సాధికారత సాధించని ఒడంబడిక

23 Sep, 2021 00:48 IST|Sakshi

కొత్త కోణం

ఎన్నికల్లో ఇప్పుడు రిజర్వుడు స్థానాలుగా ప్రతిఫలించిన పూనా ఒడంబడిక జరిగి తొమ్మిది దశాబ్దాలు గడిచింది. స్వాతంత్య్ర పూర్వ భారతదేశంలో అంబేడ్కర్‌కూ, మహాత్మాగాంధీకీ కుదిరిన ఈ ఒడంబడిక గట్టి వాదోపవాదాలకు కేంద్రబిందువైంది. అంటరాని కులాలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలని, దీనికి నామినేషన్‌ పద్ధతి కాకుండా, వాళ్ళ ఓట్ల ద్వారా వాళ్లే ప్రతినిధులుగా ఎన్నిక కావాలని అంబేడ్కర్‌ వాదించారు. ఇది హిందూ సమాజాన్ని మరింత చీల్చుతుందని గాంధీజీ భావించారు. ఈ నేపథ్యంలో ఇద్దరిమధ్యా కుదిరిన, కుదిర్చిన రాజీయే పూనా ఒడంబడిక. ఈ ఒడంబడిక రావడానికి కారణమైన ముందటి, అనంతర పరిణామాలు స్వాతంత్య్ర పోరాటానికి సమాంతరమైన చరిత్ర!

‘‘భారత సామాజిక నిర్మాణం రెండు ముఖ్యమైన భాగాలుగా విభజితమైంది. అందులో ఒకటి వర్ణం, రెండవది అవర్ణం. వర్ణంలో ద్విజులు, ద్విజులు కానివారు ఉంటారు. అవర్ణంలోని వారిని అంటరాని తెగలు, నేరస్థ, ఆదిమ తెగలుగా వర్గీకరించారు. అయితే వర్ణంలోని ద్విజులు, ద్విజులు కానివారి మధ్య విభజన ఉంటుంది. అది పెద్దగా కనిపించని సన్నని పొర. అవర్ణంలోని ఆదిమ తెగలు ఎవరికి వారుగానే జీవిస్తారు. వర్ణంలోని కులాలతో వీరికి అంతగా సంబంధాలుండవు. అయితే వర్ణా నికి బయట అవర్ణులుగా ఉన్న అంటరాని కులాలకు, మిగతా సమా జానికీ మధ్య ఉన్న వైరుధ్యం ఇనుప కంచె లాంటిది. దానిని ఛేదిం చడం అంత సులువు కాదు.’’ బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ 1940కి ముందే చేసిన విశ్లేషణ ఇది. ఆ రోజు అంటరాని కులాలుగా పిలిచిన నేటి షెడ్యూల్డ్‌ కులాలు, రాజకీయ పరిభాషలో దళితులు ఈ సమా జంలో ఇప్పటికీ భాగం కాలేకపోయారు. 

భారతదేశంలో ప్రజా ప్రభుత్వాల ఏర్పాటు, ప్రజాప్రాతినిధ్యం, ప్రజాస్వామ్య స్థాపన అవగాహనల కోసం 1919లో భారత దేశం సందర్శించిన సౌత్‌బరో కమిటీ ముందు ఒక ముప్ఫై యేళ్ళ యువ కుడైన అంబేడ్కర్, అమెరికాలో చదివిన ఉన్నత విద్యావంతుడిగా సుదీర్ఘమైన ప్రసంగం చేశారు. భారతదేశంలో కులాల మధ్య ఉన్న అంతరాలు, ముఖ్యంగా అంటరాని కులాలకూ, ఇతర కులాలకూ మధ్య ఉన్న అసమానతలు ప్రభుత్వాల ఏర్పాటులో ప్రభావం చూప కూడదంటే, అంటరాని కులాలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించా లని, దీనికి నామినేషన్‌ పద్ధతి కాకుండా, వాళ్ళ ఓట్ల ద్వారానే వాళ్ళ ప్రతినిధులుగా ఎన్నిక కావాలని, ఇది ప్రజాస్వామ్య పద్ధతిలో జరగా లని సూచించారు. అంటే సమాజంలోని విద్యావంతులకు, సంపన్ను లకు, భూస్వాములకు, వ్యాపారస్తులకు మాత్రమే ఓటు హక్కు కల్పిం చడం సరిపోదని, కుల, మత, ప్రాంత భేదం లేకుండా ప్రతి వయో జనుడికీ ఓటు హక్కు కల్పించాలని సౌత్‌ బరో కమిటీ ముందు ప్రతిపాదించాడు ఆ యువకుడు. ఆ తర్వాత సైమన్‌ కమిషన్‌ ముందు, 1930–32 మధ్య జరిగిన రౌండ్‌ టేబుల్‌ కాన్ఫరెన్స్‌లలోనూ ఆయన ఇదే అంశాన్ని మరింత శాస్త్రీయ పద్ధతిలో వాదించారు. అప్పటికే ముస్లింలకు, క్రిస్టియన్లకు అమలు జరుగుతున్న ప్రత్యేక ఎన్నిక విధా నాన్ని, అంటే తమ అభ్యర్థులకు తామే ఓట్లు వేసుకునే పద్ధతిని అప్పుడు డిప్రెస్డ్‌ క్లాసెస్‌గా పిలుస్తోన్న అంటరాని కులాలకు వర్తిం పజేయాలని వాదించారు.

మొదటి రౌండ్‌ టేబుల్‌ సమావేశాలకు గాంధీజీ హాజరుకాలేదు. బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ మొదటి సభలో ఈ విషయంపై చేసిన ప్రతిపాదనను విని బెంబేలెత్తిపోయిన గాం«ధీజీ, రెండో సమావేశాలకు హాజరయ్యారు. ఈ సమావేశంలో గాంధీజీ అత్యంత శ్రద్ధపెట్టిన అంశం డిప్రెస్డ్‌ క్లాసెస్‌కు ప్రత్యేక ఎన్నిక విధానాన్ని వ్యతిరేకించడమే. అంబేడ్కర్, గాం«ధీ మధ్య ఈ విషయమై తీవ్ర వాదోపవాదాలు జరి గాయి. అంటరాని కులాలను తరతరాలుగా వెలివేశారని, హిందువు లలో భాగంగా వారిని ఎన్నడూ చూడలేదని, ఆర్థిక, సామాజిక అణచివేతకు గురిచేశారని అంబేడ్కర్‌ వాదించారు. ఈ  కారణంగానే వారికి రాజకీయ హక్కులు, ప్రాతినిధ్యం కావాలని; వారి ప్రతినిధు లను వారే ఎన్నుకునే అవకాశం కల్పించాలని కుండబద్దలు కొట్టారు. లేదంటే, రాజకీయ స్వేచ్ఛకు బదులు దళితులు తరతరాల బానిసత్వా నికి బలి కావాల్సి ఉంటుందని తేల్చి చెప్పారు. అంబేడ్కర్‌ సూచించి నట్టుగా, అంటరాని కులాలకు ప్రత్యేక ఎన్నిక విధానంలో తమ అభ్యర్థులను తామే ఎన్నుకునే విధానానికి ఆనాటి బ్రిటిష్‌ ప్రభుత్వం అంగీకరించింది. అందుకు అనుగుణంగా నాటి బ్రిటిష్‌ ప్రధాని రామ్సే మెక్‌డొనాల్డ్‌ ఒక ఉత్తర్వును జారీచేశారు. దానిపేరే కమ్యూనల్‌ అవార్డు.

అయితే, గాంధీ దీనిని జీర్ణించుకోలేకపోయారు. 1932, మార్చి 11న బ్రిటిష్‌ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఒక లేఖ రాశారు. ‘అంటరాని కులాలకు ప్రత్యేక ఓటింగ్‌ విధానం కల్పించి, వారి అభ్యర్థిత్వాన్ని వారే ఎన్నుకునే అవకాశాన్ని కల్పిస్తే, నేను ఆమరణ దీక్షకు పూనుకుం టాను’ అన్నారు. రామ్సే మెక్‌డొనాల్డ్‌ గాంధీ లేఖకు, ‘‘మీ ఉద్దేశం హిందువులకు, అంటరాని కులాలకు కలిపి ఓటింగ్‌ ఉండాలని కాదు. హిందువుల మధ్య ఐక్యత సాధించాలని కాదు. అంటరాని కులాల తరఫున శాసనసభలో నలుగురు నిజమైన ప్రజాప్రతినిధులు రాకుండా అడ్డుకోవడమే తప్ప మరొకటి కాదు’’ అని తీవ్రంగా జవాబి వ్వడం గమనించాల్సిన విషయం.
 
రామ్సే మెక్‌డొనాల్డ్‌ ఉత్తర్వులకు వ్యతిరేకంగా గాంధీజీ ఆమరణ నిరాహార దీక్ష చేశారు. దానితో కాంగ్రెస్‌ పార్టీ, హిందూ సంఘాల నాయకులు అంబేడ్కర్‌ మీద తీవ్రమైన ఒత్తిడి తెచ్చారు. చివరిదాకా అంబేడ్కర్‌ వాళ్ళ ఆలోచనలకు తలొగ్గలేదు. కానీ, ఒకవేళ గాంధీ ప్రాణాలకు ప్రమాదం ఏర్పడితే గ్రామాల్లో అల్పసంఖ్యాకులుగా ఉన్నవారిపై, అగ్రవర్ణాలు దాడులకు తెగబడతారనే భయంతో రామ్సే మెక్‌డొనాల్డ్‌ ఇచ్చిన ఉత్తర్వులను వదులుకోవాల్సి వచ్చింది. దాని స్థానంలో 1932 సెప్టెంబర్‌ 24వ తేదీన పూనా ఒడంబడిక జరిగింది. పూనా ఒడంబడిక ద్వారా ప్రత్యేక ఓటింగ్, అంటే తమ అభ్యర్థులను తాము మాత్రమే ఎన్నుకునే విధానానికి బదులుగా, రిజర్వుడు నియోజక వర్గాల విధానం అమలులోకి వచ్చింది. 

ప్రస్తుతం మనం చూస్తున్న రిజర్వుడు స్థానాల ఎన్నికల విధా నంలో కేవలం ఆధిపత్య కులాల, సవర్ణ హిందువుల అంగీకారం ఉన్నవాళ్ళే ఎస్సీ ప్రతినిధులుగా ఎన్నికవుతూ వస్తున్నారు. దళితుల కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్న వాళ్ళు, కులసమాజానికి వ్యతిరేకంగా పోరాడుతున్న వాళ్ళు ఎస్సీల ప్రతినిధులు కాలేకపోతున్నారు. కారణం మనందరికీ తెలుసు. ప్రస్తుతం భారత దేశంలో ఉన్న రాజకీయ పార్టీలు మెజారిటీగా ఆధిపత్య కులాల నాయకత్వంలో ఉన్నాయి. అంతేకాకుండా, ఓటర్లలో నూటికి 70 నుంచి 80 శాతం మంది దళి తులు కానివారే. అందువల్ల కూడా నిజమైన దళిత ప్రజాప్రతి నిధులు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా ఎన్నిక కావడం లేదు. ఎవరు కాదన్నా అవునన్నా ఇది నిజం. దీనికి ప్రస్తుతం ఎన్నికవుతున్న ఎస్సీ ప్రజాప్రతినిధులను బాధ్యులను చేయాల్సిన అవసరం లేదు. దీనికి కారణం ఎన్నికల విధానమే తప్ప వ్యక్తులు కాదు. 

ఒకవేళ బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ ఆశించినట్టుగా, తమ ప్రతి నిధులను తామే ఎన్నుకునే అవకాశం ఉన్నట్లయితే ఇప్పటికే భారత సామాజిక, రాజకీయ రంగంలో మౌలికమైన మార్పులు  వచ్చేవి. కానీ ఎస్సీ ప్రతినిధులందరూ ఈ రోజుకు కూడా అసెంబ్లీలోగానీ, పార్లమెంటులో గానీ దళితుల పక్షాన నోరు విప్పలేని స్థితిలో ఉన్నారు. అప్పుడప్పుడు కొంత మంది మాట్లాడుతుంటారు. వాళ్ళంతా ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు. మళ్ళీ వాళ్ళే అధికార పక్షంలోకి వెళ్తే నోటికి తాళాలు పడిపోతాయి. ఇది ఒక కఠోర వాస్తవం. 

అయితే దీనికి పరిష్కారమేమిటి అనే సందేహం వస్తుంది. తక్షణమైతే ప్రజా ప్రతినిధులు తమలో తాము అవలోకనం చేసు కోవాలి. కనీసం తక్షణ సమస్యలపైనైనా దళితుల పక్షాన నిలబడ టానికి ప్రయత్నించాలి. అంతిమంగా ఈ ఎన్నికల విధానాన్ని మార్చడానికి మళ్ళీ ఒక రాజకీయ ఉద్యమం జరగాలి. తమ ప్రతినిధులను తామే ఎన్నుకునే విధానంపైన ఒక చర్చ జరగాలి. ఇందుకుగాను దళితులు రాజకీయ ఉద్యమానికి సన్నద్ధం కావాలి. సమాజంలోని ప్రజాస్వామిక శక్తులు, అసమానతలు తొలగిపోవాలనే వ్యక్తులు, సంస్థలు, దళిత ప్రజాప్రతినిధుల ఎన్నిక విధానంలో మార్పు కోసం కలిసి రావాలి. లేనట్లయితే సామాజిక ఆర్థిక అసమానతలకు తోడుగా రాజకీయ బానిసత్వం ఇంకా పాతుకుపోయే ప్రమాదం ఉంటుంది.


మల్లెపల్లి లక్ష్మయ్య  
వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు ‘ మొబైల్‌ : 81063 22077

మరిన్ని వార్తలు