రాయని డైరీ: మల్లికార్జున్‌ ఖర్గే

12 Sep, 2021 01:05 IST|Sakshi

ల్యాండ్‌లైన్‌ మోగుతోంది!! 
సాధారణంగా అది మోగదు. వారం క్రితం మాత్రం వెంకయ్య నాయుడు చేశారు. 
‘‘ఆ రోజు అలా జరిగి ఉండాల్సింది కాదు ఖర్గేజీ..’’ అన్నారు వెంకయ్య నాయుడు నిన్న శనివారం కాకుండా ఆ ముందరి శనివారం ఫోన్‌ చేసి! 
ఏ రోజు, ఏలా జరిగి ఉండాల్సింది కాదని ఆయన అంటున్నారో వెంటనే గ్రహించలేక పోయాను. ‘వెంకయ్యాజీ... మీరు దేని గురించి మాట్లాడుతున్నారు?!’ అని నేను ఆయన్ని అడగొచ్చు. అయితే అలా అడగటం ఆయనకు ఆగ్రహాన్నో, ఆవేదననో ఏదో ఒకటి కలిగించే ప్రమాదాన్ని ఎదుర్కోవడానికి కూడా నేను సిద్ధపడి ఉండాలి. 
ఎవరైనా కరెంట్‌ ఈవెంట్స్‌ తెలియకుండా ఊరికే జీవించేస్తుంటే వారిపై వెంకయ్య నాయుడుకి ఆగ్రహం వస్తుంది. కరెంట్‌ ఈవెంట్స్‌ని ఫాలో అవుతున్నప్పటికీ సమయానికి వాటిని తిరిగి గుర్తుకు తెచ్చుకోలేని వారిని చూస్తే ఆయనకు ఆవేదన కలుగుతుంది. ‘ఎటువైపు వెళుతోంది సమాజం!’ అని ఆగ్రహం. ‘ఏమైపోతున్నాయి విలువలు!’ అని ఆవేదన. 

ఏ రోజు, ఏలా జరిగి ఉండాల్సింది కాదో గుర్తుకు తెచ్చుకునేందుకు అప్పటికప్పుడు ప్రయత్నించి, విఫలమై.. ఇక తప్పక.. ‘‘ఏ రోజు వెంకయ్యాజీ’’ అని అడిగేశాను. 
 ‘‘ఏ రోజు అని అడుగుతున్నారా ఖర్గేజీ! రాజ్యసభలో మీరు ప్రధాన ప్రతిపక్షానికి నాయకుడై ఉండీ ‘ఏ రోజు?’ అని అడుగుతున్నారా? ఏ రోజో చెప్పడం నాకు ఇష్టం లేదు. కావాలంటే ఆ రోజు ఏం జరిగిందో చెబుతాను. గర్భగుడి లాంటి సభలో మీవాళ్లు టేబుళ్ల పైకి ఎక్కారు. ఫైళ్లు విసిరేశారు. పెద్ద పెద్దగా అరిచేశారు. కాగితాలు చింపేశారు. వాటన్నిటిపై దర్యాప్తు కోసం ఒక క్రమశిక్షణ కమిటీ వేస్తున్నాను. కాంగ్రెస్‌ నుంచి ఇద్దరు ఆ కమిటీలో ఉండాలి..’’ అన్నారు వెంకయ్య నాయుడు.
గుర్తొచ్చింది నాకు! సభలో వెంకయ్య నాయుడు ఆవేదనతో కంటతడి పెట్టిన రోజు అది. ఆగస్టు 11. పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు వాయిదా పడి, రెండు రోజుల ముందే ముగిసిన రోజు. 

పాత సంగతిని ఇప్పుడెందుకు గుర్తుచేసుకుని ఆయన కమిటీ వేస్తున్నట్లు! 
‘‘వెంకయ్యా జీ... మా మీద కమిటీ వేస్తూ మమ్మల్నే కమిటీలో చేరమంటే ఎలా చెప్పండి? ఆ రోజు మీరు చర్చకు పెట్టకుండా బీమా బిల్లును పాస్‌ చేయించడం కూడా జరిగి ఉండాల్సింది కానీ వాటిలో ఒకటి కదా..’’ అని.. అప్పటికేమీ చెప్పకుండా.. ఆ తర్వాత లెటర్‌ రాసి పంపాను.
ఇప్పుడు మళ్లీ ల్యాండ్‌లైన్‌ మోగుతోంది!! మళ్లీ వెంకయ్య నాయుడేనా! 

అయినా ఈరోజు, రేపు ఆయన పుదుచ్చేరిలో బిజీగా ఉంటారు. పక్కనే లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ తమిళిసై ఉంటారు. ‘జిప్మెర్‌’లో సోలార్‌ పవర్‌ ప్లాంట్‌ను ప్రారంభించాక అక్కడి నుంచి ఇద్దరూ అరవింద ఆశ్రమానికి వెళ్తారు. మధ్య మధ్య తెలుగు భాష గొప్పదనం గురించి వెంకయ్యనాయుడు, తమిళ భాష ప్రాచీన  ప్రాశస్త్యం గురించి తమిళిసై ఒకరితో ఒకరు సంభాషించుకుంటూ ఉంటారు. కనుక ఆయన నాకు ఫోన్‌ చేసే అవకాశం లేదు. 

ఒకవేళ ఫోన్‌ చేస్తున్నది ఆయనే కనుకైతే.. ఈసారి ‘ఆ రోజు’ జరిగి ఉండాల్సినవి కాని వాటిని టాపిక్‌లోకి రానివ్వకుండా.. చరిత్రలో ఆ రోజు జరిగిన ఒక ‘అపురూప’ ఘటనను ఆయనకు గుర్తు చేయాలి. నాలుగేళ్ల క్రితం సరిగ్గా ఆగస్టు 11నే వెంకయ్య నాయుడు ఉపరాష్ట్రపతి అయ్యారు. ఆనాటి కరెంట్‌ ఈవెంట్‌ను నేనింకా మర్చిపోలేదంటే... ‘సమాజంలో విలువలు ఎక్కడికీ పోలేదు, భద్రంగానే ఉన్నాయని’ ఆయన సంతోషించవచ్చు. ప్రతిపక్షంలో ఉన్నంత మాత్రాన అధికార పక్షంలోని ఒక వ్యక్తిని సంతోష పెట్టకూడదనేముంది?

-మాధవ్‌ శింగరాజు 

మరిన్ని వార్తలు