యూపీలో కాంగ్రెస్‌ హామీల జోరు 

15 Nov, 2021 01:18 IST|Sakshi

భారీస్థాయిలో నిర్వహించే ర్యాలీలూ, పెద్ద పెద్ద బహిరంగ సభలూ ఎన్నికల్లో విజయం కట్టబెడతాయని గ్యారంటీ లేదు. కానీ కోల్పోవడానికి ఇక ఏమీ లేని పార్టీ వైపు ప్రజాభిప్రాయాన్ని మళ్లించడంలో అవి ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్‌ పార్టీ వచ్చే ఎన్నికల్లో తన అదృష్టాన్ని ఈ కోణంలోనే పరీక్షించుకుంటోంది. ప్రతిపక్షాలతో పాటు అధికార బీజేపీని కూడా ఆలోచనలో పడవేసే స్థాయిలో ప్రియాంకా గాంధీ నేతృత్వంలోని యూపీ కాంగ్రెస్‌... ఎన్నికల ప్రచారంలో ముందంజలో ఉంటోంది. 30 ఏళ్ల క్రితమే యూపీలో అధికారానికి దూరమైన కాంగ్రెస్, జనరంజక హామీల పేరిట భారీ ప్రయోగాలతో ముందుకొస్తోంది. ఈ ప్రయోగాలు ఆ రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేస్తాయా, లేక మరోసారి వైఫల్యం బాటన నడిపిస్తాయా అనేది తేలాలంటే కొద్ది నెలలు వేచి చూడాల్సిందే.


ఉత్తరప్రదేశ్‌ రాష్ట్ర ఎన్నికల బాధ్యత తీసుకున్న కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వద్రా అక్టోబర్‌ 10న వారణాసిలో ర్యాలీ నిర్వహించిన తర్వాత, అక్టోబర్‌ 31న గోరఖ్‌పూర్‌లో మరొక భారీ ర్యాలీ నిర్వహించారు. దీనికి భారీ ఎత్తున హాజరైన జన స్పందన చూసి రాజకీయ పరిశీలకులు, ప్రతిపక్ష పార్టీల సభ్యులు, చివరికి కాంగ్రెస్‌ కార్యకర్తలు సైతం ఆశ్చర్యంలో మునిగి తేలారు. ఉత్తరప్రదేశ్‌లో మూడు దశాబ్దాల క్రితమే పాలనా పగ్గాలు కోల్పోయిన కాంగ్రెస్‌ పార్టీ, రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో గుర్తించదగిన స్థాయిలో ప్రధాన పోటీదారుగా ఆవిర్భవించడమే దీనికి కారణం.

ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ కంచుకోట గోరఖ్‌పూర్‌లో అక్టోబర్‌ 31న కాంగ్రెస్‌ పార్టీ నిర్వహించిన ప్రతిజ్ఞా ర్యాలీ, ఆ ర్యాలీ ఏర్పాట్లలో భాగమైనవారితో సహా అందరినీ నివ్వెరపర్చింది. అంతమంది జనం హాజరవుతారని కలలో కూడా ఊహించలేదని  ప్రత్యక్ష సాక్షులు వ్యాఖ్యానించారు. జనం వెల్లువ ముందు సమావేశ స్థలం కూడా చిన్నదైపోయిందని మరొకరు పేర్కొన్నారు. ఆ ర్యాలీలో  ప్రియాంకా గాంధీ ప్రసంగిస్తూ, రాష్ట్రంలో సంస్థాగతంగా కాంగ్రెస్‌ బలహీనపడిపోయిందని వ్యాఖ్యానిస్తున్న వారు ఈ ర్యాలీకి హాజరైన ప్రజలను చూశాక మాట్లాడాలన్నారు. 

పునర్నిర్మాణం దిశగా ముందంజ
ఉత్తరప్రదేశ్‌ అధికార రాజకీయాల నుంచి 30 ఏళ్ల క్రితమే తప్పుకున్న తర్వాత,  కాంగ్రెస్‌ అతి కొద్ది సంఖ్యలోనే భారీ సభలను నిర్వహించగలిగింది. కానీ ఈ సంవత్సరం కాంగ్రెస్‌ నిర్వహించిన రెండు అతి భారీ బహిరంగ సభలు రాష్ట్ర రాజకీయ వాతావరణాన్ని మార్చివేసినట్లు కనబడుతోంది. ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్‌ చాలా కాలంగా బడానేతల పార్టీగా మాత్రమే కొనసాగుతూ వచ్చిది. స్థానిక స్థాయిలో నాయకులకు విశ్వాసంగా ఉన్నవారిని మాత్రమే పార్టీలో చేర్చుకుంటూ వచ్చారు. ఈ సమస్యను పరిష్కరించడానికి ఎలాంటి ప్రయత్నాలూ జరిగిన దాఖలాలు లేవు. నిజానికి, కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎలాంటి ప్రభావమూ చూపకుండానే ఇలా వచ్చి అలా దిగిపోయేవారు. ఈ నేపథ్యంలో యూపీలో కాంగ్రెస్‌ పార్టీ ఎంతగా గిడసబారిపోయిందంటే, శాసనసభలోని మొత్తం స్థానాల్లో పదోవంతు కంటే తక్కువ స్థానాల్లో మాత్రమే ఎన్నికల సమయంలో సీట్ల సర్దుబాటు కుదుర్చుకోగలుగుతూ వచ్చింది. జాతీయపార్టీగా అవమానకరమైన స్థితికి అది కుంచించుకుపోయింది.

2019లో లోక్‌సభ ఎన్నికల తర్వాత, పార్టీని పునర్నిర్మించే ప్రయత్నాలు జరిగాయి. క్షేత్రస్థాయి కార్యకర్తలకు ప్రాధాన్యమిస్తూ జిల్లా కమిటీలను పునర్‌ వ్యవస్థీకరించారు. దళితులు, వెనకబడిన కులాలకు చెందినవారు, మైనారిటీలు, యువత, మహిళల ప్రాతినిధ్యం పెరిగింది. ఈ మార్పును మండల, న్యాయపంచాయతీ స్థాయి వరకు తీసుకెళ్లారు. ఒకసారి సంస్థను పునర్నిర్మించాక, కార్యకర్తలకు సైద్ధాంతిక శిక్షణతోపాటు ప్రజా సమస్యల పట్ల ఆందోళనలు నిర్వహించే వ్యూహాన్ని కూడా రచించారు. యూపీలో ఘోరనేరాలు చోటు చేసుకున్న ప్రతి సందర్భంలోనూ ప్రియాంక బాధితులను కలిసి, వారి కుటుంబాలకు మద్దతుగా నిలబడ్డారు. ‘ఉన్నావో’ ఘాతుకం నుంచి హత్రాస్‌ వరకు, ఆగ్రా నుంచి లఖింపూర్‌ వరకు ప్రతి ఘటనలోనూ ఆమె నిర్వహించిన క్రియాశీలక పాత్ర కాంగ్రెస్‌కు జీవం పోసింది.

ఇన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ, యూపీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ గణనీయ విజయాలు సాధిస్తుందని ఎవరూ ఊహించడం లేదు. రాష్ట్రంలో బలమైన సామాజిక పునాదిని ఆ పార్టీ ఇప్పటికీ కనుగొన లేకపోవడమే దీనికి ప్రధాన కారణం. రాజకీయంగా అత్యంత ప్రాధాన్యం కలిగిన ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్‌ పార్టీ తాను గెలిచే స్థానాలను మెరుగుపర్చుకోవచ్చు. కానీ పార్టీ నాయకత్వం మాత్రం 2022లో జరగనున్న యూపీ అసెంబ్లీ ఎన్నికలపై పెద్దగా ఆశలు పెట్టుకోకుండా, 2024లో జరిగే లోక్‌సభ ఎన్నికలపైనే ప్రధానంగా దృష్టి పెడుతోంది.

తప్పిదాల నుంచి నేర్చుకోవడం
ఎన్నికల్లో మహిళా అభ్యర్థులకు 40 శాతం స్థానాలు కేటాయించాలని నిర్ణయించడం, ఎన్నికలకు ఎంతో ముందుగా హామీల రూపంలో ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయడం, ప్రధాని, ముఖ్యమంత్రి నియోజకవర్గాల్లో రెండు భారీ ర్యాలీలు నిర్వహించడం వంటివి యూపీ రాజకీయ పరిస్థితులను మార్చివేశాయి. గోరఖ్‌పూర్‌ ర్యాలీతో బీజేపీ, ఎస్పీ, బీఎస్పీల్లాగా రాష్ట్రంలో భారీ బహిరంగ సభలను నిర్వహించే సామర్థ్యం తనకు కూడా ఉందని కాంగ్రెస్‌ నిరూపించుకుంది. ఇప్పుడు పూర్వాంచల్‌ రీజియన్‌లో, లక్నోలో కూడా ఒక ర్యాలీని, భారీ బహిరంగ సభను నిర్వహించడానికి పథకం రచిస్తోంది. మహిళా అభ్యర్థులకు 40 శాతం సీట్లు కేటాయిస్తానన్న హామీతో, ఉత్తరప్రదేశ్‌ రాజకీయాల్లో మహిళలను కేంద్ర బిందువుగా మార్చాలని కాంగ్రెస్‌ ప్రయత్నిస్తోంది. గోరఖ్‌పూర్‌ ర్యాలీలో భారీ సంఖ్యలో మహిళలు పాల్గొనడం పార్టీ నైతిక స్థైర్యాన్ని మరింతగా పెంచింది. బాలికలకు స్మార్ట్‌ ఫోన్లను, ఎలక్ట్రిక్‌ స్కూటర్లను అందించడంతో పాటు వారికి ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పిస్తామని ప్రకటించడం, మహిళలకు సంవత్సరానికి మూడు ఉచిత ఎల్పీజీ సిలిండర్లను ఇస్తామని హామీలు ఇవ్వడం ద్వారా ప్రియాంక మహిళా ఓటర్లను ఆకర్షించడంలో ముందడుగు వేశారు.

20 లక్షల మంది యువతీ యువకులకు ఉద్యోగాలు కల్పిస్తామనీ, రైతులకు రుణమాఫీ చేస్తామనీ, వరి–గోధుమలకు క్వింటాల్‌కు రూ.2,500  కనీస మద్దతు  ధరను కల్పిస్తామనీ కాంగ్రెస్‌ హామీ ఇచ్చింది. కాంట్రాక్ట్‌ కార్మికుల ఉద్యోగాల క్రమబద్ధీకరణ, అంగన్‌వాడీలకు, ఆశావర్కర్లకు గౌరవ పారితోషికం రూ. 10 వేలకు పెంచడం వంటి హామీలను ఇచ్చింది. ర్యాలీలలో ఈ అంశాలను ప్రస్తావించడం ద్వారా పార్టీ పలుకుబడి అమాంతంగా పెరుగుతుందని కాంగ్రెస్‌ నేతలు నమ్ముతున్నారు.

గత ఎన్నికల్లో లాగా కాకుండా, వచ్చే సంవత్సరం జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు ముందుగానే ఎన్నికల మేనిఫెస్టోను కాంగ్రెస్‌ పార్టీ విడుదల చేసింది. ఇది ఎన్నికల పోటీలో కాంగ్రెస్‌ను ఎంతో ముందుండేలా చేసింది. పైగా బీజేపీకి, ఎస్పీకి, బీఎస్పీకి కూడా గట్టి సవాలు విసురుతోంది. సమాజ్‌వాదీ పార్టీ, బహుజన్‌ సమాజ్‌ పార్టీ కూడా ఇదే విధమైన ప్రకటనలు చేసినప్పటికీ, కాంగ్రెస్‌ మేనిఫెస్టో నిజంగానే బీజేపీని సైతం ఆలోచనలో పడవేసింది. 

విజయమే లక్ష్యంగా హామీలూ, సమీకరణాలు
ఈలోగా, విభిన్న కులాల ప్రజలను చేరడం ద్వారా సామాజిక సమీకరణాలను సమతౌల్యం చేసే దిశగా కాంగ్రెస్‌ పథక రచన చేస్తోంది. గోరఖ్‌పూర్‌ ర్యాలీలో నిషాదులు, బ్రాహ్మణ వర్గ ప్రజల సమస్యలను పరిష్కరిస్తామని ప్రియాంక హామీ ఇచ్చారు. కాంగ్రెస్‌కు ఓట్లు వేసి అధికారం కల్పిస్తే, మత్స్యకారులకు వ్యవసాయ ప్రతిపత్తిని అందిస్తామనీ, ఇసుక మైనింగ్‌లో, చేపల పరిశ్రమలో మత్స్యకారుల హక్కులను పునరుద్ధరిస్తామనీ కూడా కాంగ్రెస్‌ హామీనిచ్చింది. నిషాద రాజకీయాలకు గోరఖ్‌పూర్‌ కేంద్రబిందువు. మత్స్యకార వర్గ బాధలన్నింటికి పరిష్కారం చూపుతామంటూ నిషాద్‌ పార్టీ ఇక్కడే పురుడు పోసుకుంది. ఆ పార్టీ ఇప్పుడు బీజేపీతో పొత్తు కలిపింది. అలాగే కుర్మీ ఓటర్లను బుజ్జగించడానికి, ఛత్తీస్‌గఢ్‌ మాజీ ముఖ్యమంత్రి భూపేంద్ర సింగ్‌ బగేల్‌ భారీ కటౌట్లను ‘కుర్మీ కమ్యూనిటీ జనరంజక నేత’ అనే పేరుతో నెలకొల్పారు. 

భారీస్థాయిలో నిర్వహించే ర్యాలీలూ, పెద్ద పెద్ద బహిరంగ సభలూ ఎన్నికల్లో విజయం కట్టుబడతాయని గ్యారంటీ లేదు. కానీ కోల్పోవడానికి ఇక ఏమీ లేని పార్టీ వైపు ప్రజాభిప్రాయాన్ని మళ్లించడంలో అవి ప్రధాన పాత్ర పోషిస్తాయి. యూపీలో కాంగ్రెస్‌ కోల్పోయేదేమీ లేదు. కాబట్టే అది భారీ సవాళ్లతో, ప్రయోగాలతో ముందుకొస్తోంది. ఈ ప్రయోగాలు ఆ రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేస్తాయా లేక మరోసారి వైఫల్యం బాటన నడిపిస్తాయా అనేది తేలాలంటే వేచి చూడాల్సిందే.

– మనోజ్‌ సింగ్, సీనియర్‌ కాలమిస్ట్‌
(‘ద వైర్‌’ సౌజన్యంతో) 

మరిన్ని వార్తలు