మనుషులు ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నారో.. !?

1 Dec, 2022 14:47 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

భారతదేశంలో మరణానికి ముందు వెనుకల కూడా సనాతనమైన, అమానవీయమైన సాంప్రదాయాలు మనిషిని వెంటాడుతున్నాయి.  ఆ సంప్రదాయాల్లో పడి గంజిలో పడ్డ ఈగల్లా బయ టకు రాలేక, అందులో పడి చావలేకా... కొట్టుమిట్టాడుతున్నాం. అద్దె ఇంట్లో ఆత్మీయులు, కుటుంబ సభ్యులు మరణిస్తే కనీసం అక్కడ ఉండి కర్మకాండలు నిర్వహించుకోవడానికి వీలులేని దయనీయ సామాజిక వ్యవస్థలో మనం బతుకుతున్నాం. అందుకే అద్దె ఇంట్లో ఉండేవారు అంతిమ దశలో తమకంటూ సొంత గుడిసె అయినా ఉండాలని కోరుకుంటున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో ఓ తల్లి తన కుమారుణ్ణి ఊరు చివర చిన్న గుడిసె అయినా పరవాలేదు, సొంత ఇల్లు కట్టమని వేడుకుంది. దీంతో ఆమె కుమారుడు లోన్‌ తీసుకుని సొంతిల్లు కట్టి తల్లి భయాన్ని పోగొట్టాడు.

కరీంనగర్‌ పట్టణంలో బస్వరాజు కనకయ్య, భార తమ్మ అనే రజక దంపతులు ఎన్నో ఏళ్ళుగా తమ చేతనైన పనిచేసుకొని బతుకుతున్నారు. వాళ్లకు ఇద్దరు కూతుళ్ళు. పెద్దమ్మాయి స్వప్న దివ్యాంగురాలు. ఒక కాలు పని చేయదు. రెండో అమ్మాయి సరితకు పెళ్ళయ్యింది. నిజానికి బసవయ్యకు పెళ్లయిన ఒక కుమారుడు ఉన్నా అతడు తొమ్మిదేళ్ల క్రితం గుండె పోటుతో చనిపోయాడు. అప్పుడు కూడా అప్పటి అద్దె ఇంటి యజమాని ఇంటికి రానివ్వలేదు. ఇపుడు బసవరాజు కనకయ్య కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడి మరణించాడు. ఆసుపత్రి యాజమాన్యం ఆయన బతికే అవకాశం లేదని, ఇంటికి తీసుకుపోతే బాగుంటుందని చెప్పింది. ఆ స్థితిలో ఉన్న కనకయ్యను ఇంటికి తీసుకుపోతే, ఇంటి యజమానులు రానీయలేదు. గత్యంతరం లేక కరీంనగర్‌ పట్టణంలోని శ్మశానంలోకి తీసుకెళ్ళారు. ప్రాణం ఉండగానే కనకయ్యను శ్మశానంలోకి తీసుకెళ్ళిన కుటుంబం ఆయన చావుకోసం ఎదురు చూసింది. ఒక రోజు తర్వాత కనకయ్య కన్నుమూశాడు. మరణానంతరం జరగాల్సిన కర్మకాండ అంతా ముగించుకొని మాత్రమే తిరిగిరావాలని ఇంటి యజమాని చెప్పడంతో ఇద్దరు ఆడపిల్లలతో మృతుని భార్య 14 రోజులు శ్మశానంలోనే గడిపింది.

హైదరాబాద్‌లోని అపార్ట్‌మెంట్‌లలో ఎవరైనా అద్దెకు ఉండి, అనుకోని పరిస్థితుల్లో మరణిస్తే, ఆ కాంపౌండ్‌ నుంచి శవాన్ని తీసివేయాలి. ఒకవేళ ఆసుపత్రిలో మరణిస్తే అటునుంచి అటే సొంత ఊరికైనా తీసుకెళ్ళాలి. లేదా నేరుగా శ్మశానానికి తీసుకెళ్ళాలి. కొన్ని గ్రామాల్లో మరొక వింత సాంప్రదాయం ఉంది. ఎవరైనా అనారోగ్యంతో ఆసుపత్రికి వెళ్ళి, చికిత్స పొందుతూ మరణిస్తే, ఆ వ్యక్తి మృతదేహాన్ని రానివ్వని గ్రామాలు కూడా ఉన్నాయి. పది సంవత్సరాల క్రితం మంథని దగ్గర్లోని ఒక ఊరి ప్రజలు ఇట్లాగే ప్రవర్తిస్తే, పోలీసుల సహకారంతో ఆ మృతదేహాన్ని గ్రామానికి తీసుకెళ్ళి అంత్యక్రియలు నిర్వహించాల్సి వచ్చింది. దీనికి నేనే ప్రత్యక్ష సాక్షిని. అదేవిధంగా తిరుపతి పట్టణంలో, దాని చుట్టుపక్కల గ్రామాల్లో కూడా ఇటువంటి సంఘటనలు జరిగినట్టు, జరుగుతున్నట్టు పాత్రికేయ మిత్రుల ద్వారా తెలిసింది. విశాఖతో పాటు అనేక చోట్ల ఇంటి అద్దె కోసం వచ్చిన వాళ్ళను కుటుంబంలో అనారోగ్యంతో బాధపడుతున్న వృద్ధులు ఉంటే ఇంటి యజమానులు ఇల్లు అద్దెకు ఇవ్వడానికి నిరాకరిస్తున్న పరిస్థితి ఉంది.

మనిషికి మరణం తథ్యమనీ, అది ఎప్పుడైనా, ఎవరికైనా రావొచ్చనీ తెలిసి కూడా మనుషులు ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నారనేది అర్థం కాని ప్రశ్న. దీనికి గాను నేను ఎవ్వరినీ నిందించడం లేదు. కానీ దీని గురించి ఆలో చించాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తున్నాను. 

ఇటువంటి పరిస్థితులు ఏర్పడడానికి కొందరు పుట్టించిన సాంప్రదాయాలు కారణమవుతున్నాయని భావించక తప్పదు. ఇంట్లో ఒక మరణం జరిగితే, కొందరు పురోహి తుడిని సంప్రదిస్తుంటారు. ఇటీవల ఇటువంటి వారి సంఖ్య మరింత పెరిగింది. ఆ పురోహితుడు... వ్యక్తి ఏ ముహూర్తంలో చనిపోయాడో నిర్ణయించి దుర్ముహూర్తమైతే, దానికి శాంతి ఉపాయాలు సూచించి, కొన్నిసార్లు కొన్ని నెలల పాటు మరణించిన ఇంటిని విడిచి పెట్టాలని సూచిస్తున్నారు. దీనిని చూసి ఇంటి యజమానులలో... తమ ఇంట్లో వేరే వాళ్ళ మరణం జరగరాదని, మృతదేహాన్ని ఇక్కడపెట్టరాదనే ఛాందస భావనలు కూడా బాగా పెరుగుతున్నాయి. తమ ఇంట్లో పెళ్లి జరగబోతున్న వారు సొంత బంధువుల అంత్యక్రియలకూ హాజరు కావడానికి ఇష్టపడటం లేదు. ఇట్లా మరణం చుట్టూ అల్లుకున్న ఈ ప్రవర్తన మన సమాజం డొల్లతనాన్ని చూపెడుతున్నది. 

నిజానికి మన రచనలలో, ప్రసంగాల్లో మృత దేహాన్ని పార్థివ దేహం అంటారు. అంటే పంచభూతాలతో నిండిన శరీరం జీవం పోవడం వల్ల... వాయువును, అగ్నిని, నీటిని, తన సహజ స్వభావాన్ని కోల్పోయి కేవలం మట్టిగా మిగిలిందని చెబుతారు. మట్టి మట్టిలో కలుస్తుంది. పంచ భూతాలతో నిండిన శరీరంలో మట్టి మిగిలినందున ఎంతో పవిత్రమైందిగా చూడాలి. కానీ అందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తుండడం వింత సాంప్రదాయంగా భావించొచ్చు. కానీ చావును ఒక భయంకరమైన ఘటనగా చూపించి, దాని చుట్టూ ఒక మూఢనమ్మకాన్ని సృష్టించి, ఆ అంధ విశ్వాసాన్ని సమాజం అంతటా వ్యాప్తి చేస్తున్నారు. 

ఇటువంటి మూఢ నమ్మకాలను తొలగించకుండా, సమాజంలో మానవత్వాన్ని నింపలేం. ఈ మూఢ నమ్మకాలను ప్రేరేపిస్తున్న వారే ముందుకు వచ్చి, ఇవి సరైనవి కావని చెప్పాలి. లేదా అవి శాస్త్రీయమైనవైతే వాటిని ఆధారాలను, శాస్త్రాలను బయటపెట్టాలి. ఒకవేళ వాళ్ళు ఆ పని చేయలేకపోతే, మానవత్వమున్న ప్రతి ఒక్కరం దీని మీద ఒక కార్యాచరణకు పూనుకోవాలి. అదే విధంగా ప్రభుత్వం వైపు నుంచి రెంట్‌ కంట్రోల్‌ యాక్ట్‌లో కొన్ని మార్పులు చేయాలి. ఇంటి యజమానులు ఇటువంటి అమానవీయ చర్యలకు పాల్పడితే, శిక్షించడానికి వీలుగా ఆ చట్టంలో సవరణలు చేసి, వాళ్ళను శిక్షార్హులుగా చేయాలి. దీని గురించి న్యాయనిపుణులు, ప్రజా ప్రతినిధులు ఆలోచిం చాలి. మన దేశంలో రోజు రోజుకీ పెరుగుతున్న పట్టణీకరణ, అద్దె ఇండ్ల సమస్యలను పెంచుతున్నది. కావున ఇది కోట్ల మంది సమస్య. రాజకీయ పార్టీలు, సంఘాలు మానవత్వంతో తమ పాత్రను నిర్వహించాల్సి ఉంది. (క్లిక్ చేయండి: 66 ఏళ్లుగా సర్వసాధారణం.. ఇప్పుడెందుకు వివాదం!)


- మల్లెపల్లి లక్ష్మయ్య 
సామాజిక విశ్లేషకులు

మరిన్ని వార్తలు