Mallireddy Pattabhi Rama Reddy: చరిత్ర రచనకు సోపానం

7 Jan, 2023 14:18 IST|Sakshi
మల్లిరెడ్డి పట్టాభి రామరెడ్డి

భారతదేశంలో రాష్ట్ర స్థాయిలో హిస్టరీ కాంగ్రెస్‌ లేని రోజు ల్లోనే ‘ఆంధ్రప్రదేశ్‌ హిస్టరీ కాంగ్రెస్‌’ను స్థాపించడంలో ప్రధాన భూమిక పోషించినవారు మల్లిరెడ్డి పట్టాభి రామరెడ్డి. జనవరి 7, 8 తేదీల్లో కడప యోగి వేమన యూనివర్సిటీలో ఆ హిస్టరీ కాంగ్రెస్‌ తన 45వ వార్షిక సమావేశాన్ని నిర్వహించుకుంటోంది. ఈ సందర్భంగా పట్టాభి రామరెడ్డి గురించీ, ఏపీ హిస్టరీ కాంగ్రెస్‌ గురించీ సంక్షిప్తంగానైనా మాట్లాడుకోవలసి ఉంది. 

పట్టాభి రామరెడ్డి గొప్ప మేధావి. అసాధారణ అధ్యాపకుడు. చరిత్ర పరిశోధకునిగా ఆయన తన తరువాతి తరాలకు మార్గం చూపించారు. ఆయన తొలిసారిగా బీఏ, ఎంఏ కోర్సు లలోనూ, ఏపీపీఎస్‌సీ నిర్వహించే పోటీ పరీక్షలలోనూ ఆంధ్రుల చరిత్రను సిలబస్‌లో చేర్చేలా కృషి చేశారు. తెలుగు వారి చరిత్రను లోతుగా ఆధ్యయనం సాగించడానికి నెల్లూరు జిల్లా కావలి జవహర్‌ భారతి కాలేజీలో 1976 మే నెల ఒకటి, రెండు తేదీలలో ఆంధ్రప్రదేశ్‌ హిస్టరీ కాంగ్రెస్‌ తొలి స్థాపనా సమావేశాలను నిర్వ హించారు. 

ఆయన కోరుకున్న విధంగానే ఏపీ హిస్టరీ కాంగ్రెస్‌... ఆదిమ యుగాల నుంచి ఇప్పటివరకూ ఉన్న తెలుగు నేల చరిత్ర, సంస్కృతులను అధ్యయనం చేసి విలువైన సంపుటా లను ప్రచురించింది. ఇవ్వాళ దేశంలో ఏపీ హిస్టరీ కాంగ్రెస్‌ అంటే ఓ గౌరవం ఉంది. ఒక స్థాయి ఉంది. 

పట్టాభి రామరెడ్డి క్విట్‌ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. ఎమ్‌ఎన్‌ రాయ్‌ ప్రభావానికి లోనై సోషలిస్టు పార్టీ రాజకీయాల్లో పాల్గొన్నారు. తాను చదువుకున్న మద్రాస్‌ పచ్చ యప్పాస్‌ కళాశాలలోనే అధ్యాపకుడిగా కొంతకాలం పని చేశారు. కావలి ‘జవహర్‌ భారతి’లో అధ్యాపకుడిగాచేరి అనేక హోదాల్లో పనిచేశారు. అలాగే శ్రీ వెంకటేశ్వరా యూనివర్సిటీ లోనూ పనిచేశారు. 

ఆయన నెల్లూరు చరిత్రపైనా, మొత్తంగా తెలుగువారి చరిత్రపైనా ఎన్నో  గ్రంథాలు రాశారు. ఇంతటి ప్రతిభాశాలి 2004 మార్చి 30న తుదిశ్వాస విడిచారు. ఆయన కలల పంట ఏపీ హిస్టరీ కాంగ్రెస్‌ మాత్రం తెలుగువారి సేవలో తరిస్తోంది. (క్లిక్ చేయండి: ఆంధ్రా కురియన్‌కు నివాళి!)

– ప్రొఫెసర్ దేవిరెడ్డి సుబ్రమణ్యం రెడ్డి
రిటైర్డ్‌ చరిత్ర ఆచార్యులు, ఎస్వీ యూనివర్సిటీ

మరిన్ని వార్తలు