పెత్తనంపై ధ్యాస తప్ప బాధ్యత పట్టదా?

17 Jun, 2021 02:34 IST|Sakshi

‘‘కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ వల్ల లక్షలాది మంది ప్రాణాలు కోల్పోవడానికి ప్రధాన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే’’ అని ఉత్తర భారతదేశంలోని ఆరు రాష్ట్రాల ప్రజలు అభిప్రాయపడ్డారు. ‘ప్రశ్నమ్‌’, ‘ది ప్రింట్‌’ సంస్థలు సంయు క్తంగా నిర్వహించిన సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. బిహార్, హరియాణా, జార్ఖండ్, మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రాల్లో 14,881 మందిని ఇంటర్వ్యూ చేశారు. ఇందులో 70 శాతం మంది పురుషులు, 30 శాతం మంది మహిళలు. 52 శాతం మంది యువత కాగా, 36 శాతం మంది మధ్య వయస్కులు, 12 శాతం మంది అరవై యేళ్లు దాటినవారు. ఈ ఆరు రాష్ట్రాలలోని 967 అసెంబ్లీ నియోజక వర్గాల ప్రజలు ఇందులో భాగస్వాములయ్యారు.

బిహార్‌లో 41 శాతం మంది కేంద్ర ప్రభుత్వమే కోవిడ్‌ ఉత్పా తానికీ, ప్రాణ నష్టానికీ ప్రధాన కారణమని భావించగా, 21 శాతం మంది రాష్ట్ర ప్రభుత్వం పాత్ర ఉందని చెప్పారు. అదే సమయంలో 38 శాతం మంది ఇది తమ దురదృష్టమని బాధపడ్డారు. అదేవిధంగా ఉత్తర్‌ప్రదేశ్‌లో 46 శాతం కేంద్రాన్నీ, 20 శాతం రాష్ట్రాన్నీ బాధ్యులుగా పేర్కొన్నారు. ఇక్కడ ఇంకొక విచిత్రముంది. ఆరు రాష్ట్రాల్లో సరాసరి 39 శాతం మంది ఇది తమ తలరాత అని పేర్కొన్నారు. అంటే భారత దేశంలో ఖర్మ సిద్ధాంతం ఎంత బలంగా ఉందో అర్థం అవుతుంది. భారతీయులు ఎంతటి విపత్తునైనా తమ తలరాత అనుకునేంతటి బలహీనులుగా మలచడంలో పాలకులు ఎంతగా కృతకృత్యుల య్యారో అర్థం చేసుకోవచ్చు. రాజస్తాన్‌లో 47 శాతం మంది ప్రభు త్వాలను దీనికి బాధ్యులుగా పేర్కొనలేదు అంటే మనం ఉన్నది ఎలాంటి సమాజమో పూర్తిగా అర్థమౌతుంది. 
ఇప్పటివరకు దేశంలో 38 కోట్ల 13 లక్షలకు పైగా పరీక్షలు నిర్వహించగా 2 కోట్ల 95 లక్షలకు పైగా పాజిటివ్‌గా తేలినట్టు లెక్కలు చెబుతున్నాయి. ఇందులో 3 లక్షల 77 వేల మంది మరణించినట్టు ప్రభుత్వం ప్రకటì ంచింది. ఈ లెక్కలు ఏవీ సంపూర్ణ సత్యాలు కావని అందరికీ తెలిసిన బహిరంగ రహస్యమే. ఇటీవల బిహార్, మహారాష్ట్ర ప్రభుత్వాలు తమ లెక్కలను సవరించగా, గతంకన్నా ఎక్కువ మర ణాలు ఉన్నట్టు తేలింది. అదే విధంగా ఈ సర్వేలో 17 శాతం మంది తమ కుటుంబంలో ఎవరో ఒకరు మరణించినట్టు చెప్పారు. అంటే మృతుల సంఖ్య ఇంకా అధికంగా ఉన్నట్లు అంచనావేయొచ్చు. తెలంగాణలో మరణాలు గత రెండు మూడు సంవత్సరాలతో పోలిస్తే చాలా ఎక్కువని తేలింది. జనన, మరణాల నమోదులో తేలిన అంశాన్ని ఒక ఆంగ్ల పత్రిక ఇటీవల వెల్లడించింది. ఉదాహరణకు 2019లో 1,22,102 మంది మరణించగా, 2020లో 1,54,992 మంది చనిపోయినట్టు లెక్కలు చెబుతున్నాయి. 2021 మే నాటికి 76,024 మంది చనిపోయినట్టు తెలుస్తున్నది. ముఖ్యంగా ఏప్రిల్, మే నెలల్లో ఈ మరణాల సంఖ్య అధికంగా నమోదైంది. అన్నింటికన్నా ఘోర మైన విషయం, ఉత్తర్‌ప్రదేశ్, బిహార్‌ రాష్ట్రాల్లో శవాలను దహనం చేయక గంగానదిలో విసిరివేసినట్టు అనేక విజువల్స్, ఫొటోలు బయటకొచ్చాయి. ప్రభుత్వాలు చూపుతోన్న లెక్కలకు కనీసం ఐదు రెట్లు అధికంగా మరణాలు సంభవించినట్టు నిపుణులు అంచనా వేశారు.

కోవిడ్‌ విషయంలో మరొక ముఖ్యమైన అంశం ప్రజల ప్రాణాలతో పాటు, ఆస్తులు కోల్పోవడం, అప్పుల పాలు కావడం. తమ జీవితమంతా రెక్కలు ముక్కలు చేసుకొని సంపాదించినదంతా ప్రైవేట్‌ ఆసుపత్రులకు చెల్లించుకొని, చివరకు ఆప్తుల ప్రాణాలను సైతం దక్కించుకోలేక శవాలను వెంటబెట్టుకొచ్చిన ఘటనలు మన చుట్టూ కోకొల్లలు. శంషాబాద్‌లోని ఒక కుటుంబంలో ముగ్గురు చనిపోగా, దాదాపు 80 లక్షల రూపాయలు హాస్పిటల్‌ బిల్లు చెల్లిం చుకోవాల్సి వచ్చింది. ప్రత్యేకించి సెకండ్‌ వేవ్‌లో ప్రజలు వెచ్చించిన డబ్బు వేలకోట్లలో ఉంది. ఎవరి బొక్కసాలను నింపింది, దీనిలో ఎవరి వాటా ఎంత? దీనిని వెలికితీయాల్సిన గురుతర బాధ్యత పౌరసమాజంపై ఉంది. 
మన దేశంలో మొత్తం ఆసుపత్రులు 69,265 కాగా, ఇందులో 43,487 ఆసుపత్రులు ప్రైవేట్‌లో, 25,778 ప్రభుత్వ రంగంలో ఉన్నాయి. ప్రైవేట్‌ రంగంలో అత్యధికంగా ఉన్న రాష్ట్రాలు కర్ణాటక, ఉత్తర్‌ప్రదేశ్, తెలంగాణ, హరియాణా, మహారాష్ట్ర, కేరళ, పంజాబ్‌. అదే విధంగా మొత్తం పడకల సంఖ్య 18,99,228 కాగా, ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో 11,85,242 ఉన్నాయి. సెకండ్‌ వేవ్‌లో దాదాపు 40 రోజులకు పైగా అన్ని ఆసుపత్రులలోని పడకలు, ప్రత్యేకించి ప్రైవేట్‌ ఆసుపత్రులలో ఖాళీగా లేవు. ఒక అంచనా ప్రకారం ప్రతిరోజూ ఒక పడకకు ప్రైవేట్‌ ఆసుపత్రులు వసూలు చేసిన డబ్బు 15 వేల నుంచి లక్ష రూపాయల వరకూ ఉంది. సరాసరి 50 వేల రూపాయలు ఒక పడకకు అనుకుంటే దాదాపు దేశ వ్యాప్తంగా ప్రజలు ప్రైవేట్‌ ఆసు పత్రులకు సమర్పించుకున్న డబ్బు రెండు లక్షల యాభైవేల కోట్లకు పైనే. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కోవిడ్‌ సమయంలో వైద్యం మీద పెట్టిన ఖర్చు చాలా తక్కువ. నిజానికి ప్రభుత్వాలు వాళ్ళు నిర్వ హించిన ప్రభుత్వాసుపత్రులలో వైద్యం అందించడం మినహా ఎటు వంటి సహాయం ప్రజలకు అందించలేకపోయారు. ఇంజెక్షన్లు, ఆక్సి జన్‌ సిలిండర్ల బ్లాక్‌ మార్కెట్‌ను కూడా సమర్థవంతంగా అరికట్ట లేకపోయారు.

ఇటువంటి మహమ్మారిని అరికట్టడంలో రాష్ట్రాలకన్నా కేంద్రానిదే ప్రధాన బాధ్యత. కానీ కేంద్ర ప్రభుత్వం ఒక ట్రాఫిక్‌ పోలీస్‌ చేసిన పని కూడా చేయలేకపోయింది. అధికారాలన్నింటినీ తన అధీనంలో పెట్టుకుని, రాష్ట్రాల హక్కులను నిరర్థకంగా మార్చింది. అంతే కాకుండా తాను చేసిన నిర్ణయాలను తానే విస్మరించింది. ఏప్రిల్, 2, 2020న కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఒక సర్క్యులర్‌ను విడుదల చేసింది. 2005లో ఆమోదించిన డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ చట్టం ప్రకారం, కోవిడ్‌ చికిత్సలో అవసరమయ్యే మాస్కులు, పీపీఈ కిట్లు, గ్లోవ్స్, వెంటిలేటర్స్‌ను ఉత్పత్తి చేయడం, కొనుగోలు చేయడం, దిగుమతి చేసుకోవడం, పంపిణీ చేయడం లాంటి పనులు కేంద్ర ప్రభుత్వం అధీనంలోని నిపుణుల కమిటీ చేయాలి. రాష్ట్ర ప్రభుత్వాలు తమకు ఏఏ వస్తువులు ఎన్ని కావాలో నివేదించుకుంటే, కేంద్ర ప్రభుత్వం సమకూరుస్తుంది. ఆక్సిజన్‌ ఉత్పత్తి, పంపిణీని కూడా కేంద్రం తన చేతుల్లోనే ఉంచుకుంది. దీనివల్ల ఏప్రిల్, మే నెలల్లో జరిగిన అల్లకల్లోలం కళ్ళారా చూశాం. కేంద్ర ప్రభుత్వ అధికార కేంద్రీకరణ వల్ల ఎవ్వరూ ఊహించని జననష్టం, ప్రాణనష్టం వాటి ల్లింది. దీనివల్ల మందులు, ఆక్సిజన్‌ ఇతర వస్తువులు ఏవీ సరైన సమయంలో ఆసుపత్రులకు అందలేదు. ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం చివరకు కోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది.

మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం సంపూర్ణంగా విఫ  లమైన విషయం కేంద్రంలోని ప్రతిపక్షాలకే కాదు, అధికార పక్షానికీ తేటతెల్లం అయ్యింది. అయిదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు, కొన్ని రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు, ఉత్తర్‌ప్రదేశ్‌లో కుంభమేళా నిర్వహణ అగ్నికి ఆజ్యం పోసినట్టు అయ్యింది. కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే కోవిడ్‌ విపత్తుకి  లక్షలాది మంది ప్రజల విలువైన ప్రాణాలు బల య్యాయన్న విషయం ప్రజలకర్థం కావడానికి వేరే ఉదాహరణలు అక్కర్లేదన్నది జగమెరిగిన సత్యం. నిలువునా కూలిన కుటుంబాలు, ధ్వంసమైన ఆర్థిక వ్యవస్థ, అ«థఃపాతాళానికి కూరుకుపోయిన పేదల బతుకులు, జీవనాధారాన్ని కోల్పోయిన వృద్ధులు, మహిళలు, పిల్లలు, ఉపాధి కరువై ఉరివేసు కుంటున్న ప్రైవేటు ఉద్యోగులు, దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడు తోన్న విద్యారంగం... ఇంతకు మించిన ఉదాహరణలేవీ పాలకుల చిత్తశుద్ధిని అంచనావేసేందుకు ప్రజలకు అవసరం లేదన్నదొక్కటే సంపూర్ణ సత్యం. అందుకే అన్ని లెక్కలూ తేలాలి. అది తేల్చాల్సింది ప్రజలే.


మల్లేపల్లి లక్ష్మయ్య
వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు
మొబైల్‌ : 81063 22077 

మరిన్ని వార్తలు