అన్నదాతా! సుఖీభవ!

25 Jul, 2020 02:59 IST|Sakshi

అక్షర తూణీరం
మన గణాంకాలలో జనాభాలో ఎనభై శాతం మంది వ్యవసాయంపై జీవిస్తు న్నారని చెప్పుకోవడమేగానీ దానికి తగిన ప్రోత్సాహం లేదు. రైతు మట్టి మీద మమకారంతో, తను కాడికింద పారేస్తే తిండి గింజలు ఎవరు పండి స్తారనే బెంగతో కొన్ని వందల సంవ త్సరాలుగా లాభ నష్టాలతో పని లేకుండా కాడి మోస్తున్నాడు. రైతు అమాయకత్వాన్ని తరతరా లుగా మన రాజకీయ నాయకులు చక్కగా వాడుకుంటున్నారు. బస్తీ వాసుల్లాగా పల్లెవాసులు రోడ్లు అడగరు. వీధి దీపాలు కోరరు. చదువులకి బళ్లు, వైద్యానికి ఆసుపత్రులు ఆశించరు. రకరకాల ధాన్యాలు, కూరలు, పళ్లు, పాలు రైతు కష్టంలోంచే వస్తాయి. ఆరుగాలం కష్టించి పండిస్తే దళారులు సిల్కు లాల్చీల మడత నలగకుండా, సింహ భాగం జేబుల్లో వేసుకుపోతారు.

ఇన్నాళ్టికిగానూ ఓ మనసున్న మారాజు రైతు బతుకుల్ని క్షేత్ర స్థాయిలో అణువణువుగా పరిశీలించాడు. కరిగిపోయాడు. రైతు భరోసా పథకం ప్రారంభించాడు. పల్లెలు కూడా బస్తీల్లా కళకళలాడాలని ఆశించాడు. కొన్ని పనులు సఫలమై కార్య రూపం దాల్చాయి. ఇంకా కొన్ని రావల్సినవి ఉన్నాయి. నిజా నికి మన దేశంలో అతిపెద్ద పరిశ్రమ వ్యవసాయం. రైతులు, రైతుకూలీల గురించి పట్టించుకున్నవారు లేరు. వ్యవసాయానికి పెట్టుబడులు, మంచి విత్తనాలు, సరైన ఎరువులు పురుగుమం దులు లాంటి రైతు ప్రాథమిక అవసరాలు ఇప్పుడే అందుబాటు లోకి వస్తున్నాయి. వ్యవసాయం చదువులేని సెక్టార్‌ అవడం వల్ల, రైతుకి ఫలాలు చేరడంలో కొన్ని తరాల వ్యవధి పడు తోంది. ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉంటే– పంట మురుగు కాల్వల నిర్వహణని మెరుగుపరచవచ్చు. సాగులో నీటి పొదుపుని ప్రచారం చెయ్యొచ్చు. రైతులకి పంట చేలో ఎప్పుడూ నీళ్లు నిండుగా ఉండాలనే మూఢ నమ్మకం ఉంటుంది. నిజానికి అలా నీళ్లు నిల్వ ఉంటే, వాతావరణంలోంచి ఆక్సిజన్‌ మొక్క వేళ్లకు చేరదు. పైన నీటిపొర అడ్డుకుంటుంది. పంటచేనుకి నీరు అవసరమే గానీ దానికో పరిమితి ఉంది. యూరియా లాంటి ఎరువుల అతి వాడకంతో వచ్చే అనర్థాలను ప్రత్యక్షంగా రైతు లకు చూపాలి. 

ఒకనాడు వానపాముని ‘రైతు మిత్ర’గా పిలిచే వారు. సంప్రదాయ ఎరువులు పోయి రసాయనాలు రావడంతో వానపాములు ఇతర మేలు చేసే జీవాలు అడుగంటాయి. ఇప్పుడు తిరిగి వెర్మీ కల్చర్‌ని పునరుద్ధరించాలి. పచ్చి రొట్ట, ఎరువుల్ని విరివిగా వాడకంలోకి తెచ్చుకోవాలి. త్వర త్వరగా పెరిగే జీలుగు, జనుము, గ్లైడ్‌పీడియా, చిటికేశ్వరం లాంటి మొక్కలు మళ్లీ వ్యవసాయంలో భాగం కావాలి. రైతు భరోసా కేంద్రాలు దృశ్య మాధ్యమం ద్వారా రైతులకు వారానికి ఒకటి, రెండు క్లాసులు నిర్వహించాలి. మంచి విత్తనం ఎంపిక, విత్తన శుద్ధి నేర్పాలి. మన నేలలకు అనువైన వ్యవసాయ యంత్రాలు రావాలి. ఒకప్పుడు బాగా ప్రచారంలోకి వచ్చిన ‘గోబర్‌గ్యాస్‌’ కనుమరుగైంది. దాంతో మంచి సహజ ఎరువు కూడా పోయింది. చిన్న రైతుకి అయినా కనీసం రెండు మూడు పశువులు, ఒక వంద బాతులు ఉండి తీరాలి. బాతులు పంట చేనుకి మంచి చేస్తాయి. ఆదాయం కూడా. రైతు కూలీల పరి స్థితుల్ని మెరుగు పరచాయి. నీళ్లలో, బురదలో, పనిచేసే కూలీ లకు అందుకు తగిన గ్లౌజు లుండాలి. కాళ్లకి కూడా తొడుగులుం డాలి. ఎండనుంచి కాపాడే టోపీలుండాలి. శ్రామికులకు మరీ ముఖ్యంగా లేవలేని తల్లులకు, అక్క చెల్లెమ్మలకు యజమాని ద్వారా పౌష్టికాహారం అందాలి. రాత్రి అన్నంలో తోడుపెట్టిన పాలబువ్వతోబాటు ఒక అరటిపండు, ఒక గుడ్డు ఇవ్వాలి. మహిళలకు కొంచెం నీడ అవసరానికి తగిన మరుగు ఉండాలి. వ్యవసాయం కూడా ఒక మంచి పరిశ్రమగా గుర్తింపు పొందాలి. శ్రామికుల కోసం సౌకర్యాలు పెరగాలి. రక్షణ కల్పించాలి.

తెలుగు రాష్ట్రాలలో రైతులు కూడబలుక్కుని పంటలు వేయడం శుభసూచకం. అలాగే అందరూ ఆధునిక వ్యవసాయ రీతులపై చర్చించుకోవడం, సూచనలు పాటించడం చాలా ముఖ్యం. ప్రసార సాధనాలు, ప్రచార సాధనాలు విపరీతంగా వచ్చాయి. కానీ నిత్యకృత్యంలో అవేవీ రైతుకి సక్రమంగా ఉప యోగపడటం లేదు. మిగతా ప్రాంతాలతో చూస్తే ఇప్పటికీ మన రాష్ట్రంలో దిగుబడులు తక్కువగానే ఉంటున్నాయి. కనీసం పంట రెట్టింపు అయ్యే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. భూమిని నాలుగంచెల విధానంలో సద్విని యోగం చేసుకొనే పద్ధతులు మన రైతులకు తెలుసు. చుట్టూ చేను గట్టుమీద కొబ్బరిచెట్లు, చేలో అరటితోట, దాని నీడన కంద పిలకలు, దానికింద అల్లం కుదుళ్లు పండించే రైతులు న్నారు. కొబ్బరిమానులకి ‘కోక్‌’ తీగెల్ని అల్లుపెడతారు. నిత్యం పరిశోధనలు జరగాలి. రైతులకి కొత్త ఆశలు మొలకెత్తేలా చూడాలి. వ్యవసాయం దండగ కాదు. పండుగ అనిపించేలా పాటుపడాలి. పశుసంపదని పెంచడం ద్వారా గ్రామాలకు కళ, కాంతి, ఆరోగ్యం తిరిగి తీసుకురావాలి. రైతుని ఆదరించి ప్రోత్సహించడంలోనే మానవజాతి భవిష్యత్తు ఉంది. మానవా ళికి అణ్వస్త్రాలకంటే అన్న వస్త్రాలు ముఖ్యం! ఇప్పుడు మీడియా మొత్తం సంచలనాల మీద దృష్టి పెట్టకుండా రైతుల వెల్ఫేర్‌పై శ్రద్ధ పెట్టాలి. దాన్ని మించిన దేశభక్తి లేదు.

(వ్యాసకర్త ప్రముఖ కథకుడు)
శ్రీరమణ

మరిన్ని వార్తలు