అందరివాడు అంబేడ్కర్‌

5 Nov, 2020 00:30 IST|Sakshi

కొత్త కోణం

ఎస్సీ, ఎస్టీలతోపాటు బలహీన వర్గాలు అనే పదం అంబేడ్కర్‌ ఉపయోగించడంలో ఉద్దేశం వెనుకబడిన కులాల కోసమేనని గుర్తుంచుకోవాలి. కొంతమంది దురుద్దేశంతో అంబేడ్కర్‌పై బురద చల్లడానికి ప్రయత్నిస్తున్నారు. అంబేడ్కర్‌ను ఎస్సీల కోసం మాత్రమే ఆలోచించిన నాయకుడిగా ముద్ర వేస్తున్నారు. ఇది కొన్ని దురదృష్టకరమైన సంఘటనలకు అవకాశం కల్పిస్తున్నది. వెనుకబడిన కులాలకు, బలహీన వర్గాలకు మంచి జరగాలని అంబేడ్కర్‌ నుంచి మొదలుకొని నేటి దళిత నాయకులు, కార్యకర్తల వరకు అందరూ మనసా వాచా కోరుకుంటున్నారు. అభివృద్ధిలో ఆమడ దూరానికి నెట్టివేసిన దళితులు, ఆదివాసీలూ, బడుగు బలహీన వర్గాలను సమైక్యంగా ముందుకు నడపాలన్నదే అంబేడ్కర్‌ ఆకాంక్ష. నిజానికి బీసీ వాడల్లో కూడా ఆయన విగ్రహాలను ప్రతిష్టించుకోవాలి.

‘‘రాజ్యాంగంలోని ఆర్టికల్‌ –46, బలహీన వర్గాల ప్రయోజనాలను, ప్రత్యేకించి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడంలో ప్రభుత్వానికి సంపూర్ణమైన అధి కారాలను ఇచ్చింది. అందుకు ప్రభుత్వం ఎటువంటి చట్టాలనైనా చేయవచ్చునని రాజ్యాంగం స్పష్టం చేస్తున్నది. పార్లమెంటు ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఆర్టికల్‌–15కు సవరణ చేసి బలహీన వర్గాలకు రక్షణ కల్పించాలి’’ అని మొట్టమొదటి రాజ్యాంగ సవరణపై బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ అత్యంత స్పష్టంగా మాట్లాడారు. 

సెప్టెంబర్‌ 16, 1921న అప్పటి జస్టిస్‌ పార్టీ ప్రభుత్వం మద్రాసు ప్రెసిడెన్సీలో బ్రాహ్మణేతరులకు రిజర్వేషన్లు కల్పిస్తూ, 613 నంబర్‌ కమ్యూనల్‌ జీఓను విడుదల చేసింది. ఆ రిజర్వేషన్లు రాజ్యాంగం అమ లులోకి రావడానికి ముందూ, ఆ తర్వాతా అమలు జరిగాయి. కానీ జూన్‌ 7, 1950న చంపకం దొరై రాజన్‌ మద్రాసు హైకోర్టులో ఈ రిజర్వేషన్లను సవాల్‌ చేస్తూ రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. రాజ్యాం గంలోని ఆర్టికల్‌ 15 క్లాజు ప్రకారం, కులం పేరుతో వివక్ష చూపడం, అవకాశాలను నిరాకరించడం సరికాదని వాదించారు. మద్రాసు హైకోర్టు ఆమె వాదనను అంగీకరించింది. సుప్రీంకోర్టు కూడా ఈ తీర్పుని సమర్థించింది.

దీంతో కేంద్ర ప్రభుత్వం ఇరకాటంలో పడింది. రాజ్యాంగం స్ఫూర్తి నిజానికి అదికాదు. కానీ ఆర్టికల్‌ 15లో ఉన్న ఆ లొసుగును వాడుకొని రిజర్వేషన్లను కొట్టిపారేశారు. అప్పుడు కేంద్రంలో ప్రధాన మంత్రిగా జవహర్‌లాల్‌ నెహ్రూ, న్యాయశాఖ మంత్రిగా అంబేడ్కర్‌ ఉన్నారు. అందుకే ఆర్టికల్‌ 15ను సవరించాలని అంబేడ్కర్‌ సూచిం చారు. దానికి అనుగుణంగానే ఆర్టికల్‌ను సవరిస్తూ పార్లమెంటులో నెహ్రూ తీర్మానం ప్రవేశపెట్టారు. దానిపై వివరణ ఇస్తూ, అంబేడ్కర్‌ పైవిధంగా వ్యాఖ్యానించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 46 ప్రకారం ప్రభుత్వానికి రిజర్వేషన్లు కొనసాగించే అధికారం ఉందని గట్టిగా వాదించారు. ఒకవేళ ఆ రాజ్యాంగ సవరణ లేకపోతే ఎస్సీ, ఎస్టీలతో సహా బీసీలకు, మహిళలకు ఇప్పుడు ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ఎటువంటి రిజర్వేషన్ల అవకాశం ఉండేది కాదు. సామాజిక అసమాన తల నుంచి పాక్షిక విముక్తికి ఉద్దేశించిన ఈ సవరణకు పునాది ఆర్టికల్‌ 46. రాజ్యాంగంలోని నాలుగవ భాగంలో పొందుపరిచిన ఆదేశిక సూత్రాలలోని ఆర్టికల్‌–46 ఈ రోజు ఎన్నో సంస్కరణలకు పునాది అన్నది సుస్పష్టం.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఉత్తరాంచల్‌ రాష్ట్రాలు అనుభవిస్తున్న ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ పథకాల చట్టాలకు కూడా ఈ ఆర్టికల్‌ మాత్రమే ఆధారం. అంటే అంబేడ్కర్‌ దూరదృష్టితో ఈ ఆర్టికల్‌ను రాజ్యాంగంలో పొందుపరిచారు. ‘‘బలహీన వర్గాలు ప్రత్యేకించి ఎస్సీ, ఎస్టీ వర్గాల కోసం విద్య, ఆర్థిక రంగాలలో ప్రత్యేక మైన అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత, వాటిని చాలా శ్రద్ధతో శీఘ్రగతిన అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది’’ అంటూ ఆర్టికల్‌ దిశానిర్దేశం చేస్తున్నది. ఎస్సీ, ఎస్టీలతో పాటు బల హీన వర్గాలు అనే పదం అంబేడ్కర్‌ ఉపయోగించడంలో ఉద్దేశం వెనుకబడిన కులాల కోసమేనని గుర్తుంచుకోవాలి. కొంత మంది దురుద్దేశంతో అంబేడ్కర్‌పై బురద చల్లడానికి ప్రయత్నిస్తున్నారు. అంబేడ్కర్‌ను ఎస్సీల కోసం మాత్రమే ఆలోచించిన నాయకుడిగా ముద్ర వేస్తున్నారు. ఇది కొన్ని దురదృష్టకరమైన సంఘటనలకు అవ కాశం కల్పిస్తున్నది. 

అంతేకాకుండా మరొక ముఖ్యమైన విషయాన్ని గుర్తు చేసు కోవాలి. ఇప్పుడు మనం ఓబీసీ(ఇతర వెనుకబడిన వర్గాలు) అని పిలుస్తున్న వారి కోసం అమలులోకి వచ్చిన మండల్‌ కమిషన్‌ సిఫా రసులకు పునాది రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 340 అనేది మర్చిపోవద్దు. ఆయా వర్గాల స్థితిగతులను తెలుసుకోవడానికి జరిగే అధ్యయనానికి ఈ ఆర్టికల్‌ అవకాశం ఇచ్చింది. దీని ఆధారంగానే మొట్టమొదటి బీసీ కమిషన్‌ ఏర్పాటైంది. దాని పేరు కాలేకర్‌ కమిషన్‌. సామాజికంగా, విద్యా విషయకంగా వెనుకబడిన కులాలను గుర్తించి, అధ్యయనం చేసి, వారి స్థితిగతులను ఈ కమిషన్‌ కేంద్ర ప్రభుత్వానికి సమర్పిం చింది. కానీ చాలా సంవత్సరాలు ప్రభుత్వాలు దానిపైన శ్రద్ధ పెట్ట లేదు. మళ్ళీ 1979లో జనతాపార్టీ ప్రభుత్వం బి.పి.మండల్‌ నాయ కత్వంలో వెనుకబడిన కులాల విద్య, సామాజిక విషయాల అధ్యయ నంపై కమిషన్‌ను నియమించింది. విద్య, ఉద్యోగ రంగాల్లో ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్లు కల్పించాలని సిఫారసు చేస్తూ, 1980 డిసెం బర్‌లో మండల్‌ కమిషన్‌ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. కానీ 1990 వరకు దానిపైన ఏ ప్రభుత్వాలు స్పందించలేదు. కేంద్రంలో వి.పి.సింగ్‌ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత 1990 ఆగస్టు 7వ తేదీన మండల్‌ కమిషన్‌ నివేదికను ఆమోదించారు.

దీని అమలు కోసం విధివిధానాలను రూపొందించా లని అప్పటి ఉప ప్రధాని దేవీలాల్‌కు బాధ్యతలు అప్పగించారు. కానీ ఆయన తాత్సారం చేయడంతో ఆ బాధ్యతలను రామ్‌విలాస్‌ పాశ్వాన్‌కు అప్పగించారు. ఆయన దీనిపై చాలా తీవ్రగతిన అధికారులతో సమన్వయం చేసి, ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించే పనిని సులభతరం చేశారు. అంతకుముందు బహుజన్‌ సమాజ్‌ పార్టీ వ్యవస్థాపకులు కాన్షీరాం దీనిపై ఉద్యమం చేపట్టారు. ‘మండల్‌కో లాగ్‌వాకర్, నహీతో కుర్సీ ఖాళీ కరో’ అంటూ దేశవ్యాప్తంగా ఆందోళన నిర్వహించారు. ఈ రోజు దేశవ్యాప్తంగా అమలు జరుగుతున్న విద్య, ఉద్యోగ రిజర్వేషన్లకు పునాది రాజ్యాంగంలోని 46, 340 ఆర్టికల్స్‌. అంతేకాకుండా, మండల్‌ కమిషన్‌ సిఫారసులను వ్యతిరేకిస్తూ ఆధిపత్య కులాలు ఆందోళన చేస్తే, దానిని అడ్డుకున్నదీ, మండల్‌ కమిషన్‌ సిఫారసులను అమలు జరపాలని ఉద్యమాలు నిర్వహిం చిందీ, దానికి నాయకత్వం వహించిందీ దళిత సంఘాలు, సంస్థలు, కవులు, రచయితలు. ఉత్తర భారతదేశంలో ఈ సందర్భంగా అనేక చోట్ల దళితులపైన దాడులు జరిగిన విషయం గతచరిత్రను తిరగేస్తే అర్థం అవుతుంది. ఇదే సందర్భంలో దళితులపై అనేక తప్పుడు కేసులు సైతం పెట్టారు. వెనుకబడిన కులాలకు, బలహీన వర్గాలకు మంచి జరగాలని అంబేడ్కర్‌ నుంచి మొదలుకొని నేటి దళిత నాయకులు, కార్యకర్తల వరకు అందరూ మనసా వాచా కోరుకుంటు న్నారు. అభివృద్ధిలో ఆమడ దూరానికి నెట్టివేయబడిన దళితులు, ఆది వాసీలూ, బడుగు బలహీన వర్గాలను సమైక్యంగా ముందుకు నడ పాలన్నదే అంబేడ్కర్‌ ఆకాంక్ష. 

కానీ వెనుకబడిన కులాలు మాత్రం గ్రామాల్లో కొన్ని పట్టణాల్లో దళితులపై దాడులు చేస్తూనే ఉన్నారు. కొన్ని చోట్ల అంబేడ్కర్‌ విగ్రహాలను పెట్టాలని దళితులు నిర్ణయిస్తే, వారిపై అమానుషంగా దాడులు చేస్తున్నారు. గత నెల దసరా రోజున తెలంగాణలోని సిరిసిల్ల రాజన్న జిల్లాలోని రామాజిపేటలో దళితులపైన బి.సి. కులాల దాడి ఇందుకు నిదర్శనం. ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా గరగ పర్రులో అంబేడ్కర్‌ విగ్రహం ప్రతిష్టించుకోవాలని దళితులు భావిస్తే, వారిని సామాజికంగా వెలివేశారు. ఇవి రెండు ఉదాహరణలుగా మాత్రమే ప్రస్తావిస్తున్నాను. ఇటువంటి ఘటనలే చాలా చోట్ల జరి గాయి, జరుగుతున్నాయి. రామాజిపేటలో ఇళ్ళపై దాడిచేసి మహిళ లను, పిల్లలను కొట్టడం, వాహనాలను, వస్తువులను ధ్వంసం చేయడం జరిగింది. పోలీసులు సమయానికి వెళ్ళకపోయి ఉంటే, కారంచేడును మించిన మారణకాండ జరిగేదని బాధితులు ఏడుస్తూ చెప్పడం కలవరపరుస్తున్నది. 

బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ ఎస్సీ, ఎస్టీలకు మాత్రమే మేలు చేశారనే ప్రచారాన్ని ఇకనైనా మానుకోవాలి. నిజానికి దేశ సమగ్రత, సమైక్యత కోసం ఆయన చేసిన కృషి ఎవ్వరూ మరువలేనిది. ఇతర వెనుకబడిన కులాల(ఓబీసీ)లోని విద్యావంతులు, సంఘాల పెద్దలు తమతమ సామాజిక వర్గాలలోని ప్రజలకు, ప్రత్యేకించి యువకులకు తమ ప్రయోజనాల కోసం పనిచేసిన వాళ్ళ గురించి చెప్పాలి. అంత కన్నా ముఖ్యంగా ప్రజల మధ్య కులాల విభేదాలు ఉన్నాయి. అవి విద్వేషాలుగా మారకూడదు. అసమానతల తొలగింపులో ప్రధాన అడ్డంకిని మరువకూడదు. బలహీనవర్గాల పక్షాన నిలిచి పోరాడిన అంబేడ్కర్‌ను విస్మరించడం, ఆయన భావజాలాన్ని అడ్డుకోవడం, విగ్రహాలను పెట్టనివ్వకపోవడం ఎంతమాత్రం విజ్ఞత అనిపించు కోదు. చరిత్రను తెలుసుకొని, భవిష్యత్తును నిర్మించుకోవడం వివేక వంతులు చేసే పని. ఇకనైనా కలిసికట్టుగా ప్రయత్నం మొదలవ్వాల్సిన సందర్భమిదే. నిజానికి బీసీల మది మదిలో అంబేడ్కర్‌ని నిలుపు కోవాలి. బీసీ వాడల్లో ఆయన విగ్రహాలను ప్రతిష్టించుకోవాలి.

-మల్లెపల్లి లక్ష్మయ్య  
వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు ‘ మొబైల్‌ : 81063 22077

Read latest Guest-columns News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా