, కరుణ, సమానత్వం, సత్యం లాంటి ఆలోచనలను, ఆచరణను అందించిన బౌద్ధం మనకు ధమ్మదీప దానోత్సవాన్ని కూడా ఇచ్చింది. అందుకే దీపావళి బౌద్ధుల, జైనుల పండుగగా మొదలై ఇప్పుడు అందరూ జరుపుకొంటు న్నారు. బౌద్ధులు, సామాజిక బాధ్యత కలిగినవాళ్లు దీపా వళి రోజున మొగ్గలన్నతో సహా ఎంతో మంది సామాజిక విప్లవకారులను స్మరించుకోవాల్సిన అవసరమున్నది. అందరం మనుషులమేననే భావనను, సమానత్వం, సోద రత్వం అనే మార్గాన్ని అందించిన ధమ్మదీప దానోత్స వాన్ని దీపావళిగా జరుపుకొందాం.

వ్యాసకర్త: మల్లెపల్లి లక్ష్మయ్య 
సామాజిక విశ్లేషకులు
మొబైల్‌ : 81063 22077

మరిన్ని వార్తలు