ఆమె జీవితం అజరామరం

8 Oct, 2020 00:40 IST|Sakshi

కొత్త కోణం

శ్రీకాకుళ సాయుధ పోరాట యోధురాలు పైలా చంద్రక్క జీవితం నిజమైన కమ్యూనిస్టు ఆచర ణకు నిలువెత్తు సాక్ష్యం. 11 ఏళ్ళ పసి వయస్సు నుంచి, తుది శ్వాస విడిచే వరకూ విప్లవమే ఉచ్వాస, నిశ్వాసలుగా బతికారు చంద్రక్క. చంద్రక్క ఏ విశ్వవిద్యాలయాల్లోనూ చదువుకోలేదు. ఇంగ్లిష్‌ లాంటి భాషల్లో ప్రావీణ్యం సంపాదించలేదు. మార్క్స్, లెనిన్, మావో లాంటి మహామేధావుల రచనలను ఆమూలాగ్రం చదవలేదు. అయినా ఆమె అనుసరించిన, ఆచరించిన మార్గం మేధావులెందరికో సాధ్యం కాలేదు. ఆమె 72 ఏళ్ళ జీవితంలో 12 ఏళ్ళు మినహా మిగిలిన 60 ఏళ్ళు కల లోనూ, మెలకువలోనూ విప్లవాన్నే కాంక్షించింది. ఆచరిం చింది. కుటుంబ బంధాలూ, సామాజిక కట్టుబాట్లూ, నిర్భం ధాలూ, పోలీసుల చిత్రహింసలూ, యావజ్జీవ కారాగార శిక్షలూ వంటి ఏ కక్ష్యలోకీ ఆమెని ఇమడ్చలేకపోయాయి. ఎన్ని కష్టాలు ఎదురైనా, నిర్భంధాలు వెన్నాడినా, సుదీర్ఘ కాలపు జైలు జీవితాన్ని గడిపినా, పొత్తిళ్ళలోని బిడ్డ దూరమై, పార్టీలో చీలికలు జరిగి ఉద్యమం బలహీనపడినా, ఆరోగ్యం సహకరించక ఎన్నో సార్లు మృత్యువు అంచుల్లోకి వెళ్ళినా, పార్టీని, ఎర్రజెండాను వదల్లేదు. ఉద్యమబాట వీడలేదు. 

చంద్రక్క ఉద్యమ జీవితంలోకి అడుగుపెట్టేనాటికి శ్రీకాకుళం జిల్లాలో ప్రజల పరిస్థితులు దారుణంగా ఉండేవి. చంద్రక్కది ఉద్దానంలోని రాజాం గ్రామం. అతిపేద కుటుం బంలో కామమ్మ, చిన్నయ్యల ఎనిమిదో సంతానంగా జన్మిం చింది. చిన్నప్పటి నుంచి పెత్తనాన్ని భరించని తత్వమున్న చంద్రక్క మొక్క లకు నీళ్ళు తీసుకురాలేదన్న నెపంతో మాస్టారు బడినుంచి వెళ్ళగొట్టడంతో, చదువుకి స్వస్తి పలికి, ఆ ఊళ్ళోని కమ్యూ నిస్టు గొరకల రాంబాబు చొరవతో రాత్రి పాఠశాలలో చేరింది. శ్రీకాకుళ ఉద్యమ నాయకుడు సుబ్బా రావు పాణిగ్రహి, రాజాంలో ప్రదర్శించిన  కళారూపం, జముకుల కథ ఆమె మనస్సులో బలమైన ముద్రవేసింది. కమ్యూనిస్టుల్లో ఉద్యమంలో భాగం కావాలని ఆనాడే చంద్రక్క నిశ్చయానికి వచ్చింది. 1967 ప్రాంతంలో పార్టీ పిలుపు మేరకు పూర్తికాలం కార్యకర్తగా మారారు చంద్రక్క. తొలుత బాలల సంఘంలో అడుగుపెట్టి, మహిళా సంఘం నాయకురాలుగా ఎదిగారు. గరుడభద్రగ్రామంలో పెత్తం దార్లు ఆక్రమించుకొన్న పేదల భూముల్లో పంటలను కోసి, కమ్యూనిస్టులు పేదలకు పంచిపెట్టిన ఘటన శ్రీకాకుళ గిరి జన సాయుధ రైతాంగ పోరాటంలో ఒక మహత్తర ఘట్టం. 

ఆ తర్వాత చంద్రక్క ‘తెగింపు సంఘం’ నుంచి దళంలో చేరింది. బారువా పోలీస్‌ స్టేషన్‌ మీద దాడి చేయాలని నిర్ణ యించుకుంటారు. కానీ పోలీసుల బలం ఎక్కువగా ఉందని తెలుసుకొని, మరుసటిరోజు బాతుపురం భూస్వామి ఇంటి మీద దాడిచేశారు. ఈ దాడిలో ప్రధాన పాత్ర చంద్రక్క, అంకమ్మలదే. భూస్వామి అక్రమంగా దాచుకున్న ప్రామిసరీ నోట్లను చింపివేసి, ధాన్యాన్ని ప్రజలకు పంచిఇచ్చారు. ఈ క్రమంలోనే పైలా వాసుదేవరావు చొరవతో చంద్రక్క పైలా సహచరిణి అయ్యారు. పంచాదికృష్ణమూర్తి, సుబ్బారావు పాణిగ్రాహి, తామాడ గణపతి, అంకమ్మ, సరస్వతి ఈ పెళ్ళి పెద్దలుగా వ్యవహరించారు. దళాల్లో నిబద్ధతతో, నిర్భ యంగా, చురుగ్గా ఉండే చంద్రక్క ఎంతో మంది మహిళా కార్యకర్తలకు, దళ సభ్యులకూ స్ఫూర్తిదాయకంగా నిలిచారు. ఇదే సమయంలో చంద్రక్క తల్లి కాబోతోన్న విషయం తెలిసింది. పార్టీ నిర్ణయం మేరకు అబార్షన్‌ చేయించుకోవ డానికి చంద్రక్క సిద్ధమైంది. కానీ ఏడు నెలల గర్భం కావ డంతో అబార్షన్‌ ప్రమాదకరమని, వైద్యులు నిరాకరించారు.

శ్రీకాకుళ పోరాటం ఉవ్వెత్తున ఎగిసిపడుతోన్న రోజులు, తీవ్రమైన నిర్భంధం మధ్య కొల్లా వెంకయ్య కొడుకు డాక్టర్‌ రాజమోహన్, చంద్రక్కను హైద రాబాద్‌లో ఆసుపత్రిలో చేర్చారు. ఆ తరువాత పార్టీతో కాంటాక్టు తెగిపోయింది. పాప పుట్టింది. రోజులు గడుస్తున్నాయి. అన్నం, మంచి నీళ్ళు ఇచ్చేవాళ్ళు లేరు. జనవరి నెల మంచి శీతాకాలం, విపరీతమైన చలి. కప్పుకోవడానికి దుప్పటి లేదు. బిడ్డ ఒంటిపైన గుడ్డ లేదు. పక్కన వాళ్ళిచ్చిన గౌను తొడిగి తన పైటకొంగుతో పాపకి కప్పుకొని కడుపులో పెట్టుకొనేది. అర్థాకలితో రోజులకు రోజులు ఎదురు చూసింది. ఒక రోజు డాక్టర్‌ రాజమోహన్‌ వచ్చి చంద్రక్కను హడావిడిగా ఆసు పత్రిలోంచి తీసుకొచ్చి, ఓ ఇంటికి చేర్చారు. అక్కడి నుంచి పార్టీ నాయకులు కొండపల్లి సీతారామయ్య, కేజీ సత్య మూర్తి, అత్తలూరి మల్లికార్జున్‌రావు ఉండే డెన్‌కు చంద్రక్కను తీసుకెళ్ళారు. బిడ్డపుట్టిన చాలా రోజులకు పైలా అక్కడికి వచ్చారు. అప్పటికే బిడ్డను ఎవరికైనా ఇచ్చేయాలని పార్టీ నిర్ణయించింది. బిడ్డని ఎవరికివ్వాలి అనే చర్చ జరిగి నప్పుడు అత్త లూరి మల్లికార్జున్‌రావు ముందుకు వచ్చి తమ కుటుంబానికి పెంపకానికివ్వాలని సూచించారు.

నెల రోజుల బిడ్డని బాపట్ల దగ్గరి చింతలపూడికి పంపించారు. అప్పటికే వారికి 8మంది పిల్లలున్నా, అరుణను చాలా గారాబంగా పెంచారు. వారి పెంచిన ప్రేమకు గుర్తుగా, ప్రేమతో పెంచిన తల్లిదండ్రుల ఇంటిపేరే తనకు కావాలని అత్తలూరి అరుణగా తనను తాను ప్రకటించుకుంది చంద్రక్క బిడ్డ. బిడ్డని ఇచ్చేసిన చంద్రక్క తిరిగి ఉద్యమబాటపట్టింది. 1975, మే 5వ తేదీన శ్రీకాకుళంలో అరెస్టయి, పోలీసుల చేతిలో చిత్రహింసలకు గురైంది. 13 ఏళ్ళకుపైగా జైలు జీవితం గడిపారు చంద్రక్క. జైలునుంచి విడుదలయ్యాక కూడా తిరిగి ఉద్దానం ప్రజలకోసం పోరాడింది. పైలా వాసు దేవరావు తరఫున వచ్చిన భూమిని సైతం అమ్మివేసి, కూతు రుకో, కుటుంబానికో ఇవ్వలేదు. ఆ డబ్బుతో అమరవీరుల స్మారకార్థం ఆఫీసుని కట్టించింది. తను కట్టించిన ఆఫీసులో ఒక కార్యకర్తగా ఉన్నదే కానీ, యజమానిగా కాదు.

ఆమె ఆఫీసు ఒక కమ్యూన్‌ వంటశాల. ఒక ప్రజావైద్యశాల. పైలా వాసుదేవరావు అమరత్వం తరువాత ఆమె ఆరోగ్యం క్రమంగా దెబ్బతినడం మొదలైంది. అయినా ఆమె లక్ష్య పెట్ట లేదు. చివరకు కోవిడ్‌ని కూడా తోసిరా జంటూ, మృత్యు వుకు ఎదురెళ్ళారు. నిత్యం ప్రజలు, పార్టీ, ఉద్యమం తప్ప మరే ధ్యాసలేదామెకు. మావో చెప్పినట్టు నిశ్చేతనంగా జీవిం చడం కన్నా ధైర్యంగా మరణించడమే మేలు అనుకున్నారు చంద్రక్క. ఒళ్ళుపుళ్ళుపడి రక్తం స్రవిస్తూన్నప్పుడూ ఆమె ఉద్యమకర్తవ్యానికే ప్రాధాన్యతని చ్చారు. ప్రజలు, ఉద్యమం, పార్టీయే ఊపిరిగా జీవించారు. ఆమె రేపటి తరానికి వేగు చుక్కగా, భవిష్యత్‌ పోరాటాల ఆశాజ్యోతిగా, ఉద్దానం జనం గుండెల్లో ఎగిరే ఎర్ర జెండాగా చిరస్థాయిగా నిలిచిఉంటారు.

మల్లెపల్లి లక్ష్మయ్య 
వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు ‘ 81063 22077

Read latest Guest-columns News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా