ఈసారి పరిమితుల మధ్య బ్రహ్మోత్సవాలు

22 Sep, 2020 01:46 IST|Sakshi

సందర్భం

తెలుగువారి ఇలవేలుపు తిరుమలేశుని బ్రహ్మోత్సవాలు రంగరంగ వైభవంగా ఆరంభమయ్యాయి. సాక్షాత్తు బ్రహ్మదేవుడే స్వయంగా ఆరంభిస్తాడు కాబట్టి బ్రహ్మోత్సవాలయ్యాయని, నవ బ్రహ్మలలోని ఒక్కొక్క బ్రహ్మ ఒక్కొక్క రోజు వచ్చి జరిపిస్తాడు కాబట్టి ఈ పేరు వచ్చిందని, పరబ్రహ్మ స్వరూపుడైన వేంకటేశ్వరునికి జరిపే ఉత్సవాలు అయినందున బ్రహ్మోత్సవాలుగా పిలుస్తారని, బ్రహ్మాండ నాయకుడిని తలుస్తూ, కొలుస్తూ బ్రహ్మాం డంగా చేసే ఉత్సవాలు కాబట్టి బ్రహ్మోత్సవాలు అని, ఇలా రకరకాలుగా చెబుతారు. ‘ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన అంతమాత్రమే నీవు...’ అని అన్నమయ్య అన్నట్లుగా, ఏ తీరున అభివర్ణించినా, ఏ రీతిన కొలిచినా, ఇవి బ్రహ్మోత్సవాలే. ప్రతి ఏటా ఎక్కడెక్కడి నుండో భక్తులు తండోపతండాలుగా తరలివస్తారు. కరోనా వల్ల ఈ సంవత్సరం ఏకాంతంగా జరుపుకుంటున్నారు. అందరి మేలుకోరి ఇలా జరుపుకోవడంలో ఎటువంటి తప్పూ లేదు. శ్రీ విష్వక్సేనుడి వద్ద తొలి రోజు పూజలు జరిపి అంకురార్పణ చేశారు. శనివారం నాడు ధ్వజారోహణంతో మొదలైన ఈ సంబ రాలు చక్రస్నానంతో ముగుస్తాయి. సెప్టెంబర్‌ 19వ తేదీన మొదలైన ఈ వేడుకలు 27 వరకూ సాగుతాయి. గరుడసేవ రోజు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వై.ఎస్‌. జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పిస్తారు.

 అంకురార్పణకు ఒక విశిష్టత వుంది. యాగశాలలో మట్టితో నింపిన తొమ్మిది పాళికలలో శాలి, వ్రహి, యవ, ముద్గ, మాష, ప్రియంగ మొదలైన నవధాన్యాలను పోసి పూజిస్తారు. ఈ కార్యక్రమానికి చంద్రుడు అధిపతి. శుక్లపక్ష చంద్రుని వలె నవధాన్యాలు దినదినాభివృద్ధి చెందాలని ప్రార్థనలు జరుపుతారు. పాళికలలో వేయగా మిగిలిన మట్టితో యజ్ఞ కుండలాలను నిర్మిస్తారు. తరువాత, పూర్ణకుంభ ప్రతిష్ఠ చేస్తారు. పాళికలలో వేసిన నవధాన్యాలకు నిత్యం నీరు పోస్తారు. అవి పచ్చగా మొలకెత్తుతాయి. అంకురాలను ఆరోపింపచేసే కార్యక్రమం కాబట్టి దీన్ని అంకురార్పణ అంటారు. మొదటి రోజు జరిగే ఉత్సవం ధ్వజారోహణం. ఉదయాన్నే సుప్రభాత, తోమాల సేవలు జరిపాక, శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామికి ఏకాంతంగా తిరుమంజనం చేసి, నైవేద్యం సమర్పిస్తారు. ఆలయసన్నిధిలోని ధ్వజస్తంభంపై పతాకావిష్కరణ చేస్తారు. ఈ గరుడ పతాకమే సకల దేవతలను పిలిచే ఆహ్వానపత్రం.

రెండవరోజు శేషవాహనంలో ఇరువురు అమ్మలతో అయ్యవారిని ఊరేగిస్తారు. సింహవాహనంపై స్వామివారిని మూడవరోజు ఊరేగిస్తారు. సర్వ భక్తుల సకల కోరికలు తీర్చడానికి కల్పవృక్ష వాహనంపై స్వామివారు నాల్గవరోజు ఎల్లరకు కన్నుల విందు చేస్తారు. అన్ని రోజులు ఆలయ వాహన మండపంలో ఆరంభమైతే, ఐదోరోజు ఆలయంనుంచే పల్లకీపై ఆరంభమవుతుంది. ఈరోజు స్వామి మోహినీ అవతారంలో ఉంటారు. స్వామివారి ప్రధానభక్తుడైన గరుడవాహనం సేవ ఈరోజు ఉంటుంది. రాష్ట్ర ప్రజల తరపున ముఖ్యమంత్రి నూతన వస్త్రాలు సమర్పించే విశేష కార్యక్రమం ఈరోజు ఉంటుంది. ఆరవరోజు గజవాహనం, ఏడవరోజు సూర్యప్రభ వాహనం, ఎనిమిదవ రోజు ర«థోత్సవం, తొమ్మిదవ రోజు చక్రస్నానం జరుగుతాయి. చక్రస్నానాలు పూర్తయిన తర్వాత, సాయంకాలం ఆలయ ధ్వజస్తంభం మీద ఆరోహణ చేసిన గరుడ పతాకాన్ని అవరోహణ చేస్తారు. అంటే దించుతారు. ఈ అవరోహణతో బ్రహ్మోత్సవాలకు వచ్చిన సర్వ దేవతలకు వీడ్కోలు పలికినట్లే. 

ఇలా ప్రతి ఏటా వేడుకలు జరపడం కొన్ని వందల సంవత్సరాల నుండీ జరుగుతోన్న ఆనవాయితీ. ఏనాడూ ఉత్సవాలు ఆగలేదు. ‘వేంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించనః వేంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి’ అన్నట్లు ఇంత వైభవంగా బ్రహ్మోత్సవాలు ఎక్కడా జరుగవు,  క్షేత్రరాజంగా విరాజిల్లే తిరుమలలో తప్ప. వచ్చే సంవత్సరం రెట్టింపు ఉత్సాహంతో బ్రహ్మోత్సవాలు జరుగుతాయని విశ్వసిద్దాం.
వ్యాసకర్త: మాశర్మ ,  సీనియర్‌ జర్నలిస్ట్‌ 
మొబైల్‌ : 93931 02305

మరిన్ని వార్తలు