ఆ వ్యాఖ్య రాజ్యాంగస్ఫూర్తికి విరుద్ధం

21 Nov, 2020 00:35 IST|Sakshi

విశ్లేషణ

రాజ్యాంగంలోని అత్యంత ముఖ్యమైన అధికరణ ఏది అని ఎవరైనా నన్ను అడిగితే అది అధికరణ 32 అని చెబుతానని రాజ్యాంగ నిర్మాత డా‘‘ బి.ఆర్‌ అంబేడ్కర్‌ ఒకసారి అన్నారు. ఈ అధికరణ రాజ్యాంగానికి ఆత్మ, హృదయం లాంటిదని అన్నారు. ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లితే వాటికి రక్షణని ఇచ్చేది అధికరణ 32 మాత్రమే. రిపబ్లిక్‌ టీవీ అధినేత అర్ణబ్‌ గోస్వామికి సుప్రీంకోర్టు బెయిల్‌ మంజూరు చేయడం,, యూపీ పోలీసులు అరెస్టు చేసిన కేరళ జర్నలిస్టు కప్పన్‌ బెయిల్‌ పిటిషన్‌ని వారాల తరబడి వాయిదా వేయడం చర్చనీయాంశమైంది. రాజ్యాంగంలోని అధికరణ 32 ప్రకారం వ్యక్తులు దాఖలు చేస్తున్న దరఖాస్తులను ఇకనుంచి నిరుత్సాహపరచడానికి ప్రయత్నం చేస్తామని సుప్రీంకోర్టు బెంచి వ్యాఖ్యానించడం రాజ్యాంగ సూత్రాలకే విరుద్ధం.

సిద్ధిక్‌ కప్పన్‌ కేరళ రాష్ట్రానికి చెందిన జర్నలిస్ట్‌. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని హాథ్రస్‌లో జరిగిందని ఆరోపణలొచ్చిన ఓ సామూహిక మానభంగం, హత్య కేసులని రిపోర్టు చేయడానికి వెళ్తున్నపుడు ఆయన్ని ఉత్తర ప్రదేశ్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. దాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలైంది. ఆ దరఖాస్తుని విచారిస్తున్న సుప్రీంకోర్టు బెంచి రాజ్యాంగంలోని అధికరణ 32 ప్రకారం వ్యక్తులు దాఖలు చేస్తున్న దరఖాస్తులను ఇకనుంచి నిరుత్సాహపరచడానికి ప్రయత్నం చేస్తామని వ్యాఖ్యానించింది.

ఆ బెంచికి నేతృత్వం వహిస్తున్న భారత ప్రధాన న్యాయమూర్తి ఎస్‌.ఎ. బాబ్డే.. రిపబ్లిక్‌ టీవీ అధినేత (యాంకర్‌) అర్ణబ్‌ గోస్వామికి సుప్రీంకోర్టు బెయిల్‌ మంజూరు చేసినపుడే దేశ ప్రజల దృష్టి, మరీ ముఖ్యంగా మేధావుల దృష్టి అధికరణ 32 వైపు మరలింది. దేశమంతా ఈ వ్యాఖ్య మీద చర్చించడం మొదలు పెట్టారు.  ఇంతకీ రాజ్యాంగంలోని అధికరణ 32 ఏం చెబుతుంది? ఈ అధికరణని రాజ్యాంగంలో పొందుపరిచేటపుడు రాజ్యాంగ నిర్మాతల అభిప్రాయం ఏమిటి? ఈ అధికరణ ప్రాముఖ్యత ఏమిటి? ఇవీ ప్రశ్నలు. ఈ ప్రశ్నలకి జవాబులని వెతుక్కునేముందు ఇటీవల కాలంలో దేశంలో జరుగుతున్న సంఘటనలని, కేసులని పరిశీలించాల్సిన అవసరం ఎంతైనా వుంది. వాటికీ ఈ అధికరణకీ ఉన్న సంబంధం ఏమిటీ? అన్న విషయాలను పరిశీలిద్దాం.

అక్టోబర్‌ 5 వ తేదీన హాథ్రస్‌కి వెళ్తున్న సందర్భంలో పోలీసులు ముందుగా క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌లోని సె. 151 ప్రకారం కప్ప¯Œ ని ముందస్తు అరెస్టు చేశారు. ఎవరైనా నేరం చేస్తారని భావించినపుడు ఆ నేరాన్ని పోలీసులు మరో విధంగా నిలుపుదల చేయలేనపుడు ఈ అరెస్టుల్ని చేస్తారు. ఆ తరువాత రాజద్రోహం, ఇంకా యు.ఎ.పి.ఎ చట్టాలలోని కొన్ని సెక్షన్‌ల కింద కేసులని కూడా తనపై నమోదు చేశారు. ప్రముఖ విప్లవ కవి వరవరరావు (80) న్యూరోలాజికల్, యూరో లాజికల్‌ వ్యాధులతో బాధపడుతున్నారు. ఈ మధ్యే ఆయన్ని నిర్బంధించి రెండు సంవత్సరాలు దాటింది.  

సుధా భరద్వాజ్‌ (59) కూడా ఆగస్టు 2018 నుంచి నిర్బంధంలో ఉంటూ పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. స్టాన్‌స్వామి (83) పార్కిన్సన్‌ వ్యాధితో బాధపడుతూ ఉన్నారు. ఆయన జైల్లోనే ఉన్నారు. వాళ్ల  కేసుల్లో అత్యవసరం లేదు. కానీ అర్ణబ్‌ గోస్వామి కేసులో సుప్రీం కోర్టుకి అత్యవసరం కనిపించింది. అందులో తప్పు లేకపోవచ్చు. కొన్ని కేసుల్లో హైకోర్టుకి వెళ్లమని సుప్రీంకోర్టు అంటుంది. అలాంటి కేసులని సుప్రీంకోర్టు ఎంపిక పద్ధతిన విచారిస్తుంది. దీనిపై నిలకడ  లేకపోవడం ఆందోళనకరం. చట్టం ఎందుకు అందరినీ ఒకే విధంగా చూడలేకపోతోంది? 

రాజ్యాంగంలోని 3వ విభాగంలో ప్రాథమిక హక్కులు ఉన్నాయి. అధికరణ 32 కూడా అందులో భాగం. తమ ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లినపుడు, లేదా వాటిని అమలు చేసుకోవ డానికి దేశం లోని ఏ వ్యక్తి అయినా అధికరణ 32ని  ఆశ్రయించి సుప్రీంకోర్టు తలుపు తట్టవచ్చు. రాజ్యాంగంలోని అత్యంత ముఖ్యమైన అధికరణ ఏది అని ఎవరైనా నన్ను అడిగితే అది అధికరణ 32 అని చెబుతానని రాజ్యాంగ నిర్మాత డా‘‘ బి.ఆర్‌ అంబేడ్కర్‌ ఒకసారి అన్నారు. అది లేకుండా రాజ్యాంగాన్ని ఊహించలేం. దాన్ని తప్ప మరే అధికరణని నేను ఉదహరించలేను. ఈ అధికరణ రాజ్యాంగానికి ఆత్మ, హృదయం లాంటిదని అంబేడ్కర్‌ అన్నారు. రాజ్యాంగ నిర్మాతలు ఈ విధంగా కూడా అన్నారు. ప్రాథమిక హక్కులకి భంగం వాటిల్లితే సుప్రీంకోర్టుకి వెళ్ళి ఉపశమనాలని పొందవచ్చు.

అన్ని ప్రాథమిక హక్కులకి రక్షణని ఇచ్చేదీ.. ముఖ్యమైనదీ అధికరణ 32 మాత్రమే.  సివిల్, క్రిమినల్‌ కేసుల్లో ఓడిపోయిన వ్యక్తి హైకోర్టులో అప్పీలుని దాఖలు చేసుకోవచ్చు. ఆ తరువాత సుప్రీంకోర్టుకి వెళ్ళవచ్చు. అయితే ప్రాథమిక హక్కులకి భంగం వాటిల్లితే, బాధిత వ్యక్తి అధికరణ 32 ప్రకారం సుప్రీంకోర్టునీ, అధికరణ 226 ప్రకారం హైకోర్టునీ ఆశ్ర యించవచ్చు. హైకోర్టుని ముందుగా ఆశ్రయించి ఆ తరువాత సుప్రీం కోర్టుకి వెళ్ళాలన్న నియమం లేదు. బాధిత వ్యక్తి నేరుగా తన ప్రాథ మిక హక్కులకి భంగం వాటిల్లినపుడు, లేదా అమలు పరచుకోవ డానికి నేరుగా సుప్రీంకోర్టుని ఆశ్రయించవచ్చు. అధికరణ 32 ప్రాథ మిక హక్కు. కానీ అధికరణ 226 ప్రాథమిక హక్కు కాదు.

గతంలో పాట్నా హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసి ఇప్పుడు సీనియర్‌ న్యాయవాదిగా ప్రాక్టీస్‌ చేస్తున్న అంజనా ప్రకాశ్‌ అర్ణబ్‌ గోస్వామికి బెయిల్‌ మంజూరు చేసిన విషయాన్ని ప్రస్తావిస్తూ ఓ వ్యాసంలో ఇలా అభిప్రాయపడ్డారు. నవంబర్‌ 11వ తేదీన సుప్రీం కోర్టు బెంచి ప్రత్యేకంగా సమావేశమై బెయిల్‌ మంజూరు చేయడం ద్వారా భారత సుప్రీంకోర్టు ప్రపంచంలోనే ఎంత శక్తివంతమైనదో మరోసారి ఈ కేసు ద్వారా రుజువైంది. సుప్రీంకోర్టు ఎంత శక్తివం తమైనది అనే అంశంపై న్యాయవాదులు ఏ విధంగా జోక్‌ చేస్తారో కూడా ఆవిడ తన వ్యాసంలో ప్రస్తావించారు.

ఆడని మగగా, మగని ఆడగా మాత్రం సుప్రీంకోర్టు ప్రకటించలేదు. ఇది తప్ప సుప్రీంకోర్టు ఏదైనా చేయగలదని అన్నారామె. సెలవు రోజైన నవంబర్‌ 9న బొంబాయి హైకోర్టు అర్ణబ్‌ గోస్వామి కేసుని ఐదుగంటలపాటూ విన్నది. సుప్రీం కోర్టులో కూడా అర్ణబ్‌ దరఖాస్తుని దాఖలు చేశాడు. అది 11న లిస్ట్‌ అయింది. ఆ రోజంతా సుప్రీంకోర్టు వాదనలని విని అర్ణబ్‌ని విడుదల చేయాలని ఆదేశించింది. 

కోర్టులు చాలాసార్లు ఏకపక్షంగా, సహేతుకంగానే  కేసుల్లో జోక్యం చేసుకుంటాయి. వ్యక్తి స్వేచ్ఛ, స్వాతంత్య్రాలకి కోర్టు అత్యంత ప్రాధాన్యతలని ఇవ్వాలి. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 21, 22 దీన్నే చెబుతున్నాయి. అయితే ఆర్టికల్‌ 14ని కూడా మనం మరచిపోకూడదు. గోస్వామి కేసు వాదనలు ముగిస్తూ న్యాయవాది కపిల్‌ సిబల్‌ ఇలా అన్నారు. ‘కేరళ రాష్ట్రానికి చెందిన కప్పన్‌ని ఉత్తరప్రదేశ్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. అధికరణ 32 ప్రకారం మేం కోర్టు తలుపు తట్టాం. కింది కోర్టుకి వెళ్ళండి అని 4 వారాల తరువాత ఆ కేసుని పోస్ట్‌ చేశారు’. కానీ ఈ వాదన మీద సుప్రీంకోర్టు ఎలాంటి వ్యాఖ్యానాన్ని చేయలేదు. 

అలా కప్పన్‌ కేసు మళ్ళీ సుప్రీంకోర్టు ముందుకు వచ్చినపుడు ప్రధాన న్యాయమూర్తి బాబ్డే అధికరణ 32 ప్రకారం సుప్రీంకోర్టుకి రావడాన్ని నిరుత్సాహపరచడానికి ప్రయత్నం చేస్తామని అన్నారు. ఈ వ్యాఖ్యతో దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. అధికరణ 32 ప్రకారం వచ్చిన హక్కులని రాజ్యాంగం ప్రకారం మాత్రమే సస్పెండ్‌ చేయ వచ్చు. ఎల్‌. చంద్రకుమార్‌ వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసులో ఏడుగురు సభ్యులు గల సుప్రీంకోర్టు బెంచి అధికరణ 32 అనేది రాజ్యాంగంలోని మౌలిక అంశమని, అది అంతర్భాగమని వ్యాఖ్యానించింది.

ఎమర్జెన్సీ కాలంలో ఏడీఎం జబల్‌పూర్‌ వర్సెస్‌ శివకాంత్‌ శుక్లా కేసులో సుప్రీంకోర్టు మరోవిధంగా అభిప్రాయ పడింది. ఎమర్జెన్సీలో ఈ హక్కు ఉండదని మెజారిటీ న్యాయ మూర్తులు అభిప్రాయపడ్డారు. ఆ తరువాత 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ అభిప్రాయాన్ని పార్లమెంట్‌ సవరించింది. ఎమర్జెన్సీ కాలంలో కూడా అధికరణ 20, 21లలో పేర్కొన్న హక్కులకి భంగం వాటిల్లితే సుప్రీంకోర్టునీ అదేవిధంగా హైకోర్టునీ ఆశ్రయించవచ్చు. ప్రాథమిక హక్కులకి భంగం వాటిల్లితే సుప్రీంకోర్టు అధికరణ 32 ప్రకారం అవసరమైన ఉత్తర్వులని, రిట్స్‌ని జారీ చేయవచ్చు.

అధికరణ 32 ప్రకారం దేశంలోని ప్రతి వ్యక్తికీ హక్కుల అమలుని నిరుత్సాహపరుస్తామని బహుశా పనిభారం వల్ల ప్రధాన న్యాయ మూర్తి అని అంటారు. సుప్రీంకోర్టు విపరీత పనిభారంతో ఉంది. ఆ మాటకొస్తే దేశంలోని ప్రతికోర్టూ పనిభారంతో నలిగిపోతున్నాయి. ఏది ఏమైనా ప్రధాన న్యాయమూర్తి వ్యాఖ్యలోని ఆంతర్యం బోధ పడలేదు. సుప్రీంకోర్టు పనిభారం తగ్గించడానికి కోర్టు ఆఫ్‌ అప్పీల్స్‌ అన్న వ్యవస్థ ఏర్పాటు చేసి దేశంలోని ఐదారు ప్రాంతాల్లో వీటి బెంచీలు ఏర్పాటు చేయాలని కొంతమంది న్యాయకోవిదులు సూచిం చారు. ఆ సూచనలు అలాగే ఉండిపోయాయి.

ఆ విధంగా వాటిని ఏర్పాటు చేసినా, అధికరణ 32 ప్రకారం పనిభారం సుప్రీం కోర్టు పైనే ఉంటుంది. కోర్ట్‌ ఆఫ్‌ అప్పీల్స్‌ లాంటి మరో వ్యవస్థ కన్నా సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను పెంచి దేశంలో నాలుగైదు బెంచీలు ఏర్పాటు చేయడం వల్ల ఈ సమస్యని కొంతమేరకు అధి గమించ వచ్చేమో. ఈ మధ్యన కోర్టు ధిక్కార కేసుల సంఖ్య కూడా రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ఈ పరిస్థితికి అందరూ కారకులే. వీటి పరిష్కా రానికి మరో వ్యవస్థ రావాల్సి ఉంటుందా? ఆలోచించాలి. అంతేగానీ రాజ్యాంగ ఆత్మని చంపినా, తగ్గించినా రాజ్యాంగం నిరర్థకం అవు తుంది. 

వ్యాసకర్త


మంగారి రాజేందర్‌ 
ఈ–మెయిల్‌ : rajenderzimbo@gmail.com

మరిన్ని వార్తలు