దళితులకు ప్రత్యేక నివాసాలు తప్పదా?

22 Oct, 2020 01:43 IST|Sakshi

కొత్త కోణం 

‘‘దళితులకు ప్రత్యేక నివాసాలను ఏర్పాటు చేయడం, ఎవరి హక్కులనూ, అధికారా లనూ, అతిక్రమించడం కాదు. వేల ఎకరాల వ్యవసాయ యోగ్యమైన భూమి ఉపయోగం లేకుండా ఉంది. అటువంటి భూములలో దళితులకు ప్రత్యేక నివాసాలను, ప్రత్యేక ట్రస్టును ఏర్పాటు చేసి, నిధులను కేటాయిం చాలి. దక్షిణాఫ్రికాలోని ‘బంటు’ తెగ లాంటి గిరిజన జాతి పరిస్థితికి, షెడ్యూల్డ్‌ కులాల జీవన పరిస్థితులకు చాలా దగ్గరి పోలిక ఉంది. దక్షిణాఫ్రికా రాజ్యాం గంలో బంటు తెగకు ప్రత్యేక ప్రాంతాల ఏర్పాటు అవకాశాన్ని కల్పిం చారు. కానీ భారత రాజ్యాంగం ముసాయిదాలో అటువంటి ప్రతిపా దన లేకపోవడం ఎందుకో అర్థం కావడం లేదు’’ అని 1946, ఏప్రిల్‌ 23వ తేదీన బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌  ‘ది టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. 

ఈ ప్రతిపాదన చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుండొచ్చు. చాలా మందికి మింగుడు పడకపోవచ్చు. ఫర్వాలేదు. కానీ, ఎందుకు అంబే డ్కర్‌ అటువంటి ప్రతిపాదన చేశాడో ఆలోచించాలి? అదే విధంగా ఇప్పుడు 70 ఏళ్ళ తర్వాత మళ్ళీ దానిని ఎందుకు లేవనెత్త వలసి వచ్చిందో కూడా మనం గుర్తించాలి. గతనెల రోజులుగా ఉత్తరప్రదేశ్‌ లోని హాథ్రస్‌ జిల్లా బుల్‌బరి గ్రామంలో 19 ఏళ్ళ దళిత బాలికపై నలుగురు ఆధిపత్య కులానికి చెందిన యువకులు అత్యాచారం చేసి, చంపడానికి ప్రయత్నించారు. సెప్టెంబర్‌ 14, 2020 తేదీన పొలంలోకి గడ్డికోసం వెళ్ళిన యువతిని సందీప్, రాము, లవకుశ్, రవి అనే నలు గురు యువకులు ఆమె దుపట్టాను మెడకు బిగించి లాక్కొని వెళ్ళి, సామూహికంగా అత్యాచారానికి పాల్పడినట్లు ఆ దళిత యువతి  సోద రుడు పోలీసులకు తెలిపారు.

ఈ దాడిలో ఆ యువతి వెన్నెముక పూర్తిగా విరిగిపోయింది. అమ్మాయి అరుస్తుంటే నాలుకను సైతం పీకే సిందా నరహంతక ముఠా. అయినా ఆమె అరుస్తుంటే తల్లి పరిగెత్తు కొని వచ్చింది. అప్పటికే ఆమె పడిపోయి ఉన్నది. ఆమెపై అత్యాచారం చేయబోతుంటే అడ్డుకున్నందుకు దళిత యువతిని క్రూరంగా చిత్ర హింసలకు గురిచేసినట్లు కూడా వైద్యులు నిర్ధారించారు. చివరకు ఆమె చికిత్స పొందుతూ ఢిల్లీ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచింది. తమ బిడ్ద చివరి చూపుకూడా దక్కకుండా, అర్ధరాత్రి ఆ యువతి శవాన్ని పోలీ సులే దహనం చేశారు.

ఈ ఘటన జరిగిపోయిన తర్వాత పోలీసులు మరో సంచలన అబద్ధాన్ని ప్రకటించారు. పోస్ట్‌మార్టం రిపోర్టులో ఆమెపైన అత్యా చారం జరగలేదని తేల్చారు. ‘అత్యాచారం జరగకపోతే, ఆమెపైన ఇంతటి క్రూరమైన హింస ఎందుకు జరిగిందనే విషయానికి పోలీసుల దగ్గర సమాధానం లేదు. పోలీసులు ప్రవర్తించిన తీరు ఒక కులం పెంచుకుంటున్న కాపలాదారులు వ్యవహరించిన విధంగానే ఉంది. కానీ ‘రూల్‌ ఆఫ్‌ లా’కు కట్టుబడిన యంత్రాంగం విధంగా కనిపిం చడం లేదు. ఈ ఒక్క ఘటనతో ఆగిపోలేదు. ఆ తర్వాత జరిగిన ఘటనలు కూడా చూస్తే, భారత దేశంలో షెడ్యూల్డ్‌ కులాలుగా పిలువ బడుతున్న దళితులకు ఎంతటి రక్షణ ఉందో మనకు అర్థం కాగలదు. సెప్టెంబర్‌ 29న, ఉత్తరప్రదేశ్‌లోని అజ్మీర్‌ జిల్లా రామ్‌గంజ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో దౌరాయి గ్రామంలో ఒక యువతిపై అత్యాచారం జరిగింది. అదే రాష్ట్రంలో బలరాంపూర్‌లో 22 ఏళ్ళ దళిత యువతిపై ఇద్దరు ఆధిపత్య కులానికి చెందిన యువకులు అత్యాచారం జరిపారు. భదోయి జిల్లాలో 14 ఏళ్ళ దళిత బాలికపై అత్యాచారం జరిపి, హత్య చేశారు. ఆమె తలను ఇటుకలతో కొట్టి ముక్కలు ముక్కలు చేశారు. 

అంతేగాకుండా గ్యాన్‌పూర్‌ ఏరియాలో 44 ఏళ్ళ దళిత వివా హితపై నలుగురు వ్యక్తులు అత్యాచారం జరిపారు. మధ్యప్రదేశ్, బిహార్, రాజస్తాన్‌ ఇంకా దేశంలోని చాలా రాష్ట్రాల్లో అత్యాచారాలు సర్వసాధారణంగా మారిపోయాయి. ఇక దళిత యువతుల పరిస్థితి చెప్పనక్కర్లేదు. దళిత స్త్రీలపై జరుగుతోన్న అత్యాచారాలు నేరాలుగానే పరిగణించని స్థితి. గత నాలుగేళ్ళలో దళిత మహిళలపై జరిగిన అత్యాచారాలను పరిశీలిస్తే, దళితుల జీవితాలు ఎంతటి భయంకర మైన స్థితిలో ఉన్నాయో అర్థం అవుతుంది. దేశం మొత్తంలో 2015లో 2,332 మంది, 2016లో 2,540, 2017లో 2,770, 2018లో 2956 మంది దళిత మహిళలు ఆధిపత్య కులాల పురుష దురహంకారానికి బలైపోయారు. ఇందులో ఉత్తరప్రదేశ్‌ కుల దురహంకారానిదే అగ్ర స్థానం. 2015లో 444 మంది, 2016లో 557 మంది, 2017లో 549 మంది, 2018లో 526 మంది మహిళలు అత్యాచారానికి బలై పోతు న్నారు. ఇవి కేవలం పోలీస్‌ స్టేషన్‌లో నమోదైన కేసులు మాత్రమే. అసలు పోలీసు స్టేషన్‌ మెట్లెక్కడానికి సాహసించని దళిత కుటుం బాలు కోకొల్లలు. దళిత స్త్రీలపై జరుగుతోన్న అత్యాచారాలు అనూ హ్యమైన సంఖ్యలో ఉంటాయన్నది సత్యం. ఇక హత్యలు, కిడ్నాప్‌లు, దాడుల లాంటి ఘటనలకు దేశంలో ఎక్కడా లెక్కా పత్రం లేదు. 

మనదేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 73 ఏళ్ళు దాటాయి. రాజ్యాంగం అమలులోకి వచ్చి 70 ఏళ్ళు నిండాయి. కానీ దళితుల రక్షణ విషయంలో ఎటువంటి ప్రగతి లేదు. సమాజం ఆధునిక ఆలోచనలు, శాస్త్ర సాంకేతిక రంగాల్లో పురోగతి సాధిస్తుందని భావి స్తున్నాం. కానీ దళితులపైన జరుగుతున్న దాడులను చూస్తే ఈ దేశంలో దళితులనే వారిని మనుషులుగా చూస్తున్నారా? అనే అను మానం కలగకమానదు. అందుకే అంబేడ్కర్‌పైన ఉటంకించిన అభి ప్రాయం, ప్రతిపాదించిన పరిష్కారం మళ్ళీ చర్చలోకి తీసుకురాక తప్పలేదు. అంబేడ్కర్‌ రచనలు, ప్రసంగాలు 9వ భాగంలో ప్రత్యేక నివాసాలు అనే చాప్టర్‌ ఉంది. అందులో ఆయన పేర్కొన్న ఒక అంశాన్ని ఇక్కడ పేర్కొనడం సబబుగా ఉంటుంది. ‘పోలీసు వ్యవస్థ, న్యాయవ్యవస్థ రెండూ హిందువుల వైపే ఉంటాయి. అందుచేత హిందువులతో పోరాడితే వారికి పోలీసుల నుంచి రక్షణ గానీ, న్యాయమూర్తుల నుండి న్యాయం గానీ లభించదు. వాళ్ళు ఆధిపత్య కులాల పక్షాన్నే ఉంటారు. ఆధిపత్య కులాలకు ఉన్న సామాజిక అండదండలు, ఆర్థిక బలం దళితులకు ఉండవు. అందువల్ల వాళ్ళు ఈ వ్యవస్థ ఫలితాలను అందుకోలేరు’ అన్న అంబేడ్కర్‌ మాటలు నేటి ప్రభుత్వ వ్యవస్థల పనితీరుకి అద్దంపడుతున్నాయి.

అక్షర సత్యాలుగా నిలుస్తున్నాయి. పోలీస్‌ స్టేషన్‌లలో నమోదౌతున్న కేసుల సంఖ్య రోజు రోజుకీ తరిగిపోతోంది. ఇటీవల ఎస్సీ, ఎస్టీ చట్టంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నిందితులకు అండగా నిలిచింది. ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయడానికి ముందు విచారణ జరపాలనేది అటువంటి నిబంధన. ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం. దానితో చాలా కేసుల్లో పోలీసులే బాధితులను బెదిరించి, కేసులే లేకుండా చేసి, నిందితుల కొమ్ముకాస్తున్న పరిస్థితిని మనం చూస్తూనే ఉన్నాం. అయితే కోర్టుల దాకా వెళ్ళిన కేసులలో కూడా శిక్షలు పడుతున్నవి అత్యంత అరుదనే చెప్పొచ్చు. 2017–18 కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నివేదిక ప్రకారం 16.3 శాతం కేసుల్లోనే శిక్షలు పడుతున్నాయి. ఇవన్నీ కింది కోర్టులే. పై కోర్టుల్లో వీటిని కొట్టేస్తున్నారు.. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ చుండూరు కేసు. జిల్లా కోర్టు శిక్షలు విధిస్తే, హైకోర్టు న్యాయమూర్తి దానిని కొట్టివేశారు. ఇంతకన్నా వేరే ఉదాహరణ అక్కర్లేదు. ఇంతేకాకుండా దళితులపైన భౌతిక దాడులే కాకుండా, ఉద్యోగులపై, అధికారులపై వివక్ష, వేధింపులు నిత్యకృత్యంగా మారిపోయాయి. రాజకీయ నాయ కులైన దళితులు కూడా రెండవ శ్రేణి నాయకులుగానే చూడబడుతు న్నారు. పార్టీ నాయకత్వాలకు అడుగులకు మడుగులొత్తకపోతే, ఏ నాయకుడికైనా పుట్టగతుల్లేవు. ఇది ప్రస్తుత దళితుల పరిస్థితి.

అందుకే బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ లాంటి వాళ్ళు, కనీసం ప్రత్యేక నివాసాల ద్వారానైనా దళితులు భౌతిక హింసకు దూరమవు తారని భావించారు. నాగ్‌పూర్‌లో 1942, జూలై, 19 తేదీల్లో జరిగిన అఖిల భారత షెడ్యూల్డ్‌ కులాల సదస్సులో ఆయన ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ‘హిందువులకు సంబంధం లేకుండా ప్రత్యేకంగా షెడ్యూల్డ్‌ కులాల నివాసాలను ఏర్పాటు చేయాలి. కొత్త గ్రామాల నిర్మాణం కోసం సెటిల్‌మెంట్‌ కమిషన్‌ని ఏర్పాటు చేయాలి. ప్రభు త్వానికి సంబంధించిన అనాక్రమిత వ్యవసాయ భూముల్ని కమిషన్‌కు అప్పగించాలి’ ఇట్లా తన ప్రతిపాదనలను అంబేడ్కర్‌ రాజ్యాంగ సభ ముందుంచారు. కానీ ఇవేవీ రాజ్యాంగంలోకి రాలేదు.

ఇప్పుడైనా అటువంటి ప్రతిపాదనను ప్రభుత్వాలు ఆలోచించాలి. ఆధిపత్య కులాలు మెజారిటీగా ఉన్న చోట, దళితులు చాలా తక్కువ జనాభా ఉన్నచోట ఈ దారుణాలు మరింతగా పెరుగుతున్నాయి. కారంచేడు, చుండూరులో దాడిచేసిన సామాజిక వర్గాల జనాభా అధికం. అదేవిధంగా బులాన్‌గర్‌ గ్రామంలో అత్యాచారం జరిగిన చోటా కులం బలం ఎక్కువ. అక్కడ దళితుల ఇళ్ళు కేవలం పదిహేను మాత్రమే. అంతే కాకుండా చాలాచోట్ల ఏ కులం వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉంటారో ఆ కులం వాళ్ళు దాడులకు సిద్ధమౌతున్నారు. దీనికి ఎన్ని ఉదాహరణలైనా చూపించవచ్చు. కనీసం ముందు ఒక ప్రయత్నం చేయవచ్చు. ఎక్కడైతే దళితులు చాలా తక్కువ జనాభాగా ఉన్నారో, వారిని దళితులు అధికంగా ఉన్న చోటుకు మార్చితే కనీసం జన బలంతోనైనా కొంత భద్రత వస్తుం దేమో చూడాలి. 

ఏది ఏమైనా హాథ్రస్‌ ఘటన తర్వాత దళితుల్లో ఒకరకమైన ఆవేదన, ఆవేశం బయట పడుతున్నాయి. ఇది ప్రత్యక్ష కార్యాచరణగా ఇప్పుడు బయటపడకపోవచ్చు. కానీ ఇది ఇంతటితో ఆగదు. ఎవరైనా ఈ దేశ సమగ్రత, సమైక్యత గురించి ఆలోచించే ముందు దళితుల రక్షణ, భద్రత గురించి తప్పనిసరిగా ఆలోచించాల్సి ఉంటుంది. అంబేడ్కర్‌ చేసిన ప్రతిపాదన గురించి ఆలోచించాలి. ఒకవేళ ఆ ప్రతిపాదన సరైంది కాదనుకుంటే, ప్రత్యామ్నాయం ఏంటో చెప్పాల్సి ఉంటుంది. లేదంటే దేశ సమగ్రత, సమైక్యత కేవలం హుళక్కిగానే మిగిలిపోతుంది. హిందూ సమాజం ఏకత్వం గురించి హిందూ మతం ఐక్యత గురించి సంఘాలు, సంస్థలు, పీఠాలు, ట్రస్టులు ఈ విషయాన్ని ఇప్పటికైనా నోరు తెరిచి మాట్లాడితే వినాలని ఉంది.


మల్లెపల్లి లక్ష్మయ్య

వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు ‘ మొబైల్‌ : 81063 22077 

మరిన్ని వార్తలు