ద్రవ్యోల్బణ కబంధ హస్తాల్లో ప్రపంచం

2 Jul, 2022 10:38 IST|Sakshi

భారత్‌తోపాటూ ప్రపంచ దేశాలన్నీ ఇవ్వాళ ద్రవ్యోల్బణంలో చిక్కుకుని అల్లాడుతున్నాయి. ఈ పరిస్థితికి కోవిడ్‌ మహమ్మారి, రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధం వంటివి ముఖ్య కారణాలు. ఇవికాక ఆయా దేశాల్లో నెలకొని ఉన్న ఆర్థిక, రాజకీయ వ్యవస్థలూ స్థానికంగా ద్రవోల్బణానికి దోహదం చేస్తున్నాయి. 44 అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థల నుండి డేటా విశ్లేషణ చూస్తే, దాదాపు అన్నింటిలో, కోవిడ్‌ మహమ్మారి ముందు నుండీ వినియోగవస్తువుల ధరలు గణనీయంగా పెరిగాయని అర్థమవుతుంది. బ్యూరో ఆఫ్‌ లేబర్‌ స్టాటిస్టిక్స్‌ తాజా నివేదిక ప్రకారం, మేలో వార్షిక ద్రవ్యోల్బణం రేటు సూపర్‌ పవర్‌ అనుకుంటున్న అమెరికాలో 8.6 శాతంగా ఉంది. ఇక  ఇతర దేశాల పరిస్థితి ఊహించవచ్చు.

ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణం అనేది ఆర్థిక లావాదేవీలపై ప్రభావం చూపే సాధారణ దృగ్విషయం. ప్రస్తుతం ద్రవ్యోల్బణంతో ప్రపంచ దేశాలు అల్లాడి పోతున్నాయి. 2001–2019లో సగటు వార్షిక ప్రపంచ ద్రవ్యోల్బణం 3.8 శాతంతో పోలిస్తే, 2022లో అది 7.9 శాతంగా ఉంది. 2023 నాటికి 5.0 శాతానికి చేరుకుంటుందని అంచనా. మొత్తంమీద, ఎక్కువ శక్తివనరులపై ఆధారపడే దేశాలు 2022లో అధిక ద్రవ్యోల్బణ ప్రభావాలను అనుభవిస్తాయి. 2021–22 ద్రవ్యోల్బణం అనేది 2021 మొదట్లో ప్రారంభమై ప్రపంచంలోని చాలా ప్రాంతాలలో పెరిగింది. దీనికి ప్రధానంగా కోవిడ్‌–19 వల్ల ఏర్పడిన సరఫరా కొరత కారణం. మహమ్మారి తగ్గుముఖం పట్టడంతో మంచి ఉద్యోగం, వేతనాల పెరుగుదల కారణంగా బలమైన వినియోగదారుల డిమాండ్‌ కూడా కారణమని భావిస్తున్నారు.

2022 వరకు సరఫరా గొలుసు అంతరాయాలు కొనసాగుతున్నం దున ద్రవ్యోల్బణం వాస్తవానికి ఊహించిన దాని కంటే ఎక్కువ కాలం కొనసాగవచ్చని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎమ్‌ఎఫ్‌) జనవరిలో హెచ్చరించింది. ట్రేడింగ్‌ ఎకనామిక్స్‌ ప్రకారం అత్యధిక ద్రవ్యోల్బణ రేట్లు ఉన్న మొదటి ఐదు దేశాలు... వెనిజులా (1198.0 శాతం), సూడాన్‌ (340.0 శాతం), లెబనాన్‌ (201. 13 శాతం), సూరినామ్‌ (63.3 శాతం), జింబాబ్వే (60.7 శాతం). అదే విధంగా అత్యల్ప ద్రవ్యోల్బణ రేట్లు కలిగిన టాప్‌ 5 దేశాలు రువాండా (–2.0 శాతం), (చాద్‌ –0.5 శాతం), మాల్దీవులు (–0.2 శాతం), గాబన్‌ 0.6 శాతం), జపాన్‌ (0.6 శాతం). పెరుగుతున్న ట్రెండ్‌ మరో మూడేళ్లపాటు కొనసాగవచ్చని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.

ద్రవ్యోల్బణ సూచికలను మూడు విధాలుగా వర్గీకరిస్తారు. అవి వినియోగదారు ధర సూచిక (సీపీఐ), టోకు ధరల సూచిక (డబ్లు్యపీఐ), ఉత్పత్తిదారు ధర సూచిక (పీపీఐ). సీపీఐ అనేది విని యోగదారు స్థాయిలో రవాణా, ఆహారం, వైద్య సంరక్షణ వంటి ప్రాథమిక అవసరాల సగటు ధరలను పరిశీలించే కొలత. వస్తువులు వినియోగదారునికి చేరే ముందు ఉత్పత్తిదారు లేదా టోకు స్థాయిలో ధర మార్పులను డబ్లు్యపీఐ కొలుస్తుంది.

పీపీఐ అనేది వినియోగ దారుని కాకుండా విక్రేత దృక్కోణాల నుండి ధర మార్పులను కొలిచే కొలమానాల కుటుంబం. డిమాండ్‌– ప్రేరణ ద్రవ్యోల్బణం (వస్తు సేవలకు డిమాండ్‌ ఉన్నప్పుడు సంభవించేది), వ్యయ– ప్రేరణ ద్రవ్యోల్బణం (ఉత్పత్తి వ్యయం పెరుగుదల ఫలితంగా సంభవిం చేది), అంతర్నిర్మిత ద్రవ్యోల్బణం (ద్రవ్యోల్బణం కొనసాగుతుందనే అంచనాల కారణంగా సంభవించేది) అనేవి సాధారణంగా ఏ దేశంలో నైనా కనిపించే ద్రవ్యోల్బణాలు. ఈ మూడూ ఒక దేశ ఆర్థిక వ్యవస్థలో ద్రవ్య సరఫరా– వస్తువుల సరఫరా మధ్య సమతౌల్యానికి సంబంధిం చినవి. నిజానికి మరీ ఎక్కువ, అతి తక్కువ ద్రవ్యోల్బణాలు... రెండూ ప్రతికూల పరిస్థితులకు దారితీస్తాయి.

అయితే ద్రవ్యోల్బణం ఆదర్శ స్థాయి ఏమిటి? యునైటెడ్‌ స్టేట్స్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ ప్రకారం సంవత్సరానికి రెండు శాతం ద్రవ్యోల్బణం ఉత్తమంగా నిర్ణయించిన రేటు. ఇది వినియోగదారు ధర స్థిరత్వాన్ని కొనసాగించి, ఉపాధిని పెంచడం వంటి ప్రధాన లక్ష్యాలను సాధించేదిగా ఉంటుంది. చాలా దేశాలు ఈ రేటును ఆమోదించాయి.

సూపర్‌ పవర్‌ అమెరికాలో వినియోగదారుల సూచిక ధరలు 2022 చివరి నాటికి 5 శాతం పైగా స్థిరమైన రేటుతో పెరుగు తున్నాయి. దీని వలన డిమాండ్‌ పరిమితం చేయడానికి ఫెడ్‌ (అమె రికా కేంద్ర బ్యాంకింగ్‌ వ్యవస్థ) వడ్డీరేట్లను పెంచింది. 2023లో ద్రవ్యో  ల్బణం కొనసాగి వృద్ధి మాంద్యం, నిరుద్యోగిత రేటు పెరగడానికి కారణమవుతుంది.  44 అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థల నుండి డేటా విశ్లేషణ చూస్తే, దాదాపు అన్నింటిలో, మహమ్మారి ముందు నుండీ వినియోగ వస్తువుల ధరలు గణనీయంగా పెరిగాయని అర్థమవు తుంది. ఈ 44 దేశాలలో 37 దేశాల్లో, ఈ సంవత్సరం మొదటి త్రైమాసికంలో సగటు వార్షిక ద్రవ్యోల్బణం రేటు 2020 మొదటి త్రైమాసికంలో ఉన్నదాని కంటే కనీసం రెండింతలు ఉంది. బ్రిటన్‌లో ద్రవ్యోల్బణం 30 ఏళ్ల గరిష్ట స్థాయి అయిన 5.5 శాతానికి చేరుకుంది. మొత్తం మీద అభి వృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థల్లో దశాబ్దపు సగటు ద్రవ్యోల్బణం 10 శాతంగా ఉంది.

బ్రెజిల్, రష్యా, మెక్సికో వంటి ఇతర పెద్ద అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో, అంతర్జాతీయంగా పెరుగుతున్న ఇంధన ధరల ప్రభావం కారణంగా వినియోగ వస్తువుల ధరలు త్వరగా పెరగడాన్ని చూస్తున్నారు. ఈ దేశాల్లో గత ఏడాది వార్షిక ద్రవ్యోల్బణం వరుసగా 10, 8.4, 7.4 శాతాలుగా నమోదయ్యాయి. అభివృద్ధి చెందుతున్న దేశాలలో ప్రధానంగా డిమాండ్, వ్యయ ప్రేరణల ద్రవ్యోల్బణాలు కనిపిస్తాయి. బ్రెజిల్, రష్యా వంటి అనేక వర్ధమాన ఆర్థిక వ్యవస్థలు వడ్డీ రేట్లను పెంచడం ద్వారా ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచేందుకు ప్రయత్నించాయి. ఈ చర్య రుణ ఖర్చులను పెంచడం ద్వారా విని యోగదారులపై మరింత ఒత్తిడిని కలిగిస్తుంది. ఫలితంగా ఆహార ఖర్చులు ఎక్కువవుతాయి. 

భారతదేశంలో వినియోగదారుల ధరల సూచీ సీపీఐ ద్రవ్యో ల్బణం మార్చి 2022లో 7.0 శాతం నుండి ఏప్రిల్‌లో 7.8 శాతానికి పెరగగా, మే నాటికి 7.0 శాతంగా ఉంది. సెప్టెంబరు నాటికి భారతదేశంలో ద్రవ్యోల్బణం 8 శాతం కంటే ఎక్కువగా ఉంటుందని అంచనా. భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ ఇటీవల ద్రవ్యోల్బణం అంచ నాను 2022–23 ఆర్థిక సంవత్సరానికి 5.3 నుండి 5.7 శాతానికి సవరించింది. అధికారిక సమాచారం ప్రకారం, భారతదేశంలో వార్షిక ద్రవ్యోల్బణం రేటు మార్చి 2022లో 6.95 శాతానికి పెరిగింది. భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న ముఖ్యమైన సవాల్‌ ముడి చమురు ధరల పెరుగుదల. ఇది కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర వస్తువుల ధరల పెరుగుదల ఫలితంగా కొన్ని నిత్యావసర వస్తువుల దిగుమతి ధరలు పెరిగాయి. అంతేకాకుండా, రష్యా– ఉక్రె యిన్‌ యుద్ధం తరువాత, ప్రపంచ సరఫరా గొలుసులో అంతరాయం ఏర్పడింది. తన చమురు అవసరాలలో 85 శాతం దిగుమతుల ద్వారా తీర్చుకునే భారత్‌లో ఉక్రెయిన్‌–రష్యా యుద్ధం వల్ల ముడి చమురుతో పాటూ పామాయిల్, వంట గ్యాస్‌ ధరలూ పెరిగాయి. 

ఇటీవల, ద్రవ్యోల్బణ నిరోధక చర్యల్లో భాగంగా 2018 తర్వాత మొదటిసారిగా, భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ రెపో రేటును 40 బేసిస్‌ పాయింట్లు పెంచింది. రెపో రేటు పెరుగుదల కారణంగా, బ్యాంక్‌ రుణం నెలవారీ వాయిదాలు పెరుగుతాయి. భారతదేశం వినియోగ ఆధారిత ఆర్థిక వ్యవస్థ. 2021–22లో రబీ, ఖరీఫ్‌ సీజన్‌లలో ఆహార పంటల ఉత్పత్తి బాగా ఉండటంతో, ఆహార ధాన్యాల ద్రవ్యోల్బణంపై ఒత్తిడి తగ్గే అవకాశం ఉంది. ఇంకా, దిగుమతులపై ఒత్తిడిని తగ్గించ డానికి దేశీయ వంట నూనెల ఉత్పత్తిని పెంచాల్సిన అవసరం ఉంది.

రైతుల ఆదాయాన్ని పెంచడం, దేశం వ్యవసాయ ఎగుమతులను పెంచడం ద్రవ్యోల్బణాన్ని అధిగమించడానికి మంచి ఉపాయాలు. ‘గతిశక్తి’ వంటి ప్రభుత్వ ప్రాజెక్టులు పెట్టుబడులను పెంచుతాయి. ముడి సరఫరాల భద్రతను నిర్ధారించడానికీ, ఒకే ప్రాంతం నుండి చమురు దిగుమతులపై ఆధారపడే ప్రమాదాన్ని తగ్గించడానికీ, భారతదేశం... పశ్చిమ ఆసియా, ఆఫ్రికా; ఉత్తర, దక్షిణ అమెరికాల నుండి పెట్రోలియం దిగుమతులను విస్తరించడంపై దృష్టి సారిం చింది. ఏ ఆర్థిక వ్యవస్థలోనైనా ద్రవ్యోల్బణం సాధారణం కాబట్టి, ఆర్థిక వ్యవస్థ సజావుగా సాగేందుకు ద్రవ్యోల్బణం ప్రభావాన్ని తగ్గించేందుకు ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు సమీక్షలపై దృష్టి పెట్టి చర్యలు తీసుకోవాలి.


 

-డాక్టర్‌ పి.ఎస్‌. చారి, వ్యాసకర్త మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌ నిపుణులు
మొబైల్‌: 83090 82823

మరిన్ని వార్తలు