ప్రపంచ విప్లవోద్యమ చుక్కాని లెనిన్‌

22 Apr, 2021 00:51 IST|Sakshi

‘‘మార్క్స్‌ తదనంతరం విప్లవ కార్మికోద్యమం ప్రపంచానికి అందించిన గొప్ప మేధావి వి.ఐ. లెనిన్‌’’ అంటూ 1924లో ఆనాటి హంగేరియన్‌ తాత్విక వేత్త జార్జి లూకాస్‌ వ్యాఖ్యానించారు. అలాంటి లెనిన్‌ పేరు నేడు కొంత తక్కువగా వినిపిస్తుండవచ్చు. ప్రపంచ కార్మికలోకపు వేగుచుక్క లెనిన్‌ పేరుని స్మరించుకోవడానికి కూడా కొందరు భయపడి ఉండవచ్చు. లేదా కొందరు కావాలనే ఆతని పేరుని మరుగుపర్చే ప్రయత్నంలో ఉండి ఉండవచ్చు. కానీ 20వ శతాబ్దంలో ప్రపంచ గమనాన్ని, కోటానుకోట్ల మానవ మెదళ్ళను కదిలించిన, అనంత జనసమూహాలను ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రభావితం చేసిన పేరు ఇది. 1917లో జార్‌ చక్రవర్తికి వ్యతిరేకంగా జరిగిన విప్లవ పోరాటం విజయవంతమై, అక్టోబర్‌ విప్లవంగా ప్రపంచ ప్రసిద్ధికెక్కింది. ఆ విప్లవంలో ఎగిసిపడిన అరుణ పతాకంలో అగుపించిన ఏకైక ప్రతిబింబం లెనిన్‌.

151 సంవత్సరాల క్రితం.. 1870, ఏప్రిల్‌ 22న రష్యాలోని సింబిర్క్స్‌లో లెనిన్‌ జన్మించారు. ఆయన పూర్తిపేరు వ్లాదిమిర్‌ ఇల్విచ్‌ ఉల్వనోవ్‌ లెనిన్‌. ఆయన సంపన్న కుటుంబంలోనే జన్మించారు. ఆయన తండ్రి పాఠశాల అధికారిగా పనిచేశారు. లెనిన్‌ సోదరుడు జార్‌ చక్రవర్తిపై హత్యాయత్నం చేశాడన్న నేరం మోపి, ఆయనకు 1887లోనే ఉరిశిక్ష విధించారు. లెనిన్‌ కూడా నిరంకుశ రాచరిక జార్‌ చక్రవర్తి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటంలో పాల్గొనడం వల్ల 1897లో కజన్‌ విశ్వవిద్యాలయం నుంచి ఆయన్ను బహిష్కరించి, సైబీరియాకి పంపించి వేశారు.

ఆయన మొదట్లో రష్యన్‌ సోషల్‌ డెమొక్రటిక్‌ లేబర్‌ పార్టీలో క్రియాశీలకంగా పనిచేశారు. ఆ తర్వాత బోల్షివిక్‌ గ్రూప్‌నకు వ్యవస్థాపక నాయకుడయ్యారు. ఆ తర్వాత లెనిన్‌ అందించిన నాయకత్వం వల్ల ఆయన అవలంబించిన విప్లవ ఎత్తుగడ వల్ల 1917లో జార్‌ చక్రవర్తి ప్రభుత్వం కూలిపోయింది. ఆ తర్వాత ఆవిర్భవించిన సోవియట్‌ యూనియన్‌ సోషలిస్టు రిపబ్లిక్‌కు చైర్మన్‌గా ఎన్నికై, 1924లో తుది శ్వాస విడిచేవరకు  కొనసాగారు. ఆయన నాయకత్వం, ఆయన రచనలు, విప్లవోద్యమాన్ని విజయపథంలో నడిపించిన ఆయన సారథ్యం ఆనాడు యావత్‌ ప్రపంచ గమనాన్నే మార్చేందుకు దోహదపడ్డాయి.

ఆయన తాత్విక భూమికకు ఆయన రచనలు సాక్ష్యాలు. ముఖ్యంగా రాజ్యం–విప్లవం, కమ్యూనిజం–ఒక బాలారిష్టం, ఒక అడుగు ముందుకు-రెండడుగులు వెనక్కి, సామ్రాజ్యవాదం-పెట్టుబడి దారి విధానపు అత్యున్నత దశ, లాంటి రచనలు ఆనాటి ప్రపంచ కార్మికోద్యమ, ప్రజాస్వామిక, విప్లవోద్యమకారులకు దారిచూపే దివిటీలయ్యాయి. ముఖ్యంగా ‘సామ్రాజ్యవాదం పెట్టుబడిదారీ విధానపు అత్యున్నత దశ’ అనే రచన ఈనాటికీ ప్రపంచ ఆర్థిక సిద్ధాంతాలలో అత్యంత అరుదైన రచన. ఆ పుస్తకంలో లెనిన్‌ ఆనాడు రష్యాలోని పెట్టుబడిదారీ పద్ధతులను, యూరప్‌లో జరుగుతున్న పెట్టుబడిదారీ పరిణామాలను చాలా లోతుగా అధ్యయనం చేశారు. ఆనాటి సామ్రాజ్యవాద దశను నిర్వచించడానికి ఆయన కొన్ని సూత్రీకరణలు చేశారు. అందులో మొదటిది, ఉత్పత్తిని, పెట్టుబడిని కేంద్రీకృతం చేసే గుత్త సంస్థలను రూపొందించడం, రెండవది, బ్యాంకుల పెట్టుబడిని, పారిశ్రామిక పెట్టుబడులను కలిపివేసి ఫైనాన్షియల్‌ పెట్టుబడిని తయారుచేయడం, మూడవది, అంతకు ముందు ఎగుమతిచేసే వస్తువులతో పాటు, పెట్టుబడిని ఎగుమతి చేసే విధానాలను మొదలు పెట్టడం, నాలుగవది, అప్పటికే ఏర్పడిన ప్రపంచ పెట్టుబడి గుత్త సంస్థలు భౌగోళికంగా తమలో తాము విభజించుకోవడం, అయిదవది పెట్టుబడి శక్తులు ప్రాంతాల వారీగా తమ ఆధిపత్యాన్ని నెలకొల్పుకోవడం. ఈ అయిదు అంశాలు పెట్టుబడిదారీ వ్యవస్థను ప్రపంచ వ్యాపితం చేయడానికి ఉపయోగపడ్డాయి.

ఈ పుస్తకాన్ని 1916లో లెనిన్‌ రాశారు. అంటే వందేళ్లు పూర్తయ్యాయి. ఈ రోజు సామ్రాజ్యవాదం రూపు మార్చుకొని ప్రపంచీకరణ అవతారం ఎత్తింది. ఆయా దేశాల్లోని పాలక వర్గాలను తమ అనుచరులుగా మార్చుకొని, ఆ దేశాలలోని ప్రజలను ముఖ్యంగా మధ్య తరగతి వర్గాలను, శాస్త్ర, సాంకేతిక రంగాల్లో వచ్చిన అభివృద్ధితో తయారు చేసిన వస్తు సముదాయం మత్తులో ముంచి వేసి, ఎన్నటికీ బయటపడే వీలులేని, ఆర్థికచట్ర వలయంలోకి తోసివేసి, అంతర్జాతీయ మార్కెట్‌ను కొల్లగొడుతోంది. ఇప్పుడు మనమంతా ఆ మాయాజాలంలో ఇరుక్కుని కొట్టుమిట్టాడుతున్నాం.

1917లో రష్యాలో విజయం సాధించిన అక్టోబర్‌ విప్లవం ప్రపంచంలోని అన్ని దేశాల వలసపాలకులపై ఆయా దేశాల ప్రజలు తిరుగుబాటు చేసే విధంగా స్ఫూర్తిని కలిగించింది. కమ్యూనిజాన్ని ఏ కోశానా సమర్థించని మహాత్మాగాంధీ, మానవతా సిద్ధాంతమే తన జీవిత కవితా వస్తువుగా స్వీకరించిన రవీంద్రనాథ్‌ ఠాగూర్‌లు కూడా రష్యా విప్లవాన్ని ఆహ్వానించారు. జవహర్‌లాల్‌ నెహ్రూ 1920లోనే రష్యాను సందర్శించి ప్రేరణ పొందారు. ఆ తర్వాత జరిపిన కాంగ్రెస్‌ మహాసభల్లో సోషలిజం ఆవశ్యకతను, సమానత్వ భావనలపై సుదీర్ఘంగా మాట్లాడారు. రష్యా విప్లవం తర్వాతనే ప్రపంచంలోని అన్ని దేశాల్లో ప్రజాస్వామ్య ఉద్యమాలు, సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటాలు, జాతుల విముక్తి పోరాటాలు వెల్లువెత్తాయి. చైనా లాంటి ఒక పెద్ద దేశంలో మావో సే టుంగ్‌ నాయకత్వంలో చైనా విప్లవం విజయవంతమైంది. ‘‘జాతులు విముక్తిని కోరుతున్నాయి, దేశాలు స్వాతంత్య్రాన్ని కోరుతున్నాయి. ప్రజలు విప్లవాన్ని కోరుతున్నారు’’ అంటూ ఆనాటి విప్లవ యుగ ప్రాముఖ్యతను మావో ఉత్తేజకరంగా చాటిచెప్పారు.

ఆనాడు లెనిన్‌ యువతరం కలల నాయకుడిగా నిలిచారు. బ్రిటిష్‌ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడి ఉరికొయ్యలను ముద్దాడిన భగత్‌సింగ్‌ కూడా లెనిన్‌ తాత్విక భావాల పట్ల ఆకర్షితులయ్యారు. భగత్‌సింగ్‌కి ఉరిశిక్షను అమలు చేసే ముందు జైలు అధికారులు చివరి కోరిక ఏమిటని అడగ్గా ‘‘నేను లెనిన్‌ జీవిత చరిత్రను చదువుతున్నాను. అది పూర్తిచేయాలనేదే నా కోరిక’’ అని భగత్‌ సింగ్‌ చెప్పిన మాటలు ఆనాటి నుంచి నేటి వరకు యువతరం గుండెల్లో ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి. ఎన్ని తరాలు మారినా, మరెన్ని వక్ర భాష్యాలు, సిద్ధాంతాలు ఉద్భవించినా ప్రపంచగమనాన్ని మార్చిన వ్యక్తులను ఎవ్వరూ విస్మరించలేరు. మానవజాతి మనుగడ కొనసాగినంత వరకూ, దోపిడీ, పీడనలు తొలగిపోయి, ఎటువంటి వివక్షకూ తావులేని సమసమాజం ఆవిష్కృతం అయ్యేవరకు లెనిన్‌ అనే మూడక్షరాలు యావత్‌ సమాజాన్ని ప్రభావితం చేస్తూనే ఉంటాయి.


మల్లెపల్లి లక్ష్మయ్య
వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు (81063 22077)
(నేడు లెనిన్‌ 151వ జయంతి) 

మరిన్ని వార్తలు