ప్రభుత్వ పనితీరుకు జన నీరాజనం!

6 Jun, 2022 14:14 IST|Sakshi

మే 26 నుంచి 29 వరకు నాలుగు రోజుల పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మంత్రులందరం సామాజిక న్యాయభేరి పేరిట బస్సు యాత్ర చేపట్టాం. అణగారిన వర్గాలకు ఈ ప్రభుత్వం చేసిన మేలు, సామాజిక న్యాయంలో బలహీన వర్గాలను పాలకులుగా మార్చిన తీరు వివరించడానికి యాత్రగా మేం బయలుదేరాం. యాత్రలో నేను చూసిన, అనుభవంలోకి వచ్చిన అంశాలను ఇక్కడ పంచుకుంటున్నాను.

‘సహాయం పొందినవారు కృతజ్ఞత చూపించరని జనంలో నానుడి ఉంది. కానీ అది నిజం కాదని సామాజిక న్యాయభేరి యాత్రలో మాకు స్పష్టంగా కనిపించింది. మూడు సంవత్సరాలుగా ముఖ్యమంత్రి జగన్‌ తీసుకున్న నిర్ణయాలు, అమలు చేసిన పథకాలు, చేపట్టిన కార్యక్రమాలు... సమాజంలోని అట్టడుగు వర్గాల వ్యక్తులను ఆర్థికంగా, సామాజింగా, రాజకీయంగా స్థితిమంతులను చేయడానికి దోహదం చేశాయి. ఇది ప్రజల్లో కనపడుతుందా? ఈ విషయం తెలుసుకోవాలన్న ఆతురత... యాత్ర శ్రీకాకుళంలో ప్రారంభ సమయంలో నాలో కలిగింది.  సంక్షేమ పథకాలు తీసుకుంటున్న లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో యాత్రకు ఎదురేగి స్వాగతం పలికి మాతో అడుగు కలిపారు. సీఎం జగన్‌ చేపట్టిన సంక్షేమ పథకాలు తమ జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయనే విషయం వారు స్పందించిన తీరులో ప్రస్ఫుటమయింది. లబ్ధిదారులు స్వచ్ఛందంగా రోడ్ల మీదకు వచ్చి యాత్రకు సంఘీభావం ప్రకటించారు. సీఎం జగన్‌ ఆదేశంతో ఆయన బొమ్మ పెట్టుకొని 17 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మంత్రులం బస్సు యాత్రగా వస్తేనే ప్రజల్లో ఇంతటి ఆదరణ లభిం చిందంటే... స్వయంగా వైఎస్‌ జగన్‌ ప్రజల్లోకి వస్తే మరెంతటి ఆదరణ లభిస్తుందో, ఏ స్థాయిలో బ్రహ్మరథం పట్టడానికి ప్రజలు ఎదురు చూస్తున్నారో చెప్పాల్సిన పనిలేదు. 

విజయనగరానికి యాత్ర చేరినప్పుడు భారీ వర్షం స్వాగతం పలికింది. వర్షం కారణంగా బహిరంగ సభ నిర్వహించే పరిస్థితి లేక రద్దు చేయాల్సి వచ్చింది. అంతటి వర్షంలోనూ ప్రజలు తడుస్తూనే యాత్రకు స్వాగతం పలకడం నన్ను కదిలించింది. సీఎం జగన్‌ విధానాలనూ, సంక్షేమ పాలననూ ప్రజలు మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నారనే నమ్మకం నాలో రెట్టింపయింది. విశాఖలో దారి పొడవునా జనం పోటెత్తారు. ఇదే తీరు అనంతపురం వరకు ప్రజా స్పందన మాకు అడుగడుగునా కనిపించింది. గతంలో ఎన్నడూ గుర్తింపునకు నోచు కోని కులాలను వెతికి మరీ పదవులు, పథకాలు ఈ ప్రభుత్వం ఇచ్చింది. ఆయా కులాల వారు మాకు యాత్ర పొడవునా తారసపడ్డారు.

జగన్‌ పనితీరుకు అన్ని సభలకు పోటెత్తిన జనం, రాత్రి 11 గంటలకూ రోడ్లమీద నిలబడి యాత్ర కోసం ఎదురు చూసిన సందర్భాలు నిదర్శనంగా నిలిచాయి. కరోనా వల్ల కష్టాలు ముంచు కొచ్చినా, గత ప్రభుత్వం పెట్టిపోయిన బకాయిల బరువును దించుకుంటూనే... దళిత, గిరిజన, బహుజనులే కాకుండా సర్వజన సంక్షేమాన్ని నెత్తి కెత్తుకున్న సీఎం జగన్‌ పనితీరు ప్రజలకు నచ్చింది. భావి తరాల భవిష్యత్తును భుజానికి ఎత్తుకున్న జగన్‌కు ప్రజల్లో ఉన్న ఆదరణే... సామాజిక న్యాయభేరి యాత్రకు జనం నీరాజనం పట్టడానికి కారణం. ప్రతిపక్షం చెబుతున్న మాటలనూ, దుష్ట చతుష్టయంలో భాగమైన పత్రికలూ, టీవీల... రాతలూ, తీతలనూ ప్రజలు పట్టించుకోలేదని యాత్రలో ఉన్న అందరికీ స్పష్టమయింది.

ముఖ్యమంత్రితో చర్చించి, మరింత బలమైన కార్యక్రమాలను తీసుకొంటాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల అభ్యున్నతికి ప్రభుత్వం చేస్తున్న కార్య క్రమాలు, పథకాలను ప్రతి గుండెకు చేర్చడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తాం. ప్రతి హృదయాన్నీ తట్టిలేపి ఈ ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధి, సంక్షేమ పాలనలను వివరిస్తాం.


- ప్రొఫెసర్‌ మేరుగు నాగార్జున 
ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి

మరిన్ని వార్తలు